ప్రసంగం: ఎ.కృష్ణారావు
(కవి, ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి )
ఎప్పటికీ సమకాలికుడు గురజాడ
ప్రకాశిక పత్రిక పునఃప్రారంభ సభ
గురజాడ పై మాట్లాడడం అనేది చాలా ఇష్టమైన అంశం. ఆయన జన్మించి ఒక శతాబ్ధం దాటినప్పటికీ నా భావజాలానికీ, నా ఆలోచనా విధానానికి ఆయన అత్యద్భుతంగా సరిపోతున్నారు. నా తర్వాత శతాబ్దం దాటినా గురజాడ అప్పారావు ఆలోచనా విధానం, భావజాలం అప్పటి కాలానికి సమకాలీనంగా ఉంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆయన 1915లో మరణించి ఉండవచ్చు. కాని ఆయన ఆ తర్వాతే మరింత సజీవంగా, ఎప్పటికీ నవనవోన్మేషంగా జీవిస్తూ వచ్చారు.
గురజాడ అప్పారావు గారు గతాన్ని అధిగమించిన వ్యక్తి.భవిష్యత్ ను ఆహ్వానించిన వ్యక్తి. గతాన్నే నమ్ముకుని, గతకాలపు భావాలే గొప్పవని గతంలో బతకడం ఆయన స్వభావం కాదు. ‘మంచి గతమున కొంచెమోనోయ్’ అన్న భావనను ఈ దృక్పథంతో అర్థం చేసుకోవాలి. అదేసమయంలో వర్తమాన సమాజంలో ఉన్న అవినీతి, మూఢాచారాలు, అణిచివేత, మతతత్వం, బూటకపు దేశాభిమానం మొదలైన రుగ్మతలను కూడా ఆయన సహించలేదు. వెనుకడుగు వేయడం ఆయన డిక్షనరీలో లేదు. ‘వెనుక చూచిన కార్యమేమోయ్ , మందగించక ముందుకడుగేయ్, వెనుకపడితే వెనుకేనోయ్’ అని ఆయన జాతికి పాఠం చెప్పారు. యదాతథ పరిస్థితితో రాజీపడడం తన లక్షణం కాదని నిరూపించారు. యదాతథ స్థితిని కోరుకునేవారు ‘మార్పుకు బద్దవిరోధులు,పురోగతికి అవరోధులు’ అని ప్రకటించారు.
గురజాడ అప్పారావు గారు నిత్య ఆధునికుడు. ప్రశ్నించకుండా అంగీకరించడం ఆయన తత్వం కాదు. ‘ప్రశ్నించకుండా అంగీకరించడం బానిస మనస్తత్వం’ అని చార్వాకుడే అన్నారు.ఆలోచించకుండా అంగీకరించడం సరైంది కాదన్నారు. మనిషి ఆలోచనా శీలి కావాలన్నారు. ‘భావించడం నా ముచ్చట, ఆలోచన నా బలం’ అని ఆయన చెప్పారు. మూఢనమ్మకాల్ని, దురాచారాల్ని, బూటకపు సంఘ సంస్కర్తల్ని, బ్రిటిష్ విద్యావిధానాన్ని, వ్యవస్థల్లో ఉన్న దుర్మార్గాల్నీ ఆయన ప్రశ్నించారు. ఆధునిక సాహిత్యంలో ప్రశ్నించడం అంటూ మనకు నేర్పిన సాహితీవేత్త గురజాడ.
నేటి సమాజంలో మతాన్ని, దేవుడిని, భావోద్వేగాల్ని, దేశం పట్ల బూటకపు దురభిమానాన్ని రెచ్చగొట్టి రాజకీయాలకు ఉపయోగించుకోవడం కనపడుతుంది. గురజాడ ఇలాంటి ధోరణుల్ని ఆనాడే ఎండగట్టారు. ‘మత సమైక్యతే నేటి అవసరం’ అని స్పష్టం చేశారు. మతం ఏదైనా మనుషులంతా ఐక్యమయితే జాతి సమున్నతి జరుగుతుందని చెప్పారు. మతం కన్నా సైన్స్ కు ఆయన ప్రాధాన్యత నిచ్చిన ఆధునిక రచయిత గురజాడ. అందుకే ‘మతములన్నియు మాసిపోవును జ్ఞానమొక్కటే వెలిగి నిలుచును’. అని ఆయన స్పష్టంగా చెప్పారు. జ్ఞానమంటే సైన్స్ అన్నది ఆయన దృక్పథం.
