6.1 C
New York
Monday, November 25, 2024

స్వయంకృతం

స్వయంకృతం

-సుధామురళి

“ఇదంతా నువ్వు చేసున్నదే… నీ స్వయంకృతానికి ఎవరిని కారణం చేస్తావ్?”

“అదేంటండీ అలా అంటారు?s ఇందులో నా తప్పు ఏముంది, మనుషుల్ని నమ్మడమే నేను చేసిన తప్పా?”

 “ఎంత అమాయకంగా అడుగుతున్నావ్- నాదేం తప్పు ఉందని? నేను చెబుతూనే ఉన్నాను… ‘వాడు ఒట్టి మోసగాడు,  వాడిని వెనకేసుకు వచ్చి ఇల్లు గుల్ల చేయొద్దు’ అని.  విన్నావా? ఇప్పుడు లబోదిబోమంటూ ఏడిస్తే ఏమొస్తుంది?ఎవరి కర్మకు ఎవరు కర్తలు… అనుభవించు”

 ఇదీ- ఉదయం మా ఇద్దరి మధ్యా జరిగిన వాగ్వివాదం. ఈరోజే కాదు, ఎప్పుడు ఏ తప్పు జరిగినా దానికి కారణం నేనూ, నా మనసు, అది చేసే పనులు!

ఇలానే ఉంటాయి మా ఇంట్లోవాళ్ళ ఆలోచనలు.

 మొన్నటికి మొన్న నేను కన్న నా పదమూడేళ్ల కొడుకు ‘అమ్మా! అలా ఆటోవాడు ఎప్పుడడిగితే అప్పుడు అయ్యోపాపం అని ఇవ్వడమేనా’ అన్నాడు. వాళ్ళ పాప స్కూల్ ఫీజులని, చిన్నపిల్లకు మంచి బట్టలు లేవని, అవి కొనిపెట్టాలనీ అలా సాయాలు చేయడం ఎందుకు? ఇప్పుడేమో వాడు ఒట్టి తాగుబోతు, ‘డబ్బులన్నీ ఇలానే తగలేస్తున్నాడ’ని వాళ్ళావిడ నీదగ్గర బాధపడితే ‘ అయ్యో దేవుడా! అలాంటివాడికి దానం చేశానా’ అని ఏడవడం దేనికి? ఇవన్నీ నీ చేతులారా చేసుకున్నవే” అంటూ ఎంత క్లాస్ పీకాడో…?

అసలు చిన్నప్పటి నుంచీ ఇంతేనండీ నా జీవితం!

*****

 “శారదా… శారదా!”

“చెప్పమ్మా… ఎందుకు అలా అరుస్తున్నావ్?”

 ” పక్కింటి ఆ నలభై ఏళ్ల అంకుల్ నీతో తప్పుగా ప్రవర్తించాడా?”

 “ఎవరు చెప్పారమ్మా!”

 “ఎవరు చెప్తే ఏమయ్యింది? అది నిజమా… కాదా”

 ” నాకు ఆయన చూపులు, చేతలు నచ్చట్లేదని నీకు ముందే చెప్పాను. నువ్వేమో ‘ చిన్నపిల్లవి, నీకేం తెలుసే’ అంటూ నా మాటలు పట్టించుకోలేదు. నేను వాళ్ళ ఇంటికి వెళ్లను అంటే నువ్వే బలవంతంగా పంపించేదానివి. ఇప్పుడు నువ్వే నాపైన  అరుస్తున్నావు”

“అవునే! అమ్మకు అర్థం అయ్యేలా చెప్పాల్సిన బాధ్యత నీమీదే కదా ఉంది. అసలు నిన్నెవరు ఆయనతో నవ్వుతూ మాట్లాడమన్నదీ! ఆ ఆంటీ ఉంటే వెళ్ళాలి, లేదంటే మానాలి. అంతేకానీ, నేను వెళ్లమన్నాను కదా అని వెళ్లి, లేనిపోని తలవంపులు తెస్తావా” అంటూ గొడ్డును బాదినట్టు బాదింది. 

నా పదవ ఏట జరిగిన ఈ సంఘటనలో నా తప్పు ఏముందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ‘మామయ్యా’ అని పిలిచే అభంశుభం తెలియని నామీద ఆ దుర్మార్గపు ఆలోచన వస్తుందని నాకెలా తెలుస్తుంది? ఏ ఆలోచనా లేకుండా, అమ్మ నన్ను అలా కొట్టేసింది. మేం ఇల్లు మారేదాకా నన్ను వాళ్ళ ఇంటి గడప కూడా తొక్కనీయలేదు.

