శ్రీ గద్దల అనిల్
ప్రవేశిక:
“పిల్లల్లారా పాపల్లారా రేపటి భారతపౌరుల్లారా
పెద్దలకే ఒక దారిని చూపే పిన్నల్లారా పిల్లల్లారా
మీ కన్నుల్లో పున్నమి జాబిలి
ఉన్నాడు, ఉన్నాడు పొంచున్నాడు
మీ మనసుల్లో దేవుడు కొలువై ఉన్నాడు”
దాశరథి కృష్ణమాచార్యులు “పిల్లల్లారా పాపల్లారా” అనే గేయ ఖండికలో పిల్లల గొప్పతనం, వారి కన్నుల్లో దాగి ఉండే పున్నమి జాబిలి, వారి మనస్సుల్లో కొలువై ఉండే దేవుడిని వర్ణిస్తూ, నేటి పిల్లలే రేపటి భారతపౌరులు అనే విషయాన్ని ఆయన నొక్కి వక్కాణించారు. అయితే, తెలుగు సాహిత్యంలో బాల సాహిత్యం ఎప్పటి నుంచి ప్రారంభమైంది?, ప్రాచీన కవులు ఏయే సందర్భాలలో బాలల గురించి ప్రస్తావించారు?, ఆధునిక కవులు బాల సాహిత్యానికి చేసిన కృషి ఏమిటి?, కవి, కథకులు ఎస్.ఎమ్. ప్రాణ్‌రావు రాసిన చెలిమి కథల్లో బాలలకు సంబంధించి ఏయే సామాజిక అంశాలు పేర్కొనబడ్డాయి అనే అంశాలను విశ్లేషించడమే ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశం.
ప్రాచీన తెలుగు సాహిత్యంలో బాలల ప్రస్తావన:
క్రీ.శ. 12వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ కవి పాల్కురికి సోమన కాలం నుంచి తెలుగు సాహిత్యంలో బాల సాహిత్యం ప్రారంభమైందని చెప్పవచ్చు. పాల్కురికి సోమన రాసిన బసవపురాణంలో మొట్టమొదటిసారిగా బాలలకు సంబంధించిన జోల పాటలు, ఆటలు ప్రస్తావించబడ్డాయి. “జోసరచుచు సన్నుతిబాడు” అంటూ పిల్లలను నిద్ర పుచ్చటానికి పాడే జోల పాటను రాశారు. వీటితో పాటు రాగుంజు పోగుంజు లాట, కుందెన గుడి, చప్పట్లు, గుడిగుడి గుంజం గుంజారాగం, సిట్లపొట్లాట, దాగుడుమూతలు వంటి బాలల ఆటలను సోమన తొలిసారిగా సాహితీలోకానికి అందించారు.
ప్రాచీన బాల సాహిత్యం అంత ఆధికంగా గేయ రూపంలో ఉండేదని చెప్పవచ్చు. పాల్కురికి సోమన తర్వాత అనంతామాత్యుడు (భోజరాజీయం), కొరవి గోపరాజు (సింహాసన ద్వాత్రింశిక) మొదలైన కవులు సందర్భానుసారంగా వారి వారి గ్రంథాల్లో బాల సాహిత్యాన్ని ప్రస్తావించారు. ఆ తర్వాత క్రీ.శ. 15వ శబ్దానికి చెందిన పోతన తన భాగవతంలో బాల కృష్ణుని ఆటలను వర్ణిస్తూ, బాలలకు సంబంధించి రాసిన గేయాలు నేటికి ప్రచురంలో ఉన్నాయి. అన్నమయ్య రచించిన “చందమామ రావే జాబిల్లి రావే; జో అచ్యుతానంద జోజో ముకుందా” అనే పాటలు ఇప్పటికీ గ్రామాల్లో, పట్టణాల్లో వినిపిస్తూనే ఉన్నాయి. మొదట్లో బాలల సాహిత్యం ప్రత్యేకంగా లేదు. రాను రాను పెద్దలు రామాయణ, భారత, భాగవతాల్లోని చిన్న చిన్న నీతి కథలను పిల్లలకు అవసరమైన రీతిలో వినిపించేవారు.
