11.5 C
New York
Sunday, November 24, 2024

దేశం, భక్తి, దేశభక్తి

డాక్టర్‌ కొవ్వలి గోపాలకృష్ణ, ప్రధాన సంపాదకులు

భారతదేశంలో నివసిస్తున్న, ప్రపంచమంతటా విస్తరించి విరాజిల్లుతున్న భారతీయులకీ 78వ స్వాతంత్ర్య దిన శుభాకాంక్షలు. గడచిన ఏడున్నర దశాబ్దాలలో భారత దేశం సాధించిన ప్రగతి, పలు రంగాలలో జరిగిన అభివృద్ధి ఎంతో గణనీయమైనదన్న విషయం కాదనలేనిది. ఈ ప్రగతికి ఎన్నో కారణాలు ఉండవచ్చు కానీ, దేశం ఎంచుకున్న ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రజల శాంతికాముక జీవన ఆకాంక్ష, ముఖ్యకారణాలు. ప్రస్తుతం పొరుగు దేశాలలో నెలకొని ఉన్న పరిస్థితులు గమనిస్తే భారత దేశ సుస్థిరత వెనక ఉన్న కారణాలు స్పష్టంగా అవగతం అవుతాయి. ఈ ప్రగతికి కారణమైన అన్ని రాజకీయ పార్టీలనీ, నాయకులనీ, ప్రజలనీ అభినందించాలి.

78 సంవత్సరాల వయస్సు ఉన్న యువదేశం సాధించవలసినది ఇంకా చాలా ఉంది. 25 సంవత్సరాల లోపు వయసు ఉన్న ప్రజల సంఖ్య భారతదేశంలో అధికం. వేగంగా పెరుగుతున్న జనాభాకి తగిన వసతుల కల్పన, యువతీయువకుల, శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకోగల పథకాల రూపకల్పన, అభివృద్ధికి అవసరమైన దీర్ఘకాల ప్రణాళికల రూపకల్పన ఎంతో అవసరం.

వ్యవసాయ ప్రధానమైన ఆర్థిక వ్యవస్థ ఉన్న భారతదేశంలో రైతులకి సరైన ప్రోత్సాహం, ఆసరా ఇవ్వడం చాలా అవసరం; ఇది అధికారంలో ఉన్న ప్రభుత్వాల బాధ్యత. బుణ మాఫీ వంటి దయాగుణ ప్రదర్శన కంటే, రైతు బుణగ్రస్తుడు కాకుండా ఉండేలా ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందించడం చాలా అవసరం. పండించిన పంటకి అవసరమైన గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకోవడం ప్రభుత్వ కనీస కర్తవ్యం. పండించిన పంట ఎండా వానల తాకిడికి, ఈనగాసి నక్కల పాలు అన్న చందాన నాశనం అవుతోంటే రైతు గుండె తరుక్కు పోవడమే కాకుండా, పండించడానికి వెచ్చించిన ఎన్నో వనరులు, ముఖ్యంగా రైతు, వ్యవసాయ కార్మికుల శ్రమ, వృధా కావడం గర్హనీయం. రైతులు పంటలని నిలవ ఉంచుకునే విధంగా గిడ్డంగులను నిర్మించి సరసమైన ధరకి అందుబాటులో ఉండేలా చేయడం ఎంతో ముఖ్యం.

ఎదుగుతున్న దేశం పెక్కు సవాళ్లను ఎదుర్కుంటోందన్నది సత్యం. ముఖ్యంగా యువత ఎదుర్కుంటున్న సవాళ్లు క్లిష్టమైనవి. బతుకుతెరువుకి అవసరమైన నైపుణ్యం ఇవ్వని డొల్ల పట్టాలు యువత భవితకి గొడ్డలిపెట్టు. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఏటా వెలువరించే నివేదికల ప్రకారం దేశంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలల నుండి పట్టాలు పొందినవారిలో అధిక శాతం వేర్వేరు ఉద్యోగాలకి అవసరమైన కనీస అర్హతలు లేనివారట. డిగ్రీలు, హోదాలకి పట్టం కట్టే భారతదేశంలో నిత్య జీవితంలో అవసరమైన నైపుణ్యానికి ప్రాముఖ్యత ఇవ్వం. సంభాషణా నైపుణ్యం మొదలు కలిసి పనిచేసే తత్వం వరకు యువతకి అవసరమైన నైపుణ్యాల సముపార్జనకు అవసరమైన శిక్షణ కళాశాల విద్యలో చేర్చవలసిన అవసరం ఉంది. ఉత్తమ భవిష్యత్‌ పట్ల ఆశ కలిగించే సాహిత్య పరిచయం యువతకి అవసరం.

బహుళ సంస్కృతులు, బహు జాతుల సమాహారమైన భారతదేశ మనుగడకి ప్రజాస్వామ్యయుత పాలన, అన్ని వర్షాల, అన్ని ప్రాంతాల ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా తీసుకునే నిర్ణయాల ఆధారంగా చేసే పరిపాలన ఎంతో అవసరం. నిష్టూరంగా వినిపించినా కొన్ని విషయాలు నిక్కచ్చిగా ప్రస్తావించడం మేధావి వర్గ బాధ్యత. కొన్ని దశాబ్దాల క్రితం వరకూ కుల, మత రహిత, సమ సమాజ స్థాపన మేధావుల ఆశయంగానూ, సామాన్యుల ఆశగానూ ఉండేది. దేశంలో నెలకొని ఉన్న ప్రస్తుత పరిస్థితులు చూస్తే, ఈ ఆశయాలు ఎంతవరకు నెరవేరాయన్న ప్రశ్నకి సమాధానం అంత సులభం కాదేమో. సమాజం కులోపకులాలుగా, వర్గోపవర్గాలుగా, ప్రాంతోపప్రాంతాలుగా చీలి, సమష్టి మేలు కంటే వ్యక్తి మేలుకి ప్రధాన్యతనిచ్చే ఆలోచనలు విస్తరిల్లుతున్నాయి. రాజకీయ నాయకులూ అదే ఆశిస్తున్నారు, ప్రజలూ అదే కోరుకుంటున్నారు అనిపిస్తోంది. కులవ్యవస్థని నిరసించిన కాలం నుంచి, కుల బల ప్రదర్శన స్థాయికి సమాజం పరిణామం చెందిందా? మేధావులు నిష్కర్షగా, నిష్పాక్షికంగా ఆలోచించాలి. ఆరోగ్యకరమైన దేశ ప్రగతికి యువతే భవిత. యువతకి మార్గదర్శనం చేసే బాధ్యత మేధావి వర్గానిదే.

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలోని ఐక్యతని ఆకాంక్షించే మాటలు సమాజాన్ని ఆలోచింపచేస్తాయని ఆశిద్దాం.

“ఎగిరే జండా మన జనని: ఏమంటున్నది మననుగని
పూవుల దీవెనలందిస్తున్నది: తనంత ఎత్తుకు ఎదగమని
గాంధీజీ అందించిన సూత్రం కలిపిన భారతి సంతానం
ఎన్నో జాతుల ఎన్నో రీతులు ఎన్నో రంగుల విరులసరం
విభేదాలతో విడిపోతే ఆ తల్లికి తీరని సంతాపం
కళకళలాడుతూ కలిసుంటేనే కలుగును కళగను సంతోషం
ఆ వెలుగును అందుకొని నీ ప్రగతిని పొందమని”
5/5 - (1 vote)
Prakasika
Author: Prakasika

Related Articles

Latest Articles