శ్రీ ఎ.రజాహుస్సేన్
కళాప్రపూర్ణ బళ్ళారి టి.రాఘవ గారి సుదీర్ష ఉపన్యాసం. ..!! గురజాడ వారు ఏ ముహూర్తాన కన్యాశుల్కం నాటకం రాశారో గానీ…నాటికీ నేటికీ అదో దృశ్యకావ్యంగా మిగిలిపోయింది. ఆ నాటకంలోని మొదటి రంగంలో “గిరీశం” ఇలా అంటాడు.
“డామిట్…ఇలాంటి మాటలంటే నాకు కోపం వస్తుంది… పూనా డెక్కన్ కాలేజీలో నేను చదువుకుంటున్నప్పుడు … “ది ఇలెవన్ కాజెస్ ఫర్ ది డిజనరేషన్ ఆఫ్ ఇండియా” (The eleven causes for the degeneration of India) ను గూర్చి మూడు గంటలు ఒక్క బిగిని లెక్చర్ ఇచ్చేసరికి ప్రొఫెసర్లు డంగయిపోయినారు! మొన్న బెంగాళీవాడు ఈ పూర్త్లో లెక్చర్ ఇచ్చినపుడు ఒక్కడికైనా నోరు పెగిలిందీ? మనవాళ్ళు వుట్టి వెధవాయ్‌లోయ్”.
ఇలా గిరీశం భారతదేశం పతనానికి పదకొండు కారణాలున్నాయని ఓ స్టేట్ మెంట్ అయితే ఇచ్చాడు కానీ..! నాటకంలో ఎక్కడా అవేమిటో చెప్పలేదు. వాటిని మీరే ఆలోచించుకోండని పాఠకుల మీదే వదిలేశాడు. ఆ రోజుల్లో గిరీశం స్టేట్ మెంట్ లోని పదకొండు కారణాల్ని గురించి ఎవరూ అంతగా పట్టించుకోలేదు కానీ_సర్ కట్టమంచి రామలింగారెడ్డి గారు మాత్రం తీవ్రంగా ఆలోచించడం మొదలెట్టారు. మామూలుగా అయితే గిరీశం లాంటి భ్రష్టుడి నోట వచ్చిన ఈ మాటలకు అంతగా ప్రాథాన్యమీయాల్సిన పనిలేదు. కానీ ఇది గురజాడ వారి నాటకం కాబట్టి బుర్రకు పనిపెట్టక తప్పింది కాదు.
సర్ కట్టమంచి రామలింగారెడ్డి గారు ఆరోజుల్లో(1933) ఆంధ్ర విశ్వకళాపరిషత్ విసి గా వున్నారు! ఆంధ్రావిశ్వ కళాపరిషత్ దేశంలోని అన్ని యూనివర్సిటీల కంటే వున్నతంగా తీర్చిదిద్దాలని ఆయన వివిధ విజ్ఞాన శాఖలకు సంబంధించిన అంశాలపై నిష్టాతులచే ఎక్స్ టెనన్షన్ లెక్చరర్స్. ఇప్పించే వారు. ఇందులో భాగంగానే “భారతదేశం పతనానికి పదకొండు కారణాలు” అనే అంశంపై రాజమహేంద్రి ట్రెయినింగ్ కాలేజీలో ఉపన్యాసం ఏర్పాటు చేయించారు. అయితే ఎవరిచేత ఈ ఉపన్యాసం ఇప్పించాలన్న విషయమై తర్జనభర్జన జరిగాక,చివరకు బళ్ళారి రాఘవ గారి పేరును ప్రతిపాదించారు. రాఘవ గారు షేక్స్పియర్, బెర్నార్డ్ షా తదితర నాటకాల్ని అథ్యయనం చేశారు. ఆంగ్ల సాహిత్యంపై రాఘవ గారికి గట్టి పట్టుంది. అదీగాక ఆయన జాతీయ న్యాయ శాస్త్రాల్లో నిష్ణాతులు. గొప్ప వక్త.
