9.8 C
New York
Monday, November 25, 2024

రాయలసీమ గ్రామీణ జీవిత ప్రతిబింబం – కూలిన బురుజు

డా. కె. నాగేశ్వరాచారి

జీవితంలో ఒడిదుడుకులు జాస్తిగా ఉన్నప్పుడే మంచి కథా సాహిత్యం వస్తుందన్న సిద్ధాంతం ఒకటి వున్నది. నిజం కూడా కావచ్చు – కొ.కు.

ఈ మాటను నిజం చేసినవారు “కూలిన బురుజు” కథతో కేతు విశ్వనాథరెడ్డి. ఈ ఒక్క కథతోనే అన్ని కథల్ని అంచనా వేయాలి.

ఈ కథ 1988 మార్చి 28న ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో మొదటిసారిగా వెలువడింది. కథా రచనాకాలం నాటికి ముఖ్యంగా రాయలసీమ జిల్లా ముఠా కక్షలతో రావణకాష్టంగా రగులుతున్న కాలం. దీనికి తోడు నిరంతరం కరువు కాటకాలు. అదనంగా పాలెగాళ్ళ సంస్కృతి దీనికి తోడై రాయలసీమ సమాజంపై ముప్పేట దాడిగా కొనసాగుతూ వుంది. ఈ నేపథ్యంలో వచ్చిన కథ కూలిన బురుజు.

కథకుడిగా చేయి తిరిగిన రచయిత కేతు విశ్వనాథరెడ్డి. రాయలసీమ సమాజాన్ని పాఠకలోకానికి పరిచయం చేసినవారు. పైగా అరసం కార్యకర్త, సాహిత్యోధ్యమకారుడు. తనకంటూ ఒక సామాజిక దృక్పథాన్ని ఏర్పరచుకున్నవారు. కేవలం రచయితేగాక విమర్శకులు కూడా. కథా మర్యాదను పాటిస్తూ, రచయితగా సామాజిక బాధ్యతను గుర్తించుకొని రచనలు కొనసాగిస్తున్నవారు కేతు విశ్వనాథరెడ్డి.

ముఠా కక్షల నేపథ్యంలో కూలిన బురుజు కథ కొనసాగింది. కథ ఉత్తమ పురుషలో నడిచింది. తన బావ ముఠా కక్షల్లో భాగంగా హతుడు. తాను కథకుడు – తిరుపతిలో ఉద్యోగస్తుడు, వైద్యుడు. తన అక్క లక్ష్మక్కను పరామర్శించడానికి వాళ్ళ గ్రామానికి వెళతాడు. ఒక్కరోజు జరిగిన కథ ఇది. గ్రామ పొలిమేరల నుంచే కథకుడికి శ్మశాన శాంతి కనిపిస్తుంది. గ్రామంలో కూడా అదే స్థితి. కథకుడికి ఉద్యోగం రాకముందు తండ్రి తెచ్చే పెళ్ళి సంబంధాలు ఇష్టం లేక తప్పించుకోవడానికి అక్క బావ ఊర్లోనే ఆరు సంవత్సరాలు గడిపాడు. గ్రామస్తులంతా పరిచయస్తులే. గ్రామంలో పాత కూలిన బురుజు చుట్టూ వుండే మనుషులెవరూ కనిపించరు. ఒక ముసలాయన వాకబు చేస్తే సీతమ్మ ఇంటికి వచ్చానని చెప్పి ఇంటికి చేరుకుంటాడు. ఇంటి ముందు వాళ్ళ పెదనాన్న, ఇద్దరు యువకులు కనిపిస్తారు. ఇంట్లోకి వెళ్ళిన తరువాత సీతమ్మను ఓదారుస్తూ లక్ష్మక్క దగ్గరకు వెళ్ళి పరామర్శిస్తాడు. రాత్రికి భోంచేసి ఇంట్లో కాకుండా బయట మంచంపై పడుకుంటాడు. రాత్రి పోలీసులు వచ్చి ఇల్లు సోదా చేసి కథకుణ్ణి, అతని బావ బంధువుల్ని పోలీసు స్టేషనుకు ఎస్‌.ఐ. తరలిస్తాడు. అక్కడ కథకుడి మిత్రడు జయరాం ఇటువంటి కేసులోనే పోలీసు స్టేషనులో వుంటాడు. జయరాం విషయం తెలిసిన తరువాత ఉదయం ఆ ముగ్గుర్ని ఎస్‌.ఐ. మీ ఊర్లకు వెళ్ళిపొమ్మని పంపిస్తాడు. కథకుడిని పెదనాన్న కథకుడి సూట్‌ కేసు స్టేషన్‌ వరకూ వచ్చి ఇచ్చి సాగనంపుతాడు. కక్షలకు కారణాలు వెదదకాలని అఅయరాం సంభాషణల్లో వ్యక్తమవుతుంది. ఇదీ సంక్షిప్తంగా కథ.

