6.1 C
New York
Monday, November 25, 2024

గుంపులో గోవిందయ్య

గుంపులో గోవిందయ్య

వెంకటమణి ఈశ్వర్

రెండ్రోజులయ్యింది గోవిందును జైల్లో పెట్టి. అరెస్టు చేసినట్లు
కన్నవారికి కనీసం సమాచారం ఇవ్వలేదు పోలీసులు. అప్పుడు పక్కనే వున్న రవి కూడా ఏ
సమాచారమూ ఎవరికీ అందించలేదు; చెబితే ఎక్కడ భయపడతారోనని
మిన్నకుండిపోయాడు. అతడు, మరికొంతమంది కలిసి గోవిందు కోసం స్టేషన్‌ వద్ద
పడిగాపులు కాస్తున్నారు. ఆఖరుకి ఆ నోటా ఈ నోటా విషయం పొక్కి తండ్రి
బాలరాజుకు తెలియగా, ఆనందపురం పోలీస్‌స్టేషన్‌కి వచ్చాడు. గోవిందును
చూస్తానంటే అవతలకి పొమ్మన్నారు పోలీసులు. ఎంత పొమ్మన్నా పోక అతడు
స్టేషను బయటి తలుపు వద్ద వారగా నిలబడి ”మా అబ్బాయి అంత చేయరాని నేరం ఏం
చేశాడు బాబూ? మనిషిని చూపించనైనా చూపించడం లేదు… దయుంచి వదిలెయ్యండి
బాబూ!” అని దణ్ణాలు పెడుతూ వేడుకుంటున్నాడు. అతగాని గోడు ఎవ్వరికీ పట్టడమే
లేదు.
ఇంతలో గోవిందుని మరో స్నేహితుడు, మాజీ కార్పొరేటర్‌ కొడుకు జగన్నాధం
స్టేషనుకొచ్చి సి.ఐ.ని కలిశాడు. ”ఏమిటి సార్‌! మావాడిని అరెస్టు చేశారట.
అడిగితే కారణం కూడా చెప్పడం లేదట. మెజిస్ట్రేటు ముందు ఇంకా
హాజరుపర్చలేదేమిటి, ఇంతకీ కేసు బుక్‌ చేశారా లేదా… ఏదీ ఎఫ్‌.ఐ.ఆర్‌?” అంటూ
ఆరాలు తీశాడు.
సి.ఐ. ”ఒరేయ్‌! సారుకి ఎఫ్‌.ఐ.ఆర్‌. చూపించాలట” అంటూ ఎకసెక్కంగా నవ్వుతూ
”వెళ్లవయ్యా, వెళ్లి పని చూసుకో” అని జగన్నాథాన్ని పొమ్మన్నాడు. జగన్నాథం
”ముందు గోవిందు ఎక్కడున్నాడో చెప్పండి సార్‌! అప్పుడే ఇక్కడి నుండి కదులుతాను”
అని భీష్మించుక్కూర్చున్నాడు. బయటున్న స్నేహితులు లోనికొచ్చి అతడికి
మద్దతుగా నిలబడ్డారు. ”స్టేషన్‌పైకి దొమ్మీకొచ్చారా? ” అంటూ సి.ఐ. లేచి
”ప్రతివాడికీ చట్టమంటే లోకువైపోయింది. ఎవడో అధికారంలో ఉన్నవాడికేగాని…
అది అందరికీ చుట్టమైపోతుందా” అని కసురుకుంటూ వాళ్లని బయటకు గెంటేశాడు.
”ఈ పోలీసులు గోవిందును విడిచిపెట్టరు బాబూ! నన్ను ఆ నాయకుడి దగ్గరికి
తీసుకుపొండి. నేను ఆయన కాళ్లమీద పడి- మళ్లీ ఎప్పుడూ అటువంటి తప్పుడు పని
చేయడని, నాదీ పూచీ అని చెప్పి విడిపించమని అడుగుతాను. వెధవని కన్నాక
తప్పుతుందా నాకు? తీసుకెళ్లండి బాబూ” అని గోవిందు స్నేహితుల వద్ద
మొరపెట్టుకున్నాడు బాలరాజు. వాళ్లు ఆయన్ని తీసుకుని జనరాజ్యం పార్టీ
జిల్లా కార్యాలయానికి వెళ్లారు.
ఆ కార్యాలయం మద్యం వ్యాపారులు, కాంట్రాక్టర్లు, కార్యకర్తలతో
నిండుగా వుంది. జగన్నాథం లోపలకు వెళ్లి- పార్టీ అధ్యక్షులు గారపళ్ల

