11.5 C
New York
Sunday, November 24, 2024

మాయిముంత

డాక్టర్‌ పెద్దింటి అశోక్‌ కుమార్‌

సాయమ్మకు నిద్రవడుతలేదు. చిన్న బిడ్డ దేవ యాదికచ్చి గుండె చెరువయింది. కన్నీళ్లతో మెత్త సగం నానింది.

“బిడ్డ ఒకలకు చెయ్యి జాపకుంట బతుకాలని అప్పుసప్పు జేసి ఉన్న ఇంటికి ఇత్తి. పిల్లలు అయితలేరంటే బూమండలం మొత్తం జోలె గట్టుకుని తిరిగితి. సల్లగ ఒక కానుపు జేత్తి. ఇప్పుడు నేను కనవడుతలేనా…అవ్వారాయే అని తోలుక పోదా! మల్లా పొద్దులు నిండినయి. కానుపుకు ఎట్లతోలుకరావాలె. నాకు ఎట్ల చేతులత్తయి” అనుకుంది.

అప్పుడే బయట బలబల చప్పుడు. చిన్నగా అరుపు. ఆలోచనల్లోంచి తేరుకుని చెవులు రిక్కించి విన్నది సాయమ్మ. సప్పుడు పెద్దదయింది. సాయమ్మ ఉల్కిపడ్డది.

అనుమానం లేదు. ఏ ఎద్దో,పోతో ఎనుగు దుంకి అనుపచేన్లకు వచ్చినట్టుంది. చేను పాడుగాను. ఏ గడియల  కాసెనోగాని పలారంగావట్టె” అనుకుంది.

ఎంటనే భర్తను కేకేసి “ఔ… ఉన్నావా? ఒకసారి గటు సూడుపో…అనుప చేను పెట్టుడేమో గాని కావలి గాయలేక సత్తున్నం. రాత్రిలేదు పగలులేదు” గులిగింది సాయమ్మ.

సాయన్నకు అప్పుడే కన్నంటుకుంది. భార్య పిలుపుకు లేచిండు. “దీని పాడుగాను. రాత్రి పూట ఏమచ్చే! బర్లు గిట్ల వచ్చెనాంటె పొట్టు పొట్టు తొక్కుతయి” అనుకుంట చేతి కట్టెకోసం చూసిండు.

“ఏమాయె, నువ్వు గోశి సదిరే వరకు అది సగం మడి తొక్కుతది. నడువు… నడువు…!” గద్దిరిచ్చింది సాయమ్మ. 

చేతి కట్టెను, టార్చ్‌ లైటును అందుకుని తలుపు తెరిచి బయటకు వచ్చిండు సాయన్న. అప్పటికే పల్లె మొత్తం కన్ను మగ్గింది. పల్లెకు దూరంగా ఉన్న ఇల్లు అది. మాగిన అనుపచేను వాసన గుప్పుమంది. చేను నిండా ఏన్నీల పరుచుకుంది.

సాయన్న పెరడంతా చూసిండు. మొదటి మడిలో నల్లటి ఆకారం కనిపించింది. లైటు కొట్టి చూసిందడు. పాణం దస్సుమంది. అతడు బయపడ్దట్టు అది బర్రెనే!

జన్‌ గత్తర్రాను గదనే! నువ్వు వాసన వట్టినవంటే ఇడుత్తవా..! ఎద్లో పోతో ఐతే ఒకటే వత్తది. నువ్వు మండకు మంద ఎంట పెట్టుకత్తవు” అనుకుంట మట్టి పెల్లను అందుకుని బలంగా ఇసిరి కొట్టిండు.

పెల్ల కొమ్ములకు తాకింది. అయినా బర్రె కదల్లేదు. తీగెల్ని మజ్జెడ మజ్జెడ తొక్కింది. సాయన్నకు తిక్కలేసింది “అరే… దీని కత జూసినవా… అడుగు జరుగుతలేదు.” అనుకుంట చేతిలో కట్టెను ఇసిరిండు. కట్టె అంత దూరం పోలేదు. నాలుగు అడుగులేసి కట్టెను అందుకుని బర మీదికి ఉరికిండు.

అప్పుడే బయటకచ్చింది సాయమ్మ. వత్త వత్తనే ఏన్నీల సాలులో బర్రెను గుర్తువట్టింది. దబదబ నాలుగు అడుగులేసి బరై దగ్గరికి వచ్చింది. కొట్టబోతున్న సాయన్నను అపింది.

ఆమెడ దూరంలో గోజ కనవడితే ఉరికురికి తరిమే సాయమ్మ తనను ఎందుకు అపిందో అర్ధం కాలేదు సాయన్నకు. అతడు అడిగేలోపే గొంతు తగ్గించి “అది మన గొంగి బర్రె గదా! వంగు కొమ్ములు కనవడుతలెవ్వా….” అన్నది.

అప్పుడు చూసిండు సాయన్న బరైను. వంగుకొమ్ములు, నాలె సూపులు, ఎత్తుగా ఉన్న ఊపురం.

కోపం మరింత ఎక్కువయింది “గొంగిదో… గోప్టిదో… తలకు వాసిన ఎంటిక ఏ రేవులపోతే మనకేంది”. అంటూ కట్టెతో బర్రె కొంకుల మీద కొట్టిండు.

ఆ దెబ్బకు గెంటినట్టు రెండడుగులు ముందుకేసింది బరై.

సాయమ్మ గుండెల కలుక్కుమంది. “నీ ప్రాడుగాను జరాగు. బర్రె సుడిమీదుంది. తీగలేత్తుంది. కనవడుతలేదా” అన్నది.

నిండుకుండలెక్క కదులుతున్న బర్రెను చూసినంక సాయన్న చెయ్యి కిందికి దిగింది. అయినా కోపం తగ్గలేదు. “నీగత్తర్రాను నాయిల్లుకు సిచ్చుపెట్టినవు. చేసింది సాలదని మల్లచ్చినవా” అన్నడు కోపంగా.

