8.4 C
New York
Monday, November 25, 2024

‘దళారీ’ దగా పిడికిళ్లలలో రైతు జీవితం

డాక్టర్ పొదిలి నాగరాజు

“పదిపైసలు పెట్టుబడి లేకుండా, పొట్టచించితే అక్షరం రాకపోయినా బ్రోకారాఫీసు బోర్డేసుకున్న నాయాతళ్లు యేం సంపాదించినారనీ! చెప్పితే సువ్వాశ్చర్యపోతార్‌, మా షావుకారి కట్టించిన బిల్దింగుచూస్తే కండ్లు తిరుగుతాయనుకో” దళారి కథలో దస్తగిరి పాత్ర ఆధారంగా రచయిత చెప్పిన మాటలివి. కమీషన్ల పేరుతో రైతును మోసం చేసే దళారి వ్యవస్థ అన్యాయాన్ని సభ్యసమాజానికి, రైతు వర్షానికి తెలియజేయటమే “దళారీ” కథా ఇతివృత్తం. దళారీ వ్యవస్థ పెచ్చు మీరితే వ్యవసాయరంగంలో రైతుబతుకు చీడముట్టిన పంటలా చిలికిపోతుందనే వాస్తవానికి ఈ కథ దర్పణం పడుతుంది. డా॥ శాంతి నారాయణ ఈ కథను 1985లో రచించాడు. మే 10న ఆంధ్రప్రభ వీక్షీలో ఇది అచ్చయింది. పేద రైతు కుటుంబంలో పుట్టిన శాంతినారాయణకు రైతు జీవితంలోని ప్రతి అణువు ఎరుకే. అందుకే శాంతినారాయణ రాసిన రైతు కథల్లో పతనమౌతున్న రైతే మనకు కనిపిస్తాడు. రాయలసీమలో వ్యవసాయం కత్తి మీద సాములాంటిది. దీనికి కారణం కరువు పురుగు. ఇది సీమరైతుకు అలవాటైన పురుగే. ఇది కాకుండా కథా కాలానికి కొత్తగా రైతును ముట్టిన మరో చీడ పురుగు దళారి వ్యవస్థ. దీనిని నులిపేయకపోతే భవిష్యత్తు రైతులేని సమాజాన్ని చూడవలసి వస్తుందన్న ఆవేదనను రచయిత ఈ కథ ద్వారా తెలియజేశాడు. ఇది అనంతపురం నుండొచ్చిన కథ. కథా కాలానికి అనంతపురం మార్కెట్టులో కమీషన్హార్లు రైతు చుట్టూచేరి రైతు కష్టాన్ని పీక్కుంటున్న తీరును దళారి కథ చక్కగా చిత్రించింది.

