11.5 C
New York
Sunday, November 24, 2024

మా నాన్న నాకేమిచ్చారు?

కీ. శే. అవసరాల రామకృష్ణారావు

ఫిప్తు ఫారం మొదలు బియ్యస్సీ దాకా ఒకేచోట కలసి చదువుకొని బ్రతుకు తెరువు కోసం ఎవరి మటుకు వాళ్లు విడిపోయినా రవణమూర్తీ, రామ్యూర్తుల మనస్సులు మాత్రం ఎప్పుడూ కలుసుకుని కబుర్లు చెప్పుకుంటూనే ఉంటాయి. అందుకనే ఒక మూర్తి ఈ లోకం నుంచి తప్పుకున్నా రెండవ మూర్తి లోకంలో మాత్రం ఆ మూర్తి స్ఫూర్తి ఎప్పటికీ కళకళలాడుతూనే ఉంటుంది. అలాంటి ఒక సందర్భంలో రవణమూార్తి ఓసారి స్నేహితుడి కొడుకుని చూడ్డానికి వచ్చాడు.

“ఇదిగో అలా నువ్వు కంట తడి పెడితే నేను రాకనే పోదును. మామూలు రకం పరామర్శల కయితే రోజులు దాటకుండానే వచ్చి ఉందును. మూడు నెలలు దాటేక రావడమెందుకూ?”

రవణమూర్తి గోపాలం చెయ్యి మొహం నించి బలవంతంగా అడ్డు తీసేశాడు గోపాలం రెండు కళ్లల్లోంచీ కన్నీళ్లు కాలవలు గట్టేయి. “ఓహో అంటే ఓహో అనుకునే స్నేహితులు వందలకొద్దీ ఉన్నా మనస్సు విప్పి చెప్పుకునేవారు ఏ ఒకరో ‘యిద్దరో ఉంటారు. నెల్లాళ్లకి ఒక మారయినా మా గురించి వింటేనేగాని నాన్న గారికి తోచేది గాదు బాబాయి గారూ! మిమ్మల్ని చూస్తూంటే నాన్నగారు జ్ఞాపకం వచ్చి నా మనసు మరీ కెలికేసినట్లు అవుతోంది”

“అబ్బే, అదేవింటి బాబూ బొత్తిగా చిన్న పిల్లాడిలా?”

“లేదు నేను చిన్న పిల్లాడిని అనుకునే వారింకెవరూ లేరు. చీరలూ నగలూ యిచ్చే మొగుణ్ణి మా ఆవిడకి నేనున్నాను బిచకత్తులూ, పిప్పరమెంతు బిల్లలూ తెచ్చే నాన్నని మా పిల్లలికి నేనున్నాను. నాకెవరున్నారు? మనమల్ని ఎత్తగల వయస్సున్న కొడుకయినా సరిగ్గా తింటాడో లేదో అని భోజనం దగ్గర విసనకర్రతో ప్రత్యక్షమయే తల్లి నాకు ఏనాడో కరువయింది. కొండంత నీడ, ఆకాశమంత అండ మా నాన్న కూడా నాకు లేకుండా పోయాడు… ఇంక నాకెవరున్నారు?” గోపాలం వెక్కి వెక్కి ఏడ్వ నారంభించాడు. విడదీసిన కొద్దీ దెబ్బలాట ఎక్కువైనట్టు, తవ్విన కొద్దీ గొయ్యి పెద్దదైనట్టు, అనునయించిన కొద్దీ విచారం ఎక్కువౌతుంది. అందుకనే అనుభవం గల రవణమార్తి గదిలోకి వెళ్లి పుస్తకాలన్నీ వెతికి “హేప్లాట్‌’ పట్టుకొచ్చాడు. పుస్తకం అటూయిటూ తిప్పి ఒక పేజీ దగ్గర ఆగేడు. “ఇది నువ్వు చదివావుగా బాబూ! తండ్రిని కోల్పోయి సర్వస్వాన్నే “కోల్పోయినట్లు బాధపడే “హేమ్లెట్‌”కి చెప్పినట్టు చెబుతూ షేక్స్పియరు మానవాళికి అందించిన మహత్తర వాక్యాలు చూడు.”

గోపాలం ఆశ్చర్యంగా ఆ వాక్యాలు చదివేడు. సధ్రంథాలకీ జీవితాలకీ అంత సామీప్యం ఉంటుందని అతనెప్పుడూ అనుకోలేదు.

