7.7 C
New York
Monday, November 25, 2024

ప్రసంగం: గోపాలకృష్ణ కొవ్వలి

ప్రసంగం: గోపాలకృష్ణ కొవ్వలి

ప్రకాశిక పత్రిక పునఃప్రారంభ సభ

జూం వేదిక నలంకరించిన పెద్దలకీ, ప్రేక్షక, శ్రోతకోత్తములకీ, విడివిడిగా, కలివిడిగా కలిసి జరుపుకుంటున్న ఈ సభకి ప్రకాశిక సంపాదకవర్గం తరఫున స్వాగతం. సంపాదకవర్గంలోని వారి నిజరూపదర్శనం నాకింకా కాలేదు. అన్నీ Virtual  బంధాలే,  ఒక్క నా భార్య అరుణతో తప్ప, అదీ పాక్షిక ప్రత్యక్ష బంధం మాత్రమే. ఆవిడని చూడటం కంటే చదవడమే ఎక్కువ (whatsapp ద్వారానే సందేశాలు, సంసారాలూగా). IT  భార్య ఉంటే నొ టీ, అప్పుడప్పుడు భేటీ కదా!  ఈ పత్రిక పునర్జన్మకి మాతృక, గురజాడ మీద మా ఆవిడకున్న గౌరవం, మమకారం, ఆవిడ నిరంతర కృషి. ఆ కారణంగా, అర్ధాంగికి ముప్పావు క్రెడిట్ సభాపూర్వకంగా.  సహృదయంతో ఎప్పుడూ సహకరిస్తున్న బావ గారు, రవీంద్రుడు గారికి ధన్యవాదాలు.    

ఎవరిళ్ళలో వాళ్ళు సుఖాసీనులై అంతర్జాల ఆంతరంగికులతో మనోజ్ఞ భావాలని పంచుకునే అవకాశం కల్పించిన జూమ్ లాంటి app లాగే, శివసాన్నిధ్యాన్ని పొందిన గురజాడ కూడా పాల్గొనే అవకాశం కల్పించగల  సాంకేతిక ఆవిష్కరణ జరిగితే ఎంత బాగుంటుంది! ముందు ముందు అలాంటి ఆవిష్కరణలూ వస్తాయేమో! ఇప్పటికి ఆయన స్ఫూర్తి ప్రకాశికలు మన అంతరంగాలను తాకుతూ ఉత్తేజపరుస్తున్నాయనడం అతిశయోక్తి కాదు.

ప్రకాశిక గురించిన కొన్ని వివరాలు, విశేషాలు, ఆశయాలు పత్రిక తొలి సంచికలో పొందు పరిచాను. ప్రకాశికని ప్రారంభించాలన్న ఆలోచనకి సుమారు ఆరు సంవత్సరాల వయసు. తొలి అడుగువేసి పని ప్రారంభించినా క్షీణిస్తున్న పత్రికా  రంగాన్ని చూసి నీరసపడ్డాను. “గుండె గొంతుకలోన కొట్లాడుతాది కూసుండనీదురా కూసింత  సేపు” అన్నట్లు ప్రతిరోజు, ప్రతి రాత్రి, ప్రకాశిక నా ఎద తలుపులు తడుతూనే ఉంది. ఈ ఆరేళ్లుగా ప్రకాశిక గుర్తొచ్చినంతగా శ్రీమతి గుర్తుకు  రాలేదని చెప్పడం అబధ్ధం కాదు. ప్రారంభించాలనే ఉత్సాహం,‘నాకు సాధ్యమా’ అన్న సంశయం మధ్య ఊగిసలాటకీ ఆరేళ్ళవయసొచ్చింది. పెద్దలు విహారిగారు పరిచయం అయ్యాక నా అభిలాషని ఆయనకి తెలియజేసి సలహా, సహకారాలు అందజేయమని అక్టోబరు 2 2020 వ తేదీన కోరాను. ఆయన అభినందనపూర్వకంగా అంగీకారం తెలిపారు. అంతకుముందటి వారం మా శర్మగారికి కూడా నా అభీష్టం తెలియజేస్తూ వారి సహాయ సహకారాలు అడిగాను. ఆయన నా ఉత్సాహాన్ని  ప్రోత్సహిస్తూ, పత్రిక ఆవశ్యకతను ఆహ్వానిస్తూ, నా ప్రయత్నాన్ని అభినందిస్తూ, చక్కని నిర్మాణాత్మక సూచనలు చేశారు. ఆరేళ్ళ ‘భయ’ లంఖణానికి పత్యం దొరికినట్లయింది.