సాయమ్మకు కోపంలేదు. బాధగా ఉంది. అప్పటికే బిడ్డను తిట్టుకుంట ఏడుతంది. బర్రను చూసినంక ఆ ఏడుపు ఎక్కువయింది. దాని రొండ్లమీద చేతులేసి తట్టి” రేపో మాపో అన్నట్టు తల్లడిత్తన్నవు. గిప్పుడు దొంగతిండి గావలెనా… పొద్దులు నిండినయి. సక్కగ ఇంటికిపో” అన్నది మనిషితో అన్నట్టు.

సాయన్న కోపంతో “ఇంకదాన్ని నెత్తిమీద ఎత్తుకో…ఏ… ఎల్లదొబ్బు. తీగెల్ని తొక్కుతుంది” అన్నడు. అంటూనే అరిచెయ్యితో ఈపు మీద రెండు సరిసిండు బర్రెను. సొలుగుతూ అడుగులో అడుగు, రెండు అడుగులేసి ఆగింది బర్రె.

సాయన్న బర్రెను గెదిమిండు. అది మెల్లెగా ఎనుగుదాటింది. సాయన్న అక్కడనే ఆగిండు. సాయమ్మ మాత్రం బర్రెను పానాది దాటిచ్చి వచ్చింది. ఇద్దరూ ఇంట్లోకి నడిచిండ్రు. తలుపులు దగ్గరేస్తూ పానాది దిక్కు పారజూచింది సాయమ్మ. మసక వెన్నెల్లో బర్రె కనిపించలేదు.

“.. “చూసినవా…గొడ్దు బరైను ఇచ్చినమని మీ అక్క తిట్టనితిట్టు తిట్టె. అది తిట్టింది సరే.. బిడ్డ సల్లగుండ బీడ్డెంత బుద్ధిమంతురాలు. అనరాని మాటలనె. నన్ను ఉరివెట్టుకుని సావుమనె. పందిగన్నట్టు కన్నవనె. ఇప్పుడు జూడు బర్రె ఈతకచ్చె. మీదవడ్డ దెబ్బలు పోతయేమో గాని మాటలు వోతాయా..?” బాధగా అన్నది సాయమ్మ.

సాయన్న నోరు మెదుపలేదు. వచ్చి పక్కమీద వాలిండు. సాయమ్మకు నిద్ర ఎప్పుడో దూరమయింది. మంచం కోడు మీద కూసుంటూ “ఇంట్ల ఎవ్వలు లేరట. పొద్దుగల్లనే తాలమేసి బండి గట్టుకుని మల్లన్న గుట్టలకు పోయిండ్రట. పిల్లయి పుట్టెంటికలు తీత్తరట. అవ్వా పోదాందాయె అని రాకపాయె సూడు. యాడవుట్టె యాడవెరిగే…” బాధగా అన్నది సాయమ్మ.

“తల్లికుంటే బిడ్డ దొర్సానట. బిడ్జెకుంటే తల్లి బాంచెదట. దాని కండ్లకు మనం కనవడుతున్నమా! ఆపతికి సంపతికి ఆదుకుంటదని బిడ్డని ఊరి ఇత్తే అగ్గిల బొర్రియ్యవట్టె.” సాయన్న విరక్తిగా అన్నడు.

ఇద్దరు మౌనంగా పక్క మలిచిండ్రు. సాయన్నకు కన్నంటుకుంది. సాయమ్మకు కన్ను మలుగుతలేదు. బిడ్డదేవనే గుర్తుకత్తుంది. ఆమె తిట్టిన తిట్లే బొచ్చెల మెరుత్తున్నయి.

సాయమ్మకు ముగ్గురు బిడ్డలు. దేవనే చిన్నది. ఇద్దరు బిడ్డలను వేరే ఊరిచ్చిండ్రు. దేవను ఊల్లెనే మేనరికం ఇచ్చిండ్రు. యాదాది రెండేండ్లు గడిచినయి. దేవ ఊర్లెనే కాబట్టి తల్లిగారింటికి పొద్దునవత్తే మాపున ఎల్లిపోయేది. ఇద్దరు బిడ్డలు మాత్రం వారాలకు వారాలు ఉండేవాళ్లు.

వచ్చినప్పుడు వారాలకు వారాలుంటరు. ఉన్నదంతా అక్కలకే పెడుతుందని దేవ అనుమానం. ఊర్లేనే ఉంటుంది గదా! ఉన్నదంతా దేవకే పెడుతుందని అక్కల అనుమానం. మొగంద్లు ఎగేసిండ్రు. అత్తలు దిగేసిండ్రు. అక్క చెల్లెండ్లు ముగ్గురు శికలు వట్టుకున్నరు.

బర్రె పెయ్య దగ్గర పంచాది ముదిరింది. గొంగి బర్రెను దేవ మలుపుకుంది. మాకూ పెయ్య దుడ్డెలను కొనియ్యిమన్నరు పెద్ద బిడ్డలు. వాళ్లకు చెరొకటి  కొనిచ్చింది సాయమ్మ. యాడాది రెండేండ్లలో అవి కట్టి ఈనినయి. దేవది గొంగి పెయ్య మాత్రం కట్టలేదు ఈనలేదు.

గొడ్డు పెయ్యను ఇచ్చినవని దేవ లొల్లిచేసింది. ఇంకోటి కొనియ్యిమంది. చెల్లెకు ఇంకొకటి కొనిత్తే మాకూ కొనియ్యాలని అక్కలు అన్నరు మాటా మాటా పెరిగింది. ఎవలకూ ఏదీ ఇచ్చేది లేదని సాయమ్మ కోపంగా చెప్పేసింది.

దేవను చేసుకుంటే ఇల్లు పొలమూ తమకే ఉంటదని ఆశపడ్డ దేవ అత్తగారికి సాయమ్మ తీరు నచ్చలేదు. ఇంటి మీదికచ్చి నానా యాగి చేసిండ్రు. పెద్ద బిడ్డలిద్దరినీ బదునాం జేసిండ్రు.