ఆ వాక్యాల సారాంశం యిది : “ఇందులో కొత్తదనం గాని విచారించవలసింది గాని ఏముందీ? నీ తండ్రి తన తండ్రినీ, ఆయన వాళ్ల తండ్రినీ… అలా…. ఎందరో వాళ్ల తండ్రుల్ని కోల్పోయారు…నువ్వీనాడు నీ తండ్రిని కోల్పోవడం అతి సహజం. ఇందులో వింతేమున్నది? చింతేమున్నది? ప్రకృతి సూత్రం అంతే నన్నది!”

గోపాలం పుస్తకాన్ని ఆ పేజీ దగ్గిర విరచి అలాగే టేబిలు మీద పెట్టేడు. ఆ మధ్య మొహం పెట్టి కళ్లు మూసుకున్నాడు.

గోపాలం యింకా యింటికి రాలేదు. రవణమూర్తి ఒక్కడూ గదిలో అటూ, యిటూ పచారు చేస్తున్నాడు. అతను యింట్లో చూసిన రామ్మూర్తి తాలూకు వస్తువులు – పొడుంకాయ, టైరుజోడు, రోల్డ్‌ గోల్డ్‌ ఫ్రేం కళ్లజోడూ, చిన్న వివేకానందుడి ఫొటో – యిలాంటివాటికన్న అతని జ్ఞాపకాలూ.ముఖ్యంగా నిర్లిప్తతా, సంతృప్తి, హాస్యం, మేళవించిన అతని చమత్కార సంభాషణలూ రవణమూర్తిని కదిలించాయి.

“వెధవ పిల్లి, పాలన్నీ ఎలా పారబోసిందో”

“బాగుంది, గిన్నెలోనే ఉండి వేడిగా ఉంటే అలా తాగగలదు మరీ ? అన్ని పాలూ మనమే ఊనబడితే దాని కడుపు నిండేది ఎలా? అయినా నేడో రేపో యీనేట్టుంది కూడాను.”

“అదేవింటీ, దేవుడికి లేకుండా ఆ పువ్వులన్నీ ఊరూ వాడా పంచి పెట్టేస్తున్నారా. ఏం మనుషులమ్మా?”

“బాగుంది, మూడొంతుల మంది దేవుళ్లు పువ్వుల్లో పుట్టినవాళ్లే …. వాళ్లకి మళ్లీ అవే యిస్తే బాగుంటుందా మరీ?”

“రామం, మొన్న బస్సులో వస్తూంటే నీ పర్సు పోయిందట పాపం?”

“బాగుంది, అందులో ఉన్నదెంత గనక ? పాపం ఓ పూట ఓ కుటుంబాని

కయినా కడుపు నిండేనో లేదో… అయినా నాలాంటి అజాగర్త పరుల్నందర్నీ ముందు జైల్లో పెడితే దేశంలో దొంగతనాలు తగ్గునేమో!”

“ఏవంండీ చూశారా, నల్లెలా అంట బొడిచేసిందో… ఎంత దద్దు రెక్కిపోయిందో !”

“బాగుంది జడ్జీగారి కూతుర్ని నల్లి పిల్ల కుట్టడమే ? అంత బొత్తిగా భయం భక్తీ లేకుండా పోయిందా? దొంగ రాస్కెల్‌, ఈమారు కనబడనీ కనుక్కుందాం!”

“పాపం, కోడలు యింటికి వచ్చేవరకైనా మీ ఆవిడ బతకలేకపోయింది….”

“బాగుంది…. కోడలు యింటికి వచ్చేక సుఖంగా బతికిన అత్తగారు ఎవరు గనక? ఒకవేళ యీవిడ సుఖంగా బతికితే ఆ కోడలు జీవించేది ఎన్నాళ్లు గనక?”

“ఇంటింటా తిరుగుతూ యిలా కబుర్లు చెబుతూ ఎన్నాళ్లని తిరగ్గలవు తాతయ్యా ?”

“బాగుంది…. పిలుపు వచ్చే వరకూ ఆగ కేం చేస్తాం? ఇంకా మా అమ్మకి దయ కలిగినట్టు లేదు మరి !”

బాగుంది… జీవితం యింత బాగున్నవాళ్ళకి మరణం కూడా మరింత బాగుండ కేం చేస్తుంది ? కలిగి ఉన్నా కళ్లు కలగని మనిషికి – మంచం మీద ఉన్నా మంచి ముత్యంలా గడిపిన మనిషికి – పంకంలో ఉన్నా పద్మంలా వికసించిన మనిషికి – ఆఖరి కూడా అందంగా ఉండ కేం జేస్తుంది? సూర్యాస్తమయం కూడా సుందరంగా ఉండడంలో వింత ఏముంది? అన్నీ సద్దుకుని సరిదిద్దుకుని రైలు ప్రయాణానికి వెళ్ళినంత ఉత్సాహంగా వెళ్ళిపోయాడు రామ్మూర్తి.

