ఏ దారి ఎటు పోతుందో…
-పామర్తి వి. వి. సత్యనారాయణ
“నాకీ అన్నం వద్దు” అంటూ కంచం తోసేశాడు అయిదేళ్ళ రాముడు.
“ఆ అన్నానికి ఏమయిందిరా? ఎందుకు వద్దూ?” కోపంగా అడిగింది వార్డెన్
జయలక్ష్మి.
“బాలేదు. వాసనొస్తంది”
ఓ సాంఘిక సంక్షేమ వసతి గృహం అది. ప్రభుత్వ పాఠశాలలో ఉచిత విద్య,
హాస్టల్లో భోజన-వసతి సదుపాయమూను. ఆ గృహంలో సుమారు యాభై మంది బాలబాలికలు
ఉంటున్నారు. అందరూ ప్రాథమిక పాఠశాల విద్యార్థులే.
ఆ హాస్టల్ కి వార్డెన్ జయలక్ష్మే అయినా, పెత్తనమంతా ఆమె భర్త
రామ్మూర్తిదే. పసివాళ్ళని కూడా చూడకుండా ఆ పిల్లల పట్ల కర్కశంగా
ప్రవర్తిస్తూంటాడు. పిల్లల కోసం కేటాయించిన రేషన్ లో సగం స్వాహా
చేసేస్తుంటారు ఆ దంపతులు! చిమిడిపోయినదో పాచిపోయినదో అన్నమూ, నీళ్ళ
సాంబారు; వడలిపోయిన కూరగాయల వంటకాలూ తినలేక ఆ పిల్లలు అవస్థపడుతూంటారు.
“వేలెడంత లేవు నువ్వు. ఇప్పట్నుంచే తిరుగుబాటా? ఇక్కడ నీ తాత
జాగీరేమైనా ఉందనుకున్నావట్రా? నోర్మూసుకుని తిను…” గట్టిగా కసిరాడు
రామ్మూర్తి.
“అయినా సరే. నేను దీన్ని తినను. నాకు మంచి అన్నం పెట్టు” మొండిగా
అన్నాడు రాముడు.
ఉగ్రుడైన రామ్మూర్తి వాడి వీపు విమానం మోత మోగించాడు. “తినకపోతే
మానెయ్ రా. రేపంతా నీకు తిండి బంద్!” అన్నాడు.
“మా అమ్మతో చెబుతా” బెదిరించాడు రాముడు, ఏడుస్తూనే.
“నీ దిక్కున్న చోట చెప్పుకో” అంది వార్డెన్. పిల్లలంతా రాముడి వంక
జాలిగా చూశారు.
ఫామ్ హౌస్ లో డబుల్ కాట్ బెడ్. దాని మీద మెత్తని పరుపు, అందమైన పాలిస్టర్
బెడ్ షీటు. అయినా అసౌకర్యంగా ఉంది రంగమ్మకు. ఇరవయ్ ఎనిమిదేళ్ళుంటాయి.
ఏడో నెల గర్భిణి. . అస్తమానూ పడుకునే ఉండాలంటే విసుగ్గా ఉంటోంది. నెలలు
నిండుతూంటే కాలు కింద పెట్టనివ్వడంలేదు ఆమెను. కడుపులోని బిడ్డ కోసమే ఆ అతి
జాగ్రత్త. అదంతా విడ్డూరంగా తోస్తోంది ఆమెకు. పండ్లు, టానిక్ లు,
బలవర్థకమైన పోషకాహారంతో…సన్నగా ఉండే తాను ఇప్పుడు ఒళ్ళుచేసింది. రంగు
కూడా వచ్చింది. తన అవసరాలను తీర్చేందుకు ఆయా, నర్సింగ్ సిస్టర్ ఉన్నారు.
కాయకష్టానికి అలవాటుపడ్డ తనకు రాజభోగం! తలచుకుంటే ఆశ్చర్యం కలుగుతోంది
ఆమెకు. కానీ, బైటకు వెళ్ళే స్వేచ్ఛ లేదు. ఆ గదిలోనే బందీ అయిపోయింది.
మంచం దిగబోయిన రంగమ్మను వారించింది ఆయా.
“కదలకుండా పడుకుని ఉండాలంటే విసుగ్గా ఉంది” అంది రంగమ్మ.
“డాక్టర్ గారు నీకు పూర్తి విశ్రాంతి కావాలన్నారు” చెప్పింది నర్సింగ్
సిస్టర్.