ఒకనాడు సాయన్నకు కడుపునొప్పి లేచింది. చూసిపోయిన దిక్కులేదు. ఒకనాడు సాయమ్మకు జరవచ్చింది. వాకిలి నూకిన మనిషిలేదు. బిడ్డలు అల్లుంద్లు రాకదపోకద బందయింది.

సాయమ్మకు ఇప్పుడు అవన్నీ గుర్తుకత్తున్నయి. “ఎవలనేమంది…. ఎవలదేం తింటి…? ముగ్గురు బిడ్డలు ఆపతికి సంపతికి వాలుతరంటే పక్కల పాములైరి. పుట్టెడు పండుగ చేసుకుందట. నన్నుపిలువద్దా! వట్టిగ పోదునా…” అనుకుంది.

అప్పుడే మళ్లీ బలబల సప్పుడయింది. సాయన్నను లేపింది సాయమ్మ. లేపుతూ “మల్లన్న గుట్టలకు పోయినోళ్ళు వచ్చిండ్రంటవా” అన్నది

ఇప్పుడు యాడత్తరు. తినితాగి ఏ తెల్లారంగనో వత్తరు. ఎక్కిపోయే మ్యాకను కొన్నరట. అయినా దయ్యం బియ్యం తింటేంది…? దక్కలోడు పాశం దింటేంది? నడిజాము రాత్రి గుయ్‌ గుయ్‌ మని తలిగినవు పండూ…” అన్నడు యాష్టగా.

అప్పటికి బలబల సప్పుడు ఎక్కువైంది. “ఏం పంటవులేవ్వు…సప్పుడైతుంది. కుప్పను గుర్రాలకు వెట్టి నిద్రపోతవా…?” అంటూ బయటకచ్చింది సాయమ్మ. ఆమె వెంటనే బయటకచ్చిండు సాయన్న, వచ్చింది గొంగి బర్రెనే అని ఇద్దరూ గుర్తు వట్టింద్రు.

ఈసారి బర్రె పెద మడిలో కనిపించింది. చేనులో అనుపకాయ ఎక్కడన్నా బలంగా ఉందా అంటే అది పెద్దమడిలోనే. సాయన్న పాణం గిలగిల కొట్టుకుంది. కోపంతో కట్టెను అందుకున్నడు. పండ్లు కొరుక్కుంట ఉరికిండు. అతన్ని ఆగుమంటూ ఎంట నడిచింది సాయమ్మ. సాయన్న అందకుండా ముందుకు నడిచిండు.

అది మాగమాస శివరాత్రి సందు. సలి తగ్గినా ఇగం పెడుతుంది. సాయమ్మ నెత్తి సుట్టూ కొంగునుకప్పుకుంటూ “తిక్కలోడు పుసపుస రండు దెబ్బలేసినా ఏత్తడు” అనుకుంట దబదబ నడిచింది.

మసక ఎన్నెల్లో గొంగి బర్రై బస్స బస్స మసులుతుంది. అనుపపొదల్ని తొక్కుతుంది. ఆయాసంతో ఎగపోత్తంది.

సాయన్న బర్రెను అదిలించిండు. బయటకు తోలాలని చూసిండు. వద్దని సాయమ్మనే ఆపింది. అది నొప్పులు దీత్తందని గ్రహించి రొండ్లను పునికి చూసింది. మక్కుల్ని నొక్కి చూసింది. మక్కులల్ల బొక్కలు తేలినయి. సాయమ్మకు జల్లుమంది.

“అరే… రొండ్లు గుంజినయి. మక్కులు జారినయి. తోక లావట్టి తినుకుతుంది. తీగేలు చిక్కవడ్డయి. ఈ రాత్రే ఈనేతట్టుంది.” సాయమ్మ భయంగా అన్నది.

సాయన్నకు కోపమచ్చింది.

“ఈననీ ఈనకపోని గంగల గలువని. మనకెందుకు? చేన్ల నుంచి ఎల్లగొడుదాం.” అదిలిస్తూ అన్నడు సాయన్న,

సాయన్నను కోపంగా చూస్తూ “ఈతకు తయారున్న బర్రెను ఎల్లగొడుతవా..? అక్కడ ఎవలూ లేకనేపోయిరి. ఈ రాత్రి ఎటువోతది తిరుగుతుంటే ఎక్కడ ఈనుతది? ఇది పుట్టినప్పుడు ఎంత కష్టమైంది ఎరికే గదా! దీని తల్లికి గుర్లమాయి బయిటికత్తే బద్దలేసి కట్టినం యాదికుందా? దీనికిది తొలుసూరు కానుపేనాయె. ఎంత కష్టమైతదో” అన్నది సాయమ్మ

సాయన్న ఒంటికాలు మీద లేచిండు. “ఏంది…? నువ్వు ఈత జేత్తవా…? వచ్చిన మాట సాలదా… చేను నాశినమైతంది. ఒక్క కాయ చేతికిరాదు. ఎల్లగొట్టు…” అన్నడు.

సాయమ్మ ఏదీ గమనించడంలేదు. బరైెనే చూస్తుంది. దాని స్థితినే అంచనా వేస్తుంది. అది ఆయాసంతో తిరుగుతుంటే ఆమెలో తల్లిపేగు కదులుతుంది. ఏదో మత్తు ఆమెను కమ్ముకుంది.

“నీ కాయ సల్లగుండ. పోతెపోని తియ్యి. పొడ పొత్రం జారుతుంది. గంటలనో అరగంటలనో ఈనుతది. నా ముగ్గురి బిడ్డలతోని దీని మాయిముంత గూడ నాయింట్లనే ఉంది. ఎట్ల ఎల్లగొడుత. నీళ్ళు కాగవెట్టుపో” అన్నది.

సాయన్నకు కోపమచ్చింది. అయినా తమాయించుకున్నడు. సాయమ్మను ఒప్పిస్తున్నట్టు “గడ్డి గాడుపుల పోతేంది…? వడ్లు వాగుల పోతేంది. గాలికివాయే కంపను గోసికి పెట్టుకున్నట్టు ఈ కతేంది, దుకాణమేంది..? ఈ బర్రై సాలు మంచిదిగాదు. కట్టపు కానుపు. అప్పుడు దీనితోనే సిచ్చువుట్టింది. ఇప్పుడు కానుపుల ఏమన్నా అయిందనుకో. మల్లా సిచ్చువుడుతది. మెల్లగ ఎనుగు దాటిద్దాం. పానాదెక్కిచ్చి పల్లెకు మలుపుదాం” అన్నడు.