అక్టోబరు 2, 2020 నాటికి నా పరిధి, శక్తి సామర్థ్యాల అవగాహన మేరకు ప్రకాశిక నిడివి 16 పేజీలుగా నిర్ణయించాను.  కానీ,  ఈ రోజు మన ముందుకు వస్తున్న తొలి సంచిక నిడివి సుమారు 108 పేజీలు. ఇంత నిడివిని, స్థాయిని, ప్రాముఖ్యతని పెంచడంలో కీలకపాత్ర వహించిన గురుతుల్యులు విహారి గారికి, సోదరుడు మా శర్మ గారికి, వారి ద్వారా పరిచయం అయిన అనేక ప్రముఖ రచయితలకి, రచయిత్రులకీ కృతజ్ఞతలు.

‘ప్రకాశిక’ ఒక పత్రిక మాత్రమే కాకుండా, భాష, సంస్కృతుల  పునరుజ్జీవనానికి (Renaissance) వేదిక కావాలని నా ఆకాంక్ష, అభిలాష. వాడుక భాష వాడకంలో మారుతూ ఉంటుంది. పదాల వాడుక పరిణామం చెందుతుంది.  కానీ, పదకోశాన్ని పరిపుష్టం చేసి, ముందు తరాల వారికి మన పద సంపదని, సాహిత్య సౌందర్యాన్ని తెలియజేస్తూ, వారిని మన భాషా మాధుర్యపు మత్తులతో ఉత్తేజితం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. తెలుగు భాష పరిరక్షణ, పదకోశ పరిపుష్టత, పదాల విస్తృత ప్రయోగానికి ప్రోత్సాహం అవసరం. ముఖ్యంగా యువకులలో రాయడాన్ని ప్రోత్సహించవలసిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. సంక్షిప్త  సమాచారాల వాడకంలో ముందంజలో ఉన్న యువత రాయడం మరిచిపోతే, ఉపేక్షిస్తే భాషకి ఆయుఃపరిమాణం  తగ్గుతుంది, పటుత్వం దెబ్బతింటుంది.

ఆ మధ్య మిత్రుడొకరు వాళ్ళబ్బాయితో చేస్తున్న వాట్సప్ సంభాషణని చూపించాడు. నా మిత్రుడు‘ఎలా ఉన్నావురా?’ అంటే ‘fine’ అని, ’ఇంటికి ఎప్పుడు వస్తున్నావు?” అంటే ‘Idk’ అని, “అమ్మతో మాట్లాడతావా?” అంటే ‘ttul dad”అని వెంటనే ముగించేశాడు.   idk,ttul భాషని ఛేదించడానికి, పండిన నా తల పనికిరాక, అర్థం అయ్యాక తలగోడకి కొట్టుకునే పరిస్థితికి వచ్చాను. మాట్లాడే వాడుక భాష విభిన్నంగా ఉన్నా, రాసే భాషకి ప్రామాణికత అవసరం. మాట్లాడే భాషని  వాడుక భాషగా పరిగణించాలంటే, రాష్ట్రాల చట్టసభలలో, ఎన్నికల ప్రచారాలలో, టి.వి చర్చలలో, వాడుతున్న భాషని ప్రామాణికంగా తీసుకోగలమా? టీవీ లో కొంతమంది యాంకర్ల “ఉచ్చారణసహిత” భాషని ప్రామాణికంగా ముందు తరాల వారికి అందివ్వగలమా? ఫేస్బుక్ దయవల్ల ప్రతీ వ్యక్తీ ప్రచురణ కర్తగా, యూట్యూబ్ దయవల్ల ప్రతీ వ్యక్తీ ఒక ఛానల్  అధిపతిగా అవుతున్న ఈ కాలంలో తప్పొప్పులు ఎంచి చూపే ప్రామాణిక వనరుల ఆవశ్యకత  ఉంది.