బాలల సాహిత్యం - ఆధునిక కవుల కృషి:
ఆధునిక తెలుగు సాహిత్యంలో బాలల సాహిత్యానికి కృషి చేసిన కవుల్లో ముందువరసలో ఉండే కవి గురజాడ అప్పారావు. బాలల కోసం ఆయన కొన్ని ప్రత్యేక గేయాలు రాశారు. ఆ తర్వాత చలం సమకాలినుడైన చింతా దీక్షితులు “లక్క పిడతలు” అనే పేరుతో బాలల కోసం ఓ సంపుటి వెలురించారు. తెలంగాణలో ప్రసిద్ధులైన కవి పండితులు దా. సి.నారాయణ రెడ్డి, దాశరథి కృష్ణమాచార్యులు, పి పి. యశోదారెడ్డి, డా. కపిలవాయి లింగమూర్తి, “గడియారం రామకృష్ణ శర్మ మొదలైనవారు బాలల కోసం అనేక పద్యాలు, గేయాలు, నీతి కథలు, నాటికలను, నవలలు, జీవిత చరిత్రలు రచించి, బాల సాహిత్యానికి ఎనలేని సేవ చేశారు.
ఆచార్య బిరుదురాజు రామరాజు “తెలంగాణ” పిల్లల పాటలు, త్రివేణి పిల్లల పాటల పేర్లతో పుస్తకాలను వెలువరించారు. గడియారం రామకృష్ణశర్మ “వీరగాథలు” అనే బాలవీరుల కథలను, మనింకోడు రామయ్య “తాతయ్య కథలు”, “ఆశాలువ” నవల, దీక్ష, ఆహుతి, పాకాల యశోదారెడ్డి నక్కబావ, బడిపెద్ద, బుచ్చిగాడు వంటి చాలా కథలను రచించి, బాల సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు.
ఎస్.ఎమ్. ప్రాణ్‌రావు పరిచయం:
ఆధునిక తెలుగు సాహిత్యంలో రచయితగా, నవలాకారుడుగా, కథకుడుగా ప్రసిద్ధిగాంచిన కవి ఎస్.ఎమ్.ప్రాణ్‌రావు (సరబాద ముఖ్య ప్రాణ్‌రావు). వీరు తెలంగాణలోని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 1943లో జన్మించారు. తండ్రి రమణారావు, తల్లి పద్మావతి. ఉపాధ్యాయునిగా పని చేస్తూనే ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఆంగ్లసాహిత్యంలో బి.ఏ, ఎం.ఏ. పూర్తి చేశారు. సమాజంలోంచి వైవిధ్యమైన, విశేషమైన ఇతివృత్తాలను ఎన్నుకొని చారిత్రక, సామాజిక అంశాలతో రచనలు కావిస్తున్నారు. వీరు రచనా వ్యాసంగానికి ముందు సినిమా రచయితగా &్ర ప్రసిద్ధులు. ఆంగ్లసాహిత్యంలో విద్యనభ్యసించిన ఎస్.ఎమ్. ప్రాణ్‌రావు ఇప్పటి వరకు మొత్తం 24 రచనలు చేశారు. అందులో ఒక కథా సంపుటి, రెండు కవితా సంపుటాలు, రెండు నాటకాలు, పందొమ్మిది నవలలను వెలువరించారు.
ఎస్.ఎమ్. ప్రాణ్‌రావు చెలిమి కథలు - సామాజిక అంశాలు:
చెలిమి కథలు అనే పుస్తకాన్ని రచయిత ఎస్. ఎమ్. ప్రాణ్‌రావు 1993లో వెలురించారు. ఇందులో పిల్లలు, సమాజంలో జరుగుతున్న సంఘటనలకు సంబంధించి మొత్తం కథలు రాయబడ్డాయి. ప్రాణ్‌రావు వివిధ పత్రికల్లో పని చేసిన సమయంలో రాసిన కథలను చెలమి కథల పేరుతో సంపుటిగా తీసుకొచ్చారు. ఇక ఇందులోని కథలను పరిశీలిస్తే, 1. బేరం 2. దుష్ట్రగహం 3. కుంటికులాసం 4. చదువు 5. ఎలక్షన్ ఆట 6. అమ్మ 7. పుట్టిన రోజు కానుక 8. డిగ్నిటీ 9. నెత్తుటి సూరీడు 10. ముసుగు ఉంగరం వంటి శీర్షికల పేరుతో కథలు రాయబడ్డాయి. ఈ కథల్లో కుంటికులాసం, చదువు, పుట్టిన రోజు కానుక బాలల గురించి ప్రస్తావించబడింది.
