9.8 C
New York
Sunday, November 24, 2024

మహా విద్వాంసుడు

ఆచార్య తుమ్మల రామకృష్ణ

ఆంధ్రభూమి జూన్‌ 6, 2022 సంచికలో ప్రచురితమైనది.

కన్నదాసు మూలింటి కొట్టిడీలో అడుగుపెట్టాడు. మౌనంగా నాలుగు మూలలూ పరికించి చూశాడు. పాత రాతి గోడలు. సున్నం గచ్చుతో కట్టిన గోడలు. పెచ్చులూడిపోయిన గోడలు. పేడ మన్ను కలిపి మెత్తిన తేపలు. సున్నం ఎలిసిపోయిన తేపలు. పాతబడి రేపోమాపో పడిపోవడానికి సిద్ధంగా ఉన్న గోడలు.

కన్నదాసు ముభావంగా ఉత్తరం వేపు తిరిగి చూశాడు. ఒళ్లు జలదరించింది. ఎగిరట్ల పడ్డాడు. క్షణం భయమనిపించింది. మసక చీకట్లో తలకిందులుగా వేలాడుతూ ఉంది. తాతముత్తాతల నాటి జ్ఞాపకం. వారసత్వంగా మిగిలున్న నాదస్వరం. అవమానాలకు ఆనవాలుగా మిగిలున్న నాదస్వరం. వెక్కిరింతలా గూటాన వేలాడుతున్న నాదస్వరం. సప్తస్వరాలను సరళీవరసలుగా, జంట స్వరాలుగా, దాటు స్వరాలుగా, గీతాలుగా, వర్ణాలుగా, క్రీర్షనలుగా, సంకీర్తనలుగా…. రాగాలుగా… పల్లవులుగా… ఇంకా ఎన్నో రకాలుగా పలికే… ఒలికే… పలవరించే నాదస్వరం. హోరుగాలి సవ్వడులు వినిపించే నాదస్వరం. సముద్ర తరంగాల మ్రూతల్ని మరిపించే నాదస్వరం. వేల సంగతుల సమ్మోహన రాగాల మోహన గాంధర్వగానాల సమ్మిశీత రూపం నాదస్వరం. శుభాలకీ అశుభాలకి గడపల్లోో గడీల్లోో ముందు నిల్చి నడిచే నాదస్వరం.

కనృదాసు జీవితంలో నాదస్వరం ముట్టుకోకూడదనుకున్నాడు. చిన్నతనంలో తండ్రి సాంబయ్యతో కల్సి
పెళ్లిళ్లకీ, పేరంటాలకీ, నలుగులకీ, దేవర్లకీ, సమర్తలకీ, చావులకీ, మెరవన్లకి అన్నిటికీ పోయినాడు. కళ్ళారా చూసినాడు. చెవులారా విన్నాడు. అవమానాలు… చీత్మారాలు… చీదరింపులు… తిట్లు… కులం అందించిన చేదు జ్ఞాపకాలు… మాయని మచ్చలు… గుండె గాయాలు…..

ముప్పె ఏళ్ళు… ఆలోచించి ఆలోచించి లోపల్లోపల కుమిలిపోయాడు… కురూపిగా మారిపోయాడు. క్రూర ఘోర కుల కర్కోటకులతో వాదించి, విభేదించి అలిసిపోయాడు.

