సాహిత్యంలో సాంఘిక నాటక సామ్రాజ్య రాఙ్ఞి కన్యాశుల్కం
– పి. గోవిందరావు, 98668 67610
గురజాడ అప్పారావుగారి కలలరాణి ‘కన్యాశుల్కం’ అని చెప్పవచ్చు. ఇది ఒక సాంఘిక సమస్యాత్మక నాటకం. అన్ని మతాలను సమానంగా భావించిన గురజాడ బరంపురంలోని సర్వమత భోజన సహపంక్తిలో పాల్గొనడాన్ని అప్పటి సనాతన ఆచారం గురజాడని ఒకదశలో దూరం పెట్టింది. అయిననూ అప్పటి ప్రజలను చైతన్యపరిచేందుకు సరైన ప్రచారమాధ్యమాలు లేకపోవడంచేత వేశ్యల మత్తులో మునిగి తేలుతున్న అన్ని జాతులవారిని జాగృతం చేయాలంటే నాటకమే సరైన సాధనమని భావించారు గురజాడ. ఎందుకంటే అప్పటికాలంలో ఊరూరు తిరుగుతూ జరుపుతున్న నాటక ప్రదర్శనలను ప్రజలు ఎక్కువగా ఆదరిస్తున్నారు. కాబట్టి అప్పటి ప్రజలను జాగృతం చేయాలంటే నాటకమే సరైన ప్రచార సాధనంగా భావించిన గురజాడ మొక్కవోని ధైర్యంతో కన్యాశుల్కం నాటకానికి నాందీవాక్యం పలికారు. ఇందులోని పాత్రలన్నీ నిజజీవితానికి అద్దంపట్టేవిగా ఉంటాయి. ఏ పాత్రకి ఆ పాత్ర తన ఔన్నత్యాన్ని పెంచుకుంటూ కథకి బలాన్ని, జీవాన్ని తెచ్చిపెట్టాయని చెప్పవచ్చు.
కన్యాశుల్కంలోని ప్రతి పాత్రా గురజాడవారి అనుభవైకవేద్యమే. ఆనాటి కాలంలో విజయనగరం పరిసర ప్రాంతాలలో వాడుకభాషని ప్రామాణికభాషగా తీసుకోవడం జరిగింది. గురజాడవారి అత్తవారి ఊరు విశాఖపట్నం జిల్లాలోని దేవరాపల్లి. అప్పటికాలంలో వేశ్యలతో సహచర్యం అంటే గౌరవంగా భావించేవారు. అప్పటి రోజుల్లో ప్రతి శుభకార్యానికి సానిమేళం పెట్టడం గొప్పగా భావించేవారు. అటువంటి రోజుల్లో గురజాడ వారి బావమరిది బసవరాజు విజయనగరంలోని వేశ్యావాటికలోనున్న పొడుగు సుందరి అనే వేశ్య పట్ల మోహితుడై ప్రాణత్యాగం చేసుకొవడం గురజాడ మనసు కలచివేసింది. బహుశా ఆ వ్యధ నుండి పుట్టికొచ్చిన పాత్రే మధురవాణి.
సమాజంలో ఎక్కువభాగం వేశ్యామయమై ఉండటాన్ని గమనించిన గురజాడ ఆ వేశ్యావృత్తి పాత్రను తీసుకొని వన్నెచిన్నెలు అద్ది అద్భుతమైన మధురవాణి పాత్రగా శిల్పాన్ని తీర్చిదిద్దారు. ఆనాటి కాలం నుండి ఈనాటి కాలం వరకు చాలా మంది వారికున్న జ్ఞానానికి పండితోత్తములుగా చెలామణి అవుతారేగాని సమయం వచ్చినప్పుడు పప్పులో కాలు వేసి దబాయించుకుంటూంటారు. అలాంటి పాత్రే అగ్నిహోత్రావధానిది.