రమణమూర్తి పై గొంతుతో కళ్ల నీళ్లు తుడుచుకున్నాడు. క్రిందటేడు తను రామూరరిని చూడ్డానికి యీ ప్రాంతాలకి వచ్చినపుడు ఒక మారు ఏం జరిగిందనీ….

తియ్యని మాటలే కాక తియ్యని మాత్రలు కూడా యివ్వడం వాడికి అలవాటు. ఇంట్లో వాళ్ళకీ, తెలిసిన వీధిలో వాళ్ళకీ, ఎరిగిన ఊళ్ళో వాళ్లకీ సాయం చెయ్యడంలో పెద్ద ఆశ్చర్య మేమీం లేదు. ఆరోజు తనూ రామూర్తీ ఇలా గుమ్మం దిగి వీధిలో అడుగు పెట్టేరో లేదో ….“ఏం బాబు బత్తాయి పళ్లు మంచి వున్నాయి – ఏవైంనా పడతాయా యేటి” అంటూ పళ్ళమ్మి ఎదురొచ్చింది. దాని నెత్తిన ఉన్న పళ్ల గంపకన్నా అది చంకనెత్తిన గయ్యాలి గంపే రామూర్తిని ఎక్కువగా ఆకర్షించింది.

“ఈ గుంటని తీసుకెడితే యింక నువ్వు పళ్ళు అమ్ముకున్నట్టే.. నీ కేకకన్న దాని ఏడుపే బాగా వినిపిస్తోందేంవేం?”

ఎందుకేటి బాబూ, నాల్రోలమట్టి బొట్టి మూసిన కన్నెరగదు. ముండ నన్నొగ్గదు, నోరు కట్టదూ… నా నేటి సెయ్యను సొప్పండి?”

“చెబుతా…. ముందా గేటు తలుపు వేసి లోపలికిరా ….”

రవణమూర్తి అడ్డు బడ్డాడు.

“ఒరే మనం రైలుకి వెళ్లామను కున్నాంగా…. మధ్యని ఈ పేటా పన ఏవింటీ?”

రామ్యూర్తి మాట వినిపించుకుంటేగా…. లోపలికి వెళ్ళి పొట్లాలు కట్టి తీసుకొచ్చాడు.

“చూడూ ఈ మాత్రలు దీన్చేత మింగించు. ఈ ఎట్టి పొట్లం చీకటి పడ్డాకా, ఓ రాత్రి వేళ ఈ తెల్ల పొట్లమూ…. ఈ విధంగా మింగించు”

“గొప్పోళ్ళు …గొప్పమనసు గలోళ్లు, కొత్త కొత్త కోడళ్ళు కలిగి, గొప్ప గొప్ప లోగిళ్లు కలిగి…”

“ఆం అలా గలాగేలే. ఈ రెండ్రోజులూ తిరుగుళ్లు ఆపు… ఏణ్ణర్ధం దాటని వెర్రిముండని ఎండలో తెగతిప్పి బరికిందని బజాయించుకు. ఈ బియ్యమూ, ఈ పావలా డబ్బులూ పటిగెళ్లి రేపూ ఎల్లుండీ కాలక్షేపం చెయ్యి… రెండోజులపాటు ఇంటి పట్టున ఉంటేనే గాని మళ్ళీ నీ బుల్లి నీది కాదు. తెలిసిందా?”

“మా అమ్మే, నా బాబే… ఎంత సల్లని యేల ఎంత సల్లని తల్లి నిన్నీ బూ మాలచ్చి కిచ్చిందో…. బాబ్బాబు సెమించాల…ఎంచుబడి కాయలన్నీ అమ్మేసుకున్నాను …. దిక్కుమాలిన ముండని నా కాడేం లేదు. ఈ కాయలుంచు బాబో ….”

“అలాగే పిల్లదానికి తొనలు తీసి తినిపించు… నేనే తీసుకుందును గాని యింట్లో చెట్టే ఉందిలే… అడ్డులే… అవతల నాకు పనుంది… పదరా రవణీ….దీనొక్కర్తితో కూచుంటే అయిపోతుందా యేవింటి ?”

అవును… విశ్వమానవ సౌహార్థమూ, విశాల దృక్పథమూ ఉన్న వాళ్ళకి ఒక్కరితో కూచుంటే అయిపోతుందా? ఒక్క “పని” తో సరిపోతుందా? అందుకే ఆ వయస్సు అయీ అవగానే పదవీ విరమణ చేస్తే అందరికీ ఆశ్చర్యం కలిగించింది.