తడబడుతూ వెళ్లి గూటాన వేలాడుతున్న నాదస్వరం ముట్టుకున్నాడు. తిత్తి వూడి చేతిలోకొచ్చింది. గుప్పుమని కంపు కొట్టింది. తిత్తి మూతి విప్పాడు. బల్లిగుడ్లు.. పొలుకులు, చచ్చిన రిల్లల రెక్కల పొలుకులు. తిత్తిలోంచి జలజల రాలినాయి. ఇంటి ముందరకు వచ్చి తిత్తి విదిల్చినాడు. కడుపులో దేవినట్లయింది. కంపు భరించలేక తిత్తి గోడకవతల పారేసినాడు. నాదస్వరం అటూ ఇటూ తిప్పి చూసినాడు. కర్రకు కట్టిన ఎర్రటి జోల్నా తుక్కు తుక్కయిపోయింది. ఆకులు పగిలి పనికి రాకుండా పోయినాయి. కండెలు చిట్లిపోయినాయి. నాలుగైదు చోట్ల అనుసు చిట్లి చీలిపోయింది. సన్నని రాగి కమ్మితో చీలికల్ని కలిపి చుట్టి, మైనం పూసినట్లుండారు. నాదస్వరం తిరగేసి చూసినాడు. ఏండ్ల తరబడి తాత ముత్తాతలు… ఊపిరిపోసిన ఎంగిలి చారలు అనుసంతా అవమానాల మచ్చలు. కర్రను గమనించాడు. రంధ్రాలు పూడిపోయినాయి.

కన్నదాసు పెరట్లోకి పోయి, ఎడమచేతో నాదస్వరాన్ని తలకిందులుగా పట్టుకొని కుడిచేత్తో నాలుగు చెంబులు నీళ్లు ఎత్తి అనుసులో పోసినాడు. కర్ర రంధ్రాల్లోంచి నీళ్లు బొట్లు బొట్లుగా కారినాయి. గుడిసిల్లు సూర్లో దోపిన శలాకు తెచ్చి రంధ్రాల్లో పెట్టి తిప్పినాడు. కర్ర పైభాగంలోంచి, అనుసులోంచి శలాకు దూర్చి అటూ ఇటూ తిప్పినాడు. మళ్లీ నాలుగు చెంబులు నీళ్లు ముంచి అనుసులోంచి పోసినాడు. రంధ్రాల్లోంచి నీళ్లు ఫౌంటెన్సా చిమ్మినాయి. పొడిగుడ్డతో నాదస్వరాన్ని పరిశుభ్రంగా తుడిసినాడు. కర్ర బాగుంది. ఎక్కడా గాలి నెర్లులేవు. కర్ర పనికొస్తుందనుకున్నాడు.

సాంబయ్య కొడుకు పనుల్ని మతిపోయిన వాడులా చూస్తున్నాడు. మాట పడిపోయినవాడులా మూగగా నిలబడుక్కున్నాడు. సాంబయ్యకు కన్నదాసు వాలకం అర్ధం కావడంలేదు. సాంబయ్య ముప్పె ఏళ్లుగా కొడుకును దేనికి దూరంగా పెట్టాలనుకున్నాడో ఇప్పుడు కొడుకు దాన్నే అతి ప్రియంగా శుభ్రం చేస్తున్నాడు. దానికి మళ్లీ ఊపిరి పోయాలనుకుంటున్నాడు కన్నదాసు. సాంబయ్యకు కన్నదాసు నాదస్వరం ముట్టుకోవడం ఇష్టంలేదు. నాదస్వరం అట్లే కొట్టిడీలో గూటన వుండిపోవాలనుకున్నాడు. తనతోపాటు అదికూడా మట్టిలో కలిసి పోవాలనుకున్నాడు.

తనలాగే తన కొడుకు ఎదుగూ బొదుగూ లేకుండా చావుమేళాలు, సమర్త మేళాలు వాయించుకుంటూ వూళ్ళో రైతుల చేత అవమానాలు పొందుతూ బతక్కూడదనుకున్నాడు.

సాంబయ్య కొడుకు ముఖం చూడలేకపోతున్నాడు. తప్పుకొని తిరుగుతున్నాడు. ఒక్కోసారి ముఖం చాటేస్తున్నాడు. ఒకే ఇంట్లో ఉంటూ ఒకే కుండలోని కూడు తింటూ, ఒకే కప్పుకింద నిద్రపోతూ తండ్రి కొడుకులు ఒకరితో ఒకరు మాట్లాడకుండా అంటీ ముట్టనట్లుండటం సాంబయ్యకి కష్టంగా ఉంది.