సాయమ్మ భర్తను ఈసడింపుగా చూసి “పుట్టు నొప్పుల కుట్లు నీకేం తెలుసు. ఇయ్యపురాలు తిట్టిందని, అల్లుడు అలిగిండని బిడ్డను కానుపుకు తీసుకరాక ఊకున్నమా? వాళ్ళ మొఖం ఎవలు జూసిండ్రు. బర్ర మొఖం జూడు. బిడ్డ తల్లడిత్తంది. ఇది గూడా పురుడుకు తల్లిగారింటికే వచ్చింది” అన్నది.

బర్రె ఆయాసంతో కాళ్ళను రాస్తుంది. నీరసంగా కూలబడి లేస్తుంది. తల పైకెత్తి అరుస్తుంది. పోటుమీదున్న సముద్రం లెక్క కల్లోలంగా కదులుతుంది. మంత్రిచ్చినట్టు సాయమ్మ బర్రై చుట్టే తిరుగుతుంది. ఆయాసంతో ఉన్న బర్రె పశువులా కాక కడుపుతో ఉన్న బిడలెక్కనే కనిపిస్తుంది.

సాయన్నకు మాత్రం అసహనంగా ఉంది. కోపంగా కూడా ఉంది. అది తొక్కుతున్న అనుపచేను పొదలే కనిపిస్తున్నయి. ఆమెతో వాదానికి దిగుతూ “సూడు… ఇది తొలుసూరికానుపు. ఏమైతదో తెలువది. ఏదన్నా కిందిమీదైతే మనమే చేసినమని బదునామత్తది. మనను ఉంచనన్నా ఉంచరు. సంపనే సంపుతరు.” అన్నడు.

సాయమ్మ కోపంగా చూసింది. “నీ బుద్దుంటే నాతో ఉండు. లేకుంటే మలుసుక పండు. అంతే గనీ నోటికచ్చింది ఒర్రకు. బర్రెను ఆగం జయ్యకు.” అన్నది రొండ్లు తీడుతూ.

సాయన్న బుస్సుమన్నడు. చేతుల కట్టె నాలెకు గొట్టిండు. “యాడనన్న అగ్గిదలుగు… లంజె…ఆరునెల్ల పంట అగ్గిల వెట్టవడితివి. రేపు ఏదన్నయితే లోపల కత్తిపెట్టి చీరుతరు. అప్పుడు ఆయిమంటది పాణం” అని కోపంగా ఇంట్లకు నడిచిండు.

అతని కంటే ముందుగనే ఇంట్లకు నడిచింది సాయమ్మ. పొయ్యి రాజేసి నీళ్ళు వెట్టింది. కంకెడన్ని ఎల్లిగడ్డలు దంచి ముద్దజేసింది. వరి, గోధుమ, మినుపపిండిలను కలిపి నానవెట్టింది. సందెడు ఎండు గడ్డి తెచ్చి బరై ముందు ఏసింది.

ఏన్నీల నడినెత్తి మీదికచ్చింది. ఆయాసంతో బరై ఒర్రుతుంది. తినుకుతుంది. తల్లడిత్తుంది. నడ్డి ఇరుత్తుంది. పండుకుంట లేత్తుంది దాని సూత్తుంటే సాయమ్మ కండ్లల్ల నీళ్ళు తిరిగినయి.

“అడిజన్మపాడుగానూ… ఆడిజన్మపాడు జన్మబిడ్డా…. అన్నీమనకేనాయె… జరంత ఓర్సుకో… ఇంకొంతసెపైతే అయిపాయె. కానుపంటె వట్టిదా…? సచ్చి పుట్లినట్లు..” అన్నది బర్రాను పునుకుతూ.

బర్రె మసులుతునే ఉంది. అరగంట… గంట… రెండు గంటలయింది. తీగలు పుడుతునే ఉన్నయిగనీ పొడ పొత్రం మాత్రం రాలుత లేదు.

సాయమ్మకు భయం మొదలయింది. సాయన్న మాటలు గుర్తుకచ్చినయి. “అరే..ఇవారకు పొడపొత్రం జారి ఈనేదుండె. పిండం గిట్ల ఎదురుతిరిగిందా ఏంది….?” అనుకుంది. ఈ ఆలోచన రాంగనే సల్ల చెముటలు పుట్టినయి.

పోయి సాయన్నను లేపుదామా అనుకుంది. లేపితే ఇప్పుడు గూడా బర్రెను ఎటో తోలి చేతులు దులుపుకుంటదనుకుని మానుకుంది.

అప్పటికి చలి ఎక్కువయింది. ఏన్నీల వంగింది. ఆగి ఆగి గుడ్డ్గగూబ అరుపు. కుక్కలు మొరుగుతున్నయి. చీమ చిటుక్కుమన్నా వినిపించే నిశ్శబ్దం. బర్రె మసులుతుంది. తల్లడిత్తంది.

సాయమ్మబర్రై ముందు గొగ్గాల్ల మీద కూసుంది. తన మూడు కానుపులు… కానుపు కానుపుకు పడ్డ కష్టం…తాంబోలం సప్పుడు, తుడుము దెబ్బలు యాదికత్తున్నయి.

“పరమాత్మా… ఎంతపనైపాయె. పిండెం అడ్డందిరిగితే బరై బతుకది. నా బిడ్డ మంచిదన్నాగాదు. కావాలని నేనే సంపిన్నని బదునాం జేత్తది. మైసవ్వ తల్లి… ఎట్లనన్న గడ్డకు వడెయ్యి బాంచెను” అనుకుంది భయంగా.