“మరీ ఇంత విడ్డూరమా? చురుగ్గా తిరిగితేనే కదా కాన్పు సులువుగా అయ్యేది!” అంది
రంగమ్మ. రాముడు కడుపులో ఉన్నప్పుడు చివరివరకు కూలీపనికి వెళ్ళొస్తూండేది
తాను. ఇంటిపనంతా ఒంటిరెక్కతో చేసుకునేది. అందుకే కాన్పు సులభమయిందంది
అమ్మ.
వెల్లకిలా పడుకుని గది పైకప్పు వంక చూస్తూంటే, ఆమె మదిలో గతం కదలాడింది.
వ్యవసాయ కూలీల కుటుంబంలో పుట్టింది రంగమ్మ. చిన్నప్పట్నుంచీ
తల్లిదండ్రులతో పొలం పనులకు వెళ్ళేది. ఇరవయ్యో ఏట- కన్ స్ట్రక్షన్
వర్క్స్ లో పనిచేసే అశోక్ తో పెళ్ళి జరిగింది. ఇద్దరూ పనులలోకి వెళ్ళేవారు.
పెళ్ళైన ఏడాదికి కొడుకు పుట్టాడు. వాడికి ‘రాముడు’ అని పేరు పెట్టుకున్నారు. ఆ
సంతోషం ఎంతోకాలం నిలవకుండానే రంగమ్మ తల్లీ, తండ్రీ ఓ ట్రాక్టర్
ప్రమాదంలో చనిపోయారు.
ప్రభుత్వం ఎక్కడో పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడుతోందని, అక్కడ వర్కర్స్
అవసరం ఎంతో ఉందని, కూలీ కూడా ఎక్కువగా ముడుతుందనీ తెలియడంతో…
భార్యాబిడ్డలతో అక్కడికి ప్రయాణం కట్టాడు అశోక్. వెళ్ళగానే పని
దొరికింది. వర్కర్స్ కోసం తాత్కాలిక నివాసాలు కూడా ఏర్పాటయ్యాయి.
చంటాడికి ఏడాది వయసైనా వచ్చేంత వరకూ తాను పనిలోకి వెళ్ళకూడదని
నిశ్చయించుకుంది రంగమ్మ.
ఆర్నెల్లు గడచిపోయాయి. అశోక్ తాగుడుకు అలవాటుపడ్డాడు. తాగొద్దని రంగమ్మ
ఎంత మొత్తుకున్నా వినలేదు. తాగొచ్చి గొడవచేసేవాడు. ఆమెను కొట్టేవాడు.
వచ్చింది వచ్చినట్టే సారాపాలవుతూంటే, ఇంట్లో గడవడం కష్టమయిపోయేది.
పిల్లవాడి పాలకు కూడా డబ్బులు ఉండేవి కాదు. చెప్పుకొనే దిక్కులేక లోలోపలే
కుమిలిపోయేది రంగమ్మ.
అంతలో – ఆ ప్రాజెక్ట్ వల్ల పర్యావరణం దెబ్బతింటుందని, చుట్టుపక్కల
గ్రామాలు ముంపునకు గురవుతాయని, మరోసారి క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే తప్ప
పని కొనసాగించరాదనీ అంటూ ఎవరో హైకోర్టుకు వెళ్ళి ‘స్టే’ తీసుకురావడంతో
ప్రాజెక్ట్ పనులు హఠాత్తుగా ఆగిపోయాయి. రాత్రికి రాత్రి కార్మికులంతా
నిరుద్యోగులయిపోయారు! ఆ ‘స్టే’ ని ప్రభుత్వం వెంటనే తొలగింపజేస్తుందని
ఆశించినవారికి నిరుత్సాహమే కలిగింది. చూస్తూఉండగానే మూణ్ణెల్లు
అయిపోయాయి. అందరూ పస్తులపర్వంలోకి జారిపోయారు. అశోక్ ‘మందు’ కోసం
దొరికినంత మటుకు అప్పులు చేసేశాడు. వాళ్ళనూ వీళ్ళనూ బతిమాలి తెచ్చి చంటాడికి
కతికించేది రంగమ్మ. స్వగ్రామానికి తిరిగి వెళ్ళిపోదామంటే మొగుడు
వినిపించుకోవడం లేదు.
