– ఆచార్య కొవ్వలి గోపాలకృష్ణ, ప్రధాన సంపాదకులు
ప్రకాశిక పత్రికను పునః ప్రారంభించడం ఒక చారిత్రక ఘట్టం. ఒక రకంగా సాహసం కూడా. మహాకవి ఆశయాల మేరకు పత్రికను నడపాలన్న ఆదర్శం, నడపగలమా అన్న సంశయాల మధ్య సంఘర్షణ సహజమైనా, అశేష గురజాడ అభిమానుల ప్రోత్సాహం, సహకారాలతో నడపగలమనే నమ్మకం ఉంది. ఇప్పటి వరకూ సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు. సహకరించడానికి ముందుకు వస్తున్న అనేక మందికి ముందస్తు ధన్యవాదాలు. సహకరించమని ప్రముఖులకి వినయపూర్వక విన్నపాలు.
యువతని ఉత్తేజపరచి, ఉన్నత ఆలోచనలు, ఆవిష్కరణల వైపు దృష్టి మళ్ళింపగలిగే రచనలు రావాలి. సామరస్యం, ఐక్యత, సమాజ హితం గురజాడ మౌలిక తత్వం. వాదాల ప్రాతిపదికన కాకుండా, అంశాల, ఆశయాల ప్రాతిపదికన రచనలు వస్తే సమాజంలో సామరస్యం పెరిగి, సమానత్వం వైపు పురోగమించే అవకాశం ఉంటుంది. సాహిత్యం ద్వారా ద్వేష రహిత, సామరస్య భావనలని ప్రోత్సహించడం ద్వారా సాహిత్యకారులు గురజాడకి నిజమైన, ఘన నివాళిని ఇవ్వగలుగుతారన్నది నా అభిప్రాయం. గురజాడని ఒక వ్యక్తిగా మాత్రమే కాకుండా గురజాడ తత్వాన్ని ప్రేమిద్దాం; అనుసరిద్దాం. ఈ ప్రయత్నాలకి ప్రకాశిక వేదిక కావాలని నా ఆకాంక్ష.
ఈపత్రిక మనందరిదీ. కలిసి పెంచుదాం. కలిసి నడుద్దాం. . మంచి విషయాలు విన్నప్పుడో, చదివినప్పుడొ, మంచి ఆలోచనలు వచ్చినప్పుడో ప్రకాశిక ద్వారా అందరితో పంచుకోండి. వివరాలకు సంప్రదించండి.
ప్రకాశిక పత్రికను పునరుధ్ధరించే ప్రక్రియలో నేను మళ్ళీ తెలుసుకున్నదేమంటే, మన చరిత్ర, వారసత్వ సంపదల పట్ల ఉండవలసిన ప్రేమ, గౌరవం, అభిమానం, వాటిని పరిరక్షించాలనే అభిలాషల ఆవశ్యకత. ప్రకాశిక పూర్వ ప్రతులు కొన్నైనా దొరికి ఉంటే, మనం ఎంత ఉత్తేజం పొందేవాళ్ళం! గురజాడ విషయంలోనే కాదు, చాలామంది అరుదైన వ్యక్తులు రాసిన గ్రంధాలు మచ్చుకు మాత్రమే దొరికాయంటే ఎంత ఆక్షేపణీయం! త్యాగయ్య రాసిన పాడిన వేలాది కీర్తనలలో ఆణిముత్యాలు కొన్ని వందలు మాత్రమే మనకి దొరికాయంటే, మనం కోల్పోయిన వజ్రాలెన్ని ఉండి ఉంటాయో కదా! లిఖిత, మౌఖిక చరిత్రల పరిరక్షణ భావితరానికి మనం ఇచ్చే అమూల్య సంపద.
తెలుగు భాష ఎంత మధురమో, అంత కఠినం! మాట్లాడే భాష, రాసే భాషల మధ్య సమన్వయం కొంత తక్కువన్నది నిజం. తప్పుడు పద ప్రయోగాలని, ఉచ్చారణలనీ ఎద్దేవా చేస్తూనో, అవహేళన చేస్తూనో వచ్చే వ్యాఖ్యలు చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. వ్యాఖ్యలతో పాటు సరైన పదమేమిటో, సరైన ఉచ్చారణేమిటో కూడా తెలియచేస్తే విస్తృత ప్రయోజనం ఉంటుంది. తెలుగు ఉపాధ్యాయులు, ముఖ్యంగా విశ్రాంత తెలుగు ఉపాధ్యాయులు, భాషా పరిరక్షణకీ, వికాసానికీ చేయగలిగిన సేవ, సహాయం ఎంతైనా ఉంది. తెలుగు భాషాభివృధ్ధికి, పరిరక్షణకీ జరిగే ఏ ప్రయత్నానికైనా ప్రకాశిక అండగా ఉంటుంది. తెలుగు సాహిత్యం ద్వారా సమాజ శ్రేయస్సుకి దోహదపడే ప్రతీ ప్రయత్నానికీ ప్రకాశిక తోడుగా ఉంటుంది.
ప్రకాశిక మన వారసత్వ సంపద. ప్రకాశిక మన అందరిదీ. కాపాడుదాం, కలిసి పెంచుదాం.