జనవరి – మార్చ్ సంచిక
ఆలోచిద్దాం
–ఆచార్య కొవ్వలి గోపాలకృష్ణ
ప్రకాశిక తొలి సంచికకి మంచి స్పందన,
అభినందనలు వచ్చాయి. తొలి సంచిక లో వ్యాసాలు
రాసిన ప్రతీ ఒక్కరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు.
ప్రకాశిక రెండవ సంచిక 31 జనవరి 2021 న
విడుదల అవుతోంది. ఈ సంచిక కూడా విశేష
ఆదరణ పొందుతుందని నమ్ముతున్నాను.
వాదాలకి, వర్గ, వర్ణాలకి అతీతంగా పత్రికని
నడపాలన్నది నా అభిమతం. వేరు వేరు రంగాలకి
చెందిన ప్రముఖుల రచనలు, విభిన్న ఆలోచనా
ధోరణులని పంచే రచనలను ప్రచురించడం పత్రిక
ఆరోగ్యానికి మంచిదని నా నమ్మకం. ఏ ఒక్క
సిద్ధాంతానికీ ప్రకాశిక మద్దతు పలకదు; ఏ
భావజాలాన్నీ నిరసించదు. గురజాడలో ఎన్నో
కోణాలు ఉన్నాయి. వాటిని గుర్తించి విశాలాంధ్ర
పబ్లికేషన్స్ వారు గురజాడ రచనలు ఎన్నో వెలికి
తీశారు కాబట్టి ఈ రోజు మనం వాటిని చదివి
ఆనందించగలుగుతున్నాం. సమాజాన్ని, సమస్య
లని వేరు వేరు కోణాలలో పరిశీలించి నిజాయితీగా
అభిప్రాయాలు పంచుకుంటే తప్పులేదు. సాహిత్య
ప్రయోజనం సమాజహితం, సమాజ అభివృద్ధి అని
ప్రకాశిక పత్రిక వెనక ఉన్న అభిమతం. సమాజంలో
సమానత్వ ఆకాంక్షలని ప్రతిబింబిస్తూ రచనలు
రావాలి; అలాగని కొత్త అసమానతలకి దారితీసే
వాదాలు, వివాదాలు తెరమీదకి వస్తే కన్యాశుల్కం
పోయి వరకట్నం వచ్చినట్లు అవుతుంది. పరిపుష్ట
మైన భాషలో రాసిన రచనలకి ప్రకాశిక చిరునామా
అవ్వాలని మా ఆకాంక్ష. ప్రకాశిక భావేంద్ర
ధనుస్సులా విలసిల్లాలని మా అభిలాష. తొలి సంచిక
చదివిన చాలామంది ప్రకాశిక ‘భారతి పత్రిక’ ని
పోలి ఉంది అని వ్యాఖ్యానించారు.
ఆ నేపథ్యంలో భారతి పత్రిక పాత ప్రతులని పరిశీలించి అందులోనకొన్ని రచనలని ఈ సంచికలో పునర్ముద్రిస్తున్నాము.జనవరి 30 భారత దేశ చరిత్రలో ఒక గంభీరమైన రోజు. మహాత్మా గాంధీ నేలకొరిగిన రోజు. అహింసావాద కమలం ముకుళించడం మొదలయిన రోజు. మహాత్మ నిశ్చలాత్మ
అయ్యాక గడియారం 73 సంవత్సరాలు తిరిగి, దేశ గతిని, గమనాన్ని పరికిస్తూ
నిట్టూరుస్తూనే జీవిస్తోంది. స్వతంత్ర భారత దేశంలో ధర్మాగ్రహానికీ, సత్యాగ్రహానికీ విలువ,
చోటు లేని పరిస్థితులు నెలకొన్నట్లు కనిపిస్తోంది. దేశ రాజధానిలో రైతులు నెలలు తరబడి
సత్యాగ్రహం చేస్తూంటే ఏమీ పట్టనట్లు ఉపేక్షించే పాలకులు, వేల ఎకరాల భూములిచ్చి
భవిష్యత్ ఏమిటో తెలియక అయోమయంలో కొట్టుమిట్టులాడుతూ ఏడాదికి పైగా
ధర్మపోరాటం చేస్తూంటే కన్నెత్తి చూడని ప్రజాప్రభుత్వం తీరు చూసి మహాత్మ సమాధిలో
సతమతమవుతున్నారేమో. పాలకుల ధోరణి చూస్తూ ఉంటే, ప్రజాస్వామ్యాన్నే ప్రశ్నించే
వారికి అడగకుండానే ఆయుధాలు ఇచ్చినట్లుగా ఉంది. ఈస్ట్ ఇండియా కంపెనీ భౌతికంగా
భారతదేశంలో ప్రవేశించి తిష్టవేసి మనలని బానిసలుగా చేస్తే, బహుళ జాతి సంస్థలు
ఎలాంటి శ్రమ లేకుండా దేశ ఆర్థిక వ్యవస్థని నిర్దేశించే ప్రయత్నం చేస్తూంటే ప్రజలు ఎలా
ప్రతిఘటించాలి? “అంతా మీ మంచికే” అని బోధించే పాలకులు మంచి చెడులు విడమర్చి
చెప్పే ప్రయత్నం చేయక్కరలేదా? ఒక విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి సందేహాలూ,
సంశయాలు తీర్చే ప్రయత్నం ప్రధాని చేయక్కర లేదా? గత ఐదు సంవత్సరాలుగా ప్రధాని
ఎన్ని విలేఖరుల సమావేశాలు ఏర్పాటు చేశారు?
ఏకపక్ష, నిరంకుశ ధోరణులు పాలకులలో విస్తరించడానికి కారణం ఏమిటి?
నిర్వీర్యమైన మేధావి వర్గం, నినాదాలే విధానాలుగా ప్రచారం చేసే నాయకులకి వత్తాసు
పలికే విస్తృతమైన భజన సమాజాలు. నిష్పాక్షికంగా చెప్పాలంటే కుంచిస్తున్న స్వతంత్ర
ఆలోచనలు గల మేధావి వర్గం జాతి మనుగడకి హానికరం. ప్రశ్నించే వారికి రంగులద్దే
సంస్కృతి ప్రబలుతున్నట్లు కనిపిస్తోంది. అన్యాయాన్ని నిరంగ మనస్కులై నిరసించే
సమాజం రావాలి. అన్యాయాన్ని ఎత్తి చూపి సమస్యల పరిష్కారానికి మార్గం చూపే
రచనలు రావాలి. ఏ రాజకీయ పార్టీపాలిస్తున్నా సమస్యలపై గళం విప్పే తటస్థ మేధావుల
సమూహం దేశానికి అవసరం. ప్రస్తు ం అగ్ర రాజ్యాల పరిస్థితి చూస్తూంటే నిష్కల్మష,
ఉద్రేకరహిత (impassionate) అంతర్జాతీయ మేధావి వర్గ ఆవిష్కరణ ఆవశ్యకత
చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. జెండాలు మాసి ఎజెండాలుగా మారాయి. వ్యక్తులు
మారారు. వ్యవస్థలు మారలేదు. రాజులు పోయారు, ప్రజా ప్రతినిధులు వచ్చారు;
అణగార్చే ధోరణులు సమసిపోలేదు. నవ యుగ చింతనకి మనమే నాంది కావాలి.
ఆచార్య కొవ్వలి గోపాలకృష్ణ