ఓ రాత్రి స్నేహితుడంటూ ఎవరో వ్యక్తిని ఇంటికి తీసుకువచ్చాడు అశోక్. ఇద్దరూ
తాగి ఉన్నారు. “ఇతన్ని సంతోషపెట్టావంటే నాకు మందూ నీకు విందూను!” అన్నాడు.
రంగమ్మ నివ్వెరపోయింది. ఆమె తేరుకునేసరికి, అశోక్ బైటకు వెళ్ళిపోయి
తలుపు గొళ్ళెం పెట్టేశాడు. ‘తా గుడు మైకంలో మొగుడు ఏదో వాగాడనీ, తాను
చెల్లెలిలాంటిదాన్న’నీ ఆమె వేడుకున్నా వినిపించుకోకుండా , ఆగంతకుడు
బలాత్కారం చేయబోయాడు. ఆగ్రహావేశాలతో చేతికందిన రోకలిబండతో అతని తలమీద
కొట్టింది. ‘అమ్మో!’ అని అరిచి నేలకొరిగాడు. మనిషి కదలకపోవడంతో
చచ్చిపోయాడేమోనని భయం వేసింది ఆమెకు. తలుపు దబదబా బాదింది. అటువైపు నుండి
బదులు లేదు. నిద్రపోతూన్న చంటాణ్ణి తీసుకుని చంకను వేసుకుంది. కాలితో గట్టిగా
తన్నడంతో , తడికె తలుపు విరిగిపడింది. బైట మొగుడి జాడ లేదు. ఆ చీకట్లో తోచిన
దిక్కుగా పరుగెత్తింది. అలా ఎంతసేపు, ఎంత దూరం పరుగెత్తిందో తెలియదు –
శివాలయం ఒకటి కనిపించడంతో అందులో తలదాచుకుంది. పిల్లాణ్ణి ఒళ్ళో
పెట్టుకుని, స్తంభానికి చేరబడి, నిస్సత్తువగా కళ్ళు మూసుకుంది.
తెల్లవారాక గుడి తెరవడానికి వచ్చిన పూజారి లేపేంత వరకూ మెలకువ రాలేదు
రంగమ్మకు. తన కథ చెప్పి భోరుమంది. దయామయుడైన ఆయన ఆమెకు
ఆశ్రయమిచ్చాడు. అక్కడే పని కల్పించి, తన ఇంటి వెనుకనున్న ఓ గదిని ఖాళీచేయించి
వసతి ఏర్పాటుచేశాడు. ఆలయ ధర్మకర్తలకు ఆమె దుస్థితిని వివరించి, ఎంతో కొంత
నెల జీతం ఇచ్చేటట్లు ఒప్పించాడు. ఆయనకు తన కృతజ్ఞతను ఎలా తెలుపుకోవాలో
తెలియలేదు రంగమ్మకు…
రాముడికి ఇప్పుడు అయిదేళ్ళు వచ్చాయి. వాణ్ణి చదివించాలన్నది రంగమ్మ
కోర్కె. పెళ్ళాన్ని ఇతరులకు తార్చబోయిన త్రాష్టుడి పేరు తలచుకోవడానికి
కూడా ఇచ్చగించని ఆమె- అశోక్ ని తన తలపులోంచి పూర్తిగా తుడిచేసింది.
ఆలయానికి వచ్చిన ఓ స్త్రీతో పరిచయమయింది రంగమ్మకు. ఆమె పేరు
సరళాదేవి. నలభ య్యేళ్ళుంటాయి. తానొక సంఘసేవికురాలినని, పట్టణంలో
ఉంటున్నానని, ఆ గ్రామంలోని బంధువుల ఇంటికి వచ్చాననీ చెప్పింది. రంగమ్మకు ఓ
ప్రతిపాదన చేసింది ఆమె.