ఒకరితో చెప్పుకునే విషయం కాదు. చెప్పుకున్నా ప్రయోజనం ఉంటుందన్న నమ్మకం లేదు. ఇప్పటి సమస్య కాదు. తరతరాల నుంచి తనలాగే, తన వాళ్లు ఎందరో ఎదుర్కొన్న, ఎదుర్కొంటూ వున్న సమస్య. ఈ నేలలో ఎక్కడ తవ్వినా మట్టి గొంతులు సాక్ష్యమిస్తాయి. గుండెలు అవిసేటట్లు ఆ గొంతుల ఘోషలు వినబడతాయి.

నిజానికి కన్నదాసు తప్పేమీలేదు. తను చదువుకుంటానన్నాడు. క్లాసు తప్పనన్నాడు. కుల వృత్తిలోకి రానన్నాడు. కాళ్లావేళ్లా పడ్డాడు. కంటికి కడవెడుగా ఏడ్చాడు. ఊరు వదలిపోనన్నాడు. అమ్మని, చెల్లెని వదిలి పెట్టడం చేతకాదన్నాడు. స్నేహితుల్ని వదులుకోలే నన్నాడు. ఇల్లంతా కలదిరిగాడు. ఆవలింటికాడికి వెళ్లి ఎద్దుల్ని, ఆవుల్ని సూసొచ్చాడు. చేను కాటికి మడికాటికి వెళ్లి సూసొచ్చాడు. చివరకు తల్లి కొంగు పట్టుకొని బోరుబోరున విలపించాడు. లాభం లేకపోయింది. తల్లి కూడా తండి మాటకే వంత పాడింది. చెల్లి మాత్రం కౌగలించుకొని బోరున ఏడ్చింది.

సాంబయ్య ఆ రోజున కొడుకును దగ్గరికి పిల్చి కౌగలించుకొని కంట తడి పెట్టాడు. మెల్లగా తల నిమిరి నిన్ను గొప్ప విద్వాంసుడిగా తయారు చెయ్యడానికే పంపుతున్నానన్నాడు. నువ్వు బాగా విద్య నేర్చుకొని వృద్ధిలోకి వస్తే ముందుగా సంతోషించేది మేమేనన్నాడు. బుజ్జగించాడు. బుద్ధి చెప్పాడు. అప్పుడప్పుడూ వచ్చి చూసిపోతూ వుండొచ్చునన్నాడు. నేనూ మీ అమ్మ అప్పుడప్పుడూ నీ కోసం వస్తా వుంటామన్నాడు. చివరకు ఎట్లాగో గట్ల ఒప్పించాడు. కళ్లనీళ్లు తుడిచి బస్సెక్కించాడు. కళ్లనీళ్లు పెట్టుకున్నాడు. బస్సు చెరువు కట్ట దాటుకొనేంతవరకూ నడీదిలో నిలబడి చూశాడు. తలగుడ్డతో కళ్లు తుడుచుకుంటూ ఇంటిముఖం పట్టాడు. అవన్నీ గుర్తుకువచ్చి సాంబయ్య గుండె తరుక్కుపోతూ వుంది. సాంబయ్యకు శేషశాస్త్రిని బూతులు తిట్టాలనిపిస్తూ వుంది. ఎప్పటెప్పుటివో పాత జ్ఞాపకాలు దొంతర్లు… దొంతర్లుగా కదులుతున్నాయి…

ఊరి ముందర సలవ బండ. బండమీద కాలిమీద కాలేసుకు కూర్చున్న శేషశాస్త్రి. సలవ బండకు గొడుగులా చింతచెట్టు. అక్కడికి వచ్చేసరికి ఎవరికైనా ఓ క్షణం ఆ నీడలో ఆగాలనిపిస్తుంది. ఆ రోజు శేషశాస్త్రి “ఒరే సాంబా…..

ఇట్లా వచ్చిపోరా….” అంటూ పిల్చాడు. పల్లె నుంచి ఆకలితో తిరిగొస్తున్న సాంబయ్య సంకనున్న అడపం సంచి పక్కనబెట్టి, తలగుడ్డతో ముఖంమీద చెమట తుడుచుకుంటూ నాలుగడుగుల దూరంలో నిలబడుకున్నాడు.