1. కుంటి కులాసం:
ఈ కథలో చిన్న పిల్లలలో ఉండే అల్లరి స్వభావం, చిలిపి చేష్టలను కథకుడు చాలా సహజంగా చిత్రించకరించారు. “వేణు, గిరి, శ్యాంబాబు, శేఖర్ అనే నలుగురు మిత్రులు కలిసి ఏడవ తరగతి చదువుతుంటారు. నలుగురూ రోజంతా కలిసి తిరుగుతూనే ఉంటారు. వాళ్ళను తరగతి గదిలో దుష్ట చతుష్టయం పేరుతో విద్యార్థులు పిలిచేవాళ్లు.. నలుగురికీ నాయకుడు శేఖర్. అదే తరగతిలో సాయి రాజ్ అనే అబ్బాయికి పోలియో వల్ల ఒక కాలు చచ్చుపడిపోతుంది. అతనికి శేఖర్ “కుంటి కులాసం” అని పేరు పెడతాడు. ఎక్కడ కనిపించినా అలాగే పిలిచేవాడు. “కుంటి కులాసం – ఇంటికి మోసం” అంటూ పాటలు కూడా పాడేవాడు. ఒక రోజు అనుకోకుండా గోతిలో పడిపోతాడు సాయిరాజ్. అది బాగా లోతుగా ఉన్న గొయ్యి. నీళ్ళు, రాళ్ళు ఉండవు.
కానీ, లోతుగా ఉండడంతో సాయిరాజ్ కాలు బెణుకుతుంది. నిలబడడానికి ప్రయత్నిస్తాడు కానీ సాధ్యం కాదు. పైన నిలబడి చూస్తున్న శేఖరును సాయం చేయమని బతిమాలుతాడు. శేఖర్ మాత్రం గోతిలో ఉన్నది ఎవరు అని అడుగుతాడు. “నేను” అంటాడు సాయిరాజ్.“నేనంటే పేరు లేదా?” అంటాడు. “సాయిరాజ్” అంటాడు. ఆ పేరు నేను వినలేదు అంటాడు శేఖర్. తన తండ్రితోనైనా చెప్పమని సాయిరాజ్ బతిమాలతాడు. ఏమని చెప్పాలి అని అడుగుతాడు. నేను గోతిలో పడ్డానని అంటాడు సాయిరాజ్. మళ్ళీ నేను అంటే ఎవరు అని అడుగుతాడు శేఖర్, అలా చాల సేపు ఇద్దరికీ మధ్య కీచులాట
జరుగుతుంది. చివరికి శేఖర్ వేధింపును తట్టుకోలేక సాయిరాజ్ “నా పేరు కుంటి కులాసం” అని గట్టిగా ఏడుస్తాడు. దాంతో శేఖర్ మనసు కరిగిపోయి, వెంటనే గోతిలోకి దూకి, తన చొక్కాతో సాయిరాజ్ కన్నీళ్ళు తుడుస్తాడు.” ఈ కథ ద్వారా ప్రతి బడిలో దివ్యాంగులను మానసికంగా వేధించే విధానాలను కళ్ళకు కట్టినట్లు చూయించారు రచయిత ప్రాణ్‌రావు.
2. పుట్టినరోజు కానుక
ఈ పుట్టినరోజు కానుక అనే కథలో పిల్లలలో ఉండే అల్లరి, చిన్న చిన్న దొంగతనాలు చెడు అలవాట్లు దారితీసి, ఎంత పెద్ద నష్టాన్ని కలిగిస్తాయో తెలియజేస్తుంది. “రుక్కయ్య ముసలాయన. ఆయన బడి బయట జామకాయలు అమ్ముకొనే వ్యక్తి. బడి గేటు దగ్గరే ఉంటాడు. తన వ్యాపారం సరిగ్గా జరిగినా, జరగకపోయినా రుక్కయ్య సుందర్ సింగ్‌కి ఒక రూపాయి ముట్ట చెప్పాలి. లేదంటే ఇంటర్వెల్ సమయంలో, లంచ్ సమయంలో పిల్లల్ని బయటికి వెళ్ళనివ్వడు. లేదంటే గేటు ఆలస్యంగా తెరిచి, తొందరగా మూసేస్తాడు. దానితో పిల్లలు బయటకు రాలేరు. ఒకరోజు అమర్చిన జామ కాయల బండి దగ్గర పిల్లలు గుమిగూడి ఉంటారు. వారిలో గోపి అనే 12 ఏళ్ల బాలుడు ఉంటాడు. గోపి, సజ్జు మిత్రులు. తోడు దొంగలు కూడా. రుక్కయ్యకు కళ్ళు సరిగా కనిపించవు. అది ఆసరాగా చేసుకొని అతని దగ్గర ఎప్పడూ జామకాయలు కొనరు. చేతికి అందినవి దొంగిలించి తింటూ ఉంటారు. “ఈ మధ్య రుక్కయ్య అదోలా ఉంటున్నాడు జామకాయలు కూడా ఎక్కువ తేవడం లేదు” అని అనుకుంటారు. తరువాత రోజు లంచ్ సమయంలో గేటు బయట ఉండడు. అతని కోసం వెతుక్కున్న గోపి రుక్కయ్య ఎక్కడ అని జానీమియాని
అడుగుతాడు.