ఈ కథ వల్ల అర్థమయ్యే అంశాల్ని ఇలా వివరించుకోవచ్చును. కక్షల వల్ల గ్రామంలో శ్మశాన శాంతి నెలకొనడం, ప్రతి వ్యక్తిని అనుమానించడం, కుటుంబాలు విచ్చిన్నం కావడం, మొత్తంగా ధ్వంసమౌతున్న సమాజం. ఈ అన్నిటికి కారణం ప్రభుత్వ వైఫల్యాలు, అలసత్వం వంటి అంశాలు కనిపిస్తాయి.

కథా రచనాకాలం నాటికి రాయలసీమ ముఠా కక్షలతో అట్టుడుకుతున్న సమాజం కనిపిస్తుంది. తుపాకులతో ప్రయివేటు సైన్యాలు కవాతు సీమలో కనిపిస్తుంది. చేతి బాంబుల తయారీ కుటీర పరిశ్రమగా మారిపోయింది. అధికార పార్టీ ఏదో ఒక పక్షానికి అండగా వుంటుంది. ప్రతి పక్షం మరో పక్షానికి అండగా వుంటుంది. వీరిద్దరి మధ్య సామాన్య జనం నలిగిపోతూ వుంది. ఈ స్థితి పర్యావసానాలు కథలో చూడగలం. ఈ స్థితికి కారణాలు రెండు. ఒకటీ వర్షాభావం వల్ల కరువు, ప్రత్యామ్నాయ నీట వనరుల లేమి; రెండు ప్రభుత్వ విధానాల వల్ల సారా వ్యాపారం విస్తరించడం; సమాంతరంగా ప్రయివేటు కాపుసారా అమ్మకాలు; ఈ పోటీ హత్యల వరకు దారి తీసింది.

పందొమ్మిది వందల డెభ్ఫెయవ దశకంలో ప్రారంభమైన ఈ పరస్పర హననోద్యోగం దాదాపీ దశాబ్దం కాలం స్వైరవిహారం చేసింది. రాయలసీమలోని కమ్యూనిస్టు యం, ఎల్‌ పార్టీలు ముఠా కక్షలకు వ్యతిరేకంగా ఉద్యమం లేవదీసింది. లైసెన్స్‌ ఉన్న తుపాకీ ఒకటి వుంటే లైసెన్స్‌ లేని తుపాకాలు పది వుంటాయి. నాటు బాంబుల తయారీ సరేసరి ! బాంబులు చుట్టే సమయంలో పేలి చనిపోయినవారు, అంగవైకల్యం చెందినవారు, ముఠా కక్షల్లో హతులైన సామాన్య వ్యక్తులు, అనాథలైన పిల్లలతో సీమ సమాజం అట్టుడికిపోయింది. ఈ నేపథ్యంలో చాలా కథా, నవలా, కవిత్వం వెలువడింది. పౌరహక్కుల సంఘం వారు ఆయా జిల్లాలలోని ఫ్యాక్షనిస్టులుగా పేరుపడినవారిని ఇంటర్వ్యూలు చేసి “కరువు జిల్లాల్లో పాలెగాళ్ళు” అన్న డాక్యుమెంట్‌ లాంటి పుస్తకం వెలువరించారు. రాయలసీమలోని ముఠా కక్షల మూలాల్ని ఈ పుస్తకం వెలికితీసింది. ఇక్కడి రాజకీయ నాయకుల గురించి బాలగోపాల్‌ ఒక కామెంట్‌ చేశాడు, “ఇక్కడి రాజకీయ నాయకులు పార్లమెంటరీ విధానానికి ఒక మెట్టు కింద, పాలెగాళ్ళ విధానానికి ఒక మెట్టు పైన వున్నారు” అని నాయకుల స్వభావాన్ని వివరించారు.

రాయలసీమలో కక్షలకు దారితీసిన పై వివరించిన పరిణామ క్రమాన్ని కథలో కథకుడి పెదనాన్న వివరించి వున్నాడు. కథాధర్మాన్ని పాటిస్తూ రచయిత అతి సంక్షిప్తంగా కక్షలకు దారితీసిన పరిస్థితిని కథకుడి పెదనాన్నతో చెప్పించాడు. అదే శిల్ప విధానం కూడా !