ఓ ధనిక దంపతులకు సంతానం లేదు. ఏదో కారణంగా భార్య గర్భసంచి తొలగించడంతో,
మున్ముందు ఆమె గర్భం దాల్చే అవకాశమూ లేదు. అనువైన మహిళ ఎవరైనా దొరికితే,
ఆమె సహకారంతో ‘ఇన్-వైట్రో ఫెర్టిలైజేషన్’ ద్వారా బిడ్డను
పొందాలనుకుంటున్నారు. ఓ ప్రొసీజర్ ద్వారా భర్త వీర్యకణాలను ఆ మహిళ అండం
తో జతచేసి, లేబొరేటరీలోని ‘టెస్ట్ ట్యూబ్’ లో ఉంచి, ఐదారు రోజులకు
ఫెర్టిలైజ్ కాగానే, దాన్ని ఆ మహిళ గర్భం లో ప్రవేశపెడతారు. ఆమె గర్భం
ధరించి బిడ్డను కని వారికి ఇవ్వవలసి ఉంటుంది. అందుకు ఆ మహిళకు లక్షరూపాయలు
ముట్టజెబుతారు వాళ్ళు. ముందుగా సగం సొమ్ము ఇస్తారు. బిడ్డ పుట్టాక మిగతాది
చెల్లిస్తారు. రంగమ్మ వయసులో చిన్నదీ, ఆరోగ్యంగా ఉన్నదీ కావడంతో, ఆమె
ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కూడా ఆమెను ఆ దంపతులకు పరిచయం
చేయాలనుకుంటోంది సరళాదేవి. కానీ- వ్యవహారమంతా గోప్యంగా ఉంచాలి. రాముడు
తల్లితో ఉండరాదని, వాణ్ణి హాస్టల్లో ఉంచి చదివిస్తారనీ చెప్పింది.
ఔననాలో, కాదనాలో పాలుపోలేదు రంగమ్మకు. అది మంచో చెడో కూడా ఎరుగదు.
పూజారిని సలహా అడుగుదామంటే, దాన్ని రహస్యంగా ఉంచాలన్న ఆంక్ష!
లక్షరూపాయలనేసరికి ఆశ కలిగింది. ఆ సొమ్ముతో కొడుకును బాగా చదివించి
ప్రయోజకుణ్ణి చేయవచ్చుననిపించింది, అందులోని బాధలు ఎలా ఉన్నా, కొడుకు కోసం
ఏం చేయడానికైనా సిద్ధపడింది. సుగుణాదేవితో పయనమయింది రంగమ్మ.
పట్టణంలో బంధువులెవరో ఉన్నారని, వారిని చూసి వస్తామనీ పూజారితో చెప్పింది.
గడ్డుకాలంలో తనను ఆదుకున్న దేవుడులాంటి ఆయనతో అబద్ధం చెప్పవలసి
వచ్చినందుకు మదిలో బాధపడిపోయింది.
అసలు దంపతులు బైటపడలేదు. వారి తరఫున ఎవరో ఆ వ్యవహారమంతా నడిపించారు.
రంగమ్మకు వైద్యపరీక్షలు జరిపి, ఆమె ఫిట్ నెస్ ని నిర్ధారించారు. ఆ తరువాత
‘ఇన్-వైట్రో’ ప్రొసీజర్ జరిగింది. అది సఫలం కావడంతో, గర్భం ధరించిన రంగమ్మను
ఓ ఫామ్ హౌస్ లో ఉంచి, జాగ్రత్తగా చూసుకోసాగారు.
రంగమ్మ పేరిట బ్యాంక్ అకౌంట్ తెరిపించి, అడ్వాన్స్ యాభైవేలూ
అందులో జమచేశారు. తల్లి కోసం ఏడుస్తూన్న రాముణ్ణి వీధిబడిలో చేర్పించి,
ప్రభుత్వ సోషియల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉంచారు. అక్కడ ఆ పసివాడు తల్లికోసం
తల్లడిల్లిపోతూంటే, ఇక్కడ రంగమ్మ- కొడుకును చూడాలని తహతహలాడింది. కానీ,
ఇద్దరి కోరికా తీరకుండానే నెలలు గడచిపోయాయి.
ఆమధ్య రంగమ్మకు కొడుకు రోజూ కలలోకి వస్తున్నాడు. ‘అమ్మా! నన్ను
వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావ్? రామ్మా!’ అని ఏడుస్తున్నట్టుండేది. మెలకువలో
కూడా, వాడు ‘అమ్మా!’ అని పిలుస్తున్నట్లనిపించేది. కొడుకును చూడాలనీ,
హృదయానికి హత్తుకోవాలనీ తహతహలాడిపోయేది. కానీ ఆమె కోరిక, కోరికగానే
మిగిలిపోయింది.
నెలలు నిండాక రంగమ్మకు నొప్పులు రావడంతో సిజేరియన్ చేసి బిడ్డను
బైటకు తీశారు వైద్యులు. మగపిల్లాడు. తెల్లగా, ముద్దుగా ఉన్నాడు. రంగమ్మ
స్పృహలోకి వచ్చేసరికే పిల్లాడిని ఆమె నుండి వేరుచేశారు. కనీసం కళ్ళారా
చూసుకునే భాగ్యం కూడా దక్కనందుకు కళ్ళనీళ్ళు పెట్టుకుందామె.
