సముద్రాల హరికృష్ణ
తోటలోకి అడుగు పెట్టానో లేదో స్నేహ పరిమళాలు
తెమ్మెరల గుసగుసల పలకరింపులు
ఏవేవో చెప్పాలని పాపం,ఆరాటాలు!
విరి వన్నెలు,జగతికె కళకళలు,చిరకాల పరిచితాలు
సుమ వని దిగిన హరి ధనువులు
రాగార్ణవ లహరికా మ్రృదువులు!
మల్లెల ధవళాహ్వానాలు,జాజుల సన్నని దరహాసాలు
మందారపు హిందోళ తనూ విలాసాలు
నందివర్ధన నవ వధూ త్రపా మౌగ్ధ్యాలు!
పారిజాతాలు-భువి దిగిన సురభిళ తారాలంక్రృతాలు
తరు ఛాయల సేద తీరే సుకుమారాలు
సుర నందనవన పురాబంధాలు!
గులాబీలు- గోరానితే కందిపోయే సుతారపు దొంతరలు
ఎవరి ఏర్పాటులో ఆ కంటక దుర్గ రక్షలు
అపూర్వ శ్రీల కాపాడే సాయుధ సైన్యాలు!
మము కూడ చూడమనే పత్రనిర్మాణ రేఖా విన్యాసాలు
వ్యోమనాథ నిరంతర హ్రృదంతర్వర్తినులు
హరిత వివిధాలు,వివిధ హరితాలు!**
చెప్పక నీ బుజాల బురుజుల వాలే సీతాకోకచిలుకలు
తెలిసే లోపే ఎగసే రంగుల గాలిపటాలు
వేయి పూల కలశాల అతిథులు!
పూల నేస్తాలు పత్రరథాలు,తోటల వాద్య వ్రృందాలు
వ్రృక్షాగ్రాల ఇరుసంధ్యల మాటకచ్చేరీలు
కిలకిలల శుభగాత్రాల కలరవాలు!
ప్రవేశం ఎప్పుడూ ఆనందమైన కోటి శిల్ప ప్రాంగణాలు
నిర్గమన వేళల ఏమి ప్రశ్నించని ముభావాలు
మధుర భావ బంధుర,అవినాభావాలు !