“ఈ మధ్య పూర్తో వుండావా లేవారా?” శేషశాస్త్రి ప్రశ్నించాడు.

“ఏదో కడుపాత్రం స్వామి. కర్నాటక దిక్కు పోయింటి”

శేషశాస్త్రి చెప్పడం మొదలు పెట్టాడు.

“ఏమీ లేదురా సాంబా… మొన్న శనివారాలొక్కపొద్దులనాడు. మీవాళ్లంతా గుడికొచ్చిండ్రి. అబ్బుడో పిల్లోడు పాటపాడినాడు. ఏం! పాడినాడురా. మన దేవుడు నిద్రపోయినాడంటే నమ్ము. గుడికొచ్చినోళ్లంతా బొమ్మలై పోయినారంటే నమ్ము. వాని గొంతులో గంధర్వులు కొలువుండార్రా. గొంతులో మాధుర్యం ఉంది. మంచి శ్రావ్యత ఉంది. లయ బాగుంది. శ్రుతి పొల్లు పోవడం లేదు. అంతా అయినాక ‘ఎవురి కొడుకువిరా” నువ్వు అంటే “సాంబయ్య కొడుకు” అన్నాడు. నమ్మలేక పోయాను. వానికి మంచి భవిష్యత్తు ఉంది. మా ఇళ్లల్లో అలాంటి పిల్లోడు పుట్టింటే దాని కతే అలాదు. నా మాటిని వాణ్ణి మనూర్తో పెట్టద్దు. మీ వోళ్ల మధ్యలో వుంటే చెడిపోతాడు. వాణ్ణి మంచి విధ్వాంసుని దగ్గర వొదిలిపెట్టు. నాలుగేళ్లు సాధన పొందినాడంటే వాని గొంతులో పలకని సంగతంటూ వుండదు. వానికి నీ మాదిరిగా నాదస్వరం గీదస్వరం నేర్పించవద్దు. నేర్పిస్తే వాడూ నీ మాదిరి చావు మేళాలు, సమర్త మేళాలు వాయించి బతకాల్సిందే. పిల్లోడు ఎర్రగా బొద్దుగా ఉన్నాడు. చెక్కిన బొమ్మలా ఉన్నాడు. అచ్చం బాపనోళ్ల పిల్లోడులా ఉండాడు. వానికి “గాత్రం” (పాట) నేర్పించు. నేను సచ్చి ఏ లోకానున్నా మా వూరి సాములోరు మేలు చేశాడని తల్చుకుంటావు.” శేషశాస్త్రి పరవశిస్తూ చెప్పాడు.

కన్నదాసు పాటను, గొంతును శేషశాస్త్రి మెచ్చుకొనేసరికి సాంబయ్య ఉబ్బితబ్బిబ్బె పోయాడు. నాలుగేళ్లుగా అదో ఇస్తా… ఇదో ఇస్తా.. అని కూతురి పెళ్లికి వాయించిన డబ్బులు ఇవ్వకపోయిన సంగతి మరిచేపోయాడు. మనసులోనే సాంబయ్య శేషా స్త్రికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.

అవన్నీ ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి సాంబయ్యకి మతి కొస్తున్నాయి.

సాంబయ్య కన్నదాసును తమిళనాడుకు పంపించాడేగాని కొడుకుని తల్చుకోని కంట నీరు పెట్టని రోజు లేదు. తండి పరిస్థితి అర్థం చేసుకున్న కన్నదాసు తండ్రికి ధైర్యం చెబుతూ ఉత్తరాలు రాసేవాడు.

పిచ్చప్ప తర్ఫీదు కన్నదాసుకు బాగా నచ్చింది. గురువు శిష్యులు లాగా కాకుండా పిచ్చప్ప, కన్నదాసు తండ్రి బిడ్డల్లా మెలగసాగారు. తన సంగీత వారసుడు కన్నదాసే నన్నాడు పిచ్చప్ప. కన్నదాసు తన భక్తి శ్రద్ధలు, నిరంతర కఠోర సాధన ఫలించాయనుకున్నాడు.