రంగమ్మకు ముట్టవలసిన మిగతా సొమ్ము ఆమె బ్యాంక్ ఖాతాలో జమ
అయింది. తమ అవసరం తీరిపోవడంతో, రాముణ్ణి చేర్చిన హాస్టల్ వివరాలు ఇచ్చి
ఆమెను ఆసుపత్రి నుండి తిన్నగా ఇంటికి పంపేశారు. రంగమ్మ మదిలో బాధగా ఉంది –
బిడ్డ తనది కాకపోయినా, నవమాసాలూ మోసినందుకైనా కంటిచూపున కు
నోచుకోలేకపోయినందుకు! రొమ్ములు సలుపుతూంటే, పసివాడికి స్తన్యం కూడా
ఇవ్వలేకపోయిన తన దురదృష్టానికి దుఃఖించింది. విషయం తెలుసుకున్న పూజారి ఆమెను
ఓదార్చడానికి ప్రయత్నించారు. “కొడుకు కోసం ఆ బాధ్యతను స్వీకరించావు. అందులో
తప్పులేదు. నీ ఆరోగ్యం పుంజుకున్నాక హాస్టల్ కి వెళ్ళి రాముణ్ణి
తీసుకువద్దాం” అన్నారు.
ఎప్పుడెప్పుడు పట్టణం వెళదామా, కొడుకును చూసుకుందామా అని రంగమ్మ
ఆత్రుత చెందుతూండగానే- వినవచ్చింది పిడుగులాంటి ఆ వార్త! రాముడు ఉండే
హాస్టల్లోని పిల్లలంతా ఫుడ్ పాయిజనింగ్ కారణంగా హఠాత్తుగా
అనారోగ్యానికి గురై, ఆసుపత్రిపాలయ్యారు. వారిలో ఆరుగురు పిల్లలు చనిపోతే,
నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
పూజారిగారిని తీసుకుని పట్టణంలోని ఆసుపత్రికి పరుగెత్తింది రంగమ్మ,
దడదడలాడే గుండెతో. అక్కడికి వెళ్ళాక, చనిపోయినవారిలో రాముడు కూడా ఉన్నాడని
తెలియగానే కుప్పకూలిపోయిందామె.
రాముడి శవాన్ని ఆలయం వెనుక ఉన్న స్మశానంలో ఖననం చేశారు. ఆ
కార్యాలన్నీ పూజారిగారే చూసుకున్నారు. రాముడి శవంపైన పడి గుండెలు పగిలేలా
రోదిస్తూన్న రంగమ్మను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. మధ్య మధ్య
తెలివితప్పి పడిపోయేది.
వారం రోజులైనా రంగమ్మ ఇంకా కోలుకోలేదు. కొడుకును తలచుకుని లోలోపలే
కుమిలిపోసాగింది. రాముడు చనిపోయాడంటే ఇంకా నమ్మలేకపోతోందామె. తాను
డబ్బుకు ఆశపడి ఆ ప్రతిపాదనకు ఒప్పుకొని ఉండకపోతే- వాడు తనకు దూరమయ్యేవాడు
కాదు. ‘వాడి చావుకు తానే కారణం’ అన్న అపరాధభావన మనసును తొలచసాగింది.
ఎవరికోసమైతే పరాయిబిడ్డకు తన కడుపును అద్దెకు ఇచ్చిందో, ఎవరి
శ్రేయస్సుకోసమైతే పదినెలలపాటు ఎడబాటును సహించిందో – ఆ కొడుకే
దూరమయ్యాక తనకు డబ్బుతో అవసరం ఏముంది? కట్టుకున్నవాడు మోసం చేసినా,
కన్నకొడుకు కోసం మొండిధైర్యంతో ఏటికి ఎదురీదింది తాను. ఇప్పుడిక ఎవరికోసం
బతకాలి?…
ఓరోజు రాత్రి రంగమ్మ ఆలయం వెనుక ఉన్న చెట్టుకు ఉరేసుకుంటూండగా,
ఎవరో తన చీర పట్టుకుని లాగుతున్నట్టనిపించింది… ఓ చిన్నారి! “అమ్మా!” అంటూ
చీర పట్టుకుని గుంజుతోంది. ఆమె ఆశ్చర్యంతో మెడకు వేసుకున్న ముడిని
విప్పేసింది.