ఇంకేముంది ప్రసంగించాల్సిన రోజు రానే వచ్చింది. గిరీశం సూత్రీకరణపై విరామం లేకుండా ఆరు గంటలపాటు సుదీర్ధంగా ఆంగ్లంలో ఉపన్యసించారు. దురదృష్టమేమంటే అసమర్థ పాలకుల వల్ల రాఘవగారి ప్రసంగం వెలుగులోకి రాకుండా చీకట్లోకి నెట్టివేయబడింది. కాలం దొర్లిపోయింది. జనమంచి కామేశ్వరరావు గారి దృష్టి ఈ ప్రసంగపాఠంపై పడింది. యూనివర్సిటీ ముద్రణలన్నీ తిరగేశారు. ఎక్కడా దాఖలాలు దొరకలేదు. చివరకు పాతకాగితాల కట్టల్లో 1935,ఆగస్టు 19వ తేదీ నాటి హిందూ పత్రికలో నాటి రాఘవగారి ప్రసంగం కనబడింది. తీగ దొరికింది. ఇక డొంకను కదిల్చారు.
ట్రెయినింగ్ కాలేజ్లో అదే సంవత్సరం ప్రచురించిన గెజిట్ దొరికింది… నెం..1779. ఎడ్యుకేషన్31ఆగస్టు వారి మానస పుత్రుడిగా అభివర్ణించారు. రాఘవ గారి దృష్టిలోగిరీశం చుట్టకాలుస్తూ తిరిగే పోరంబోకు కాదు. చెతి బెత్తం తిప్పుకుంటూ క్షణానికో రంగూ, స్వభావంతోతుంటరి సాహసాలు ప్రదర్శించే దుష్ట చింతన గల వాడు అంతకంటే కాదు. బాధ్యతారహిత ఆంధ్ర యువజన హృదయానికి గిరీశం ప్రతినిథి.
భారతదేశ పతనానికి అతను పేర్కొన్నానని చెప్పిన కారణాలు కాల్పనికం ఎంత మాత్రం కాదంటారు బళ్ళారి రాఘవ. గిరీశం చెప్పిన పదకొండు కారణాలూ భారతదేశ పతనానికి మౌలిక కారణాలు, బాధాకర వాస్తవాలేనన్నది రాఘవగారి నిశ్చితాభిప్రాయం.
“మనమంతా గిరీశాన్ని ప్రేమిస్తాం.బహుశా అతని బలహీనతలే మనకు ఆకర్షణలేమో ?” అంటారు రాఘవ.
“పూనా కాలేజీలో తాను లెక్చరిచ్చినట్లు గిరీశం చెప్పుకున్నాడు. వెంటనే మన మనస్సున ఒక సంచలనాత్మక తరంగం తీవ్రంగా తాకుతుంది. మహనీయుడు లోకమాన్య బాలగంగాధర తిలక్ ఉద్యమించిన పవిత్ర స్మృతులు మన హృదయాలలో చెలరేగుతాయి. ఆ మానసిక స్థితిలో గిరీశం బహుశా భారతదేశ పతనానికి పదకొండు కారణాలు నిరూపిస్తూ ఉపన్యాసం చేశాడేమో అన్న విశ్వాసం మనకు కలుగుతుంది. గిరీశం వివరించిన పదకొండు కారణాలూ దైనందిన జీవితంలో సామాన్యులందరికీ ద్యోతకమయ్యే కల్పనా సత్యాలే. వాటి వల్లనే సమాజం పతనం కావడం సత్యమేనని వారంతా భావించి వుంటారు. సామాజిక జీవితంలో ఆ వినాశం స్పష్టమయ్యే రీతిలో గిరీశం విశ్వసనీయంగా చెప్పివుంటాడనే మనం భావిద్దాం” అంటారు రాఘవ.
