7.7 C
New York
Monday, November 25, 2024

సంజీవని

సంజీవని

-సింహప్రసాద్

సత్యమూర్తి ఏసీ ఫస్ట్‌ క్లాస్‌ టూ కూపేలో అడుగుపెడుతూనే, లోపల అమర్చిన
పూలూ పండ్లూ చూసి ఎంతో సంతోషపడ్డాడు.
‘‘అంతా ఓకేనా సార్‌. ఇంకేమైనా అరేంజ్‌ చెయ్యనా’’ వినయంగా అడిగాడు రమణ.
‘‘ఈ ఏర్పాట్లు ఓకే, అమృతం గుంట ఎక్కడ?’’
‘‘గుర్రాన్ని కాస్త కట్టెయ్యండి సార్‌. మీరిద్దరూ ఇక్కడే ఎక్కితే పుకార్లు
షికార్లు చెయ్యొచ్చని, నెక్స్ట్‌ స్టేషన్‌లో ఎక్కేలా అరేంజ్‌ చేశాను’’
‘‘గుడ్‌. కత్తే కదా?’’
నవ్వాడు. ‘‘కసిక్కిన మీ గుండెల్లో దిగటం ఖాయం. ఆ విషయంలో నాదీ హామీ. మళ్లీ
మళ్లీ తనే కావాలంటారు చూడండి’’ కన్ను గీటి అన్నాడు. ‘‘మరి నా కాంట్రాక్టు
సంగతి…’’
‘‘ నన్ను ఖుషీ చేసినవారిని ఖుషీగా వుంచడమే నా సిద్ధాంతం, నేను నమ్మిన ఏకైక నీతి.
రేపు సిటీకెళ్ళగానే ముందు నీ ఫైల్‌మీదే సంతకం పెడతాను’’
అతడు ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్లో ఉన్నతాధికారి. టెండర్లు పిలవకుండా
నామినేషన్‌ పద్ధతిలో అయిదు లక్షల వరకూ వర్కు కేటాయించొచ్చు. ఒకవేళ పెద్ద
పని అయితే ముక్కలు చేసి అయినా ఇష్టులకు కట్టబెడుతుంటాడు!
డబ్బు, అధికారం, కులం, బంధుత్వం – ఏ కార్డుకీ అతడు లొంగడు. అమ్మాయి పొందుకే
దాసోహం అంటాడు. ‘నారి’ కోసమే క్యాంప్స్‌కెళ్తుంటాడు. కాంట్రాక్టర్ల
ఖర్చులతో రకరకాల చిలకలతో సయ్యాటలాడటం అతడి హాబీ, ధ్యేయం!
‘‘అర్జంటు పని అని చెప్పి, ఒక్క రాత్రి కూడా వుండకుండా వెళ్లిపోతున్నారు.
అందుకని హోటల్‌ రూమునే ట్రెయిన్లోకి తేవాల్సి వచ్చింది’’ నొచ్చుకున్నాడు
రమణ.
‘‘ఇదో కొత్త అనుభవం. ఇలాంటి వెరైటీలే కిక్కిస్తాయోయ్’’ నవ్వాడు
సత్యమూర్తి.
‘‘హ్యాపీ నైట్‌. శుభరాత్రి. శుభ శోభనం!’’

ట్రెయిన్‌ కదిలింది. లుంగీ ధరించాడు. డియోడరెంట్‌ స్ప్రే చేసుకున్నాడు.
‘ఒళ్ళమ్ముకునేవాళ్ళని నమ్మకూడదు’ అనుకుంటూ పర్సు, డైమండ్‌ రింగ్‌, మెడలోని
లావుపాటి గొలుసు తీసి సూట్‌కేస్‌లో భద్రపరిచాడు. పొరబాటున కూడా ఆ పిల్లని