చవితి వెన్నెల వెలుతురులో పాపను పరిశీలనగా చూసింది
రంగమ్మ…రెండేళ్ళుంటాయి. చక్రాల్లాంటి కళ్ళతో ముద్దుగా ఉంది. ఒంటిపైన
మాసిన, అతుకుల గౌను; తైలసంస్కారంలేని జుత్తు.
“ఎవరమ్మా నువ్వు?” అడిగింది, దగ్గరకు తీసుకుంటూ.
“దుర్గ” జవాబిచ్చింది పాప. “అమ్మా! ఆకలేత్తంది”
రంగమ్మ మాతృహృదయం కరిగిపోయింది. “పద తల్లీ, బువ్వ పెడతాను” అంటూ పాపను
ఎత్తుకుని ఇంటిముఖం పట్టింది…ఇంట్లో ఉన్నదేదో ఆప్యాయంగా
తినిపిస్తూంటే ఆవురావురుమంటూ తింది ఆ చిన్నారి. తినగానే నిద్రపోయింది.ఆ
పసిపాప ఎవరో, ఆవేళప్పుడు అక్కడికి ఎలా వచ్చిందో బోధపడలేదు రంగమ్మకు.
చావబోతూన్న తనను ఆపడానికి ఆ శివుడే పంపించాడా అనుకుని విస్తుపోయింది.
తెల్లవారాక పాపకు స్నానం చేయించి, రాముడి దుస్తులు తొడిగింది. అవి వదులుగా
ఉన్నా, వాటిని సంబరంగా చూసుకుంది ఆ చిన్నారి. తలకు కొబ్బరినూనె రాసి తల
దువ్వింది రంగమ్మ. పాప ‘అమ్మా!’ అని పిలుస్తూంటే ఆమె మనసుకు ఏదో తెలియని
ఊరటగా ఉంది. ఎద పొంగిపోతోంది. వివరాలు అడగబోతే, పాప ఏమీ చెప్పలేకపోయింది.
పాపను పూజారిగారి దగ్గరకు తీసుకువెళ్ళి జరిగిందంతా చెప్పింది రంగమ్మ. పాప వంక
ఆశ్చర్యంగా చూశారాయన. ఆయన వదనంలో విషాద ఛాయలు. “మన గుడిబైట కూర్చుని
అడుక్కునే ఓ ఆడమనిషి కూతురు ఈ పిల్ల. పాపం… రెండు రోజుల క్రితం ఆమె
మరణించడంతో, మునిసిపాలిటీవాళ్ళు వచ్చి శవాన్ని తీసుకుపోయారు. ఈ పిల్లను ఎవరూ
చేరదీయలేదనుకుంటాను” అంటూ నిట్టూర్చారు.
రంగమ్మ హృదయం తల్లడిల్లిపోయింది…’భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కో రాత
రాస్తాడు. తన నుండి రాముణ్ణి అర్థాంతరంగా వేరుచేసిన ఆ దేవుడే, ఆ పసిదానికి
తల్లిని దూరం చేశాడు. ఏం పాపం చేసిందని? చావబోతూన్న తనవద్దకు పంపించి
బతికించాడు. ఈ జీవితానికి ఏదో ప్రయోజనం ఉంటే తప్ప అలా చేయడు. ఆ ప్రయోజనం
– అనాథ ఐన ఆ పసిదాన్ని సాకడమే అయ్యుంటుంది!’ – అప్పుడప్పుడు పూజారిగారు
భక్తులనుద్దేశించి చెప్పే ప్రవచనాలు మదిలో మెదలగా, అనుకుందామె. ‘ఈ
చిన్నారిలో నా రాముణ్ణి చూసుకుంటాను. వాడిపైన పెట్టుకున్న ఆశలను దీని ద్వారా
తీర్చుకుంటాను…’ అని తీర్మానించుకుంది.
రంగమ్మ నిర్ణయాన్ని ఆలకించి మనస్ఫూర్తిగా అభినందించారు పూజారిగారు. “ఆ
శివుడి ఇచ్ఛ కూడా అదే అయ్యుంటుంది, రంగమ్మా! చెట్టుమీది కాయను,
సముద్రంలోని ఉప్పునూ కలిపినట్టు…మీ ఇద్దరినీ కలపడంలోని పరమార్థం అదే!
నీవంటి సహృదయురాలి పంచను చేరడం ఈ పసిదాని భాగ్యం!” అన్నారు వారిని
ఆశీర్వదిస్తూ.