గురజాడ ఊహించిన వ్యావహారిక భాష వేరు, వేగంగా మారుతున్న కాలంలో వాడుకలోకి వస్తున్న భాష వేరు. మౌలిక ‘వాడుక భాష’ని నిర్దేశించి పరిరక్షించాల్సిన బాధ్యత తెలుగు భాషా ప్రియులందరిదీ. “గురజాడ భాషా  శైలి” పేరిట ఒక ప్రామాణిక శైలిని నిర్మాణం చేసుకోవాల్సిన చారిత్రక అవసరం ఎంతైనా ఉంది. ఆ ప్రయత్నం ప్రకాశిక వేదికగా చేద్దాం.

ఆమధ్య ఒకావిడ, ఆవిడ రాసిన ఆరు పేజీల సంకలనాన్ని (పొగడ్తలతో కూడిన పరిచయ వాక్యాలతో కలిపి 50 పేజీలు)  పంపి నా అభిప్రాయం అడిగింది. బొమ్మలతో కూడిన ఆరుకవితల సంపుటాన్ని పరికించి పులకించిపోయాను.  అందులోని మొదటి కవిత “అమ్మ, నాన్న, నువ్వు, నేను”, రెండవది “ఆకు, చెట్టు, ఎండ, వాన” ఇలాంటివే మిగతా నాలుగున్నూ. మొహమాట పడి “ఇడ్లీని తలదన్నే చట్నీలాంటి పొగడ్తలతో కూడిన మీ సంకలనం బాగుంది” అని రాసాను. ఆ అమాయకురాలు “నాకు ఇడ్లీ కంటే చట్నీ ఎక్కువ ఇష్టం. నేను చెప్పకుండానే కనిపెట్టినందుకు ధన్యావాదాలు”  అని తిరిగి మెసేజ్ పెట్టింది.  ఇలాంటి కవిత్వాలు, తత్త్వాలు వేళ్ళూనుకుంటే భాషకి, సాహిత్యానికి ప్రమాదం. అలాంటి విపత్తునుంచి  కాపాడే శక్తి, బాధ్యత తల్లులమీదే ఉంది.

తెలుగులో రాత ప్రక్రియని ప్రోత్సహించడం చాలా అవసరం అన్న అభిప్రాయాన్ని ఇంతకు  ముందే  వెలిబుచ్చాను. అత్యున్నత ప్రామాణికాలతో కూడిన రాత భాషకి, మాట భాషకి  ఆలవాలంగా, ఆలంబనగా, ప్రకాశికని తీర్చిదిద్దాలని నా  ఆకాంక్ష.  పాత కొత్తల మేలు కలయికగా ఈ పత్రిక స్వరూపం ఉండాలని నా ఆశ.   మనందరం కలిసి, ఈ ప్రయత్నాన్ని సమష్టిగా చేద్దాం.  అదే గురజాడకి స మష్టిగా మనం ఇవ్వగల అక్షర నివాళి.   

వచ్చే సంచిక జనవరి 31 న విడుదల అవుతుంది. మనది మధ్య తరగతి బడ్జెట్ పత్రిక కదా, అందుకే నెలాఖరు విడుదల సమంజసం అనిపించింది.

ఇతర కార్యక్రమాలకి సంబంధించిన ఆలోచనలని మీ అందరితోనూ కాలక్రమంలో పంచుకుంటాను. మనం ఏమి చేయాలో గురజాడ ఎప్పుడో చెప్పాడు “గట్టీ మెల్ తలపెట్టవోయ్” అని. మనం చేయాల్సింది ఆచరించడమే.

ధన్యవాదాలు.

Vote this article
Vishnu Vardhan
Author: Vishnu Vardhan

Related Articles

Latest Articles