11.7 C
New York
Monday, November 25, 2024

మా తాతయ్య

మా తాతయ్య

-కావ్యశ్రీ

ఉదయం టిఫిన్ గట్రా ముగిశాక వంటగదిలో  ఉన్న నేను వంటపనులు, బాసనలు అన్నీ నా
నెత్తిన వేసుకు వేగుతుంటే- ఇంటి ముందర లాన్ నుండి ఏవో గట్టిగా అరుపులు
వినిపించాయి. మళ్ళీ నిన్నటి అంత ప్రళయం వచ్చినట్టుందేమో  అని  ఇంటికి పరిగెత్తబోగా,
ఎదురుగా మా గారాల పట్టి 3 ఏళ్లదే కానీ మాటకారి అయిన సిరి ఏడుస్తూ వస్తుంటే
అర్థమైంది- వాళ్ళ తాతతో మళ్ళీ గొడవపడిందని. ఆ  వెనకే వస్తున్న అత్తగారు ‘వాళ్ళ దాంట్లో
జోక్యం వద్దు’ అనగానే మా పనిలో మేం మునిగిపోయాం. నేను అత్తయ్యని ఏం జరిగి ఉంటుంది అని  కూడా అడగలేదు.
మధ్యాహ్నం భోజనాల వేళకు మామగారు వచ్చి ఒక్కడే తిని మళ్ళీ తన గదిలోకి
వెళ్ళిపోయాడు. మామూలుగా అయితే సిరి పేచీపెడుతుంటే ఆ అల్లరిని ఆస్వాదిస్తూ
ఆ మాట ఈ మాట చెప్పి దాని కడుపు నింపాకే తను తినేవాడు. కానీ అలా జరగలేదు.
మునుపటి రోజునే అత్తయ్య మామగార్లు ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. ‘ఎటు
తిరిగీ మధ్యలో ఇరికేది మేమే కదా’ అనుకుంటూ మేము కూడా ఆ మౌనంతోనే భోజనం
కానిచ్చేశాం. ఇంకా మా సిరి అయితే దాని మొండిపట్టు వదలలేదు. చిన్నది కదా
కొట్టాలంటే చేతులు రాక బుజ్జగిస్తే- వింటేనా?   అటు ఇటుగా తినకుండానే
పుణ్యకాలం కాస్తా గడిచిపోయింది.
సాయంత్రం సమయాన, మాటల్లో మాటగా అత్తయ్య నన్ను పిలిచి “అమ్మా సుమా!
మీ మామగారికి టీ ఇచ్చే సమయం అయ్యింది. వెళ్లి ఇవ్వమ్మా” అనేసరికి
అలసటతో ఉన్న నాకు ఆక్రోశం ఒక్కసారిగా పరిగెత్తుకొచ్చినా ఆ కోపం కాస్తా
చటుక్కున మాయమైపోయింది ఆమె మొహం చూడగానే. అంతటి శాంతమూర్తి మరి తను. 
అలాంటి తనతో ఏమీ అనలేక “సరే అత్తయ్యా!” అని టీ మామయ్య గదిలో పెట్టి తిరిగొచ్చా.
అత్తమ్మతో… “అత్తయ్యా! ఎప్పుడూ ఉండే గొడవలు కాదా ఇవి? ఇంకా మాట్లాడకుండా
ఎన్ని రోజులు ఇలా?” అని సర్దిచెబుతుండగా- చిన్న నవ్వు నవ్వింది. “అమ్మా సుమా!
నువ్వే చూస్తున్నావ్ కదా…ఎప్పుడూ తనని ఎవరూ సరిగ్గా అర్థం చేసుకోరు అని
రాద్ధాంతం చేస్తారు మీ మామగారు! చివరికి చిన్నపిల్లదాన్ని కూడా అలానే అంటే
నేనేం చేసేది?ఈ మనిషి ఇప్పుడు చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తే ఎలా చెప్పు?
నాతో గొడవపడితే నేనేం అనాలి?  అదీకాక నా దగ్గరికి రాక ఆయనగారి వెంటే తిరుగుతూ
ఉండాలా? నానమ్మని నేనంటేనే ఎక్కువ ఇష్టం దానికి. కాబట్టి నాతో ఉంది. ఈ వేళ
ఉదయం  సిరి వాళ్ళతాత దగ్గరికి వెళ్ళేసరికి దగ్గరికి తీసుకోకపోగా- నువ్వు నా దగ్గరికి రాకు అంటూ గట్టిగా అనేసరికి నేను గట్టిగా వాదించాను. అది నచ్చలేదు మీ మామగారికి!  ఇప్పుడు చెప్పు తప్పు నాదా, మీ మామగారిదా? “