తన గురించి, గురువుగారి గురించి, అక్కడి సంగీత సాధన గురించి, పరిసరాలు గురించి తండ్రికి కన్నదాసు జాబుల్లో రాసేవాడు. తల్లిని చెల్లిని బెంగ పెట్టుకోవద్దని తెలిపేవాడు. సాంబయ్య ఆ జాబుల్ని ఒకటికి రెండుసార్లు చదివించుకొనేవాడు. ఆ జాబుల్ని అట్లే జోబుల్లో పెట్టుకొని తిరిగేవాడు. ఊర్లో తెలిసినోళ్లందరికీ ఆ జాబులు చూపించేవాడు. కన్నదాసును చూసినప్పుడల్లా ఆ జ్ఞాపకాలన్నీ సాంబయ్య కళ్ల ముందు తిరుగాడుతున్నాయి.

మల్లెపువ్వు లాంటి లాల్చీ తొడుక్కోని పాల నురగలాంటి సరిగంచు పంచె కట్టుకొని, భుజాన కండువా వేసుకొని ముఖాన చందనం బొట్టు పెట్టుకొని కన్నదాసు కచ్చేరీ చేయడానికి బస్సెక్కీ వెళుతూ వుంటే బస్టాండులో నిలబడ్డ మగవాళ్లు కూడా కన్నార్చకుండా చూసేవాళ్లు.

మంగలోళ్లలో కూడా ఇంత అందంగా పుడతారాని వెనకాల చెవులు కొరుక్కునేవాళ్లు. అలాంటి మాటలు సాంబయ్య చెవిన పడినప్పుడల్లా, లోపల్లోపల సంతోషపడేవాడు. మొదట్లో కొడుకు కన్నదాసు వెంట కచ్చేరీలకు సాంబయ్య కూడా వెళ్ళేవాడు. ఆతర్వాత సాంబయ్యకు పచ్చకామెర్లు వచ్చి మంచం పట్టడం వల్ల కొడుకుతోపాటు కచ్చేరీలకు వెళ్లడం మానుకున్నాడు.

కన్నదాసు వెళ్లని ప్రాంతం లేదు. కచ్చేరీ చెయ్యని స్టేజి లేదు. దేశం నలుమూలలా కన్నదాసు కీర్తి పాకింది. ఒక వూరు కాదు…. ఒక పట్నం కాదు… ఒక నగరం కాదు అన్ని ప్రాంతాలూ తిరిగి కచ్చేరీలు చేశాడు. ఎక్కడ పాడినా, కచ్చేరీ చేసినా విన్నవాళ్లు భేష్‌ అన్నారు. సెభాష్‌ అన్నారు. పాడుతున్నంతసేపూ మైమరచి తలలూపారు. ఒళ్లు మరిచి చప్పట్లు కొట్టారు. ఏమి రాగాలాపన… ఏమి కల్పన…ఏమి ప్రస్తానం…. పొగిడారు. అంతవరకూ బాగానే ఉంది. ఆ తర్వాతనే మొదలయింది… కన్నదాసు ఏ వూరి వాడు? ఏ కులం వాడు? అపచారం జరిగిపోయినట్లు బాధపడ్డారు. మాటల్లో తేడా చూపించారు. చేతల్లో చూపించారు. చెవులు కొరుక్కున్నారు. మూతులు ముడుచుకున్నారు. బాహాటంగానే ఆ మాత్రం ఎవరు పాడలేరు. వంటావార్పు పనులు పాడతారన్నారు.

కనృదాసు పొగత్తలకి పొంగిపోలేదు. తెగడ్తలకి కుంగిపోలేదు. ఇవన్నీ మామూలేననుకున్నాడు. తన గొంతే తన బలమనుకున్నాడు. తన విద్యే తన ధనమనుకున్నాడు.

సంగీత ఆరాధనోత్సవాల్లో పాల్గొనాలని కన్నదాసు ఎన్నో ఏళ్ళుగా కలలు కన్నాడు. ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది. తాను ఆరాధనోత్సవాల్లో పాడబోతున్నానని బంధువులకీ, స్నేహితులకీ, అందరికీ తెలియజేశాడు.