“అదేవింటీ, మీరు విశ్రమిస్తామంటే మేం ఒప్పుకుంటామా ఏవింటి? మీలాంటి “సిన్సియర్‌ వర్మరూ?”, ‘కేపబుల్‌ హేండూ” మళ్ళీ మాకు దొరకద్దూ? ఏదో రూలు కోసం రిటైరు అవడాని కింత వయసని ఏర్పరిచారు గాని రెండుసార్లు రిటైరు అవడానికి సరిపోయిన వయసుతో ఎంతమంది ఉద్యోగాలు చెయ్యడం లేదు? అసలు ఓ చెంప నెరవడమే ఈ దేశంలో నాయకత్వానికి కావలసిన క్వాలిఫికేషను గదా” అని చెప్పి చూశాడు పై యజమాని.

“అందుకని అందుకని చచ్చేదాకా డబ్బు సంపాదించడమే పరమావధిగా పెట్టుకోమంటారా? భవిష్యత్తు మీద గంపెడాశతో ఉద్యోగం కోసం భర్తని పంపించి వీధిలో అతని కోసం ఎదురుచూసే స పచ్చని పడుచు కడుపులో చిచ్చు పెట్ల మంటారా?

వద్దు బాబూ వద్దు. డబ్బు యిచ్చే స సుఖం కన్న అది అరాయించుకోడంలో కలిగే అజిర్తే ఎక్కువ”

ఆఫీసర్లనీ, ఆడిటర్లనీ మేపడాలు, పన్నుల ఎగవేతలూ, ఎకౌంటు సర్దుబాట్లూ వీటితో కొట్టుకుపోతూ కంటి మీద కునుకు ఎరగని పాపిష్టి పనులతో రామ్యూర్తి లాంటి వారికెలా ఉంటుంది యింకా యింకా ముడి? పువ్వులతో మేలుకొని పిల్లలతో ఆడుకుని పక్షులతో పడుకునే ఆయనకి జీవితంలో అందనిదంటూ ఏముంటుంది? పొద్దుటే ఆయన లేవడం చూసుకుని సూర్యుడు ఉదయించే వాడేమో. ఆయన పనిమనిషికీ, పాలవాడికీ జీతాలు యిచ్చే రోజున అది ఒకటో తారీకని అందరూ గుర్తు పెట్టుకొనేవారేమో… ఆయన ఏదైనా జవాబు రాస్తూంటే అంతకు ముందు అరగంటై ఆయనకి ఆ ఎడ్రసు నుంచి ఉత్తరం వచ్చి ఉండాలని తెలుసుకునే వారేమో …

మొగాళ్ళయితే జబ్బలనూ ఆడాళ్ళయితే చీరలనూ ప్రతిక్షణం చూసుకుని మురిసిపోతూ ఉంటారు. అసలు అద్దాల ముందు అతుక్కుపోడానికే ఎక్కడలేని టైమూ చాలదు… ఇంకా ఏమైనా టైం మిగులితే తనకున్న అన్ని విధాల తక్కువ వాళ్ళని చూసి తమ గొప్పలను చెప్పుకుంటూ ఉంటారు, “ఏ వంటావు, నేను చెప్పింది సరైన దవునా కాదా ?’ అని అడుగుతూ ఉంటారు. మీరు సెలవియ్యడం మరోలా జరగడమూనా ?” అనిపించుకుంటూ ఉంటారు. వారానికి మూడుసార్లు తలంటుకొనే అత్తగారి కయినా, “అయ్యో అంత శ్రద్ధ లేకపోతే ఎలాగమ్మా మీకూ? నెలయిందిగదా తలంటుకుని… పదండి యీపాటికి యింత నూని చుక్క పెడతాను” అనే కోడలు కావాలి. రెండు వారాలకుగాని ఒక జత బట్ట మార్చని ఆఫీసరుకయినా “అదేవింటో, మీ దగ్గరకి వస్తే యిదీ అని వర్ణించడానికి వీల్లేని పరిమళమూ, నిర్మలత్వమూ వెల్లివిరుస్తాయి సుమండీ చెప్పకేం” అనే అసిస్టెంటు కావాలి. ఊళ్ళో అమ్మిన “గెడ్సు, ఎవరో చెప్పిన నోట్సూ దగ్గిర పెట్టుకోందే పాఠం చెప్పలేని టీచరు కయినా “అరటిపండు ఒలిచి చేతులో పెట్టడం అనడం వినడమేగాని అనుభవించలేదు. ఇదే కాబోలు” అనే శిష్యుడు కావాలి.