“అది మరి అత్తయ్యా ముమ్మాటికీ మామగారిదే!  కానీ పాపం తన వయస్సురీత్యా ఇప్పుడు
చిన్నపిల్లాడే అత్తయ్యా! ఆ కాలంలో మీకు, మామగారికి 10 సంవత్సరాల తేడా ఉండటం మూలాన   మీకు
ఆ పరిస్థితి అర్థమవట్లేదు.  అయినా మీకు చెప్పేంత అనుభవం ఉన్నదాన్ని కాదు. ఉద్యోగంలో, జీవితంలో
ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలదొక్కుకున్న మనిషి అని మీరే ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా…అంతే. ఇప్పుడు ఆ మనసు అలసి కాస్త ప్రశాంతతను కోరుకుంటోంది.  మన సిరి నిన్న అంత గొడవ జరుగుతుంటే  చిన్నప్పటి నుండి మీ చేతిలో ఎక్కువ మెదలడం వల్ల  మిమ్మల్ని  ఒక్క మాట అన్నా కూడా సహించక వాళ్ళ తాతయ్యపై ఎదురుతిరిగింది. చిన్నపిల్ల కదా ఆ పసిదానికేం తెలుసు?


రాత్రి ఆ విషయం  అంతా మర్చిపోయి  ‘తాతయ్యా’ అని పలకరించింది. మాట్లాడకపోతే మీరు కూడా పోనీలెండి అని మెల్లిగా  తన మాట విన్నట్టుగా కాస్త సర్దిచెప్పి ఉంటే -నిన్నటి సమస్య ఈ రోజుతో
సమసిపోయేది. చూడండి, ఇప్పుడు ఇంకాస్త పెద్దగా అయ్యింది” అని చెప్పగానే అంది.
“నువ్వు చెప్పింది నిజమే కానీ, ఆయనగారి మీద కోపంతో  ఆ ఆలోచన వస్తేనా ఈ బుర్రకి”…
“సర్లెండి అత్తయ్యా చూద్దాం. ఈ రోజుకి కాస్త సమయం ఇస్తే అంతా సర్దుకుంటుంది” అని నేను ఇచ్చిన
ధైర్యంతో ఊపిరిపీల్చుకుంది అత్తగారు.


రాత్రి భోజనాల సమయానికి ఎవరికి వారు వచ్చి మారుమాట్లాడక తినేసి వెళ్లిపోయారు. కానీ ఈసారి మామగారు రాలేదు. వెళ్లి అడుగుదాం అంటే ఎందుకో అడుగు తడబడింది. రాత్రి 9 కావస్తోంది. హడావిడిగా సిరి… వాళ్ళ తాతయ్య గదిలోకి పరుగుపెట్టింది. ఏమీ అర్థంకానీ మేము వెళ్లి చూస్తే -100 డిగ్రీల జ్వరంతో వణికిపోతున్నాడు. సిరికి ఎలా తెల్సిందో? తడిగుడ్డతో నుదురు రాస్తున్న తనని చూసి వెంటనే మావారు డాక్టర్ని పిలిపించి మాత్రలు వేసి పడుకోబెట్టినా, సిరి మాత్రం రాత్రంతా వాళ్ళ తాతయ్య దగ్గరే ఉంది. సుమ అత్తగారికి ఉన్న కోపం నీరుగారిపోయి,   భర్తకి తనవల్లే ఇలా అయ్యిందేమో అన్న బెంగ మొదలైంది. ఎంతైనా ఆలూమగల బంధం కదా! అలకలైనా,అల్లర్లయినా ఎంతసేపు ఉంటాయి? తను, మనుమరాలు సిరితో పాటుగా రాత్రి అంతా జాగారం చేశారు. కొంచెం  జ్వరం తగ్గి  భర్త కళ్ళుతెరిచి చూసేసరికి అత్తయ్య మనసు కాస్త కుదుటపడింది.  అప్పటికే సిరి గాఢనిద్రలోకి జారుకుంది. మరుసటిరోజు ఉదయం సిరి ఒక్కతే దిగాలుగా ఆకాశంలోకి చూస్తూ కూర్చుంది.