రామప్ప అనంతపురం జిల్లాకు చెందిన రైతు. తన నాలుగెకరాలలో పండించిన ఉల్లి పంటను అతను అనంతపురం మార్కెట్టులో అమ్మటానికి ఇష్టపడడు. దానిని గుంటూరు సంతలో అమ్ముకోవాలనుకొని లారీ కోసం లారీ బ్రోకరు సుబ్బరాయుడు ఆఫీసుకు వెళ్తాడు. రామప్ప కన్నా ముందే ముగ్గురు రైతులు అప్పటికే సుబ్బరాయుడు ఆఫీసులో వుంటారు. తాము పండించిన చీనీకాయల పంటను బెంగుళూరు సంతలో అమ్ముకోవటానికి లారీల కోసం వచ్చింటారు. రైతుల్ని మోసం చేయటంలో లారీబ్రోకరు సుబ్బరాయుడిది అందవేసిన చేయి. పైగా వెంకటేశ్వరస్వామి సాక్షిగా రైతును మోసం చేసే కమీషనుదారుడు. సుబ్బరాయుడు ఇంటివద్ద నుంచి రావటానికి ముందే ఇంట్లో కొడుక్కి అరగంట కొకసారి ఫోను చేస్తూవుండమని చెప్పొస్తాడు. కొడుకు ఫోను చేసిన ప్రతీసారి ఆఫీసులో తన వద్దకు లారీల కోసం వచ్చిన రైతులకు అనుకూలంగా మాట్లాడుతూ రైతుల్ని” బురిడీ కొట్టిస్తుంటాడు. ఇదేవిధంగా బెంగుళూరు సంతోళ్లతో మాట్లాడినట్టు నటించి చీనీకాయల రైతులను నమ్మించి రెండు లారీలను బాడుగకు మాట్లాడి అటు రైతుల దగ్గర ఇటు లారీ డ్రైవర్ల వద్ద కమీషన్‌ తీసుకుంటాడు. ఇదే పంథాతో రామప్పను నమ్మించి ఎక్కువ కమీషన్ను లాక్కుంటాడు. రామప్ప సుబ్బరాయుడి వద్దకు రాకముందే పదైదు టమోటా గంపలను మార్కెట్టులో , కమీషనంగడి ఏజె జాఫరుకు కమీషను తీసుకొని అమ్మిపెట్టమని అప్పగించొచ్చింటాడు. ఆ రు కోసం రామప్ప జాఫర్‌ దగ్గరికి వెళ్తాడు. పదిగంపలమ్మిన జాఫర్‌ అవన్నీ అతికష్టం మీద అమ్మామనీ అందులో తన కమీషను, కూలీనాలీ పోగా మిగిలిన డెబ్బెరూపాయిల్ని జాఫర్‌ రామప్ప చేతిలో పెడతాడు. కేజీ టమోటాలు మూడు రూపాయిలమ్మేచోట పది మణువుల టమోటాకు డెబ్బె రూపాయిలు రావటంతో రామప్ప బాధపడిపోతుంటే మిగిలిన ఐదుగంపలకు జాఫరు పదిహారు రూపాయిలివ్వటం రామప్పను ఇంకా కుంగదీస్తుంది. అసంతృప్తిగానే అక్కడి నుంచి బయలుదేర్తాడు. కిరణాకొట్టులో ఇంటి సామాన్లను మూటకట్టించుకొని ఊరికి బయలుదేరుతుండగా సుబ్బరాయుడు బ్రోకరాఫీసులో పని చేసె దస్తగిరి వెనుక నుంచి “రామప్ప మామా” అని పిలుస్తాడు. ఇద్దరూ కలుసుకోవటంతో దస్తగిరి తనూరి వాడేనని రామప్ప తెలుసుకుంటాడు. దస్తగిరి రామప్పను టీ తాగటానికి తీసుకెళ్ళి సుబ్బరాయుడు రైతుల్ని మోసం చేసే తీరునంతా టీ అంగట్లో రామప్పకు వివరిస్తాడు. రామప్ప మొదట్లో ఆశ్చర్యపోతాడు. తర్వాత బ్రోకరు సుబ్బరాయుడ్ని, ఏజెంటు జాఫర్ని కలిపి తిడతాడు. రైతుకు ఇంత అన్యాయం జరుగుతున్నా మార్కెట్టులో తిరిగే జనంగానీ, విద్యార్లులుగానీ, రాజకియ నాయకులుగానీ తమకేమీ పట్టనట్టు వారి పనులు వారు చేసుకుంటూ వెళ్తూవుంటారు. ఇది కథాంశం.

రాయలసీమలో కథ ఇతర ప్రాంతాలతో పాటే పుట్టినా సీమకథకి, ఇతర ప్రాంతల కథకీ మధ్య విభిన్న ధోరణి ఒకటి కనిపిస్తుంది. దీనిని రాయలసీమ నేపథ్యమే కారణం. ఇక్కడ నీళ్లకన్నా కన్నీళ్ళే ఎక్కువగా కనిపిస్తాయి. సుఖపడిన జీవితాలకంటే ఛిద్రమైపోయిన బతుకులే వాసన తగులుతుంటాయి. కరువు రాక్షసి చేతిలో నలిగిన రైతు కుటుంబాలు ప్రతిపల్లెలోనూ మనల్ని పలకరిస్తుంటాయి. వానలు పడక, పంటలు పండక పదెకరాలున్న ఆసాములు సైతం గుక్కెడు గంజికోసరం పరుగులు తీసిన చరిత్ర ఇక్కడే పారాడుతూ కనిపిస్తుంది. ఇన్ని బాధలతో పురుడు పోసుకోవటం వల్లనే ప్రతి సీమకథ జీవాన్ని అద్డుకొన్నట్లుంటుంది. అటువంటిదే దళారి కథ. డాక్టరు శాంతినారాయణ కథా రచన గురించి ప్రముఖ విమర్శకులు వల్లంపాటి వెంకట సుబ్బయ్యగారు ఇలా చెబుతారు. “రాయలసీమ రైతు జీవన పతనం శాంతినారాయణ ప్రధాన కథా వస్తువు. ఆ పతనానికి శాంతి నారాయణ మూడు కారణాలను తన కథల్లో చిత్రిస్తాడు. మొదటిది రాయలసీమకు ప్రకృతి చేస్తున్న ద్రోహం. రెండవది బ్రిటీష్‌ వారితో ప్రారంభించి, స్వాతంత్రానంతరం ఆంధ్రదేశంలో అధికారానికి వచ్చిన ప్రతి ప్రభుత్వమూ చేసిన ద్రోహం. మూడవది రైతు శ్రమ ఫలితాన్ని రైతుకు దక్కనివ్వని దళారీ వ్యవస్థ” అని తన రాయలసీమ ఆధునిక సాహిత్యం సామాజిక సాంస్కృతిక విశ్లేషణ (పుట:189)లో చెప్పాడు. వల్లంపాటి చెప్పిన మూడవ అంశం సారాంశమే దళారీ కథ.