ఎంత సేపు తన వర్ణనా, తన ఓర్పూ, ఇంతకు మించి ఆలోచించడానికి టైమేది ? ఇంకా ఏమైనా మిగిల్లే సంసార తాపత్రయంలో మునిగి తేలడానికి ఒక్కొక్కరికి రెండేసి జన్మలు చాలవు. అవతల వాళ్ళ గురించి తన ఆలోచన ఎప్పుడూ ఉండదు. ఒకవేళ ఉంటే ఆ పద్ధతే వేరు.

“ఏదో పనున్నట్టు మా గోడెక్కి ఊ అరవకపోతే, ఒసే కాకీ, నీ పాండిత్యం ఎదురింటి రవణమ్మగారి దగ్గిర వెలగ బెట్టకూడదు టే” అనుకోని వాళ్లూ, పక్కింటి మోహన రావుగారి యింట్లోనే ఒక కట్టకి కట్ట ఉత్తరాలు దిగెయ్యకపోతే – నీ కొచ్చిన యేళ్లకి, పక్షపాతపు బుద్ధి కాకపోతే మా యింట్లో కూడా ఓ శుభ రేఖ విసింత్రే _ నీ నిక్షేపం త్రరిగి పోతుందా ఏమిటయ్యా ” పోస్టుమేరూ క అనుకోనివాళ్లూ అరుదు. అందుకే ఆశ్రయింపులకే జీవితం అంకితం చేసి దేశంలో చరిత్రలో పెద్ద పెద్ద స్థానాలు కల్పించుకునే వాళ్ల రొదలో – సరళ జీవనులైన సామాన్యుల కథ “వినిపించడమూ వికసించడమూ కూడా అరుదే.

“ఏవింటి యీ ఆలోచనలు తాడూ బొంగరం లేకుండా ?” అనుకున్నాడు రవణమార్తి. వెనక్కి తిరిగిచూశాడు. ఎంత సేపయిందో గాని గోపాలం వచ్చి కూచున్నాడు.

“ఏవయినా అదృష్టవంతుడవయ్యా గోపాలం నువ్వు… మీ నాన్న దేవుడు గాని మనిషి కాదు బాబూ… మీ నాన్న చివరికాల మంతా…. అందరి కంటే ఎక్కువగా నీ దగ్గిరే గడిపేడు…. ఇంతటి సత్సాంప్రదాయం ఊరికే పోదు బాబూ””

“నేనూ అలాగే అనుకున్నాను…. కాని ఆలశ్యంగా పోల్చుకున్నాను…. నేను అన్ని విధాలా అన్యాయమైపోయాను”

రవణమూర్తి ఆశ్చర్యంగా గోపాలం వైపు చూశాడు.

“అవును…. మీ ముందు నాకు దాపరికం లేదు. మనసు విప్పి చెప్పుకోడానికి కూడా మీకంటే నా కింకెవరూ లేరు. ఉన్న ఊరినీ, కన్నవారినీ ఒదిలిపెట్టలేక స్కూలు ఫైనలు ప్యాసవగానే ట్రెయినింగు అయిపోయి ఈ ఊళ్లోనే హైస్కూల్లో టీచరుగా స్థిరపడిపోయానని మీకు తెలుసు. నా సర్వీసంత వయస్సులేని మా పెద్ద కుర్రాడు ఎల్‌.సి.యీ. ప్యాసై నూటయాటై తెస్తున్నాడు గాని నా జీతం నూరు దాటలేదు. అడిగిన వాడికి లేదనని మా నాన్న వచ్చే జీతంలో పెద్ద ఆస్తి మిగులుస్తాడని నా కెప్పుడూ ఆశ లేదు. ఇంత డబ్బు నిలవ చేద్దామన్న ఆలోచన మీద ఆయనకి ధ్యాస ఉన్నట్టు నా కెప్పుడూ తోచలేదు. ఆయన స్పేహితుడొకడు చేయించిన యిరవై వేల లైఫ్‌ పోలసీ మీద మాత్రం అందరితో పాటు నా కళ్లూ ఉండేవి. అది ఆయన మొదట్లో ఎవరికీ ‘ఎసైన్‌” చెయ్యలేదు. ఇంటిపట్టున ఉన్నవాణ్ణి గనక… ఉన్నవాళ్లలో పిల్లలు ఎక్కువా, సంపాదన తక్కువా అన్న దాంట్లో ఫస్టు మార్కు నాది గనక… కనీసం అందులో ఓ పదివేలయినా నాకు ముట్టచెబుతారని ఆశించాను… కాని… జరిగిందేవింటో మీకు తెలుసుగా బాబాయ్‌ గారూ?”