“ఇంకేం వస్తాడు. దివాలా తీశాడు. కిరాయి కట్టనందుకు బండి సొంతదారు బండి లాక్కుపోయాడు. అప్పుల వాళ్లు ఇంటి మీద పడి చెంబు, తప్పేలా తీసుకుపోయారు, దాంతో పాపం, రుక్కయ్య వీధిని పడ్డాడు” అంటాడు జానీమియా. నెత్తి మీద ఎవరో సుత్తితో కొట్టినట్లనిస్తుంది గోపికి, “అదేమిటి, రుక్కయ్య దివాలా తీయడమేమిటి! అంతా అతని దగ్గరే కొనేవారుగా’ అంటాడు ఎలాగో గొంతు పెగుల్చుకొని. అంతా కొనేవారు కాదు. కొందరు దొంగతనం కూడా చేసేవారు. రుక్కయ్యకు చూపు సరిగ్గా ఆనేది కాదు. అది అదునుగా తీసుకొని దొంగ వెధవలు రోజూ కాయలు కాజేసే వాళ్లు. దాంతో పాపం రుక్కయ్యకు వ్యాపారంలో పైసా మిగలక పోగా అప్పులు పెరిగిపోయాయి. వడ్డీలు పేరుకుపోయాయి. అందుకే ఏ దిక్కూ లేని రుక్కయ్య నెత్తిన గుడ్డ వేసుకొని పట్నం పోయ్యాడు. సంక్రాంతి సెలవులు ఇస్తారు. గోపి వాళ్ళ మామయ్య ఇంటికి వెళ్తాడు. తన పుట్టిన రోజు కావడంతో గోపి తండ్రి బట్టలు కొనుక్కోవడానికి 250 రూపాయలు పంపుతాడు. వాటికి 50 రూపాయలు జోడించి బట్టలు కొనుక్కోమని ఇస్తాడు. మామయ్య, గోపి ఇద్దరూ కలిసి బట్టలు కొనుక్కోవడానికి వెళ్తారు. బస్ స్టాప్‌లో బస్సు కోసం నిలబడి ఉంటారు.
ఇంతలో గోపి పక్క నుండి ధర్మ చేయండి బాబూ అంటూ ఒక గొంతు వినిపిస్తుంది. ఆ గొంతు ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది గోపికి తిరిగి చూస్తే అడుక్కుంటూ కనిపిస్తాడు రుక్కయ్య. గోపికి కడుపులో తిప్పినట్టు అవుతుంది. చెమటలు పడతాయి. బాధ పడతాడు. తేరుకొని ఒక నిర్ణయానికి వస్తాడు. తన జేబులో నుండి డబ్బులు తీసి, రుక్కయ్య గిన్నెలో వేసేసి వస్తాడు. ఏమైంది అని అడుగుతాడు లాలనగా. కళ్ళ నుండి ధారగా పడుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ పొల్లు పోకుండా అంతా చెబుతాడు. అంతా విన్న సారథికి ఆనందం కలుగుతుంది. గోపి చేసిన పనికి మెచ్చుకుంటాడు.” ఈ కథలో రావుగారి చక్కని సహజత్వం, రచయితగా ఆయనకున్న అనుభవం, చిన్న పిల్లల మనస్తత్వం అర్ధం చేసుకునే నేర్చరితనం కనిపిస్తాయి. కథలో చిన్న చిన్న వ్యాపారుల దైన్యమైన జీవితాన్ని వర్ణించిన విధానం తీరు కరుణ రసాత్మకంగా పాఠకుల హృదయాలను కట్టి పడేస్తుంది.