“వాన్లు బాగానే వచ్చినాయనుకో, అయితే యేం జేత్తావ్‌? పైర్లకంతా నున్నగ రోగాలు. టమోటా, ఉల్లిగడ్డ యేసుకున్న మాయట్లా రైతులగతి ఆ దేవునికే దెల్సు. అంబంలో కుంబమని రేట్లు జూత్తామంటే ముండమోసినాయ్‌. అంతియింతో టమోటా వత్తావుంటే దాన్ని అడిగే నాతుడే లేదు. మార్కెట్టుకు పదిగంపలు టమోటా యేసుకొస్తే కమిసనూ గిసనూ పోయ్‌, యాబై రూపాయిలు సేతికొస్తే దాంట్లో శార్దీలేమి, పీకిన కూల్లేమి, గంపల కరీదేమి? కరువులో అధిక మాసమన్నట్లు అందెందో గంపకు పావలాదానమంట…. ఇంగ వుల్లి గడ్డలదనుకుంటే అంతా గబ్బుగబ్బులేప్పా. నాటిన ప్పెట్నుంచే సన్నదిల్లోని జూసుకున్నట్లు సూసుకొని కాపాడుకుంటే తీరా నోటికొచ్చినంక ఈ గబ్బునాకొడుకు వానతో యాడిదాట కుళ్ళుతాంది. భూమిలో వుండేది భూమిలోనే పీకింది పీకినట్లే, తరిగింది తిరిగినట్లే కుళ్ళిపోతాంటే ఇంగేమి మొత్తుకుండేది! యాల్లెప్పల్లలేప్పా, రైతు బతుకే అద్దుమాన్నమయిపోయింది” అంటూ రైతు ఆవేదనతో కథ మొదలవుతుంది. రైతాంగాన్ని ఒకవైపు ప్రకృతి, మరోవైపు దళారీ వ్యవస్థ ఎలా ఒలుచుకు తింటున్నాయో రచయిత దళారీ కథ ఆధారంగా సూచించాడు. ఇందుకు కథలో రెండు అంశాలను చిత్రించాడు. ఒకటి రైతును మోసం చేసే దళారి వ్యవస్థ, రెండవది తెలిసీ దళారీల చేతిలో మోసపోతున్న రైతాంగం. ఈ రెండింటితోపాటు కథలో రైతు పక్షాన నిలబడి రైతును మేల్కొలిపే ప్రయత్నం చేసిన దస్తగిరి పాత్ర.