ప్రతి కథకి ఒక ప్రతి నాయకుడు తప్పకుండా ఉంటాడు. ఇందులో మాత్రం తనకున్న ఆంగ్లభాషా పరిజ్ఞానాన్ని అడ్డుగా పెట్టుకొని తన చుట్టూ ఉన్న సమాజాన్ని మోసగించే విచిత్రమైన వ్యంగ్యాత్మకమైన పాత్ర గిరీశం అనే కాల్పనిక పాత్ర సృష్టి అద్భుతం. ఈ పాత్ర వేశ్యా సాంగత్యం, మోసాలు, అబద్దాలు, ఆడంబరాలు మరిగిన విచిత్ర పాత్ర గిరీశంది. డామిడ్ కథ అడ్డం తిరిగింది, నాతో మాట్టాడ్డమే ఒక ఎడ్యుకేషన్ , పొగతాగనివాడు దున్నపోతై పుట్టున్ – అన్న మాటల గారడీలతో ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేసారు గిరీశం పాత్ర ద్వారా గురజాడ. ఈ పాత్రకి గురజాడవారి హాస్యం, అపహాస్యం, చమత్కారం, సూక్ష్మబుద్ధి సంక్రమించేట్టుగా అనిపిస్తుందని కె.వి.రమణారెడ్డిగారు చెప్పడం జరిగింది. గురజాడవారికి 19వ శతాబ్దపు సామాజిక పరిస్థితులే కన్యాశుల్కం సాంఘిక నాటక రచనకు ఉపక్రమించేలా చేసాయి. ఈ శతాబ్ద కాలంలోనే పాశ్చాత్య విద్యాప్రభావంతో భారతదేశంలో జాతీయ జాగృతి ఏర్పడింది. ఈ శతాబ్ద కాలంలోనే మతాచారాల ముసుగులో స్త్రీజాతిని అథమస్థాయికి దిగజార్చింది.
ఈ నాటకంలోని గిరీశం పాత్ర తెలివైనవాడుగాను, విస్తృత పరిజ్ఞానం గలవాడుగా కూడాను తీర్చిదిద్దారు గురజాడ. సమాజాన్ని తన మాయమాటలతో నమ్మించి, చెలామణి అయ్యాడేగాని ఎవ్వరినీ మోసపుచ్చలేదని మరో విశ్లేషణ. కానీ ఆడపిల్లలను అమ్ముకోవడం, పరమ వృద్ధులకు బాలికలను కట్టబెట్టడం వంటి వాటిని దురాచారాలుగా భావించినట్టి పాత్ర గిరీశంది అని పండితుల అభిప్రాయం.
కన్యాశుల్కం అనే నాటకం ద్వారా “కన్యాశుల్కం” అనే దురాచారాన్ని ఎండగట్టి ఉన్నతమైన నైతిక ప్రమాణాలు దేశం మొత్తం వ్యాపింపజేయడమే గురజాడ ప్రధాన లక్ష్యం. కన్యాశుల్కం భీభత్స ప్రధానమైన , విషాదాంత నాటకమని శ్రీశ్రీ అనడంలో ఆ నాటకానికి ఎంత ప్రాధాన్యం సాహితీలోకంలో ఏర్పడిందో తెలుపవచ్చు. ఈ నాటకం తెలుగు జీవనాన్ని, వాతావరణాన్ని, మనుషుల శ్వాస విశ్వాసాలని, ఆంతరంగిక వ్యధల్ని, భ్రష్టుపట్టిన మానవ స్వభావాలని ఆవిష్కరించే ప్రప్రథమ సాంఘిక నాటకమని సాహితీకారుల అభిప్రాయం.
లెక్చర్లు ఎంతసేపూ సిటీల్లోనే గాని పల్లెటూళ్ళో ఎంతమాత్రం పనికిరావు అని, నీ మాస్టారుకు నన్ను చూస్తే గిట్టదు అందుచేత నిన్ను ఫెయిల్ చేసాడు అన్న గిరీశం మాటలు, మీ వల్ల నాకు వచ్చిందల్లా చుట్టకాల్చడం ఒక్కటే అన్న వెంకటేశం హాస్యపూరక వాక్యాలు గురజాడ హాస్యాన్ని స్పృశించారని కూడా మరో కోణంలో చెప్పవచ్చు. అందుకే కన్యిశుల్కం తరాలు మారుతున్నా ఎప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే సాంఘిక సమస్యాత్మక నాటకం అనడంలో అతిశయోక్తి లేదు.