సెల్ఫీ తీసుకోనివ్వకూడదనుకున్నాడు. ఇది గెస్ట్‌ హౌస్‌ కాదు గనుక మరింత
జాగ్రత్తగా వ్యవహరించాలనుకున్నాడు.
ఉత్కంఠతో ఎదురుచూస్తుంటే, ట్రెయిన్‌ తదుపరి స్టేషన్‌లో మెల్లగా ఆగింది.
ఒకామె చిన్న బ్యాగ్‌తో హడావిడిగా లోపలికొచ్చింది.
పండ్లూ పూలూ చూసి నిరుత్తరురాలయ్యింది. కళ్ళల్లో సన్నని కన్నీటి పొర
కదిలింది.
‘‘నీ ఫస్ట్‌నైట్‌ గుర్తొచ్చిందా? ఫర్గెటిట్‌. కష్టాలు, కన్నీళ్ళు,
ఫ్లాష్‌బ్యాక్‌లు ఇక్కడ నిషిద్ధం’’ కళ్ళు చికిలించి నవ్వి ‘‘ వెల్కం అమృతా!’’
అన్నాడు సత్యమూర్తి.
‘‘నా పేరు అమృత కాదు, సంజీవని’’ కించిత్తు పొగరుగానే అంది.
‘‘ నాకు రెండూ ఒకటేలే. కమాన్‌. కూర్చో. రిలాక్స్‌ డియర్‌…’’
ఆమెని పరిశీలనగా చూశాడు. పాతికలోపే వుంటుందనుకుంటూ, చూపుల్తో
ఎత్తుపల్లాల్ని కొలిచాడు. అతడి రక్తం వేడెక్కసాగింది. కింది పెదవి
కొరుక్కుంటూ, కళ్ళతో కొరుక్కుతినసాగాడు.
ఆమె బాత్‌రూంకెళ్లింది.
అతడు అగరొత్తులు వెలిగించి, ‘తెల్లచీర, మల్లెపూలు…’ పాట హమ్‌ చేయసాగాడు.
పావుగంట తర్వాత వచ్చింది. ఉబ్బి వున్న ఆమె కళ్ళను చూసి నుదురు చిట్లించి
చిరాగ్గా చూశాడు.
‘‘నైటీ వేసుకో, కంఫర్ట్‌గా వుంటుంది. ఇది టూ కూపే. గమ్యం చేరేవరకూ ఇందులో
మనిద్దరమే వుంటాం. టీసీ కాదు కదా చీమ కూడా లోపలికి రాదు’’
ఆమె ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ అతడి పక్కన కూర్చుంది.
‘‘అమ్మాయిలు నవ్వుతూ తుళ్ళుతూ వుంటేనే ముద్దుగా ముచ్చటగా వుంటుంది. నీకు
ఆకలిగా వుంటే స్వీట్సూ ఫ్రూట్సూ వున్నాయి. తిను…’’ ఆకలి చూపుల్తో
కొరుక్కుతింటూ అన్నాడు.

ఆమెలో కదలిక లేదు. ‘ఐస్‌ గడ్డ టైపు కాబోలు. కరగడానికి కాస్త సమయం పడుతుందిలే’
అనుకుంటూ వెళ్లి, ఫ్లాస్కులోని పాలు గ్లాసులో పోసిచ్చాడు.
‘‘ఎదురు సేవ అంటే ఇదే’’ నవ్వాడు గాని, ఆమె శృతి కలపలేదు.
ఆమెని రాచుకుంటూ కూర్చుని భుజంమీద చేయి వేశాడు. వీపు నిమిరాడు. ఆపైన ఒళ్ళంతా
తడిమాడు.