రైతుకు, మార్కెట్టుకు మధ్య రాయబార తంతుతో మొదలైంది దళారీ వ్యవస్థ. రైతుకు సహాయం చేయాలనే ఉద్దే శంతో పుట్టిన ఈ వ్యవస్థ రై రైతును మోసం చేసి సొమ్ము చేసుకొనే దారుణస్థితికి మారిపోయింది. ఇది రోజా రోజుకూ ప్రతి పనికీ కమీషన్లను అతికించుకొని వాటిని రాబట్టే ప్రతయ్నంలో అత్యాశకులోనై రైతుల్ని అన్నివిధాలా ఊబిలోకి నెట్టేసే సెవిధంగా తయారయింది. ఈ రకంగా కథలో రైతును మోసం చేసే వాళ్ళు ఇద్దరు. ఒకరు లారీ బ్రోకరు సుబ్బరాయుడు. మరొకరు కమీషనం గడి ఏజెంట్‌ జాఫర్‌. ఈ ఇద్దరి చేతుల్లో నలగుతూ నష్టపోయిన రైతు రామప్ప. లారీ బ్రో కర్‌ సుబ్బరాయుడు రైతులను అన్యాయం చేసి, నాలుగు లారీలు, శ్రీకంఠం టాకీసు దగ్గర నాలుగు షాపులు, గుత్తిరోడ్లో రెండెకరాల ప్లాటు, ఏడెనిమిది బ్రోకరాఫీసులు సంపాదించింటాడు. ఎంతోమంది రైతుల్ని నిలువునా దోచుకుంటే తప్ప సుబ్బరాయులాంటి కమిషనుదారుడు ఇంత సంపాదించలేడు. ఉదయం లేచినప్పటి నుంచి రైతును దోచుకోవటమే పనిగా పెట్టుకున్న సుబ్బరాయుడు పైకి మాత్రం “రైతును కడుమ్మీద గొడితే బాగుపడతారేమన్నా… దేవుడనేవాడు ఊరకనే వుంటాడా?” అంటూ వేంకటేశ్వర స్వామికి అగరుబత్తీలు అంటించీ, స్వామి సాక్షిగా మోసం చేస్తుంటాడు. తానెంతో నిజాయితీ పరుడన్ని తన వద్దకొచ్చిన రైతుల దగ్గర సుబ్బరాయుడు “ఇక్కడంతేనన్నా స ఒకటేనాడు షాపుకార్లు కావల్లని జూస్తారీ లబ్జికొడుకులు” అని తాను రైతులకేంతో మేలు చేసేవాడినని తాను చెప్పిన లిమ్లీకొడుకుల్లో తాను లేడని నమ్మిస్తాడు. సాటి కమీషన్లని తిడుతున్నాడంటే సుబ్బరాయుడు చాలా మంచి మనిషని రైతులు నమ్మిన తర్వాత తాను మోసం చేయటం మొదలు పెడతాడు. ఇంటి వద్ద నుంచి అరగంటకొకసారి ఫోను చేయమని కొడుక్కి చెప్పి రావడంతో సుబ్బరాయుడు రైతులతో మాట్లాడుతుండగా ఫోను మోగుతుంది. రైతులు తమ సరుకును ఏ ప్రాంతానికి తీసుకెళ్ళి అమ్మకోవాలనుకుంటారో ఆ ప్రాంతవాసితో మాట్లాడినట్టు రైతులు ముందే మాట్లాడతాడు. అతని మాయ మాటలు నిజమని భ్రమించి రైతులు బాడుగ లారీలను సుబ్బరాయుడికే అప్పజెప్తారు. దీనితో బాడుగ లారీలను మాట్లాడి అటు డ్రైవర్ల వద్ద, ఇటు రైతుల వద్ద కమీషన్‌ లాగుతాడు. దీనితోపాటు ఫోను చార్జీలను రాబడతాడు. బెంగుళూరులో తమ సరుకును అమ్ముకోవాలని లారీల కోసం వచ్చిన ముగ్గురు రైతులను సుబ్బరాయుడు తస కమీషను కోసం ఫోను ద్వారా వాళ్లని మోసం చేసే విధానాన్ని రచయిత చక్కగా ఆవిష్కరించాడు. “అలో…. యెవరు మాట్లాడేదీ…. ఫకీర్టీనా నేను అనంతపురం నుండి తిరుమలా బ్రోకర్‌ సుబ్బరాయుడే మాట్లాడుతాండా, యేం లేదు బై…. అక్కడ బీనాకాయల రేటెట్లుంది? ఆ…. టన్ను నాలుగువేల? సరుకు బాగుందిలే భై, మా ఆసాములవి రెండు లోడ్లు పంపుతాండా మంచి రేటుతో అమ్మించు బై…” ఇలాంటి బూటకపు మాటలతోనే సుబ్బరాయుడు గుంటూరోళ్లతో మాట్లాడినట్లు మాట్లాడి రామప్పనూ మోసం చేసి డబ్బులు గుంజుతాడు. చీనీకాయల రైతులకుగానీ, రామప్పకుగానీ తమను మోసం చేస్తున్నాడన్న విషయం తెలియకుండానే చేసే మోసాన్నంతా సునాయాసంగా చేసేవాడు సుబ్బరాయుడు. మోసం చేసే విధానంలో కొత్త పద్ధతులకు తెరలేపుతూ మార్కెట్టులో కమీషను రాబందులు రైతులోకాన్ని పీక్కుతింటున్న వైనాన్ని, కమీషనుదార్లు చేసేదంతా నిజమేనని నమ్మే అమాయక రైతాంగాన్ని రచయిత ఈ సందర్భంగా వివరించాడు.