*****

“శారదా… శారదా!” ఈసారి నాన్నగారి అరుపులు హాల్ లో నుంచి.

 ” చెప్పండి నాన్నగారూ!”

” ఏంటి ఆ ప్రసాద్ నిన్ను ప్రేమిస్తున్నాను అని ఊరంతా చెప్పుకుంటున్నాడంట?”

“అవునా! నాకు తెలీదు నాన్నగారూ”

“మగపిల్లలతో రాసుకు పూసుకు తిరగడం తెలుసా? అయినా వాడితో మాటలు ఏంటి నీకు? “

 “మీరే కదా నాన్నగారూ- బాగా చదివేవాళ్ళతో స్నేహం చేయమని చెప్పింది. అయినా ఆ ప్రసాద్ నాతో ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదు. పైగా నేను ‘అన్నా’ అనే పిలుస్తాను, ఒకే క్లాస్ అయినప్పటికీ”

 “ఎలా పిలిచి ఏం లాభం…ఇప్పుడు నష్టం జరిగిపోయాక? ఇక కాలేజీ అంటూ ఊరేగక్కరలేదు. ఇంట్లో ఉండి చదివి, ఆ పరీక్షలేవో రాసి తగలడు చాలు”

“నాన్నగారూ”

“నాన్నగారూ లేదూ, ఏమీ లేదు. చెప్పింది చేసి ఉద్ధరించు” 

 ఇది నా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో జరిగిన సంఘటన. ఆ ప్రసాద్ స్వయానా మా నాన్నగారి ఫ్రెండ్ కొడుకే. ఆ చొరవతో స్నేహం చేస్తున్నా ‘అన్నా’ అనే పిలిచేదాన్ని. కానీ అతను ఇలా చేస్తాడని నాకు ఎలా తెలుస్తుంది? ఇందులోనూ నా తప్పే వెతికి, నన్ను బలిపశువుని చేశారు మా ఇంట్లోవాళ్ళు.

*****

“శారదా… శారదా”- ఇది మావారి కరకు కంఠం నుంచి ధ్వనించిన పిలుపు.

” వస్తున్నానండీ… చెప్పండి”

“ఏముందీ చెప్పడానికి? కాలనీ కాలనీ మొత్తం నీ గురించీ, ఆ వికాస్ గురించీ చాలా ఘోరంగా మాట్లాడుకుంటున్నారు”

 “అదేంటండీ, కొత్తగా మీరూ ఇలా మాట్లాడుతున్నారు? వికాస్ మీ ఫ్రెండ్. నా వంటలు, నా కవితలు నచ్చి నాతోనూ స్నేహం చేస్తున్నాడు. అయినా- మీరు లేనప్పుడు ఎప్పుడూ అతను మన ఇంటికి రాలేదు, నాతో మాట్లాడలేదు. అన్నీ తెలిసి, మీరూ ఇప్పుడు ఇలా ఎవరో ఏదో అనుకుంటున్నారని నన్ను వేలెత్తి చూపించడం ఏమీ బాగాలేదు”

“మనం ఉండేది సమాజంలో. నాకు ఈ సమాజం నీ గురించీ, నా గురించీ ఏమని అనుకుంటుంది అనేది చాలా ముఖ్యం. అయినా నువ్వా వికాస్ కి అంత చనువు ఇవ్వడం నాకూ నచ్చలేదు. అయినా ముందు నుంచే నువ్వు ‘అన్నా’ అనో, ‘తమ్ముడూ’ అనో పిలిచుంటే బాగుండేది”

 “అంటే పరిచయం అయిన ఇన్ని రోజుల తర్వాత నన్ను ఆయన్ని ‘వికాస్’ అని కాకుండా ‘అన్నా’ అని పి లవమంటారా… అదీ ఎవరో ఏదో అనుకుంటున్నారని”

“ఎవరో ఏదో అనుకుంటున్నారని కాకున్నా, నీ మనస్సులో ఏ భావం పెరగకూడదని”

