6.1 C
New York
Monday, November 25, 2024

ఐస్ బండివాడు

ఐస్ బండివాడు

                                                                              – విష్ణుప్రియ

పుస్తకాలూ పెన్నులూ చీపుగా అర్థరూపాయికి తక్కువకి కొని, ఆ అర్థని దాచి పుల్లైస్ ఫ్రూట్  కొని పెద్ద ఘనకార్యం చేసినట్టు గర్వపడినవాళ్ళలో నేనూ ఒకర్తిని!

అర్థరూపాయి జీవితాన్ని అర్థవంతం చేయడం కోసం ఎన్నెన్నో త్యాగాలు, యుద్ధాలు చేయవలసి వచ్చేది. అయ్యయ్యో అని బాధ అనిపించినా-పెద్ద పెద్ద యుద్ధాలన్నీ తనవారితోనే జరిగినపుడు, పిల్లపీచుని ఇలాంటి చిన్న చిన్నయుద్ధాలని ఎదుర్కోలేనా? అనుకుని నా భుజంమీద నేనే ఓదార్చుకుని రోజుకొక ఐస్ కోసం ప్రణాళిక వేసుకునేదాన్ని!!

అంతా కష్టపడి డబ్బులు దాచిన రోజు,  సీజన్ మారింది. ఊళ్ళో పెద్దవాళ్ళంతా ఆర్డర్ వేశారని అదే ఐస్ పెట్టెలో బోర్న్ విటా బిళ్ళలు , బఠాణీలు తెచ్చేవాడు. ఈయన చేత్తో ఐస్ తీసుకోవడం అనేది లాటరీ అయిపోయేది మాకు.   ముందు కొనుక్కున్నవారు చెప్పేవారు కాదు.

అర్ధరూపాయ్ చేతిలో పెట్టాక  పావలా తిరిగి ఇచ్చి, సైకిల్ కి వెనకాల కట్టిన డబ్బాలో చెయ్యి పెట్టి ‘ఈరోజు ఏం వస్తుందో చూద్దామా- ఇదిగో..ఇదిగో..’ అని ఊరించి చెయ్యి బయటకి తీసేవరకూ తెలిసేది కాదు… అరచేతిలో స్వర్గం చూపెట్టి చాక్లెట్ బిళ్ళలిస్తాడని! ఇంతోటిదానికి మామ్మ కొట్టు ఉందిగా అనుకునేవాళ్ళం. వీడితో చెడితే ఊళ్ళోకి రాడు మళ్ళీ, అదొక తలనొప్పి…పోనీలే గుడ్డిలో మెల్ల అనుకుని సర్దుకుపోయేవాళ్ళం.

ఆమడ దూరాన ఉన్న నారబ్బాయ్ గారింటికి వచ్చాక  డబ్బామూత సౌండ్ వినిపించేది. ఆయన ఇంటెదురుగా ఉన్న తిరుపతిరాజుగారి వీధిలోకెళ్ళి వెనకాల నుంచి హెడ్మాస్టర్ తాతగారి వీధిలోంచి బయటకు రావడానికి పావుగంట పడుతుందని… మా వీధివాళ్ళని ఎలర్ట్ చేయడమన్నమాట!

మా ఊరి పిల్లలకి ఐస్ డబ్బా పెద్దయ్యే పెద్ద దిక్కు.  ఒకోసారి పిల్లలకి అప్పులు కూడా ఇచ్చేవాడు, నాకు తప్ప. ఒకే ఒక్కసారి అప్పు ఇచ్చి, తీర్చమని మా బామ్మని అడిగితే …ఎవరికి ఇచ్చావో వాళ్ళనడుగు అంది. నన్నడిగితే, ఏ నమ్మకంతో నాకు డబ్బులిచ్చావో వాళ్లనే అడుగు అన్నాను. అలా ఓ నాల్రోజులు ఏడిపించిన తర్వాత అప్పు మా బామ్మ వడ్డీతో కలిపి ఇచ్చింది.

అప్పట్నుంచి అతను నాకు అప్పివ్వడం మానేశాడు.  ఇంట్లో వాళ్ళు దయతలిస్తే కొనుక్కోవడం, లేదంటే లేదు!