కథలో రెండవ కమీషన్హారు కమీషనం గడి ఏజెంటు జాఫర్‌. ఈయన రైతుల వద్దకెళ్లడు. రైతులే ఇతని దగ్గరికొచ్చి తన సరుకును అమ్మిపెట్టమంటారు. అమ్మిన దానికి కమీషనుంటుంది. రామప్ప తన పదైదు టమోటా గంపలను కమీషను తీసుకొని అమ్మి పెట్టమని సరుకును జాఫర్ము అప్పగిస్తాడు. మార్కెట్లో చిల్లరగా కేజీ టమోటాలు మూడు రూపాయలు అమ్ముతుంటే కమీషనంగడి జాఫర్‌ మాత్రం రైతు పొలం నుంచి తెచ్చిన మణువు గంప టమోటాలను పదిరూపాయిలక్కూడా కొనటానికి మొగ్గుచూపడు. దీనికి కారణంగా “సరుకు బాగాలేదనీ, మదనపల్లి సరుకు ముందు ఇది పనికిరాదనీ, మార్కెట్టు శానామందమైపోయిందనీ” సాకులు చూపిస్తాడు. సరుకు అమ్ముకోవటానికి వేరే గత్యంతరం లేని రామప్ప జాఫర్‌ చెప్పిన ప్రతీదానికి ఊకొతాడు. కమీషన్‌ పేరుతో దాగా చేసే జాఫర్‌ రామప్ప అప్పగించిన పదైదు గంపలకు నూరు రూపాయి కూడా అప్పజెప్పడు. “రామప్ప నోట్లను లెక్కబెట్టుకుంటూ టమోటా నాటినప్పటి నుంచీ ఎండలో దాన్ని, ఎలా కాపాడిందీ, ఎన్నిసార్లు కలుపు తీసిందీ, ఎన్నిసార్లు మందుకొట్టిందీ జ్ఞప్తికి తెచ్చుకోనేసరికి ఆవేదనతో అతని పెదవులెండుకుపోయాయి”. ఎంతో కష్టపడితేగానీ రైతుకు పంట చేతికందదు. రాయలసీమలో రైతు కష్టం ఇతర ప్రాంతాలకంటే ఎక్కువగానే వుంటుంది. అటువంటి రైతు కష్టాన్ని గుర్తించకుండా నీడపట్టున కూర్చొని వేరే గత్యంతరం లేక తమ వద్దకొచ్చిన రైతులను అన్యాయం చేసే జాఫర్లాంటి కమీషన్దార్ల మోసాన్ని ఈ సందర్భంగా రచయిత కళ్లకు కట్టినట్లు చూపించాడు.

ఈ రెండు పాత్రలు కథలో రైతును మోసం చేసి శ్వాసపీల్చుకొనేవే. ఈ పాత్రలు మార్కెట్లలో నాటి కమీషన్హార్లు చేస్తున్న దాగాకోరు పనులకు ప్రతీకలు. వీరి మాయలోపడి మోసపోతున్న మొత్తం రైతాంగాన్ని జాగ్రత్తగా వుండమని రచయిత ఈ కథ ద్వారా హెచ్చరిస్తాడు.