ఇట్ల అనుకుందో లేదో… అట్ల టప్పుమని సప్పుడు. ఉల్కిపడ్డది సాయమ్మ. తెల్లగా బుగ్గలా వచ్చిన పొడపొత్రం తోకకిందినుంచి కొద్దిగా జారిపగిలిపోయింది. సాయమ్మకు కొద్దిగా భయం తగ్గింది. దబదబ రెండు చేతులకు ఆందెం రాసుకుంటూ “ఈ మనిషి వచ్చుగద మంచిగుండు. తొలుసూరు కానుపాయె. ఒకలకొకలం దీము.” అనుకుంది.

వెంటనే ‘పాపపు మనిషి. నేను ఆపతి పడ్డనాడే ఇంట్లలేడు. పాసువలుగ తిని మంచె మీద వన్నడు. ఇప్పుడు వత్తడా” అనుకుంది.

తల్లడిచ్చి తల్లడిచ్చి బర కూలవడ్దది. తల్లడిచ్చిన తల్లికి, ఈలోకానికి రెండు కాళ్ళు ముడిసి దండం పెడుతూ సంటిదుడ్దె బయట కచ్చింది. బగ్ర వరిగడ్డిలో సదురుకుంది. సాయమ్మ కండ్లు మొరిసినయి.

“సూసినవా… తల్లడిచ్చుకుంటనే తల్లి పిల్ల కొరకు దేవులాడుతుంది. నిలవడి ఈనితే. పిల్లకు. దెబ్బతాకుతదని. గడ్డిల పన్నది”. అనుకుంటూ అందెం రాసిన చేతులతో దుద్దెను సాగదీత్తంది. వొర్రుతున్న బర్రెను పునుకుతుంది.

పదినిమిషాలల్ల దుడ్డె బయటకచ్చింది. ఇట్లా దుడ్డె కిందపడ్డదో లేదో అట్లా ఎనక్కి తిరిగింది బర్రె. నొప్పి అయాసంతో ఎగపోత్తూనే దుద్దె ముక్కు మీదున్న మురును నాకింది. డెక్కలు కొరికింది.

సాయమ్మ ముచ్చటపడి తల్లి, బిడ్డనే సూస్తుంది. “సూసినవా దీని ఆరాటం పాడుగాను ముక్కు మీద ముర్రుంటే దుద్దెకు దమ్ముతియ్యరాదు. డెక్కలు కొరుకకపోతే నడువరాదు. పెయ్యినాకకపోతే దుడ్డె గట్టివారది. ఎవలు చెప్పిండ్రే అవ్వా… నీకు” మురిపెంగా అనుకుంది సాయమ్మ.

వెంటనే “నా పిచ్చిగనీ తల్లికి ఒకలు చెప్పాలెనా… బిడ్డలు వట్టిగనే పెరుగుతరా… ఎన్ని కతలు ఎల్లదియ్యాలె. నా బిడ్డలంటే మొగులు మీదినుంచి రాలిపడిరి” అనుకుంది.

బర్రె ఆరాటంగా దుడ్డెను నాకుతనే ఉంది. పెయ్యి మీద ముర్రు ఆరితే దుడ్డె ఎదుగది. అది తెలిసినట్టు ముక్కుమూతి, కండ్లు చెవులు పట్టి పట్టి నాకి శుభ్రం చేస్తుంది. నాకుతూ నాకుతూనే మట్టును కుమ్మరిత్తంది.

మట్టును చూసి సాయమ్మ పాణం దస్సుమంది. కాళ్ళుకడుపుల జొచ్చినయి. మట్టు కరైగా కమిలి పోయినట్టుంది. ఎన్నీల నాలుకు వంగి చూసింది. అనుమానం లేదు. వాసనలో కూడా తేడా ఉంది.

వామ్మో…మట్టు కమిలిపోయింది. మట్టు కమిలిపోతే మాయివడది. మాయి పడకపోతే బర్రె బతుకది. పిండం బయటకచ్చుడు ఒకెత్తయితే మాయి పడుడు మరో ఎత్తు. సల్లగ గడ్డకు వడ్డదనుకుంటే ఇట్ల గావట్టె” అని ఇంట్లకు ఉరికింది.

పిండిల ఎల్లిగడ్డ ఉడుకు నీళ్ళు కలిపి బర్రె ముందుంచింది. తుఫాను తర్వాత సముద్రంలా ఉంది బర్రె. తనలోకమంతా దుడ్డెనే అన్నటు దానినే సూత్తంది. ఆయాసమంత మరిచి నాకుతుంది. నాకుతూ రెండు బుక్కల పిండి తాగి నీరసంగా పండుకుంది.

బర్రె పడుకోంగనే సాయమ్మ బయం మరింత ఎక్కువయింది. “ఈనినంక మాయిపడే దాక బర నిలవడాలె. పండుకొంటె మాయికి బదులు గుడ్గమాయి ఎల్లుతది. గుడ్డమాయి ఎల్లిందంటే బర్రె గుడ్డు మగ్గినట్టె… ఎంత కర్మకచ్చే … మనుసులనేగాదు, పశువులను గూడా కానుపుకు దవాఖాన్లకు తీసుకపోయే కాలమచ్చే…” అనుకుని బర్రెను లేపింది సాయమ్మ.

ఆయాసంగా లేచిన బరై రెండు బుక్కల కుడిది దాగి దుడ్డెనే నాకుతుంది. నాకుతూ నాకుతూ బలబలమని మరింత మట్టు పోసింది. ఆమె బయాన్ని మరింత పెంచుతూ మట్టు గబ్బు వాసనగొట్టింది.

“నీ నాకుడు సల్లగుండ. ఉడుకుడుకుది నాలుగు బుక్కల కుడిది తాగు. ఆసరుంటది. నాకినకాడికిసాలు” అని దుడ్దెను పొదుగు దగ్గరికి తెచ్చింది సాయమ్మ.

తొలుసూరి కానుపు. పొదుగు నిండుగా ఉన్నా మొనల్లో దార సాగలేదు. తడిచేసి సన్నుల్ని సాగదీసింది సాయమ్మ. ముర్రుపాలు తాగితేనే దుడ్దె బతుకుతది. ముర్రుపాలు ఎంత తాగితే అంత గట్టి పడుతది దుడ్డె.