ఆమె ఆ పాలు తాగడం పూర్తి కాగానే, మీదికి లాక్కుని బిగి కౌగిల్లో ఉక్కిరిబిక్కిరి
చేశాడు. పెదాలమీద ముద్దు పెట్టుకోబోతే గట్టిగా వారించింది.
‘‘ఓహో. నీ పెదాలు నీ తొలి ప్రియుడికి అంకితం చేశావా? ఓకే. వాటితో నాకూ
పనిలేదులే’’
ఉప్పెనలా ఆమెని చుట్టెయ్యబోతే- పక్కకి తోసేసి, దూరంగా వెళ్లి నిల్చుని
ఒగర్చసాగింది.
‘‘ఏయ్‌. నా దగ్గర నకరాలు చెయ్యకు. రమణ ఇచ్చిన డబ్బు చాలకపోతే చెప్పు,
ఇంకొంత నీ ముఖాన పడేస్తాను’’.
అంతే. కింద చతికిలబడి, నోట్లో కొంగు కుక్కుకుని మౌనంగా ఏడ్వసాగింది.
‘‘నోర్ముయ్‌. నా ముందు ఏడిస్తే అమ్మాయివని కూడా చూడకుండా చంపేస్తాను’’
ఉగ్రుడయ్యాడు.
కళ్ళు తుడుచుకుని బేలగా చూసింది.
‘‘ఏయ్‌. ఇలారా. బట్టలిప్పెయ్‌…’’
ఆమె రాయిలా వుండిపోయింది. అతడి కోపం తారాస్థాయినందుకుంది. పళ్ళునూరుతూ
రమణకి ఫోన్‌ చేశాడు. ‘‘జలపాతాన్ని పంపమంటే నాచుపట్టిన చెరువుని పంపావేంటి?’’
కస్సుమన్నాడు.
‘‘అదేమిట్సార్‌. ఈ పాటికి స్వర్గానికి బెత్తెడు దూరం తీసుకెళ్ళుండాలే!’’
‘‘ఇదో పెద్ద జడపదార్థంలా వుంది. నువ్వు చెప్పేది సంజీవని గురించేనా?’’
‘‘ఆ పిల్లే సార్‌. ఒకటో రకం రతీదేవి అని ప్రత్యేకంగా సెలక్ట్‌ చేసి పంపాను.
కొంచెం ఓపిక పట్టండి సార్‌. మిమ్మల్ని చూసి భయపడుతోందేమో…’’
‘‘నేను దున్నపోతులా వుంటానా?’’
‘‘అహహ. అబ్బెబ్బే. అది కాద్సార్‌. మీరు పెద్ద అధికారి అని… ’’

‘‘ కాసేపు చూస్తాను. దార్లోకి వస్తే సరే సరి. లేకపోతే రేప్‌ చేసి పారేస్తాను’’
ఆ మాటు విని మరింత బిగుసుకుపోయి, బెదురు చూపులు చూసింది సంజీవని.
‘‘నేను చాలా రకాల సరుకుల్ని చూశాను గాని, నీలాంటిది ఎక్కడా తారసపడలేదు. రా… నా
రొమాంటిక్‌ మూడ్‌ పాడుచెయ్యకు…’’
ఆమె లేచి, సందేహిస్తూనే ఒక్క అడుగు వేసిందో లేదో- అతడు ఎదురెళ్లి
చుట్టేశాడు. నలిపేశాడు. ఆపైన ముందుకెళ్లనివ్వకపోయేసరికి, ఆమె రెండు చెంపలూ
వాయించి బలంగా తోసేశాడు. తలుపుకు కొట్టుకుని పడి పోయిందామె.