జ్ఞానేశ్వరరావును కలవాలని బంట్రోతుతో చెప్పాడు. ఆ క్షణాన అధ్యక్షులవారు
తన మద్యం షాపుల మేనేజర్లతో మీటింగులో ఉన్నాడు. ఆ మీటింగు అయినాక కలిసే
అవకాశం కల్పించమని కోరాడు జగన్నాధం.
ఆ కార్యాలయం ఆవరణలోని ఓ చెట్టుకింద కూర్చున్నాడు బాలరాజు. ”బాబూ! నా
కుమారుడిని ఏం చేస్తారో వీళ్లు?లోకంలో ఎన్ని గొడవలు చూడ్డం లేదు…
ప్రశ్నించినవాళ్ల నోళ్లు నొక్కయ్యడమే కాదు- శాశ్వతంగా కొంతమంది నోళ్లు
మూయించేస్తున్నారట కదా” అని ఒకటే ఆందోళనపడిపోతున్నాడు ఆయన.
బాలరాజుకి గోవిందు ఒక్కగానొక్క కొడుకు. వల్లమాలిన ప్రేమ అతగానికి. గోవిందు
డిగ్రీ వరకు చదివాడు. పీజీ చదవాలనుకుంటున్నాడు. ఆసెట్‌ రాశాడు. గవర్నమెంటు సీటు
రాలేదని మరెందులోనూ చేరకుండా ఇంటివద్దనే ఉంటున్నాడు. మనిషి పీజీకి పోతున్నా
అతనిలో ఇంకా కుర్రతనం పోలేదు. చాలామందిలో లేని ఓ ‘దుర్గుణ’మైన ప్రశ్నించే
తత్వమొకటి అతనిలో మెండు; నోటి దురుసుతనం కూడా జాస్తే. డిగ్రీ చదివేటప్పుడు
విద్యార్థి సంఘంలో మహ చురుగ్గా తిరిగాడు. సమస్యలపై అధికారుల్ని
నిలదీసేటప్పుడు, సంఘం నాయకుల వెనక్కి జేరి తను కూడా గట్టిగా గొంతు కలిపేవాడు.
అలా గొడవల్లో పడి తిరుగుతున్నప్పుడు బాలరాజు అతడిపై కోప్పడేవాడు తప్పితే,
మరెప్పుడూ ఒక్క గసురైనా గసురుకునేవాడు కాదు. ఈ మధ్యన ఊరి సమస్య
ఒకదాంట్లో తన-పర అంతరం చూసుకోకుండా ఏదో వాగాడని సొంత మనుషులే వాళ్లమ్మ
సావిత్రమ్మను ఆడిపోసుకున్నారు.
”నోరు అదుపులో పెట్టుకోరా అంటే వినడు. ఎన్నోసార్లు చెప్పింది వాళ్లమ్మ…
వినిపించుకున్నాడా? చూడు ఇప్పుడు విషయం ఎంతవరకు వెళ్లిందో? ఏకంగా ఓ పార్టీ
అధ్యక్షుడిమీదే నోరు పారేసుకున్నాడు. ముందూ వెనుకా చూసుకోవద్దూ! అయినా
అంత మాట అనేస్తాడా? అంటే ఊరుకుంటారా ” ఆక్రోశించాడు బాలరాజు.
”ఊరుకోండి అంకుల్‌! వాడికేం కాదు. అయినా అంత తప్పూ నేరం వాడేం చేసేశాడని…”
ఓదార్చబోయాడు గోవిందు స్నేహితుడు రవి.
”ఆ నేరం చాలదా, ప్రత్యేకించి ఇంకేం చెయ్యాలి? అయినా ఇదంతా నా
ఖర్మగాకపోతే…” అని తల కొట్టుకున్నాడు. అతని మాటల మర్మం అర్థంకాక
జగన్నాథం ”ఏమిట్రా! గోవిందు అంత నేరమేవిటి చేశాడు! ఈయనేంటి ఏదేదో
అంటున్నారు… అసలేం జరిగిందో వివరంగా చెప్పండి” అని స్నేహితుల్ని అడిగాడు.
ఇంతలో జ్ఞానేశ్వరరావు ఛాంబర్‌ నుండి కొందరు బయటికి రావడం చూసి జగన్నాధం
పరుగున వెళ్లాడు. అంతలో జ్ఞానేశ్వరరావు భూఆక్రమణ కేసు విషయమై ఏదో
మాట్లాడ్డానికి ఓ ఎమ్మార్వో లోనికి వెళ్లిపోయాడు. ఆయన వచ్చాక
పిలుస్తానని బంట్రోతు జగన్నాధానికి చెప్పాడు. జగన్నాథం తిరిగొచ్చి
”చెప్పండ్రా… అసలేం జరిగింది” అనడిగాడు.
”ఆరోజు మహాత్మాగాంధీ వర్థంతి. కార్యక్రమానికి ఈ జనరాజ్యం పార్టీ
అధ్యక్షుడు గారపళ్ల జ్ఞానేశ్వరరావు విచ్చేశాడు. ఆయన ఓపక్క మాట్లాడుతూ
వుంటే, మన గోవిందు మరోపక్క కౌంటర్లు వేస్తూ కూర్చున్నాడు. ఆయన తన
ప్రసంగంలో ”ఈరోజున అంతటా అవినీతి రాజ్యమేలుతోంది. అవినీతి రహిత సమాజం