కచ్చేరి ఇంకో పదిరోజుల్లో ఉంటుందని తెలియగానే సాధన ప్రారంభించాడు. ఏయే రాగాలు ఆలపిస్తే బాగుంటుందో ముందే నిర్ణయించుకున్నాడు. ఆయా రాగాల్లో ఇంతవరకూ అపురూప కీర్తనల్ని ఒకటికి
పదిసార్లు పాడి ఎక్కడా ఎందులోనూ పిసరంత పొల్లుపోకుండా చూసుకున్నాడు. మంచి మంచి తిల్లానాలు… పల్లవులు పెట్టుకున్నాడు.

ఆ రోజు సభ సంగీత ప్రియులతో నిండిపోయింది. దేశం నలుమూలల నుండి వచ్చిన విధ్వాంసులు ఒకటి, రెండు, వరుసల్లో కూర్చున్నారు.

అంతమంచి విధ్వాంసులు ముందు పాడడం తన అదృష్టంగా భావించాడు.

కన్నదాసు శ్రుతికూడి “మహాగణపతిం మనసా స్మరామి” అంటూ కచ్చేరి ప్రారంభాన్ని గణపతి స్తుతితో మొదలు పెట్టాడు. పక్కవాద్యాలు కన్నదాసు గాత్రంలో లీనమైపోతున్నాయి. ప్రార్థనే సంగీత హృదయుల్ని ఆనంద పారవశ్యంలో ముంచేసింది.

కల్యాణి ముం పూర్వీ కళ్యాణి… కాంభోజి… కరహరప్రియ… రంజని… శివరంజని… బేగడ… భైరవి… శహాన… కానడ… తోడి… అభేరి… ఎన్నో రాగాలు…. రావమ్మ… నీరజాక్షి కమలాక్ష్మి… ఎందుకు దయరాదు… శోభిల్లు సప్తస్వర… మోక్షము భువిలో రామా నన్ను బ్రోవరా… బ్రోచేవారెవరురా… నగుమోము… పంచరత్నాలు…. ఇలా ఎన్నో కన్నదాసు గొంతులోనుంచి జలపాతా జాలువారాయి. కన్నదాసు అంతగా పరవసించి పాడలేదు. తిల్లానాలు… పల్లవులు… ఏనాడూ ఆలపించలేదు.

అందరూ ఆగాన ప్రవాహంలో ఓలలాడారు. పరవసించి పులకించారు. సభలోనివారు…

కన్నదాసు గొంతులో కళ్యాణి పంచకళ్యాణి అయ్యింది. మోహన సమ్మోహనాస్త్రమైంది. మధ్యమావతి మతులు పోగుట్టింది. శివరంజని సిరిమల్లెలా విరిసింది. భైరవి ఉప్పొంగిన సముద్రమైంది. అభేరి భూమ్యాకాశాలను కుదిపేసింది… అన్నారు.

సంగీత ప్రస్థానంలో…

ఆదినాట అంత్య సురభి అంటారు. ఆ సాంప్రదాయాల్ని అనుసరించే కన్నదాసు మంగళం పాడి కచ్చేరి ముగించారు.

హాలు హాలంతా కరతాళ ధ్వనులతో మారు మ్రోగిపోయింది. పొగడ్తల వర్షం కురిసింది.

“ఇంత అద్భుతమైన గాత్రం ఎక్కడా వినలేద”న్నారు.

“ఆ రాగాలాపన నభూతో నభవిష్యతి” అన్నారు.

సభలోని వారంతా ఆనంద పారవశ్యంతో మునిగున్న సమయంలో ఎక్కడినుంచో సుడిగాలిలా పరబ్రహ్మశాస్త్రి మైకు ముందుకొచ్చాడు. అందరూ వూపిరి బిగబట్టి కూర్చున్నారు.

పరబ్రహ్మశాస్త్రి….