“తెలుసు…. వాడు దాన్ని సంస్కృత పాఠశాలకు రాసిచ్చాడటగా”

“మీ కిది సబ్బుబుగానే తోచిందా?..”

“…. సరేలే… చెప్పు చెప్పు”

“ఇంకేం చెప్పేది? చెట్టంత నాన్నతోపాటు కొండంత ఆశ కూడా నేల కూలి పోయింది. మా నాన్న నాకేమిచ్చారో మీకు తెలుసునా? చెప్పు దెబ్బలు!”

“చెప్పు దెబ్బలా ?”

“అవును, నాలాంటి నిర్భాగ్యుడికి అంతకన్న లభించేవి ఏమున్నాయి? అప్పు డందరూ యింటికి వచ్చినప్పుడు ఎంతో దగ్గరవాళ్లు కూడా ఎంతలేసి మాటలాడేరో మీరు ఊహించలేరు. ఆ రోజున ఎంచేతో నాకు జ్ఞాపకం లేదు, అదే పిల్లలూ యింట్లో లేరు…. అవాళ కొంచెం తల నొప్పిగా ఉంది. మామూలు టైం కన్నముందుగానే నేను యింటి కొచ్చేశాను. నేను రావడం వాళ్లు చూసినట్టు లేదు. ఎవరో అంటున్నారు.

“అలాంటి మహాత్ముడికి అన్నం పెట్టే అదృష్టం యింత మంది బలగంలో ఈ కోడలికే దక్కింది. ఇంతకీ ప్రాప్తం!”

“ఆం, ముప్పె రూపాయలు పారేస్తే వంట మనిష్‌ దొరక్కపోయిందా ఎవింటి గానీ… అయినా నాకు తెలీక అడుగుతానూ, నెలకి మూడొందలు పెన్షను తెచ్చి యిల్లు నింపే మావంగారు ఎవర్తికి చేదే?” అని జవాబు చెప్పింది మా పెద్దొదిన గారు. “అయినా వెంటనే కాచుకుని పెద్ద డాక్టరు చేత వైద్యం చేయిస్తే నాన్న దక్కునమ్మా! ఆయన దగ్గర తినడమంటే అందరూ సిద్ధంగాని, పెట్టడమంటే అందరికీ కష్టమే కదుటమ్మా” అని రాగాలు పెట్టింది మా చెల్లెలు. ‘ఎంత దానం చేసే మనిషయినా ఇంట గెలవక రచ్చ గెలిచేంత అవివేకి కాదు మా నాన్న…. దగ్గిరుండి ఏళ్ల తరబడి తిన్నది చాలక ఈ గోపాలం ఏం ప్రాణం విసిగించాడో, ఆయనకి ఒళ్లు మండి అలా రాసిపారేశారు. మొత్తమ్మీద ఎవరికీ ఏం లేకుండా చేసేగాని వాడి కళ్లు చల్లబడ్డాయి కాదు” అన్నాడు మా చిన్న తమ్ముడు. మా దొడ్డమ్మ అందుకుంది, “అది “కాదు గాని నామాట కాస్త వినండి. మీరందరూ ఆ మహాపట్నాల్లో వందలకి వందలు తెచ్చుకుని మహా సుఖపడుతున్నారనే అక్కసు కొద్దీ అదే యింత పని చేయించి ఉంటుంది. ఉన్నన్నాళ్లూ ఆ మహానుభావుడికి ఓ పూట పెట్టీ పెట్టకా ఆ జాణ పుట్టింటి కీ పాటికి ఎంత జేరే సుంటుందో! దానికి లెక్కా పద్దూ అంటూ ఉన్నాయా యేమిటి?”

“విన్నారా బాబాయి గారూ నాకు మిగిలిందేవింటో…. ఇందులో ఇంకోరు అసూయ పడ్డానికి కూడా ఉందా ? మానాన్న నా కేమిచ్చాడు?”

రమణమూర్తి చిరునవ్వుతో గోపాలం వైపు చూశాడు, ఆ కళ్లల్లో కాంతులు చూసి అతడు ఆశ్చర్యపోయాడు,

“ఇంతకన్న నీకు మీ నాన్న యింకే మివ్వాలి గోపాలం? ఎంతో పూర్వ పుణ్యం చేనుకున్న వాళ్ళకి గాని యిలాంటి ఆస్తి లభించదు. ఎవరో ఎందుకు, నీ సంపద చూసి నేనే అసూయ పడుతున్నాను!”