గిరీశం చెప్పి వుంటాడని రాఘవ గారు ఊహించిన 11 కారణాలు….!!
*1. సమాజ శ్రేయస్సుకు ఉత్తమ విద్యావిధానం…!!
కన్యాశుల్కం నాటకం మొదటి దృశ్యంలోనే భారతదేశ పతనానికి గల 11 కారణాల్ని గిరీశం తన శిష్యుడికి బోధిస్తాడు. అందులో ఒకటి విద్యావిధానం పతనం గురించి చెబుతూ… సమాజశ్రేయస్సుకు ఉత్తమ విద్యా విధానం ఎలా వుండాలో చెబుతాడు. నిజమైన విద్యావిధానానికి కొన్ని ప్రాథమిక సూత్రాలుండాలి; పుస్తకాలపై ఆధారపడే చదువే కొనసాగకూడదు. నిజమైన చదువు గురువుతో శిష్యుడికి ఏర్పడే ప్రగాఢ అనుబంధం ద్వారానే లభిస్తుంది. మన ప్రాచీనుల ఆర్య విద్యావిధానం అదే. గిరీశం మాస్టర్ల అవకతవకలు పేర్కొంటాడు. వాటి వల్లనే విద్యార్థి పాసవడానికో, లేక ఫెయిల్ అవడానికో కృతక విలువలు కల్పించబడతాయి. బ్రతుకులో ఓటమి వైపుకు తరుముతాయి. గిరీశం వెంకటేశాన్ని “మీ మాష్టర్లకి నీకున్న లాంగ్వేజీ వుందా? అనడుగుతాడు.వ్యక్తీకరణే సముచిత రీతిలో సాగించలేని ఉపాధ్యాయుడు విద్యార్థికి వినూత్న శక్తినందించలేడు.
*2. రుణదాతల నుంచి పలాయనం…!!
మొదటి రంగం, మొదటి స్థలంలోనే గిరీశం తన తెలివితేటలకు మురిసిపోతాడు. తన సౌఖ్యాల కోసం, ఆనందం కోసం ఇతరులడబ్బును ఎంత చాకచక్యంగా వాడుకుంటాడో వివరిస్తాడు! గిరీశం ఇతరుల డబ్బును సంగ్రహించి భద్రంగా జేబులో దాచుకుంటాడు. గిరీశం కూడా ఇక్కడ ఓ మాటంటాడు- “ఎటు చూసినా బాకీలే” అని. డబ్బు దుబారా చేయడమే అతని రుణగ్రస్త జీవితానికి ప్రధాన కారణం. ఇది ఇప్పటి పరిస్థితులకు కూడా సరిపోతుంది. బ్యాంకులనుంచి వేలకోట్ల రూపాయలు రుణం తీసుకుని ఎగ్గొట్టిన సంఘటనలు కోకొల్లలు. అంటే మన గిరీశం ఈ పరిస్థితిని ముందే ఊహించాడన్న మాట.
*3. ఆకాశ సౌధాలను తాకట్టు పెట్టగల చాకచక్యం…!!
ఆడంబరాలకు, ఫాల్స్ ప్రిస్టేజకుపోయి దుబారా చేస్తాం. ఈ పెళ్ళిళ్ళ పేరు మీద ధారపోసే నెయ్యి ఖర్చు కోసం ఇళ్ళూ వాకిళ్ళూ అమ్మనైనా అమ్మాలి, తనఖాకైనా కుదువ పెట్టాలి. అలాగే ఆడపిల్లలకి, మగపిల్లలకి స్కూలు, కాలేజీవచదువుల మీద పెట్టే దుబారాకైతే అంతే వుండదు. మన జీవన దృక్పథంలో ఏర్పడిన కుహనా వైభవాల వల్ల మన వ్యయాలు మితిమీరుతున్నాయి. సాంప్రదాయ భీరువులమై ఆచారాలకు దాసులమై మనం వివాహాది శుభకార్యాల ఖర్చులు తగ్గించుకోలేక పోతున్నాం. అప్పు పుచ్చుకోవడం అనేప్రక్రియలోనే స్వనాశనానికి బీజాలు పడతాయి. ఆత్మ గౌరవమూ కుదువపెట్టబడుతుంది.