“ప్రియమైన విధ్వాంసులారా… కన్నదాసు సామాన్యుడుకాదు. అతని బాణి గాత్ర సంగీత బాణి కాదు. ఆ జ్ఞానం గురువు వల్ల అబ్బిందంటే నేను నమ్మలేక పోతున్నాను. అతని తాత ముత్తాతలెవరో నాదస్వర విద్వాంసులైవుండాలి. ఆ జన్మ సంస్కారం కన్నదాసుకు అబ్బి ఉండాలి. మేము భైరవి పాడితే ఒక్క గోలిగుండు తార్రోడ్డుమీద దొర్లించినట్లుంటాది. కన్నదాసు ఈరోజు పాడిన భైరవి ఒకలారీ గోలిగుండ్లు సిమెంటు రోడ్డుమీద దొర్లించినట్లున్నాయి. ఏది ఎటుపోతూవుందో, దేనివెంట ఏది పరుగెడుతూవుందో చెప్పడం కష్టం. అది అనుభవైక వేధ్యం… అమోఘం… అనిర్వచనీయం…” అంటూ ముగించాడు. పరబ్రహ్మశాస్త్రి కన్నదాసును పొగిడాడో, తెగిడాడో ఎవరికీ అర్ధంకాలేదు.

దెబ్బ తగలాల్సిన చోటే తగిలింది. గుండె బద్ధలైపోయింది. కన్నదాసు విలవిలలాడిపోయాడు. పరబ్రహ్మశాస్త్రి మాటల్లోని వ్యంగ్యం కన్నదాసుకు బోధ పడింది.

ఒక్కక్షణం అక్కడ ఉండాలనిపించలేదు కన్నదాసుకు. ఎందరు ఎన్ని రకాలుగా ప్రాధేయపడినా కన్నదాసు వినిపించుకోకుండా వచ్చేశాడు.

కన్నదాసుకు లోకం స్వరూపం తెలిసొచ్చింది. సంగీతానికి కులం, మతం ఉన్నాయని తెలిసి తల్లడిల్లిపోయాడు. తట్టుకోలేకపోయాడు. విలవిల్లాడిపోయాడు. అర్థాంతరంగా తన గొంతు మూగబోతే బావుండు ననుకున్నాడు. ఎవరైనా తన గొంతును బలంగా పట్టి నులిమేస్తే బావుండు ననుకున్నాడు. నిట్టనిలువునా ప్రాణం పోతే బావుండు ననుకున్నాడు. బతికుంటే పాట పాడకుండా ఉండలేడు. పాట పాడితే అది ఎంగిలి పాట మంగలి పాట అంటారు. తనకు లేని కులం తను ఎక్కడి నుంచి తేగలడు. జ్ఞానంలో ఎవరితోనైనా పోటీ పడగలడే గాని లేనిది. ఎలా సంపాయించగలడు. కులాలు పెట్టినోన్ని చెప్పుచ్చుక కొట్టాలన్నాడు. కులం చూసి గౌరవించేవాడు మనిషే కాదన్నాడు. ఆ మాటకొస్తే ఎవడికులం వాడికి గొప్ప అనుకున్నాడు.

నలుగురికీ ఆనందం పంచే సంగీతానికీ, నలుగురినీ అలరించే సంగీతానికి, నలుగుర్నీ సమ్మాోహితుల్ని చేసే సంగీతానికి… ఈ దేశంలో కులముందన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోయాడు.

బొందిలో ప్రాణమున్నంతవరకూ పాట పాడకూడదనుకున్నాడు. కన్నదాసు. ఎవరొచ్చి అడిగినా కచ్చేరీలు మానేశానన్నాడు. సంగీతం మర్చిపోయానన్నాడు. సంగీతం నాలో చచ్చిపోయిందన్నాడు. ఎంత ప్రాధేయపడినా, ఎంతడబ్బిస్తామన్నా ససేమిరా ఒప్పుకోవడం లేదు.