సన్నును సాగదీసి సంటి దుడ్డె నోటికి అందిచ్చింది సాయమ్మ. దుడ్దె పతుకు లాడుతుంది. మూతితో ఎక్కడెక్కడో తడుముతుంది. నిలబడలేక కులవడుతుంది. రొమ్మును అందుకోలేక పోతుంది.

కొంతసేపు మాయిని, భయాన్ని మరిచిపోయింది సాయమ్మ, దుడ్దెను ఎత్తి తన గుండెకు అదిమిపట్టుకుంది. దాని మూతిని సాగదీసి రొమ్మును నోట్లెపిండింది. దుద్దె. పతుకులాటను, సాయమ్మ ఆలోచనను అర్ధం చేసుకున్నట్టు బర్రె ఎనుక కాళ్లను దూరంగా జరిపింది. జరుగలేదు. పొదుగును దుడ్దెకు అందేటట్టు పంగటిచ్చి వంగి నిలవడ్డది.

ఇదీ… తల్లి. ఇంత నొప్పులల్ల గూడా బిడ్డకోసం దేవులాడుతుంది. దీన్ని తల్లిని జేసిన దున్నపోతు నా మొగని లెక్కయాడ గుర్రుకొడుతుందో గని బిడ్డను సాది సవరిచ్చడానికి తల్లి ఎన్ని నొప్పులు దియ్యాలె….. ఎన్ని ఇద్దెలు నేర్వాలే” అనుకుని పాలు పడుతుంది. సాయమ్మ.

బాలెంత బర్రె ఎంత పశువైనా పెయ్యి పచ్చిపుండయితది. దుడ్డె నోట్లెకు ముర్రుపాలు పిండుతుంటే రొమ్ములు పగిలినయి. రక్తం కారుతుంది. పాలను రక్తాన్ని చూడంగనే తన పెద్ద బిడ్డ పుట్టినప్పటి సంగతి యాదికిచ్చింది సాయమ్మకు. అప్పుడు పాలు పడ్డయిగనీ సన్ను ముక్కుకు రంద్రాలు పడలేదు. మంచం నులుక సందుల్లోంచి పాలను పిండింది. రొమ్ములు పగిలి రక్తం కారింది. ఆ బాధ ఇప్పుడు మతిలకచ్చి కండ్లల్ల నీళ్లు తిరిగినయి.

“నీ దుడ్డె పాడుగాను. బతికితే బతుకుతది. సత్తె సత్తది. బోరెమోలె మొగుడు వోంగ బొంత శింపులకు ఏడిసినట్టు దాని పానమే పోతుంది. ఇదోలెక్కనా…. రక్తాలు గారుతున్నయి. ఏం పిండుడు పాడైంది” అనుకుని దుడ్డెను దూరంగా జరిపి లేచింది.

కాని బరై దూరం జరుగలేదు. దుడ్దెకు మరింత దగ్గరగా జరిగి వంగి పొదుగును మూతికి అందించింది. పాలరుచి రక్తం రుచి తెలువని సంటిదుడ్డె ఆకలి ఒక్కటే తెలిసినట్టు తల్లి పొదుగు మీదికి ఎగవడ్డది.

పెయ్యి పుండయినా, రొమ్ము పచ్చలైనా పాలు రక్తం కలిసి పారుతున్నా ఆయాసాన్ని ఉగ్గవట్టుకుని నిలవడ్డది బర్రె. ఎక్కడ ముర్రు  మిగిలిందో వాసనపట్టి మెడను సాగదీసీ దుడ్దెను నాకుతుంది. దగ్గరికి పొదుముకుంటుంది.

తనను తాను మరిచి బర్రను దుడ్డెనే సూస్తుంది సాయమ్మ. తల్లి బిడ్డల తండ్లాటను చూస్తుంటే ఆమె పేగు కదిలింది. రొమ్ములు బరువెక్కినయి. సేపులచ్చినట్టు సలపరింత మొదలయింది.

కొంగును బిగగట్టుకుని ఉడుకు నీళ్ళతో బర్రెను కడిగింది సాయమ్మ. ఎల్లిగడ్డ నూనెను పెయ్యంత రాసింది. బరైను ముందుకు నడిపించి సందెడు వరిగడ్డి ఏసింది. పచ్చటి అనుపచెట్లను నాలుగుపీకి నోటికందించింది. రెండుసార్లు కుడిది పట్టింది.

దుడ్డె సొలుగుతుంది. సొలుగుతూనే పొదుగు మీదికి ఎగువడుతుంది. గడ్డిపోసల్ని నములుతూ నములుతూ ఆయాసాన్ని బిగువట్టుకుని బర్రె పొదుగును అందిస్తుంది. దుడ్డె ఆరాటాన్ని బరై ఆయాసాన్ని చూసి “అందుకే అంటరేమో… బిడ్డరాయి తల్లిలక్క” అని అనుకుంది సాయమ్మ.

అరగంట…గంటగడిచింది. ముర్రుపాలు తాగి దుడ్డె మలుసుకుపన్నది. దుడ్దెను ముందటేసుకుని బర్రె నాకుతుంది.

రాత్రి సాగుతుంది. ఎన్నీల మసుక బారింది. చిమ్మట్ల రోద ఎక్కువయింది. పోసే మట్టు పొత్తనే ఉందిగాని మాయి మాత్రం రాలేదు. లెక్కలేని దేవుండ్లకు ఎదురు మొక్కులు మొక్కింది సాయమ్మ. అయినా మాయిపడలేదు.

అంతవరకు సోపతున్న ఎన్నీల్ల గూకింది. చీకటినిండింది. అది బర్రె జీవితంల చీకటే అనుకుంది సాయమ్మ. నోట్లెతడి ఆరింది. బయంగా సుక్కలను చూసింది. నడిజాము దాటినట్టు పట్టె మంచం వంగింది.

“ఎంత పాపానికచ్చె…ఆయిన అన్నట్టె గావట్టె. ఎట్లగతి” అనుకుంది సాయమ్మ.