ఈళసత్యాన్ని మన జాతి గుర్తించడం లేదు.
*4. ఇతరుల సొమ్ము వ్యర్థం చేయడం…!!
ఒకడు తన డబ్బును తాను వ్యర్థం చేసుకోవడం ప్రారంభిస్తే ఇతరుల ధనాన్ని వ్యర్థం చేయడానికి వెనుకాడడు.అప్పుడు వాడు సమాజానికి శత్రువుగా పరిణమిస్తాడు.మూఢ విశ్వాసాలు ,అర్ధం లేని సాంప్రదాయాలు ..ఇవే మన దురదృష్టకర జీవన స్థితికి కారణాలు.
*5 ముఫ్ఫైై మూడు కోట్ల దేవతలు…!!
భారతీయులను సంరక్షించడానికి 33 కోట్ల దేవతలు సిద్ధంగా వున్నారు. సగటు మధ్యతరగతి వ్యక్తిని దోషిగా మారుస్తున్నారు కాలాన్ని వ్యర్థం చేయడానికి ఎన్నో మార్గాలు.మానవ జీవితంలోని మధురమైన కాలమంతా స్కూళ్ళకీ, కాలేజీలకీ బలైపోతోంది. ధనాన్ని వ్యర్థం చేయడం, కాలాన్ని వ్యర్థం చేయడం,శారీరక శక్తుల్ని హీనపరుచుకోవడం.. ఇవే మనం సాధిస్తున్న విజయాలు. బాధలకు లోనయ్యే అమాయకులని దేవుడు ప్రేమిస్తాడన్నది. మన పూర్వీకుల నమ్మకం.మనిషికి ప్రజ్ఞ వుంది. శక్తులున్నాయి.కానీ ఏం లాభం? ఉదాత్త శక్తులన్నీ నిరుపయోగమవుతున్నాయి.
*6. మేధాదర్శనంపై పొర కమ్ముతోంది…!!
మన మేధాశక్తిపై పొర కమ్ముతోంది.ఆదినుంచి మనం స్వయంగా ఆలోచించకుండా మనం కట్టడి చేయబడ్డాం.పసితనంలోనేమన సహజాతాలు ప్రతిభలూ నలిపివేయబడ్డాయి.మన పరిశీలనా శక్తి చిదిమివేయబడింది. అందువల్లనే తొందర తొందరగా నిర్ణయాలు తీసుకుంటాం. సత్యా సత్యాలను ధృవపరుచుకోకుండానే అభిప్రాయాలు వెల్లడి చేస్తాం. వీటి దుష్ఫలితాలు జీవితం మీద స్పష్టంగా కనిపిస్తూనే వున్నాయి.
*7. కళ సృజనను సౌందర్యవంతం చేస్తుంది…!!
సహజాత కళల్ని మనిషిళ సాధనాభ్యాసాల వల్లనే అభివృద్ధి చేసుకోగలడు. కానీ చాలామందికి తమలో శక్తులున్నాయని తెలీదు. తెలుసుకోకుండానే వాళ్ళ బతుకులు వ్యర్థమై పోతాయి. క్షేత్ర మంటే ఏమిటి? బహుశా గిరీశం ఏమాలోచించి వుంటాడు. అభివృద్ధిని ఉపేక్షించడమే అంతరిక క్లేశమనుకొని వుంటాడు. మనం నేర్చుకుంటున్న విద్యల సారాంశం మనలో నిద్రాణంగా వున్న కళాభినివేశాన్ని ఆవిష్కరించేందుకు దోహదం చేయడం లేదు.