“అదేవింటి? నాతో మీరు హాస్యమాడుతున్నారా ?”

“లేదు … నీముందున్న చీకటిని తొలగించడానికే ప్రయత్నం చేస్తున్నాను. గట్టునే చూస్తే గంగలో నీళ్ళెైనా కలక బారినట్టే కనిపిస్తాయి. పై ‘పైన కొలిచే నిర్ధారణ చెయ్యడం న్యాయమా గోపాలం? మావాళ్ళంతా డబ్బుతోటే మనుషుల మంచి చెడ్డలు కొలిచే మర మనుషులయిపోయారు. అదే జీవనం అనుకున్నవాళ్లు అదే లేకపోతే అసలు స్వరూపం బయటపడి – బయటపడ్డ చేపల్లా బాధ పడిపోతారు… అందుకనే వాళ్ళు అలా విమర్శించడం చాలా సహజంగా ఉంది. కాని డబ్బు సంపాదించినా దాని వల్ల చెడిపోయినవాడు కుటుంబం మొత్తంమ్మీద మీ నాన్న ఒక్కడే… ఆయన నీడలో మీ అన్నదమ్ములందరి కన్న ఎక్కువకాలం నువ్వు గడిపేవు.. నీ నుంచి మాత్రం యిలాంటి మాటలు నేను ‘ఎక్స్పెక్టు” చెయ్యలేదు.”

“అదేవింటి….”

“అడ్డురాకు…. నన్నలా చెప్పుకుపోనీ…. నిన్నపొద్దుటకదూ నేను మీ యింటికి వచ్చాను … వస్తూనే నేను చూసిందేమిటో తెలుసా ? నీ పిల్లలు అప్పటికే స్నానాలు కూడా చేసి చక్కగా తలలు దువ్వుకుని గడగడ చదువుకుంటున్నారు. మీ ఆవిడ కుంపటి దగ్గిర కూచుని ఎడం చేత్తో ముక్కలు వేయిస్తూ కుడి చేతో ఒల్లో పెట్టుకున్న మడిచిన పేపర్ని అటూ యిటూ త్రిప్పుతూ చదువుకుంటోంది. నువ్వు గదిలో కూచుని కాంపోజిషను పుస్తకాలో ఏవో దిద్దుకుంటున్నావు. నేను వాచీ చూశాను. ఆరయింది! అవును… ఇందులో “ఆశ్చర్య పోడానికేముంది ఇది మన రామూరర్తి యిల్లు మరీ, ఇంకోలా ఎలా ఉంటుంది? అనుకున్నాను….

గోపాలం, సాధారణంగా కాలేజీలు పదింటికి తెరుస్తారని నీకు తెలుసుగా…. అందరూ కాదుగాని చాలామంది విద్యార్థుల దినచర్య చెబుతా విను… ఏ తొమ్మిదిన్నరకో లేస్తారు…వెంటనే శుభ్రమైన యిస్త్రీ జత ఒకటి తొడిగేస్తారు..ఎడం చేత్తో పుస్తకాలూ, కుడిచేత్తో పళ్లుదోము పుల్లా పట్టుకుని

కాలేజీకి వచ్చేస్తారు… ఏ కాలేజీ కయినా అతి దగ్గిరలో ఒక కాఫీ హోటలూ, మంగలిషాపూ తప్పవు. కావలిస్తే
చూడు. ఏ కొళాయిదగ్గిరో దంతదావనం అయిందనిపించి మంగలి షాపులో మేకప్‌ అవుతారు… హోటల్లో “లోడ్‌” వేసుకుని యివతల పడేసరికి ఫస్టు బెల్‌ ఎలాగా అవుతుంది.

ఇదెందుకు చెబుతున్నానంటే దినదిన పతనమై కృత్రిమమైపోతున్న సాంఘిక వ్యవస్థను గమనించిన నా కళ్ళకి మీ యిల్లు చల్లని పందిరిలా కనిపించింది బాబూ”

రవణమూర్తి ఒక్క నిమషం ఆగి మళ్ళీ మొదలెట్టాడు.

