7.7 C
New York
Monday, November 25, 2024

పెళ్లి షరతు

పెళ్లి షరతు

– లక్ష్మీ సుశీల పెండ్యాల

పోస్ట్ మ్యాన్ అరుపుతో ఒక్క ఉదుటున గేటు తీసి బయటకు పరుగుతీసింది పావని.
“నెమ్మది నెమ్మది… నేను ఎక్కడికి పోతానమ్మా- నీ లెటర్ ఇవ్వకుండా” నవ్వుతూ
అన్నాడు పోస్ట్ మ్యాన్ గుర్నాథం.
“ఉత్తరమేనా?” ఆత్రంగా అడిగింది పావని.
“అంతేగా”… అన్నాడు గుర్నాథం.
సంతోషంగా ఉత్తరం తీసుకుని లోనికి వెళ్లిపోయిందామె.
ఏంటో ఈవిడ ఆనందం- అనుకుంటూ గుర్నాథం చిరునవ్వు నవ్వుకున్నాడు.
లోనికి వెళ్లిన పావని ఉత్తరం చేతుల్లో పట్టుకుని ఒకసారి గతంలోకి జారుకుంది.


పావని వాళ్లిల్లు చాలా సందడిగా ఉంది. విశేషం ఏమిటంటే- ఆమెకు పెళ్లి చూపులు.
అమలాపురం సీతారత్నంగారి అబ్బాయి రఘుతో. పావని తండ్రి దినకరంకి కాళ్ళూ
చేతులూ ఆడట్లేదు… ఎందుకంటే వాళ్లింట్లో ఇదే మొదటి శుభకార్యం. పైగా
అబ్బాయి అమెరికాలో ఉద్యోగం. పెళ్లిచూపుల్లో సరైన మర్యాదలు
పాటించకపోతే ఏం కినుక వహిస్తారో అని తెగ కంగారుపడిపోతున్నాడు. భార్య
విజయని కూడా హడావుడి పెట్టేస్తున్నాడు.
దినకరం మొదటి కూతురు పావని. రెండో అమ్మాయి శర్వాణి ఇంకా చదువుకుంటోంది.
ఈలోపు పెద్ద కూతురు బాధ్యతలు పూర్తిచేయాలని ఆయన ఆలోచన.
పెళ్లివారు వచ్చేశారు. దినకరం కుటుంబం వారిని సాదరంగా లోనికి ఆహ్వానించింది.
కుశల ప్రశ్నలు అయ్యాక “అమ్మాయిని తీసుకురండి” అంటూ మగపెళ్లివారు ‘ఆర్డర్’
వేయగానే దినకరం భార్య, చెల్లెలు పావనిని తీసుకువచ్చి కూర్చోబెట్టారు.
సంప్రదాయ వస్త్రాలంకరణలో ఆమె మెరిసిపోతోంది. చూడగానే రఘు మనసుని
దోచుకుంది. పావనితో ఓ పది నిముషాలు ప్రైవేట్ గా మాట్లాడాలని అడిగాడు రఘు.
“ఇవన్నీ ఈరోజుల్లో కామనే అండీ” అంటూ దినకరంని ఒప్పించారు అక్కడివాళ్లు.
కట్ చేస్తే… పావని, రఘు- పెద్దవాళ్లకి కాస్త దూరంలో పూలమొక్కల మధ్య
పర్సనల్ మీటింగ్.
“చెప్పు పావనీ! నేను నీకు నచ్చానా?” అడిగాడు రఘు. అతనివైపు అప్పుడే తల ఎత్తి
చూసింది.

“అదీ… అదీ… అప్పుడే చెప్పలేను” అంది సందిగ్ధంగా.
“అంటే నేను బాగాలేనా?”
“అలాగని కాదు…జస్ట్ చూడగానే ఎలా చెప్పగలo?”
“హా… ఏంటి పావనీ నువ్వు మరీనూ! మనది లవ్ మ్యారేజా- కొద్దిరోజులు జర్నీ చేసి
ఆ తరువాత అభిప్రాయాలు చెప్పుకోవడానికి? పెద్దవాళ్లు కుదిర్చే పెళ్లిళ్లు
అన్నీ ఇంతేగా. నచ్చిన తరువాత పెళ్లి. ఆ తరువాత ప్రేమించుకోవడం. నువ్వు
మాత్రం నాకు చాలా నచ్చేశావ్” అన్నాడు రఘు.
“మీరు నాకు నచ్చాలంటే ఓ షరతు” అంది.
“అమ్మో అగ్నిపరీక్షలు పెట్టవు కదా?” అన్నాడు నవ్వుతూ.
“అంత కఠినమైన శిక్షలు వేయనులెండి. మీరు ఒక పని చేయాలి. ఒక నెలపాటు మనిద్దరం
కేవలం ఉత్తరాలు రాసుకోవాలి. ఉత్తరాల్లోనే మనం ఏంటో ఒకరినొకరు
తెలుసుకోవాలి. మన అభిప్రాయాలు పంచుకోవాలి” అంది.
“ఉత్తరాలా? ఈ కాలంలో… బాబోయ్, నా వల్ల కాదు పావనీ, ఏంటీ శిక్ష?” అన్నాడు
గాభరాగా.
“తప్పదు”
“ఎందుకలా?”
“రఘుగారూ! ఇప్పుడు నేను ఓకే అనగానే మీరు ఇంటికి వెళ్తూనే నాతో ఫోన్ లో
మాట్లాడతారు. చాట్ చేస్తారు. ఫోటోలు, వీడియో పంపుకొంటాం. వీడియో కాల్స్
మాట్లాడుకుంటాం. ఇది ఒక రకంగా బాగానే ఉన్నా, అసహజంగా అనిపిస్తుంది. అదీ
కాకుండా వీటి ద్వారా ఒకరినొకరు ఆవిష్కరించుకునే అవకాశం ఉండదు అని నా ఫీలింగ్.
కాబట్టి కేవలం ఉత్తరాల ద్వారానే మన కాంటాక్ట్ ఉండాలి. ఒకరికొకరు అన్ని
విషయాలూ షేర్ చేసుకుంటూ అభిప్రాయాలు పంచుకోవాలి. జస్ట్ వన్ మంత్. ఈ
షరతుకి మీకు అంగీకారమేనా?”
“ఇది చాలా అన్యాయం పావనీ! కానీ నీలాంటి అందమైన అమ్మాయిని వదులుకోవడానికి
నేను సిద్ధంగా లేను. నేను ఇండియాలో ఉండేది రెండు నెలలు. ఒక నెల ఉత్తరాలతో నీ
ప్రేమను గెలుస్తానన్న నమ్మకం నాకుంది. బట్ ఈ షరతు విషయం పెద్దవాళ్లకు
చెప్పాలి కదా!”
“అవును ఏం చేద్దాం?” అంది పావని.
“సరే, ఆ ట్రబుల్ నాకు వదిలెయ్. మా చెల్లి నెక్ట్స్ మంత్ ఇండియా వస్తోంది.
చెల్లి వచ్చి నిన్ను ఓకే అన్నాక- నాకు ఓకే అని, ఈలోపు నెల గడువు ఇమ్మని
మీవాళ్లకు చెప్పిస్తాలే” అన్నాడు నవ్వుతూ.
“థ్యాంక్స్” అంది పావని.