నాలుగు కట్టెల్ని దగ్గరేసి మంట పెట్టింది. మంట అడుగున అనుపకాయ మాడి పురిటివాసనల కలిసిపోతున్నది.

మంట వెలుగులో ఇప్పటి కంటే స్పష్టంగా కనపడుతుంది బర్రె. దాని కండ్లల్లో ఇప్పుడు ఇంకో ఆయాసం కనవడుతుంది. అది పురిటి నొప్పులది కాదని తెలిసిపోతనే ఉంది. కడుపుల మాయి ఉందజుట్టి ఎదురు బొచ్చెల తంతే వచ్చే ఆయాసం అది. ఆ ఆయాసమేదో తనకే ఉన్నట్టు తల్లడిచ్చింది సాయమ్మ.

పొంటెజామయింది. బర్రె తల్లడిత్తుంది. కొట్టుకుంటుంది. ఇంటి మీద గుడ్లగూబ “గుగ్గూ గుప్‌” అంటంది. బరై మీద నుండి గబ్బిలాలు తిరుగుతున్నయి. బర్రె వొర్రుడు మొదలుపెట్టింది. కట్టెలమంట ఆరి చీకటి నిండుకున్నది.

సాయమ్మకు ఏడుపచ్చింది. రేపు ఎవలో ఏదో అంటరన్న భయంకంటే బర్రెను దాని ఆయాసాన్ని చూస్తెనే కండ్ల నీళ్లుగారుతున్నయి. ఏడ్సుకుంటనే ఇంట్లకు పోయింది. గొడ్డలి అందుకుంది. సాయన్నను లేపి గొడ్డలి చేతికిచ్చింది. బూరుగుచెక్కను ఉప్పి చెక్కను కొట్టుకురమ్మంది.

నిద్రలేచిన సాయన్న చెక్క పేరు వినంగనే ఉలిక్కిపడ్డడు. కోపంగా “నీకు పిచ్చిలేసిందాయె. మాయిపడకపోతే ఇప్పుడేం సావది. తెల్లారినంక నలుగురిని పిలుద్దాం. సురుకులు పెదుదాం. అప్పటికి పడేనంటే పడుతది. లేకుంటే లేదు. మనమీదికి బదునాం రాదు. ఇప్పుడు చెక్క పోసినమనుకో. పడేనంటే పడుతది. లేకుంటే గంటల సచ్చిపోతది. అప్పుడు బదునాం మనమీదికత్తది.” అన్నడు.

సాయమ్మ వినలేదు. కోపంగా “నీదేం నొత్తంది. నొప్పులు తీసినోనివా… పిల్లల్ని కన్నోనివా. తెల్లారనట తెల్లారని. అది తల్లడిత్తంది తీసుకురాపో…” అన్నది.

సాయన్న ఏదో చెప్పబోయిండు సాయమ్మ చెప్పనియ్యలేదు. “అవన్ని చెప్పకు. ప్పన తెత్తవా నేను తెచ్చుకోవన్నా…” అని అతని సమాధానం కోసం చూడకుండా బయటకు నడిచింది.

అసలే నిద్రమబ్బు. ఆ మీద కోపం. సాయన్నకు తిక్కవుట్టింది. సాయమ్మ చేతులనుండి గొడ్డలి గుంజుకుని బూతులు తిట్టుకుంట అడివికి పోయిండు. బర్రె కొట్టుకుంటుంది. బరైను చూసి సాయమ్మ కొట్టుకుంటుంది. అనుపచేను పడుగు పదుగయింది.

సాయన్న చెక్క తెచ్చేసరికి సాయమ్మ జాజును, గంజిని కలిపి పెట్టింది. దానిని చూసి మరింత బయపడ్డడు సాయన్న, వద్దే వద్దన్నడు. బర్రెను సంపుతవా? అన్నడు. బదునాంగాకుమన్నడు. ఇది తాగితే బరై పిదాత సత్తదన్నదు.

సాయమ్మ వినలేదు. ఒర్రుతున్న బర్రె అయాసమే కండ్లముందు కదిలింది. ఏదో మత్తులో ఉన్నట్టు చెక్కలను దంచి జాజుల కలిపింది.

సాయన్న మొత్తుకుంటనే ఉన్నడు. వద్దంటనే ఉన్నడు. సాయమ్మ గొట్టంతో మందు బర్రెకు పోసింది. మందుకడుపుల వడంగనే వొర్రుతున్న బరై కూలవడ్దది. మెడలు సాపింది. కండ్లు తేలేసింది. గుడ్లు నిలేసింది. నాలుగు కాళ్లను సాగదీసి నిర్రదొక్కింది. కడుపు ఉబ్బి ఎగపోత మొదలయింది.

పొయ్యంగ పోసింది గనీ సాయమ్మ గుండెల రాయివడ్డది. సుట్టూ కమ్ముకున్న చీకటి, చిమ్మట్లరోద, కుక్కల అరుపు. సాయమ్మ బయాన్ని ఎక్కువ చేసింది. గజ గజ వణికి కులవడ్దది.

సాయన్న మంటను ఎగేసి బర్రెను చూసిండు. చెవులు ఇరిసిందు. తోకమట్టను గుంజిండు. దవుడలు పాపి చెతులు పెట్టి నాలికను తడిమిందు. నాలిక ఉబ్బి చేతులల్ల ఇముడలేదు.

“లంజే… వద్దంటే ఇనకపోతివి. ఉచ్చెతార్థంగ బర్రెను సంపితివి. రేపు వాళ్లు అడిగితే ఏంజెప్పుతవు. కడేబజార్ల నిలవెట్టి..” బూతు అందుకున్నడు సాయన్న.

తల్లి ఆయాసం సంటిదుడ్దెకు తెలువది. పొదుగు మీదికి ఎగవడ్డది. బిడ్డ ఆకలి తల్లికి తెలుసు. ఆయాసంలోనూ రొమ్ము అందించింది. దుడ్దెను గుంజుదామని బర్రె దగ్గరకి పోయింది సాయమ్మ. బుడుగ్గుమని చిన్నగ సప్పుడయింది. ఆశగా తోకకింద చేయిపెట్టి చూసింది. సాయమ్మ చేతికి మెత్తగా సల్లగా తలిగింది.