కావాలి మనకు” అని అన్నాడు. ఆ మాట మీద గోవిందు ”దెయ్యాలు వేదాలు
వల్లించడమంటే ఇదే! అసలు సమాజం ఇంతగా అవినీతిమయం కావడానికి ఎవరు కారణం… ఈ
రాజకీయ నాయకులే కదా? వీళ్లే ఓపక్క సమాజాన్ని చెడదీస్తూ మరోపక్క సమాజం
పాడైపోతోందని బాధపడిపోతున్నారు… ఎంత లౌక్యం! ” అని గొణిగాడు. ఆ తర్వాత
పార్టీ అధ్యక్షులవారు ఓ చోట ‘ఈ అవినీతి పోవాలి అంటే గాంధీ మళ్లీ పుట్టాలి”
అని అన్నాడు. దానికి మనవాడేమో ”పుట్టి ఏం సాధిస్తాడాయన; మీ మీ పార్టీ
రాజకీయాల పాలబడి నలిగిపోడూ… ” అని సన్నగా ఓ మాట విసిరాడు. అటుపైన
అధ్యక్షులవారు ”అయితే ఆయన మళ్లీ పుడతారన్న ఆశ నాకు లేదు. కానీ నేటి
సమాజానికి గాంధీలు ఎంతోమంది కావాలి; కాబట్టి మీరంతా గాంధీలుగా తయారవ్వాలి.
అవినీతికి తావులేని బతుకు బతకాలి. ఎన్నికలవేళ ప్రతిపక్షంవాళ్లు మీకు ‘ఓటుకు నోటు’
ఆశచూపుతారు. అలా వాళ్లిచ్చిన నోటు తీసుకుని వాళ్లకు ఓటు వెయ్యకూడదు.
సమాజంలో అవినీతి అనేది ఓటుకు నోటు తీసుకోవడం దగ్గరనుంచే ప్రారంభమవుతుంది.
ఓటుకు వెయ్యి చొప్పున ఇచ్చి గతంలో అధికారంలోకొచ్చిన ప్రతిపక్ష పార్టీ
నాయకులు మీకేం ఒరగబెట్టారో తెలుసు కదా? నా లెక్కన ఒక్కొక్క ఎమ్మెల్యే
వెయ్యి కోట్లు దోచుకున్నాడు; కోట్ల విలువ చేసే భూములు ఆక్రమించుకున్నాడు.
కాబట్టి ఓటుకు నోటు తీసుకోకండి” అని ఆయన అన్నప్పుడు గోవిందేమో
”ప్రతిపక్షంవాళ్లు ఓటుకు నోటు ఇస్తే అవినీతి. అదే వీళ్లిస్తే ఆచారం కాబోలు! ”
అన్నాడు. అధ్యక్షులవారు ”అలాగే ప్రతిపక్షంవాళ్లు పోసిన మందు కూడా తాగకండి.
తాగి మీ ఆరోగ్యాలను పాడుచేసుకోకండి. నేను తాగుడును ప్రోత్సహించను. నిజానికి
నేను మద్యపాన నిషేధాన్ని సంపూర్ణంగా కోరుకునే నాయకుడిని…” అని అనేసరికి
మనవాడికి ఎక్కడ కాలిందో మరి- ”తాగుడును ప్రోత్సహించరు- వ్యాపారం మాత్రమే
చేసుకుంటారు… నియోజకవర్గంలో సగం దుకాణాలు ‘గురువుగారి’వే కదా” అని పైకే
అన్నాడు. పక్కనున్నవాళ్లు ”ఊరుకో బాబూ! అవతల అయ్యగారు మాట్లాడుతున్నారు
కదా…మధ్యలో నీ గోలేంటి?” అన్నారు.
ఆ గోల అధ్యక్షులవారి చెవినబడిందో ఏమో ”బాబూ! ఎవరోగానీ కాసేపు
మాట్లాడకుండా ఉండండి” అన్నాడాయన. ఆ తర్వాత కొద్దిసేపు బాగానే ఉన్నాడు.
అధ్యక్షులవారు చివరగా ”ఇంతకీ నేను చెప్పబోయేదేమిటంటే- మీరంతా ఈ
రోజునుండి గాంధీ మహాత్ముని ఆదర్శంగా తీసుకుని ఆయన బాటలో నడవాలి…” అనంటే-
గోవిందు ”వీళ్లు మాత్రం ఎవర్నీ ఆదర్శంగా తీసుకోరు; ఏ ఒక్క మహాత్ముని
బాటలోనూ నడవరు” అని మళ్లీ గొణిగాడు. నేను ఊరుకోమన్నాను. ఉన్నట్టుండి
ఒక్కపెట్టున ”మరి మీరెప్పుడు గాంధీని ఆదర్శంగా తీసుకుని ఆయన బాటలో
నడుస్తారు సార్‌!” అని కేక వేశాడు. సభలోని వారంతా వెనక్కి తిరిగి చూశారు. ”ఎవరది
అరిచింది” అని అధ్యక్షుల వారడిగారు. బదులుగా ”గుంపులో గోవిందయ్య” అని
జనంలోంచి ఎవరో పిల్లిగొంతుతో అరిచారు. ఇంతలో పోలీసులొచ్చి- కేక వేసినవాడు
గోవిందు అని గుర్తించి ఫట్‌ ఫట్‌మని రెండు తగిలించి పెడరెక్కలు విరిచి పట్టుకుని
అధ్యక్షులవారికి చూపించారు. ”ఏమన్నావ్‌?” అనడిగాడు ఆయన. పోలీసుల చేతుల్లో
పెనుగులాడుతూ మనవాడు ”ఎవరి జయంతి వచ్చినా, ఎవరి వర్థంతి వచ్చినా ఆ
మహానుభావుల్ని ఆదర్శంగా తీసుకోవాలని, వాళ్లు నడిచిన బాటలో నడవాలని ఎంతసేపూ
మాకు చెప్పడమేగానీ, మీరు మాత్రం నడుస్తున్నది లేదు! నాయకులుగా ముందు మీరు ఆ
మహాపురుషుల బాటలో నడిచి చూపిస్తే, మీ వెనుక మేం కూడా నడుస్తాం సార్‌” అని