మా ఐస్ పెద్దయ్య మా ఊరిలో ఏకఛత్రాధిపత్యం చేస్తున్న రోజుల్లో- ఆటో హార్న్ తోపుడు ఐస్ బండివాడు వచ్చాడు. ఓ చిన్న సైజ్ భోషాణానికి సైకిల్ చక్రాలు పెట్టినట్టు బండి. బండి చుట్టూరా హీరో  హీరోయిన్ల బొమ్మలు, అక్కడక్కడా  అన్ని దేవుళ్ళ పటాలూ అతికించి ఉండేది.

ఐస్ క్రీమ్, ఐస్ బాల్ , ఐస్ ప్యాకెట్ అతని స్పెషాలిటీ. పోనీలే రెండ్రోజులు అమ్ముకుపోతాడని ఊళ్ళోవాళ్ళు అనుకున్నారు. అతని చెప్పులకేదో తుమ్మ జిగురు అంటుకున్నట్టు మా ఊరికి తన బండిని అంకితం చేశాడు. 365 రోజులూ ఊరి పెద్దల జులుంకి లొంగకుండా ఐస్ తెచ్చే ప్రత్యక్ష దైవంగా అవతరించాడు. పెద్దయ్యిచ్చే బోర్న్ విటా బిళ్ళల నుంచి విముక్తి కలిగించాడు. అప్పు అడిగితే తిన్నగా ఇంట్లోవాళ్ళని అడిగేవాడు కాదు. ” నీకాడ ఎప్పుడుంటే అప్పుడియ్యి బుల్లీ ” అనేవాడు. వడ్డీ పెరిగితే కష్టం కాబట్టి, మా బాబాయ్ లేదా పిన్ని సాయంతో అప్పు తీర్చేసేదాన్ని.

కాకపోతే ఇతనికి మా స్కూల్లోకి నో ఎంట్రీ. పెద్దయ్య మాత్రమే అధికారికంగా, సకల మర్యాదలతో స్కూల్ గ్రౌండ్ లో చక్కర్లు కొట్టేవాడు.

మా స్కూల్లో చేసుకునే చిన్న చిన్న పార్టీలప్పుడు, ఇంకా అఫీషియల్ గా డబ్బులున్నరోజు మా పెద్దయ్య దగ్గరకి వెళ్ళేవాళ్ళం. ఉన్న డబ్బులిచ్చి, అతనిచ్చింది తీసుకుని, కుదురుగా మధ్యలో మాట్లాడకుండా అక్కడే నిల్చుని తినాలి. పక్కనున్న కుళాయి నీళ్ళతో సుబ్బరంగా  చేతులు, మూతి కడుక్కుని  కర్చీఫ్ తో చేతులు తుడుచుకోవాలి  లేదా బాగా ఆరే వరకూ విదిలించుకున్నాకనే లోపలికి వెళ్ళాలి. లేదంటే హుంకరించేవాడు. ’ స దూకుంటున్నారు…సెప్పలేదా, సుబ్బరంగా ఉండాలని తెల్దా?’ అనేవాడు.

మాస్ గా అల్లరి చేద్దామనుకున్నరోజు మా ఇంటి పక్కన పొగడచెట్టు నీడలో కూర్చునే చిన్నయ్య దగ్గరికి ఉత్తి చేతులూపుకుంటూ పోయేవాళ్ళం.  జాగ్రత్తగా తినండి అని ఒక ప్లాస్టిక్ ప్లేట్లో ఐస్ పెట్టి ఇచ్చేవాడు. ఐదు నిమిషాల్లో తిని, అరగంట అల్లరి చేసేవాళ్ళం. “కుదురుండండమ్మా.  మీ బామ్మగారొత్తే నన్ను తిట్టి మీకు తలంటుతారు’’ అనేవాడు. ‘ఏం  కాదులే చిన్నయ్యా! నువ్వేం కంగారుపడకు’ అనేదాన్ని. సర్సర్లే అని లోలోపల నవ్వుకుంటూ,  తన బుల్లి రేడియోలో పాటలు ట్యూన్ చేసుకుని,  అటు పక్కకు తిరిగి చెట్టుకి తలానించి వింటూ పడుకునేవాడు. ఈలోగా ఎవరైనా వస్తే మేమే అమ్మిపెట్టేవాళ్ళం.  ఒకటడిగిన వాళ్ళకి రెండిచ్చి, దబాయించి డబ్బులు తీసుకునేవాళ్ళం. అతను లేచాక  చిన్నయ్యకి డబ్బులెక్క అప్పచెప్పి,  టాటా చెప్పి, ఎవరిళ్ళకి వాళ్ళు పోయేవాళ్ళం.