దేశాభిమానం ఉండడం అవసరమే కాని అది దురభిమానం కాకూడదని, దేశమంటే కేవలం మట్టి కాదని, అది మనుషులని నిజమైన దేశభక్తి గురించి చెప్పిన ప్రాజ్ఞుడు, విజ్ఞుడు గురజాడ. సముద్రాల మధ్య విడిపోయిన భూమి అంతా ఒక్కటే అన్న భావన గురజాడ అంతర్జాతీయ దృక్పథాన్ని తేటతెల్లం చేసింది. ‘లోకమంతా ఒక్క ఇల్లై’ అన్నది ఆయనే. వసుధైక కుటుంబం అని మాటలు చెప్పడం కాదు దాన్ని చేతల్లో అమలు చేయాలని ఆయన భావించారు.అందుకే ‘దేశాభిమానం నాకు కద్దని వట్టి గొప్పలు చెప్పుకోకోయ్’ అని ఆయన ఖండితంగా చెప్పారు.
సాహిత్యం లక్ష్యం, ప్రయోజనం ఏమిటో ఆయన స్పష్టంగా చెప్పారు. దురాగతాలను బహిర్గతం చేస్తూ ఉన్నత నైతిక భావాలను వ్యాప్తి చేయడం కంటే మిన్న అయిన లక్ష్యమూ, ప్రయోజనమూ సాహిత్యానికి లేదు అని ఆయన చెప్పారు.
ప్రభుత్వాలు మారినా వ్యవస్థలు మారనిది సమాజంలో మార్పు రాదని గురజాడ ఒక స్పష్టమైన సామాజిక దృక్పథంతో చెప్పారు. ‘స్వాతంత్ర్యం వస్తే మన ఊరి హెడ్ కానిస్టేబుల్ మారతాడా’ అని కన్యాశుల్కంలో ఒక పాత్ర ద్వారా అనిపించారు ఆయన. కన్యాశుల్కం నాటకంలో అభివర్ణించిన అవకాశవాదులు, అమాయకులు, అమాయకుల్ని మోసం చేసే వాళ్లు ఇంకా ఉన్నారు. మూఢనమ్మకాలింకా ఉన్నాయి. ప్రజల్ని మోసం చేసే సాధువులు ఇప్పటికీఉన్నారు. దుర్మార్గమైన పోలీసు,న్యాయవ్యవస్థలు ఇంకా ఉన్నాయి. బ్రిటిష్ కాలం నుంచి మనం న్యాయవ్యవస్థతో సహా అన్ని వ్యవస్థల్నీ అరువు తెచ్చుకున్నాం కనుక అదే అణిచివేత, అవే దుర్మార్గాలు కొనసాగుతున్నాయి. గురజాడ తీసుకున్న అనేక సమస్యలు ఇప్పుడు విత్తనం నుంచి చెట్టులాగా మారి శాఖోపశాఖలుగా విస్తరించాయి. అందువల్ల గురజాడ అప్పారావు సామాజిక దృక్పథం ఇప్పటికీ ఎంత అవసరమో మనకు ఆలోచించినప్పుడల్లా స్పష్టం అవుతుంది.
సమాజానికి ఆయన సూచించిన మంచి అపారం. ఆనాడు ఆయన ఆలోచనా విధానంలోని అమూల్యమైన సందేశాన్ని ప్రజలు గ్రహించలేదు. మనమైనా గ్రహించాలి. లోకమందలి మంచిచెడ్డలు లోకు లెరుగుదురా అన్న ఆయన ఆవేదనకు పరిష్కారం చూడాలి.