“మధ్యాహ్నం ఓమారు పడుకుని లేచే సరికల్లా మరో మనోహర దృశ్యం నా కంట పడింది. మీ అమ్మాయి పెద్దది కాబోలు, బిందెతో నీళ్ళు తీసుకోసోంది. వెనకాల అబ్బాయి రాగి చెంబుతో నీళ్ళు తెస్తున్నాడు. నన్ను పులకింప చేసింది ఇవేవీ కావు. వీళ్ళ వెనుక మీ చంటిది ఎట్టిటి లక్క పిడత నిండా నీళ్ళుపోసి తలమీద పెట్టుకుని రెండు చేతులూ పైకెత్తి అతి పొందికగా, ఒక్కచుక్క నీళ్లు పడిపోకుండా తీసుకొస్తోంది.

“దెక్కడ్నించేవ్‌ గొల్ల భామా” అని నేను పలకరిస్తే ఆ ఆరిందా అంటుందీ…

“బాంది…ఎవరింట్లో నీల్లు వాల్లు తెచ్చుకోలూ ?”

మీ పెద్దమ్మాయి చెప్పింది, అవాళ మీయింట్లో దాసీది రాలేదుట. దాసీదంటే జ్ఞాపక మొచ్చింది పరాధీనతలో పతాక నందుకున్న మా కుటుంబం మాటే చెప్పాలి. మా యింట్లో దాసీదీ, మొక్కలకు నీళ్లు పోసేదీ, మంచినీళ్ళు పోసేదీ, పక్కలు ఎత్తేదీ, బజారు కెళ్లేదీ – ఇన్నిటికీ యుంతమంది నౌకర్లూ ఉన్నారు. నీతో చెప్పకేం మా యింట్లో ప్రతి ఒక్కరికీ; కనుక్కోడానికి ఒకరూ, పొగడ్డానికి ఒకరూ కనీసం యిద్దరేసి మనుషులు కావాలి… ఏ ఒక్క మనిషి లేకపోయినా అయిదు నిమషాలు జరగదు. ఇంతమంది నౌకర్లలో ప్రతిరోజూ ఎవరో ఒకరు మానెయ్యకా మానరు. ఇక వేగుతున్న పేలాల్లా మా యింట్లో ప్రతి ఒకరూ ఎగిరెగిరి పడతారు… చూసి తీరవలసిందే…. బాబూ, డబ్బు వల్ల మేం పొందుతున్న సుఖం యిడీ…. నెలకి నూటయాభై సంపాదించిన నాడూ మేం అందులో ఇమడలేక పోయాం ఇప్పుడు పదిహేను వందలు తెస్తున్నా యిమడలేక చెప్పలేని బాధ పడిపోతున్నాం….

మీ నాన్న క్రమశిక్షణలో సంతృప్తితో, స్వయం సహాయంతో సంతోషంగా బతకడం నేర్చుకున్న మీ కుటుంబానికి ఏం తక్కువయ్యా? ఇప్పుడు చెప్పు గోపాలం మీ నాన్న నీకేం యివ్వలేదుటయ్యా… ?

చూడు గోపాలం… మీరందరూ పుట్టక పూర్వం…సుమారు ఏభై ఏళ్ళ క్రిందట… వెన్నెల రాత్రిలో ఏటి ఒడ్డున యిసకలో నేనూ రామూరర్తి ఒకరి నొకరు అలసి పోయేదాకా తరుముకొనే మధుర స్మృతులు నాకు మరొక చోట జ్ఞాపకం రావు సుమీ… ఇంతటి చల్లని వాతావరణం యిది… క్రమబద్ధమైన మీ జీవితంలో నీ భార్య కూడా భాగస్వామి కాగలిగిందంటే ఆదృష్టాన్ని అభినందించకుండా ఉండలేక పోతున్నాను… నా మనసు కెప్పుడైనా కష్టం కలిగితే విశాంతి కోసం మీ యింటికే వచ్చి తలుపు తడతాను. అవును మరి, రామూళర్తి యిల్లు యిది! నిష్కామమైన వాడి జీవితంలో శతాంశం యిక్కడ ప్రతిఫలించినా యింతకన్న విలువైన ఆస్తి ఉంటుందా? గోపాలం, తలెత్తి నా కళ్లల్లోకి చూస్తూ చెప్పు మీ నాన్న నీకేం యివ్వలేదా?”

గోపాలం భక్తి, కృతజ్ఞతలతో, కన్నీళ్లతో నిండిన కళ్లతో ఆయన వైపు చూశాడు. అంతకంటె బాగా ఎత్తున ఉన్న తండ్రి ఫోటో వైపు చూశాడు. హైస్కూలు మేష్టరీ చేసినా అందరూ మనుషులే…. అది గుర్తించడం కన్న ఆనందాన్ని అందించేది ఏమున్నది?

Vote this article
Prakasika
Author: Prakasika

Related Articles

Latest Articles