ఇలా కొందరు!
-పెనుమాక నాగేశ్వరరావు
‘’హలో”
…
‘’నిన్నే’’
…
‘’ఒక్క నిముషం’’
…
‘’నేనంటే నీకెందుకు అంత కోపం?’’
‘’నాకేం కోపం లేదు’’
‘’ఇష్టమూ లేదుగా!’’
‘’లేదు’’
‘’ఎందుకని?’’
…
‘’ఎందుకని లేదు?’’
‘’తెలీదు’’
‘’అబద్ధం’’
‘’కాదు…నిజం’’
‘’అయితే, ఎందుకో చెప్పు’’
‘’తెలీదు’’
‘’నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను’’
‘’నాకు ఇష్టమే లేదంటుంటే…’’
‘’అదే…ఎందుకో చెప్పు’’
‘’నాకే తెలీదు…నీకేం చెప్పేది?’’
‘’నాకేం తక్కువ?’’
‘’నాకవన్నీ తెలీదు’’
‘’దీన్ని మొండితనం అంటారు’’
‘’అలాగా!’’
‘’తెలివిగా మాట్లాడుతున్నాను- అనుకుంటున్నావా?’’
‘’అయి ఉండవచ్చు’’
‘’దీన్ని పొగరు అంటారు’’
‘’అవునా’’
‘’అవును’’
‘’అయితే ఏంటి?’’
‘’నాకు నువ్వు కావాలి’’
‘’నాకు నువ్వు వద్దు’’
‘’నేను నిన్నే పెళ్లిచేసుకుంటాను’’
‘’నేను చేసుకోను’’
‘’ఎందుకని?’’
‘’నాకు ఇష్టం లేదు’’
‘’మళ్ళీ అదే మాట!’’
‘’ఎప్పటికీ అదే మాట’’
‘’బలవంతంగా పెళ్లి చేసుకుంటే ఏం చేస్తావ్?’’
‘’ఏం చేసుకుంటావ్?’’
‘’పెళ్లి’’
‘’చేసుకుని ఏం చేస్తావ్’’
‘’కాపురం’’
‘’అది కాపురం ఎలా అవుతుంది?’’
‘’మరి ఏమవుతుంది?’’
…
‘’పాలూ నీళ్ళు కలిస్తే ఏమవుతుంది?’’
‘’కల్తీ అవుతుంది’’
‘’కాదు కాదు… పాలు పలచన అవుతాయి. లేదా నీళ్ళ పాలు అనవచ్చు’’
‘’పలచబడటం నాకు ఇష్టం లేదు’’
‘’నువ్వు పాలు కాదు- నీళ్ళు’’
‘’నీళ్ళ కంటే పాలు గొప్పవనుకుంటున్నావా?’’
‘’కాదా?’’
‘’కాదు’’
‘’పాలు బలం కదా’’
‘’పాలు దాహం తీర్చలేవు’’
‘’నీళ్ళు బలాన్ని ఇవ్వలేవు కదా’’
‘’ఎవరా చెప్పింది? నీళ్ళు- ఆకలి, దాహం రెంటినీ తీరుస్తాయి”
‘’సరే నువ్వు పాలే. నేనే నీళ్ళు. ‘కలసిపోదాం సరే’ అను’’
‘’అనను… అనలేను’’
‘’నేను అందంగానే ఉంటానుగా’’
‘’ఎవరికన్నా?’’
‘’అదేం ప్రశ్న?’’
‘’నీ ప్రశ్నలాంటిదే’’
‘’ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు’’
‘’ఒక్కొక్కసారి అవుతుంది’’
‘’నాకు మంచి ఉద్యోగం ఉంది’’
‘’ఉద్యోగాలన్నీ మంచివే’’
‘’మంచిది అంటే పెద్దది అని ’’
‘’ఉద్యోగం మనిషి లక్షణం. అందులో పెద్దా, చిన్నా తేడాలుండవ్’’
‘’నువ్వు ఆడదానివనే మాట మరచిపోయి మాట్లాడుతున్నావ్’’
‘’నేనెవరో నువ్వు గుర్తుచేయనక్కరలేదు’’
‘’ఎదుటివాళ్ళని గౌరవించటం తెలుసుకో’’
‘’ఆడదానికి గౌన్లు వేసుకునేటప్పుడే గౌరవం అంటే ఏమిటో తెలుస్తుంది’’
‘’మరి నీకు చీరల్లోకి ఎదిగినా తెలీలేదుగా…అందుకే…’’
‘’హద్దుమీరి మాట్లాడవద్దు… నేను వెళ్లిపోతున్నాను’’
‘’నీ మనసు మారదన్నమాట’’
‘’మారదు … మార్చుకోను…గుడ్ బై ‘’
‘’మన పెళ్లి ఎలా జరగదో చూస్తాను’’
‘’జరగని పెళ్లిని ఎలా చూస్తావ్?’’
‘’నేను చూస్తాను… నీకూ చూపిస్తాను’’
‘’కలలు కంటూ కూర్చో’’
‘’కల నిజమాయెగా, కోరిక తీరెగా అని పాడుకుందాం’’
‘’పగటి కలలు కనటం మానుకో’’
******
‘’ఇల్లలకంగానే పండుగ కాదు’’
‘’నీ మొహం. మన పెళ్లే కాదన్నావు. అయింది. నువ్వనుకుంటున్న పండుగా అవుతుంది’’
‘’బలవంతంగా చేసుకున్నది పెళ్లి కాదు’’
‘’నువ్వు ఏ పేరు పెట్టుకున్నా నాకు అనవసరం. మనిద్దరం ఇప్పుడు భార్యాభర్తలం’’
‘’నువ్వు నా దగ్గరకు రావటమే నేను భరించలేను’’
‘’ఇంకా దగ్గరవుతాం చూడు’’
“నన్ను ముట్టుకోవద్దు ‘’
‘’నిన్ను కోరి పెళ్లి చేసుకుంది అందుకు కాదు’’
‘’నేను కోరుకోలేదు’’
‘’నిన్ను అలా ఉంచాలంటే మనం విడిపోవాలి, లేదా నేను చచ్చయినా పోవాలి’’
‘’ఏదయినా సరే ’’
******
మూడు దశాబ్దాలు దొర్లిపోయినై.
ఆ ఇద్దరూ రెండుసార్లు జర్మనీ, మూడుసార్లు అమెరికా వెళ్ళి వచ్చారు.
ఇప్పుడు వాళ్ళ అబ్బాయి జర్మనీలో ఇంజనీరు, అమ్మాయి అమెరికాలో డాక్టరు.
అమ్మానాన్నా షష్టిపూర్తికి ఇద్దరూ విదేశాల నుండి వస్తున్నారు… వాళ్ళ పిల్లలతో సహా !
————————-