‘‘యూ బిచ్‌. నీకేమయ్యిందే. ఇవన్నీ ఎందుకే? ఇంకెందుకే…’’ అంటూ పూలూ పండ్లూ
ఆమెమీదికి విసిరేశాడు. అయినా అతడి కోపం కించిత్తయినా చల్లారలేదు.
రమణకి ఫోన్‌ చేసి ‘‘కరోడాని పంపావు. నా తడాఖా నీకు చూపిస్తా. చస్తే నీకు
కాంట్రాక్టు ఇవ్వను’’ చెడామడా తిట్టేశాడు.
తర్వాత రమణ ఎన్నోసార్లు ఫోన్‌ చేసేసరికి, విసుగొచ్చి స్విచ్చాఫ్‌ చేశాడు.
కాస్త చల్లబడ్డాక ‘‘నేనేమీ రాక్షసుణ్ణి కాదు. శృంగార పురుషుణ్నే. జస్ట్‌ పది
నిమిషాలు…’’ ఆమె ముందు మోకాళ్లమీద కూర్చుని, తన స్వభావానికి విరుద్ధంగా
అర్థించాడు. అతడెన్నడూ ఇలా చేయలేదు. కానీ ఇప్పుడు హీట్‌మీదున్నాడు.
కళ్ళెదుట రూపుదాల్చిన యౌవనం వుంది. అందుకని రాజీపడిపోయాడు.
ఆమె నిశ్శబ్దంగా విలపిస్తూ చేతులు జోడించింది.
‘‘పెద్ద పతివ్రతలా పోజుకొడతావేంటి? నిన్నేమీ బలవంతంగా ఎత్తుకురాలేదుగా. నీ
అంతట నువ్వే వచ్చి ఈ పో జులేంటి? ఛ. గోల్డెన్‌ టైమ్‌ పాడుజేశావు…’’ కసిదీరా
తిట్టాడు.
‘తనని రెచ్చగొట్టి, అల్లరిచేసి, ఆపైన బ్లాక్‌మెయిల్‌ చెయ్యాలన్నది
ఎత్తుగడ కాదు కదా? లేకపోతే తనని ట్రాప్‌ చెయ్యడానికి కిట్టనివాళ్లు పన్నిన
పన్నాగమా?’ -సందిగ్ధంలో కొట్టుకున్నాడు. పెదవి కొరుక్కుంటూ భయంగా,
అనుమానంగా చూశాడు. ‘అహ అదేం అయ్యుండదులే. అంతా తన బ్యాడ్‌ లక్‌. ఆ వెధవ…
శోభనం రాత్రి అంటూ వెకిలిగా నవ్వాడు. వాడి దిష్టే తగిలింది. ఇది తన పాలిట
కాళరాత్రి, కాదు- నరక రాత్రి అయిపోయింది!’
అతడు నిద్రపోలేదు. ఆమెని నిద్రపోనివ్వలేదు. రాత్రంతా అందర్నీ కసిదీరా
తిడుతూ, బెదిరిస్తూ, శపిస్తూ ఉం డిపోయాడు.
తెల్లవారకముందే ట్రెయిన్ గమ్యం చేరింది.
ఇద్దరూ బ్యాగులు తీసుకున్నారు.
ఆమె కూపేలోంచి బయటికెళ్ళబోతూ, ఆగి చేతులు జోడించింది. ‘‘మిమ్మల్ని చాలా
డిజప్పాయింట్‌ చేశాను. సారీ. నన్ను క్షమించండి’’ కన్నీళ్ళతో చెప్పింది.
‘‘ఛస్తే క్షమించను. నా నైట్‌ నాశనం చేశావుకదే పాపిష్టిదానా!’’
‘‘మీరెన్ని తిట్టినా పడతాను. తప్పు నాదే’’
‘‘ఇది తప్పుకాదు. నీతిమాలిన పని. ఏహ్యమైన చర్య. రాత్రి తెల్లవార్లూ నరకంలో
పడేసి, నిలువునా కాల్చి చంపేవు కదే రాక్షసీ!’’
‘‘నేను బతికించేదానినేగానీ చంపేదాన్ని కాదు. నా పేరే సంజీవని’’
‘‘హు. నా పేరు సత్యమూర్తి. అలాగని సత్యవంతుడ్నీ నీతిమంతుడ్నీ అయిపోతానా?
మనిషై పుట్టినందుకు కాస్త నీతీ నిజాయితీ వుండాలి. నీలా నమ్మకద్రోహం

చేసేవారికి పుట్టగతులుండవు’’ ఆమెని క్షుద్రపురుగులా చూస్తూ కసిగా అన్నాడు
సత్యమూర్తి.
‘‘నమ్మినవాళ్ళని నట్టేట ముంచకూడదన్నదే నా నీతి’’
‘‘ఆహా! తమరు చేసిన ఈ ఘనకార్యాన్ని ఏమంటారో?’’ వ్యంగ్యంగా అన్నాడు.
‘‘స్టేషన్‌కొస్తోంటే ఒక సంగతి తెలిసింది. ముందే తెలిసి వుంటే ఛస్తే
వచ్చేదాన్ని కాదు’’ కన్నీళ్ళు చిప్పిల్లుతోంటే అంది.
‘‘ఏంటో ఆ మహత్తర సమాచారం?’’

‘‘నాకు ఎయిడ్స్‌ వచ్చింది…!’’

Vote this article
Vishnu Vardhan
Author: Vishnu Vardhan

Related Articles

Latest Articles