“ఏం మాట్లాడుతున్నారండీ? అన్నా అని పిలిస్తే మాత్రం తప్పుడు భావాలు కలగవా? ఎంత అవివేకం మీది. నేను మీకు ఇదివరకే చెప్పాను, నా జీవితంలో జరిగిన ఘటనలు. అన్నీ విని అర్థం చేసుకున్న మీరు, ఇప్పుడిలా సమాజానికి భయపడి నన్ను తప్పుపట్టడం చాలా బాధను కలిగిస్తోంది”

“ఈ చర్చలు అనవసరం. నీకూ, ఆ వికాస్ కి మధ్య ఇక ఏ సంబంధం మిగలకూడదు. లేదంటే కూలిపోయే మన కాపురం నీ స్వయంకృతానికి ఫలితంగా మిగులుతుంది”

ఇది…పెళ్ళైన ఐదేళ్ల తర్వాత, నాకూ వికాస్ అనబడే మావారి ఫ్రెండ్ కీ పరిచయమైన రెండేళ్ల తర్వాత, మా ఇంట్లో జరిగిన సంఘటన.

ఇద్దరి మనసులలో ఏ తప్పుడు ఆలోచనా లేనప్పుడు- ఎవరో ఏదో అనుకునేదానికి కేవలం నేను మాత్రమే ఎలా కారణం అయ్యానో, మా బంధం తెగిపోవడం నా స్వయంకృతం ఎలా అవుతుందో… నాకు బోధపడని విషయం.

*****

‘అసలు ఫలానా టైమ్ కి బయటికి వెళితే ప్రేమ పుడుతుంది అని తెలిస్తే, ఏ ఆడపిల్లా బయటకు వెళ్లదు ” అని అదేదో సినిమాలో సుహాసిని డైలాగ్ చెప్పినట్టు- ఫలానావాడితో స్నేహం చేస్తే చెడ్డపేరు వస్తుంది అని ముందే తెలిస్తే, ఏ ఆడపిల్ల అయినా అలాంటి స్నేహాలు ఎందుకు చేస్తుంది? కోరి కోరి ఎందుకు చెడ్డపేరు తెచ్చుకుంటుంది? …ఇది నాకు ఎప్పటికీ అంతుచిక్కని విషయమే!

 ఇక ఇప్పటి విషయానికి వస్తే-

 నాతో పనిచేసే నా కొలీగ్ ఉమా వాళ్ళాయన ప్రభాకర్…అమ్మకు బాగాలేదని ఒకసారి, తన చెల్లి పెళ్లి అని ఒకసారి రెండు లక్షలు తీసుకున్నాడు. ఇది మావారికి తెలిసి ఇచ్చిన డబ్బులే. ఇప్పుడా ప్రభాకర్ ‘శారద కు నేనంటే ఇష్టం. అందుకే నేను అడిగినా, అడగకున్నా నాకు ధన సహాయం చేస్తూ ఉంటుంది. పదమూడేళ్ళ కొడుకు ఉన్నా ఎందుకో తనకు నేనంటే పిచ్చి’ అని ఊరంతా చెప్పుకోవడం విని  నిలదీస్తే? అనకూడని మాటలు అన్నందుకు నా మనసు ముక్కలు ముక్కలు అయి నేను ఏడుస్తూ ఉంటే, ఓదార్చాల్సింది పోయి దీనికీ నన్నే కారణం చేయడం ఏమిటో… ఆ దేవుడికే తెలియాలి! 

ఆడపిల్లగా పుట్టడం నా స్వయంకృతమా,  లేక స్వయంకృతాపరాధమా?

ఎదిగే వయసులో, ఎవరు ఎలాంటివాళ్ళో అర్థం చేసుకోలేని ముక్కుపచ్చలారని వయసులో అలా బాధింపబడటం నా స్వయంకృతమా!

యవ్వన ఆరంభంలో నా ప్రమేయం లేకుండా జరిగిన ఆ అనుభవాలు నా స్వయంకృతాలా?

అసలు మనుషుల్ని నమ్మడమే నేను చేసిన అపరాధాలా, స్వయంకృతాపరాధాలా!

ఇది ఎప్పటికీ తేలని విషయం. నా జీవితంలో ఎప్పటికీ తప్పించుకోలేని విషయం.  

                                                  ***********************

1/5 - (1 vote)
Vishnu Vardhan
Author: Vishnu Vardhan

Related Articles

Latest Articles