అప్పుడప్పుడు ఇంట్లోంచి మజ్జిగో , అప్పచ్చులో తెచ్చిస్తూండడం వల్లనేమో నాకు రెండ్రెండు ఐసులిచ్చి ఒకటి ఖాతాలో రాసుకునేవాడు . “ పోనీ ఫ్రీది మాత్రం ఇవ్వచ్చుగా’’ అనేదాన్ని. “యాపార దరమం , అట్టా కుదరత్తల్లీ’’ అనేవాడు.

స్కూల్ రోజుల్లో ఉన్న మంచి జ్ఞాపకాల్లో ఒకటి ఈ ఐస్ బండివాళ్ళు!

******

మొన్నామధ్య మార్చి సెలవులకు వెళ్ళినపుడు- ఊరు సగం ఖాళీ ఐపోవడం, స్కూల్ లో ఒంటిపూట బడులుండడం వల్ల ఐస్ బండి రోజులు పోయాయనుకున్నాను.

మధ్యాహ్నం పూట…పరీక్షలున్నట్టు పుస్తకం ముఖం మీదేసుకుని అరుగుమీదున్న పడక్కుర్చీలో కునుకు తీస్తుంటే లీలగా వినిపించింది ఆటో హార్న్. అదే పాత సౌండ్. “ఆదిత్యా!  బయటకి రారా, అర్జంట్’’  అని ఒక్క అరుపు అరిచి, గేట్ తీసుకుని రోడ్డుమీదకి పరిగెత్తా.  ఇంట్లోవాళ్ళకి నా కేకలు అలవాటు కాబట్టి , లోపల కునుకు తీస్తున్నవాళ్ళంతా పక్కకి ఒత్తిగిల్లి సర్దుకుని పడుకున్నారు.  పెరట్లో కర్రలతో ఆడుకుంటున్న మావాడు మాత్రం నా పొలికేకకి …నాకేమైందో అని భయపడి వచ్చాడు!

కట్ చేస్తే…మా ఆటో హార్న్ చిన్నయ్య,  నేను-ఇంకా బోలెడు కబుర్లు. “రస్నా ఐస్ ఉందా చిన్నయ్యా” అని అడిగా.  

“ఉంది బుల్లెమ్మా! మరి నాది నాసిరకం ఐసు.  హోమ్ మేడ్ అనుకో, కుదురుద్దా’’ 

“కుదుర్చుకుంటాలే కానీ- పెద్దయ్య ఎలా ఉన్నాడు” అని సైకిల్ పెద్దయ్య సంగతి అడిగాను. “ఆయనామ్మా ఆయనా” అంటూ రాగం తీస్తుంటే- ఏం వినాల్సి వస్తుందో అని…”చెప్పకులే చిన్నయ్యా! ఆయన దగ్గర కొనాలంటే డబ్బులివ్వాలి. నా దగ్గర డబ్బుల్లేవు, అప్పిస్తావా” అని అడిగా.

“తప్పకుండా బుల్లీ! కానీ వడ్డీరేటు కూసింత పెరిగింది మరి … సరేనా? ఇదిగో ఇది నీకు, ఇంకోటి మీ అమ్మ ఖాతాలో ఫ్రీ తీసుకో” అని రెండు ఐస్ లు మావాడి చేతిలో పెట్టి “ఏం  పట్నంబాబూ! ముట్టుకోవచ్చా? మాసిపోవుగా” అంటూ ఆప్యాయంగా మావాడి తల నిమిరాడు మా చిన్నయ్య!

                                        ——————————

Vote this article
Vishnu Vardhan
Author: Vishnu Vardhan

Related Articles

Latest Articles