కక్షల విషవలయం కథలో చిత్రితమైంది. ఈ విషవలయాన్ని చెప్పకపోతే పాఠకుడికి కక్షల తీవ్రత అర్ధం కాదు. రచయిత ఆశించిన ప్రయోజనం నెరవేరదు. కథలో పదమూడు సంవత్సరాల వాసు అనే పిల్లవాడున్నాడు. గ్రామంలో ఎదుటి పక్షం వాళ్ళ ఎత్తుగడలు తెలుసుకొని ఇంట్లో వివరిస్తాడు. పొరుగూరు నుంచి పై మనుషులు వచ్చినారని, రాత్రికి తమ ఇంటిపై పోలీసులు సోదాలు చేస్తారని వాసు వివరిస్తాడు. ఈ సందర్భంలో కథకుడు వాసును గురించి “ఏ గూటి చిలక ఆ పాటే పాడుతుంది” అని అంటాడు. ఈ మాట వెనుక ముఠా కక్షల కొనసాగింపు సంస్కృతి వ్యక్తమవుతుంది. లేకపోతే పదమూడేళ్ళ పిల్లవాడు ఎదుటి పక్షం ఎత్తుగడల్ని ఎలా తెలుసుకోగలిగాడు? వైద్యుడైన కథకునికి వున్న భయం వాసుకు ఎందుకు లేకపోయింది? కథకుడు ఆ గూటి పక్షి కాదు గనక, వాసు ఆ గూటి చిలకే గనక.

ఈ ముఠా కక్షలకు ఆజ్యం పోస్తున్నది రాజకీయ పార్టీలేనని “పెదనాయిన” మాటల వల్ల తెలుస్తుంది. సామాజిక సంక్షేమానికి పూచీ పడి రాజ్యాంగబద్ధంగా నమోదైన “రాజకీయ పార్టీ ఏ విలువలతో ఎన్నికై ఎటువంటి పాలన కొనసాగిస్తుందో పాఠకుడు ఈ కథ ద్వారా గమనించాలి. మొత్తం సామాజిక సంక్షేమాన్ని గాలికొదిలేసి తమ గుంపు క్షేమమే సమాజిక క్షేమమని, అదే అధికారమని, ప్రజాస్వామ్యమని ముఠా కక్షలు చెబుతాయి. ఈ అనైతికతను పాఠకుడు గమనించాలి.

స్త్రీలు సంసారపక్షంగా ఆలోచిస్తారని, మృదుస్వభావులని అనుకుంటాం. కానీ కథలోని లక్ష్మక్క పాత్ర అలా కాదు. లక్ష్మక్క “మీ బావను చంపినోడు కుక్క చావు చచ్చేదాకా ఈ గాజులు పగులగొట్టుకోను; ఈ బొట్టు చెరుపుకోను అన్నానురా ! చదువుకున్నోడివి చెప్పు ఇది తప్పంటావా ?” అని అంటుంది.

నిజానికి తన భర్తను హత్య చేసిన వాళ్ళు పదివేల రూపాయలు తీసుకుని హత్య చేశారు. తన భర్తపై వ్యక్తిగత కక్షలు, సారా వ్యాపారంలోగాని, రాజకీయ తగాదాలు గాని లేవు. కేవలం డబ్బునాశించి హత్య చేశారు. ఈ సందర్భంలో కథకుని అంతరంగాన్ని చూడాలి. లక్ష్మక్క పట్టుదలా, దాని పర్యావసానాలు ఊహించగలడు. కాని ఆమెను హెచ్చరించాలా, సమర్థించాలా, అభినందించాలా అన్న సంశయం పాఠకుణ్ణి సంబోధించి అనే మాట. ఆమె పట్టుదలను సమర్థిస్తే కక్షల పరంపర కొనసాగించాలన్నమాట! “అభినందన” అన్నమాట గాజులు, బొట్టు తీయకుండా వుంటే సంస్కృతికి సంబంధించిన అంశం. ఇక్కడ రచయిత పాఠకుణ్ణి ఆలోచించుకోమంటాడు. రచన పాఠకుడిలో సంస్కార స్థాయిని పెంచే దిశగా కొనసాగాలి. అందుకు రచయిత పాఠకుడికి అవకాశం కల్పించాడు. పోలీసు స్టేషనులో జయరాంతో మాట్లాడే సందర్భంలోనూ పాఠకుణ్ణి ఉద్దేశించే స సంభాషణ కొనసాగింది. ఈ ముఠా కక్షలకు కారణమేమిటి? దీనికీ పరీష్కారమెలా? అన్న చర్చల సారాంశం వుంది. అంటే రచయిత పాఠకుణ్ణి ఆలోచించమంటారు. కక్షలకు కారణాలు తెలుసుకోవడమే కాదు, నిర్మూలనకు పద్ధతులు కూడా అన్వేషించాలనే సందేశంతో కథ ముగుస్తుంది.