“ ఏమిటే నిశ్శబ్దం?ఎప్పుడూ అల్లరిగా ఉండేదానివి, ఇప్పుడు  మనిషివి ఉన్నట్టుగా కూడా
లేదు. మాటామంతీ లేకుండా ఎటో చూస్తున్నావు ఏంటి?” అనగానే-
“అమ్మా! తాతయ్యతో ఆడుకుందామంటే జ్వరం తగ్గట్లేదు, అలానే పడుకున్నాడు”
అని బెంగపెట్టుకు కూర్చుంది. “ఓ అదా విషయం? తాతయ్య అంటే నీకిష్టం లేదు కదా, అయినా నీతో గొడవపడ్డాడు కదా… అందుకే జ్వరం వచ్చిందేమో” అంటే “అయితే నేను, తాతయ్య ఎప్పుడూ గొడవ పెట్టుకోము” అంటూ ఏడ్చేసింది. నాకు జాలేసింది. రక్తబంధం అంటే ఇదేనేమో? ‘ఎన్ని గొడవలుపడ్డా, కాస్త నలతగా ఉంటే విలవిలలాడిపోయిన ఆ చిన్నిప్రాణంకి తాత అంటే ఎంత ప్రేమ?’ అనుకున్న నాకు నా చిన్నతనం గుర్తొచ్చింది.


మా తాతయ్య, నేను బంధువులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు పెద్ద వర్షం. దారిమధ్యలో ఆగాల్సిన పరిస్థితి. అందరికీ నేనంటే ఇష్టమే కాబట్టి, నన్ను ఇంకా జాగ్రత్తగా చూసుకున్నారు. కానీ నేను మాత్రం  మా తాతయ్యని వదిలి వెళ్ళేదాన్ని కాదు. అలా వెళ్తుండగా, ఒక కొత్త బిల్డింగ్ కట్టిన చోట తలదాచుకున్నాం. బయట ఉరుములు,మెరుపులు. నేనైతే లోపలున్నా తాతయ్యపైనే నా ధ్యాస. బయటికి వచ్చి చూస్తే ఇంకా పెద్ద వర్షం.
బంధువులలో కొంతమంది  పెద్దవాళ్ళంతా వణుకుతూ అలాగే పడుకున్నారు. అందులో మా తాతయ్య ఒకరు. అలా ఒంటరిగా వణుకుతూ ఉండడం నచ్చలేదు. మా వాళ్లపై కోపం వచ్చింది… కనీసం చద్దరు కూడా ఇవ్వలేదు అని. నిజానికి ఆయన మొండిమనిషి. అందుకే చాలామందికి గిట్టదు. తప్పక వచ్చిన మేము ఏమీ చేయలేక ఆ పరిస్థితిలో అలా గడపాల్సివచ్చింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా  వెంటనే నేను కప్పుకొన్న శాలువా కప్పి, ఆ రాత్రంతా తాతయ్య పక్కనే కూర్చున్నా వద్దని ఎంతమంది అన్నా కూడా! మా తాతయ్య  అలా ఉండడం బాధ అన్పించి ఇంకెప్పుడూ మళ్ళీ అలాంటివాళ్ళతో ప్రయాణం పెట్టుకోలేదు. ‘బంధువులైనా బంధం విలువ తెలియనివాళ్ళ ప్రేమలు వ్యర్థమే’ అనుకుంటుండగా…
“అమ్మా సుమా… సుమా!”  అంటూ పిలుస్తున్న మామయ్య గొంతు విని ఈ లోకంలోకి వచ్చిన నేను పలికే లోపు, అత్తగారి భుజాలపై చేతులు వేసుకొని చిరునవ్వుతో మామగారు మెల్లిగా నడుస్తూ రావడంతో- సిరి హుషారయింది. “తాతయ్యా” అంటూ వాళ్ళ తాతగారిని హత్తుకుంది.

‘సిరి నా వైపు ఉంటుందా నానమ్మ  వైపు ఉంటుందా’ అని అడిగిన తాత ప్రశ్నకి సమాధానంగా ఏం చెబుతుందో, మళ్ళీ ఏ అలకలు మొదలవుతాయో అని అత్తయ్య, నేను కంగారుపడ్డాం. మా సిరి ఉన్నట్టుండి వాళ్ళ నానమ్మ, తాతయ్యలను పక్కపక్కన నిలబెట్టి  “మీరిద్దరూ ఎప్పుడు అరుచుకోకుండా  ఉంటారో అప్పుడే మీ ఇద్దరి వైపు ఉంటాను. అప్పటిదాకా  అమ్మతోనే” అని ప్లేట్ ఫిరాయించింది!
అందరం నోరెళ్లబెట్టాం. చేసేదేమీ లేక బతిమాలుకొని దగ్గరికి తీసుకున్న
తాతతో మళ్ళీ ఆటపాటల్లో, గొ డవపడడంలో మునిగిపోయింది. అత్తగారు, నేను ఒకరినొకరం చూసుకొని ‘మళ్ళీ మొదలైంది’ అని నవ్వుకున్నాం.

Vote this article
Vishnu Vardhan
Author: Vishnu Vardhan

Related Articles

Latest Articles