*8. ఉన్నత లోకాల కోసం…!!
సాధారణంగా భారతీయులు ఆత్మస్తుతి కి అలవాటుపడ్డవాళ్ళు. తాము గొప్ప దానగుణం కలవారమని చెప్పుకుంటారు! వీథిలో తిరిగే భిక్షకులందరికీ తమ గృహ ముఖద్వారాలు ఎల్లప్పుడూ తెరిచే వుంటాయని గొప్పలు చెప్పుకుంటూ వుంటారు! బాధితులను, దరిద్రులను కాపాడేందుకు తామెల్లప్పుడూ సంసిద్ధంగా వుంటామని చెప్పుకుంటారు. కానీ మన దేశమంతా వెదికి చూసినా దీనుల్ని ఆదుకునే సంస్థ ఒక్కటీ కనిపించదు. నిజానికి నిరాటంకంగా జరుగుతున్న వ్యర్థత భారతదేశం సంస్కృతి పతనం కావడానికి ఒక ప్రధాన కారణం. ఆలోచనా శక్తిని వ్యర్థం చేసుకోవడం, వివేచనా శక్తిని కోల్పోవడం మన నిత్య జీవితంలో ఆవేశాన్ని వ్యర్ధం చేసుకోవడం గురించి కూడా గిరీశం ఆలోచించి వుంటాడు. భారతదేశ పతనానికి ఇది కూడా ఓ కారణమే.
*9. గుణకారాలు తప్ప మరేమీ లేదు…!!
మన సమష్టి కుటుంబాలలో కుటుంబ పెద్ద సంపాదించి పెట్టడం మిగతా సభ్యులంతా తినడంగా తయారైంది. పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కనడం… తద్వారా కుటుంబ సంఖ్య గుణకారమవుతుంది. సమపష్షి కుటుంబాలలో ప్రధాన వ్యక్తి వెళ్ళిపోవడం తటస్థిస్తే, ఆయన భార్య వితంతువై, మిగతా వాళ్ళ దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తోంది.! మన వ్యవస్థలో మార్పు రాగానే సమష్టి వ్యవస్థకు కాలదోషం పట్టింది. ఈ విషయాన్ని మనం అంగీకరించలేక పోతున్నాం. సోదర మానవాళిపై మనకెన్నడూ దయాదాక్షిణ్యాలు లేవని, జాతీయాభిమానం అన్నది శూన్యం. ఒంటిపిల్లి రాకాసితనం ఎలా ప్రవేసించిందో
మరి ! నిజంగా ఇది జీవన వ్యర్థతకు దారితీస్తోంది.
ఇలాంటి సంకుచిత విధానాలను పరిశీలించే గిరీశం మనదేశ పతనానికి పదకొండు కారణాల్ని ఊహించి వుంటాడు. పూటకూళ్ళమ్మ వృత్తి డబ్బులు పుచ్చుకొని అన్నం పెట్టడమే. గిరీశం ఆమెను ఆశ్రయించి తిండి తింటున్నాడు. కానీ డబ్బులివ్వడం లేదు మధురవాణి జీవితం స్పష్టంగా వెల్లడి అవుతున్నదే. ఒక్క బుఛ్చమ్మ విషయంలోనే గిరీశం ఆవేశాలు కొంత గుప్తమయ్యాయి! హృదయాన్ని రక్షించి, తద్వారా సంఘసంస్కరణోద్యమాన్ని పటిష్టం చేయడం గిరీశం ఆదర్భాలలో ఒకటి. మానవులు శక్తిని వ్యర్థం చేయడం ద్వారా ఆవేశాలకు ఫలితార్థం సాధించడం గిరీశానికి ఇష్టం లేదు.
*10. పాటకంటే శృతి పెద్దది…!!