3. నెత్తుటి సూరీడు
ఈ కథ విషాదాంత కథ. తాగుబోతు తండ్రికి తెలియకుండా రిక్షా తొక్కుతూ సంపాదించుకొనే అబ్బాయి ప్రమాదానికి గురై, ప్రాణాలు కోల్పోయిన ఒక పిల్లవాడి కథ. “యాదయ్యకు 12ఏళ్ళు ఉంటాయి. తండ్రి రిక్షా తొక్కుతూ వచ్చిన డబ్బులను తాగేస్తూ కుటుంబం పట్ల బాధ్యత లేకుండా ప్రవర్తిస్తాడు. పొట్ట చేత పట్టుకొని పట్నం వచ్చిన వారి కుటుంబం ఒక మురికివాడలోని గుడిసెలో కాపురముంటారు. యాదయ్య రిక్షా తొక్కి సంపాదించిన డబ్బులతో తనకు కావలసినవి కొనుక్కొని మిగిలినవి తల్లికి ఇస్తుండేవాడు. ఒకరోజు ఎప్పటిలాగే తండ్రి పడుకున్నాక రిక్షా తీస్తాడు యాదయ్య. పది రూపాయలై సంపాదించాలి.
అయిదు రూపాయిలు వాళ్ళ అమ్మకు ఇచ్చి, మిగలిన 5 రూపాయలతో బొబ్బిలి రాజా సినిమాకి వెళ్ళాలని అతని టార్గెట్. కానీ, ముగ్గురిని ఎక్కించుకొని 6 రూపాయలు సంపాదిస్తాడు. ఇంకా నాలుగు రూపాయలు కావాల్సి ఉండడంతో చివరిగా ఒకరిని ఎక్కింకుంటాడు. ఓవైపు వాళ్ళ నాన్న లేచే సమయం అవుతంది. ఆ హడావుడిలో వెళ్తూ ప్రమాదానికి గురై చనిపోతాడు.” పేదరికం ఒకవైపు, వ్యసన పరుడైన తండ్రి ఒక వైపు కుటుంబాన్ని ఆర్థికంగా క్రుంగదీయడం మన సమాజంలో ప్రతిచోట కనిపించే విషయమే. దానిని కథగా మలిచి, మనసుకు హత్తుకునేలా రాశారు రచయిత ప్రాణ్ రావు. ఇలా సమాజంలో జరుగుతున్న కొన్ని ముఖ్యమైన సంఘటలను తీసుకుని, కథలుగా మలచడంలో ప్రాణ్‌రావు మంచి నేర్చరి.
ముగింపు:
“చెలిమి కథలు” అనే సంపుటిలో ఎస్.ఎమ్. ప్రాణ్‌రావు పిల్లలకు సులభంగా అర్ధ్థయయ్యే భాషలో వారి మనస్తత్వం, స్నేహం, ఉన్నత విలువలతో పాటు సామాజిక అంశాలపై అవగాహన కల్పిస్తూ, చక్కని కథలు రాశారు. ఇలాంటి కథలు, రచనలు నేటి పిల్లలకు సాంఘికంగా, నైతికంగా ఎంతగానో ఉపయోగపడతాయని అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. నేడు బాలల వ్యక్తిత్వ వికాసానికి అవసరమయ్యే మరింత సాహిత్యం రావాల్సిన అవసరమైన ఎంతైనా ఉంది. కథలు, గేయాలు, కవితలు, వ్యాసాలు, కార్టూన్లు ఇలా ఏ రూపంలో వచ్చినా సరే, బాల సాహిత్యాన్ని సుసంపన్నం చేయాల్సిన బాధ్యత కవులు, రచయితలపై ఉంది. పిల్లల శ్రేయస్సు కోరి ఎన్ని మంచి పుస్తకాలు వచ్చినా – మానవత్వం, పరోపకారం, పెద్దలను గౌరవించడం వంటి విషయాలు చెబుతూనే మిగతావాటిపైనా వారి అవగాహనకు తగిన రీతిలో చెప్పాలి. అప్పుడే సమాజానికి మంచి బాల సాహిత్యం ఇచ్చినట్ల వుతుంది.
ఆధార గ్రంధాలు:
- తెలుగు బాల గేయ సాహిత్యం – డా.యం.కె.దేవకి
- తెలుగు సాహిత్య సమీక్ష (రెండవ సంపుటం) – డాక్టర్. జి. నాగయ్య
- తెలుగు సాహిత్య చరిత్ర – ద్వా.నా. శాస్త్రి
- చెలిమి కథలు – ఎస్.ఎమ్.ప్రాణ్ రావు