కన్నదాను ఆర్నెల్లుగా ఎక్కడికి పోవడంలేదు. మాట్లోనే ఉంటున్నాడు. పొలాలంటే, చెరువు గట్లంటి, వంకలంటి, వాడాలంటి తిరుగుతున్నాను. గుండె గొంతుకలోన పోట్లాడి, కాట్లాడి కూనిరాగమై ప్రకృతిలో మాయమైపోతూ ఉంది. ఆ కూని రాగాల్లో మహా ప్రళయ సంఘర్షణాఘర్షణలు ప్రాణం పోసుకుంటున్నాయి.

కన్నదాసు ఇప్పుడు మునుపటిలా లేడు. మాసిన గడ్డం, రేగిన జుట్టు, చెమటలో మగ్గి వాసన కొడుతున్న బట్టలు, పిచ్చిపట్టినవాడిలా గున్నాడు. ఎవరితోనూ మాట్లాడటంలేదు. ఎక్కడికి పోతాదో ఎప్పుడు వస్తాడో ఎవరికీ తెలియడంలేదు.

తన బిడ్డకి ఎవరో ఏమో చేసేశారని సాంబయ్య వూర్లో కనిపించిన మనిషి దగ్గరల్లా గొణుగుతున్నాడు. సాంబయ్య పెళ్లాం ఇంట్లో మూగగా రోధించడమే తప్పా వీధి ముఖానికి రావడంలేదు. కన్నదాను వాలకం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. బయపడిపోతున్నారు. రోజులు… నెలలు… సంవత్సరాలు దోర్లుకుపోయాయి.

ఎగవీధిలో నుంచి పరుగెత్తుకుంటూ వచ్చాడు ఆదెప్ప. రావడం. రావడం గసపోసుకుంటూ వీధిలోంచే సాంబన్నా… సాంబన్నా… అంటూ గట్టిగా పిల్చాడు. వెంటనే సమాధానం లేకపోయేసరికి మొగసాల్లోకొచ్చి “ఏమ్మే వెంకటలక్ష్మి మీ నాయన ఇంట్లో లేడా!” అన్నాడు.

“లేదు మామా పల్లికి పోయినాడు” అని సమాధానమిచ్చింది వెంకటలక్ష్మి,

“ఎట్లమ్మే ఎవురైనా పోయి తొందరగా పిల్చుకోని రావాల” అని చెప్పి ఆదెప్ప కిందికి దిగబడిపోయినాడు.

గుడి పూజారి శేషశాస్త్రి మరణించాడన్న వార్త వూరు వూరంతా అల్లుకుపోయింది. కడసారి కంటిచూపుకు చుట్టుప్రక్కల గ్రామాలనుంచి గుంపులు గుంపులు గా వచ్చిపోతున్నారు. ఆదెప్ప, సాంబన్న కోసం ఆదుర్దగా ఎదురు చూస్తూ ఉన్నాడు.

శేషశాస్త్రి ఇంటి ముందు కోలాహలంగా ఉంది.

ఏడుపులు… ముక్కు చీదడాలు… పడి పడి ఏడ్వడాలు. అందరి ముఖాల్లోనూ విషాదమే. మరణ విషాదం…

“ఏం… వెంకటలక్ష్మీ మీ నాయన రాలేదా!” ఆదెప్ప ఆత్రంగా అడిగాడు.

“లేదు మామా…” వెంకటలక్ష్మి నిస్సహాయత.

“ఇప్పుడు ఏం చేసేదమ్మీ… అందరూ వచ్చేసినారు. మంగలోళ్లని రమ్మనండి అంటూ చెప్పి పంపుతున్నారు. దిక్కు తోచడం లేదు” అన్నాడు ఆదెప్పు.

పల్లె నుంచి పరుగు పరుగున వచ్చిన సాంబయ్య మాత్రం శేషశాస్త్రిని తల్చుకొని కంట తడిపెట్టాడు. కులం కంపులో కుళ్రి కంపుకొడుతున్న శవాలను నిద్రలేపే ఆలోచనలో పడ్డాడు మహావిద్వాంసుడు.

Vote this article
Prakasika
Author: Prakasika

Related Articles

Latest Articles