గిరీశం దేశంలో యవ్వన శక్తి వ్యర్థమైపోతోందని సుదీర్థ ఉపన్యాసమిచ్చాడు. రక్త మాంసాలు వృథా వృథా అవుతున్నాయి. కానీ అభివృద్ధి మాత్రం పిసరంత కూడా కనిపించదు. ఇవన్నీ భారతదేశ ననాశనోన్ముఖతకు దారితీస్తున్నాయి.“వ్యర్థతను అరికట్టు, ఉన్నదాన్ని లాభదాయకంగా వుపయోగించు,” అన్న సూత్రాన్ని అందరూ మరచి పోతున్నారు. సగటుభారతీయుని వివాహం 14..16 సంవత్సరాల మధ్యే జరిగిపోతోంది. 20యేళ్ళలోపు పిల్లలు పుడుతున్నారు. 32..34 యేండ్లు వచ్చేసరికి ముసలోళ్ళె పోతున్నారు. 4 లేక 5 ఏళ్ళ వ్యవధి మాత్రమే మన జాతికి యవ్వన స్థితిగా పరిగణించబడుతోంది.
*11. ఇహలోకానికి, పరలోకానికీ మధ్య గోడ లేదు…!!
పూనా ఉపన్యాసంలో గిరీశం చెప్పుకున్న అంశాల్లో…
- ధనవ్యయం
- కాలం వ్యర్థం చేయడం
- కళాప్రజ్ఞలను వ్యర్ధం చేయడం
- మేధాశక్తి సంపదను వ్యర్ధం చేయడం
- ఆవేశాలను దుబారా చేయడం
- అపాత్రదానం ద్వారా వితరణ గుణం నిరుపయోగం కావడం
- యువశక్తుల అస్తిత్వాన్ని వ్యర్థం చేయడం
- ఉచ్చ్వాస నిశ్వాసాలని వ్యర్థపరచడం
- సార్వత్రికంగా భౌతిక శక్తులను నిరుప యోగ పరచడం
గిరీశం నమ్మిన ప్రధానకారణాల్ని సంశయించాల్సిన పనిలేదు. మన విశాల జీవన వ్యవస్థలోనే ఘోరమైన వ్యర్థత అసహజంగా దురాక్రమించి వుంది. గిరీశం మాటల్లో చెప్పాలంటే ఈ ప్రపంచం ఏర్పడ్డది మనిషికి సుఖాలను అంssదించడం కోసమే. దానిని అనుభవించిన వాడికే హక్కు ఏర్పడుతుంది. పరలోకంలో కూడా అంతే. ఈ జీవిత దృక్పథం సంసారానికి స్వాగతం పలుకుతుంది. అంతే తప్ప దుఃఖసాగరమనుకొని నిరసించదు!
పై కారణాల వల్ల భారతదేశం పతనమవుతోందని గిరీశం చెప్పివుండొచ్చన్నది బళ్ళారి రాఘవ గారి అభిప్రాయం. ఆయన దృష్టిలో గిరీశం నాటక పరిసమాప్తిలో గొప్ప ఆత్మత్యాగాన్ని ప్రదర్శించాడు. మహోన్నతమైన సౌజన్యారావు పంతులు గారి మానసిక బలహీనత ఏదో కనిపెట్టి దానిపైనే విజయం సాధించాడు. కన్యాశుల్కాన్ని ఇంతగా మధించిన వారిలో రాఘవ ముందుంటారు. గిరీశం ఇచ్చిన ఉపన్యాస సారాంశాన్ని రాఘవ ఇలా తనదైన శైలిలో ఆరుగంటలపాటు అనర్హళంగా ఉపన్యసించి ప్రశంసలు పొందారు. విచిత్రమేమంటే __ “కన్యాశుల్కం నూరేళ్ళ సమాలోచనం” పేరుతో వేసిన 923 పేజీల బృహత్సుస్తకంలో రాఘవ గారి ప్రసంగ పాఠం లేదు. ఇది గిరీశానికి తీరని లోటే.!!