సాహిత్యంలో సమస్యల చిత్రీకరణే కాదు, పరిష్కారం కూడా చెప్పాలనే చర్చ కొనసాగింది. అన్ని సామాజిక సమస్యలకు పరిష్కారాలున్నట్లే సాహిత్యంలో కూడా పరిష్కారాలు చెప్పాలనే చర్చ కొనసాగింది. ఈ కథలో “పెదనాయిన’” పాత్ర ద్వారా కక్షలు ఎందుకొచ్చినాయో రచయిత చెప్పించారు. కక్షలు ఏ కారణాల వల్ల పెంపొందాయో వివరించారు. సామాజిక సంక్షేమాన్ని భుజానికెత్తుకున్న రాజకీయ పార్టీలు, ప్రభుత్వ వైఫల్యాలే కారణమని కథా సారాంశం. ఈ సారాంశం మానవ సంబంధాల ఆధారంగా చెప్పించడం రచయిత నైపుణ్యం.

ఈ కథలో కొన్ని సందేహాలున్నాయి. ఊరి మధ్యలో వుండే బురుజు మరాఠీ దండు రోజుల్లో కట్టించింది. అది రక్షణకు, ఐక్యతకూ సంకేతమంటారు రచయిత. ఇప్పుడది సగం కూలిపోయి, పైన పిచ్చిమొక్కలు మొలిచాయి అని అంటారు. గ్రామంలో ఐక్యత, రక్షణ కూలిపోయినట్లే బురుజు కూలిపోయిందని చెప్పదలచుకున్నారు. మరాఠా దండుకు, ప్రయివేటు సైన్యాలకు పెద్ద తేడా గమనించలేము. బురుజు భూస్వామ్య సంకేతం. అటువంటి బురుజు కూలిపోవడం మంచిదే కదా ! బురుజు ఎవరి రక్షణకై నిర్మించింది? ఎవరి ఐక్యతపై నిర్మించింది ? గత సమాజమే మెరుగైందా ? కథలో ఏ పాత్ర కూడా ప్రధాన కథా సూత్రానికి దూరంగా లేదు. కథా సన్నివేశాలు కథా సూత్రాన్ని బలపరిచేవిగానే వున్నాయి. ఈ బురుజు ప్రస్తావనే కథలో విలక్షణంగా కనిపిస్తుంది. బురుజు భూస్వాముల ఐక్యతకు, రక్షణకు పనికొచ్చిందే కాని గ్రామంలోని మిగతా జనానికి ఎలా ఉపయోగపడుతుంది? సమాజంలో అది నిర్వహించిన పాత్ర ఎట్టింది? భౌతికంగా బురుజు కూలిపోయిందే కాని బురుజు సంస్కృతి కూలిపోలేదు. ఈ పరిస్థితిలో బురుజు చుట్టూ వున్న కట్టపై జనం కూర్చోవడానికి జంకుతారు. కట్టపై జనం కూర్చోవడమే ఐక్యత, రక్షణకు చిహ్నం కాదు. కట్ట మీద కూర్చోవడానికి అనుమతి లేని వర్గం ఏ గ్రామంలోనూ వుండదు. బురుజుకు బదులు దలితవాడలోని రావిచెట్టు కట్ట వుండి వుంటే కథ మరోలా వుండేది.

ఏదేమైనా తెలుగు కథ ప్రజల దగ్గరకు వెళ్ళింది. ప్రజల సమస్యల్ని ప్రతిబింబించింది. కేవలం “కూలిన బురుజు” కథ బింబ ప్రతిబింబ ధర్మాన్నే కాకుండా సృజనాత్మకంగా ప్రతిబింబించింది. సమస్యను అర్ధం చేసుకోవడానికి పాఠకుణ్ణి పురమాయించింది.

ఇవ్వాళ కథా రచయిత ఏమి ఎలా ఆలోచిస్తున్నాడో ఈ కథ చెబుతుంది. రచయిత సామాజిక బాధ్యత నుంచి తప్పుకోలేడన్నది వాస్తవం. ఐతే సమస్య చిత్రణ, సమస్య పరిష్కారంలో భిన్న అవగాహనలందవచ్చు.

కేతు విశ్వనాథరెడ్డి గారు మిగతా విశ్వవిద్యాలయ ఆచార్యుల లాగా పండిత చర్చలకు పరిమితం కాకుండా తన రచనల్లో ప్రజా సమస్యల్నే చిత్రిస్తూ వారి వెంటే ఆలోచించిన వ్యక్తిత్వం ఆయనది.

Vote this article
Prakasika
Author: Prakasika

Related Articles

Latest Articles