ఇద్దరూ అక్కడి నుంచి లేచారు.


అలా ఆరోజు మొదలైంది వారి ప్రేమలేఖల ప్రయాణం. అరచేతుల్లో టెక్నాలజీ
పెట్టుకుని ఈ ఉత్తరాలు రాయడం ఏంటో? అని మొదట్లో చికాకుపడిన రఘు
నెమ్మదిగా ఇష్టంగా రాయడం మొదలుపెట్టాడు. పావని నుంచి వచ్చే ఉత్తరం కోసం
ఎదురుచూడటం అతని దినచర్యగా మారింది. ఎదురుచూపుల్లో ఎంత ఆనందం ఉంటుందో
మొదటిసారి అతను ఆస్వాదిస్తున్నాడు. పావనికి రఘు అలవాట్లు, అభిప్రాయాలు
నచ్చేశాయి.


వాస్తవానికి వస్తే- ఉత్తరం తీసుకుని లోనికి వెళ్లిన పావని చదవడం
మొదలుపెట్టింది.
“పావనీ! సరిగ్గా నెల. ఈరోజుకి నీ షరతు గడువు పూర్తైంది. ఇక నాతో పెళ్లికి
అంగీకారమేనా? బలవంతం అయితే లేదు సుమా” అంటూ రఘు రాసిన అక్షరాలు చదవగానే
పావని ఇంక ఆగలేకపోయింది.
అత్యవసరమైనపుడు మాట్లాడాలంటే నాకు కాల్ చేయి అంటూ అతను ఇచ్చిన నంబర్ కు
ఫోన్ చేసింది పావని.
“హలో” అంటూ రఘు.
“నేను”
“ఎవరు?”
“నేనే?”
“నేనే అంటే?”
“పావని”
“పావనీ… చెప్పు పావనీ! నువ్వు నాకు ఫోన్ చేయడం…” అన్నాడు సంతోషంగా.
“మీరు నాకు నచ్చేశారు. వెంటనే పెళ్లి ముహూర్తాలు పెట్టించేయండి” అంటున్న
పావని మాటలు రఘు చెవిలో పడటం ఆలస్యం- పావని వాళ్లింటి గుమ్మాలకు పచ్చ
తోరణాలు మెరిసిపోయాయి.


పావనికి, రఘుకి అంగరంగ వైభవంగా పెళ్లైంది.
మొదటిరాత్రి గదిలోకి వస్తూనే “ఏమండీ! మీ ప్రేమను తెలుసుకోవడానికి ఇబ్బంది
పెట్టానా?” అంది అమాయకంగా.

“లేదు పావనీ! అందరిలాగే నువ్వు వెంటనే పెళ్లికి ఒప్పుకుంటే నార్మల్గా
ఉండేదేమో? ఈ నెలరోజులపాటు నీ గురించే ఆలోచిస్తూ, నీ గురించి తెలుసుకుంటూ,
ఎంత సంతోషాన్ని అనుభవించానో తెలుసా? పైగా జీవితానికి సరిపడా జ్ఞాపకాల్ని
ఇచ్చావు. కొన్నేళ్ల తరువాత వీటిని తిరిగి తల్చుకుంటే ఎంత బావుంటాయో కదా”
అన్నాడు రఘు.
“నిజంగా!” అంది మెరిసే కళ్లతో.
“అవును… ఇంకా మాటలేనా, ఇంకేదైనా ఉందా?” అంటూ కౌగిలిలోకి తీసుకున్నాడు రఘు.

సిగ్గుపడుతూ ఒదిగిపోయింది పావని.

Vote this article
Vishnu Vardhan
Author: Vishnu Vardhan

Related Articles

Latest Articles