సాయమ్మకు పోయిన పానం లేసివచ్చినట్టయింది. “ఏ మాయి వడుతుంది. మాయి వడుతుంది” అన్నది చిన్న పిల్లలెక్క.

సాయన్న _ ఉల్కిపడ్డడు. కొర్రాయి అందుకచ్చి చూసిండు. సరిగ్గా కనిపించలేదు. “నీ యవ్వ మాయిపడుతుందా… గుడ్లమాయివడుతుందా….?  బర్రెను లేపు… లేపు…” అన్నడు ఆగమాగా.

ఇద్దరు కలిసి బరైను లావట్టిండ్రు. నిలవెట్టింద్రు. దుడ్డెను దూరం జరిపిండ్రు. బర్రె నిర్రదొక్కి ఒక్క తినుకుడు తినికింది. బడుగ్గుమని తట్టెడు మాయి కిందికి రాలింది.

ఊపిరి ఉగ్గవట్టుకున్న సాయమ్మ గట్టిగా దమ్ము తీసి వదిలింది. సాయన్నకు గూడా బయం పోయింది. మాయిని పొక్కల పాతిపెట్టిండు.

సాయమ్మ సంబూరానికి పట్ట పగ్గాలు లేవు. ఉడుకు నీళ్లతో బర్రను కడిగింది. ఎల్లిగడ్డ రాసింది. ఈ ఆగంలో వాళ్లు సూడలేదు గానీ… ఎనుగు దుంకిన నాలుగు ఎడ్లు అనుపచేను కలే తిరిగినయి.

అప్పటకి బల బల తెల్లారుతుంది. పిట్టలు పీసు పీసుమంటున్నయి. ముర్రుపాలు తాగిన దుడ్డె గంతులేస్తుంది. బిడ్డ గంతులను చూసి బర్రె మురిసిపోతుంది. పెయ్య దుడ్దె పుట్టిందని సాయమ్మ మురిసిపోతుంది. రద్దిబద్ది తప్పిందని సాయన్న మురిసిపోతుండు.

గుట్టతీర్ధం నుంచి తిని తాగి తెల్లారేముందు ఇంటికచ్చిన దేవ బర్రెకోసం మొగన్ని గెదిమింది. శంకరి తిరుక్కుంట తిరుక్కుంట అనుపచేను అంచుకచ్చి నిలవడ్డాడు.

“అగో… శంకరి వచ్చిండు. బర్రను కొట్టియ్యి…” భర్తతో అన్నది సాయమ్మ.

సాయన్న బరైను లేపిండు. దుడ్దెను ఎత్తుకొని ముందటనడిచిండు. దుడ్డె వాసనను పసిగట్టి నిలదొక్కుకుని నడుత్తంది బర. దాని కంద్లల్ల దుడ్డె రూపమే నిండుకుంది.

తెప్పలల్ల ఎక్కడనో తేలుతున్న గద్దను పసిగట్టిన తల్లికోడి వాకిట్ల తిరుగుతున్న పిల్లలను రెప్పల కింద దాసుకుంది. దుడ్దె వెంట బర్రె ఒరుకుంట నడుస్తోంది.

సాయమ్మ తల్లికోడిని తల్లి బర్రెను మార్చి చూసింది. ఆమె కండ్లల్ల నీళ్లు తిరిగినయి. తనూ బం ఎంటనడిచింది.

సాయన్నదుడ్దెను శంకరి చేతుల పెట్టిండు. శంకరి దుడ్డెను అందుకోంగనే పెయ్యదా పోతుదా అని తోక ఎత్తి చూసిండు. చూసి నవ్వుకుంట దారి వట్టిండు. తల్లి బర శంకరి ఎంట “వ్రాయ్‌…” మని పిలుసుకుంట నడుత్తంది.

సాయమ్మ గుండె కరిగింది. శంకరికి ఎదురునడిచి “శంకరీ…దేవ పాణమెట్లుంది.. మందులు వాడుకుంటందా…?” అన్నది.

శంకరి పొడిపొడిగా సమాధానం చెప్పి ముందుకు నడిచిండు. అనుపచేనును దాటి శంకరి ఎంట వడ్డది బర్రె.

బర్రె తొక్కిన అనుపచేను అడివిల్లలున్న ఇల్లులక్క అంగడంగడయింది. అక్కడనే ఆగి బర్రెను చూస్తూ “తొడుసు మాల్లోడు… బిడ్డ పుట్టిన్నాడు ఆడిపిల్ల పుట్టిందని అలిగిపోయిందు. ఇప్పుడు ఆడిదుడై పుట్టిందని మురుత్తుండు” అనుకున్నది సాయమ్మ.

“చేను సత్తె నాశినమైపాయె…ఒక్కకాయ చేతుకిరాదు.” అనుకున్నడు సాయన్న.

“తల్లి లక్క బిడ్డ రాయంటరు. నిజమే. బర్రె జూసినవా.. దుడ్దె ఎంటపడి పోతంది. రెండు మూడు నెల్లాయె. దేవ మొఖం జూడక. బిడ్డె బరువు మనిషి. ఎట్లుండెనో… పొద్దులు నిండినంక తోలుక రావాలె. అత్తముండదేం పోతంది. ఆపది వదేదాక పనిజెప్పుతనే ఉంటది.” అనుకుంది సాయమ్మ.

తన బిడ్డ మాయిముంతను తల్లిగారింట్ల పాతి గొంగి బర్రె బిడ్డను దేవులాడుకుంటూ సాగిపోతుంది.

కస్తూరి ఆనందాబార్య స్మారక కథలపోటి 2066 లో ద్వితీయ బహుమతి పొందిన కథ. నవ్య వారపత్రిక 12-4-06

Vote this article
Prakasika
Author: Prakasika

Related Articles

Latest Articles