ఎలుగెత్తి అరిచాడు. కాని మాట అన్నాడని కోపమొచ్చేసిందో ఏమో-
అధ్యక్షులవారు ”కుర్రాడు కమ్యూనిస్టులా వున్నాడు… ఆ దర్శనం చేయించి
పంపండి” అని పోలీసులకు పురమాయించాడు. ”తమరు ప్రత్యేకంగా చెప్పాలా సార్‌… ”
అని వాళ్లు మనవాడిని పట్టుకుపోయారు” అని రవి జరిగిందంతా చెప్పాడు.
ఇంతలో బంట్రోతు ”అయ్యగారు రమ్మంటున్నారు” అని పిలిచాడు జగన్నాధాన్ని.
అందరూ లోనికి వెళ్లారు. బాలరాజు పార్టీ అధ్యక్షుడి కాళ్లపై పడిపోయాడు.
అధ్యక్షుడు తన కాళ్లకు అడుసు అంటుకుపోతుందేమో అన్నట్లు గభాలున వెనక్కి
జరిగిపోయాడు. సెక్యూరిటీ సిబ్బంది తృటిలో బాలరాజుని ఇవతలకు లాగేశారు. అతడు
కళ్లనీళ్లు పెట్టుకుంటూ ”బాబూ… బాబూ… మా గోవిందుని క్షమించి వదిలెయ్యండి
బాబూ! వాడు అమాయకుడు బాబూ!ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు బాబూ వెధవకి” అని
వంగి వంగి బతిమాలుకున్నాడు.
”నోటికెలా వస్తే అలా వాగెయ్యడమేనా… మంచీచెడ్డా చూసుకోవద్దా”
కళ్లెర్రజేశాడు పార్టీ అధ్యక్షుడు.
”బాబ్బాబు… అలాగనడం తప్పే బాబూ!’’ – మరింత నడుం వంచాడు బాలరాజు.
”ప్లీజ్‌ సార్‌… గోవిందుని వదిలెయ్యమని కాస్త పోలీసులకు చెప్పండి” అనడిగాడు
జగన్నాధం.
”షటప్‌! ఒక మహాపురుషుని వర్థంతి రోజున అలాగ అల్లరిపెడతార్రా” కేకలేసేశాడు
అధ్యక్షుడు.
”తప్పే బాబూ, చాలా తప్పయిపోయింది బాబూ! లోకాన్ని తప్పుగా చదివాడు బాబూ
వాడు… ఈసారికి తప్పు కాయండి బాబూ!”
”మనమిలా చులకనగా ప్రవర్తిస్తే మహాపురుషుల ఆత్మలు క్షోభించవూ”

”బాబ్బాబు… బాబూ బాబూ బాబూ! ”

Vote this article
Vishnu Vardhan
Author: Vishnu Vardhan

Related Articles

Latest Articles