సుబ్బరాయుడు, జాఫర్‌ లాంటి కమీషన్దార్ల చేతుల్లో మోసపోయే రైతుకు ప్రతీక రామప్ప. కథా కాలానికి అనంతపురం మార్కెట్టు కమీషన్హార్ల దాగాకోరు పిడికిళ్లలో ఎలా నలిగిపోతువుందో రామప్ప ద్వారా సూచనప్రాయంగా తెలుపుతాడు రచయిత డాక్టరు శాంతినారాయణ. “యాటికో వొకసాటికి తప్పదు గదప్పా. యీడజూత్తే ఈ మార్కెటోల్లు మాయట్లాంటి రైతుల్ని బతకనిచ్చేతట్ల లేరు. ఈ అనంతపురమంతా ముండమోసిన మార్కాట్టు పెపంచంలో ఇంకెక్కడా ఉండదేమోనప్పా. థూ…థూ… మాల్లా అంత మోసమా! యేదో బొత్తిగా సేతులాడకుంటే మొన్నవొగ పది ప్యాకెట్లు వుల్లిగడ్డ లేసకొత్తే రేటీమో ముప్పెజెప్పినారు. తీరా జూత్తే అదీయిదీ అని యేందేందో తీసేసి ఇరవైపకారం సేతిక్‌చ్చినారు దొంగనా కొడుకులు” అందుకే రామప్ప తన ఉల్లిగడ్డల్ని గుంటూరు మార్కెట్లో అమ్ముకోవాలని నిశ్చయించుకుంటాడు. రైతును మోసం చేసే కమీషన్హార్లు పంటను అమ్మిచ్చే కమీషనంగట్లోనో వుంటారనే భ్రమ రామప్పది. అందుకే తన గోడునంతా లారీబ్రోకరు సుబ్బరాయుడు వద్ద ఎల్లబోసుకుంటాడు గొర్రెకసాయి వాడికి మొరపెట్టుకున్నట్టు. తన ఊరివాడైన దస్తగిరి సుబ్బరాయుడు రైతులనెలా మోసం చేసేవాడో చెప్పేంత వరకూ రామప్ప లారీ బ్రోకర్‌ సుబ్బరాయుడు మోసాన్ని తెలుసుకోలేకపోతాడు. సుబ్బరాయుడు, జాఫర్‌ చేతుల్లో తాను మోసపోయానని రామప్పకు తెలిసిన తర్వాత “వోరి ఈనెమ్మ కడుపులుగాలా, ఎంత మోసంరా దొంగ నా కొడుకులు! థూ.. థూ… అంతా బద్దు నాయాళ్ళే” అని కేకరించి ఉమ్ముతాడే తప్ప వాళ్లపైన తిరుగుబాటు
చేయడు. రామప్ప లాంటి రైతుకు ఇంతమోసం జరుగుతున్నా బజార్లో తిరిగే వాహనాలు, ఊరేగింపుతో వెళ్ళే విద్యార్థులు, రాజకీయ నాయకులు ఎవ్వరూ పట్టించుకోరు. వారివారి పనుల్లో నిమగ్నమైపోతుంటారు. అందుకే ఇప్పటికీ మోసపోతున్న రామప్పలు సంఖ్య పెరుగుతూనే వుంది తప్ప తరగటం లేదు.

కథలో మూడవపాత్ర దస్తగిరి. ఇతను రామప్ప ఊరి మనిషి. కమీషనుదార్ల చేతిలో మోసపోతున్న రైతు పక్షాన నిలబడి రైతులకు కమీషన్హార్ల మోసాలు, కపట నాటకాల గురించి వివరించి రైతులందరినీ మేల్కొలిపే ప్రయత్నం చేసే పాత్రగా కథలో దస్తగిరి పాత్ర చిత్రించబడింది. పూర్తిగా
మోసపోయిన రామప్పను పరిచయం చేసుకొని మామ వరసను కలుపుకొని సుబ్బరాయుడు రైతులను మోసం చేసే తీరును రామప్పకు ఇలా వివరిస్తాడు. “నిజం మామా, నువ్వుండూరోనివి కాబట్టి నిజం చెప్పుతాండా, ఈ ఫోన్లు గీన్లు అంతా అబద్ధం. ఫోన్లో గుంటూరోళ్లతో మాట్లాదేదీ, బెంగుళూరోళ్లతో మాట్లాడేదీ అంతా బూటకం” అని సుబ్బరాయుడు, సుబ్బరాయుడు కొడుకు కలిసి ఒక పథకం ప్రకారం ఫోను ద్వారా రైతులను ఎలా మోసం చేస్తున్నారన్న సంగతినంత వివరిస్తాడు. ఇలాంటి మోసకార్లను నమ్మి రామప్పలాంటి రైతులు ఎంతో నష్టపోతున్నారని చెబుతాడు. “ఇది తెల్సుకోకుండా మీరు బ్రోకర్ల దగ్గరికే వస్తారు, వీళ్ళు మీతో కమీషన్‌, డ్రైవర్లతో కమీషన్‌ కొట్టడమే కాకుండా మామూలుగా నడిచే బాడిగకంటే యెక్కువ మాట్లాడిన దాంట్లో సగం గుంజుతారు” అంటూ కమీషనుదార్ల బండారమంతా బయటపడేస్తాడు. రైతు పండించుకున్న పంటను తనకుతాను స్వయంగా సొమ్ము చేసుకోవాలనే విషయాన్ని దస్తగిరి రైతాంగానికి వివరిస్తాడు. దస్తగిరి పాత్రలో రచయిత డా॥ శాంతి నారాయణనే మనకు దర్శనమిస్తాడు.

రైతు మోసపోతే కలిగే నష్టం కేవలం రైతుకే కాదు. రైతు మీద ఆధారపడి జీవించే మొత్తం సమాజానికి. కమీషన్దార్ల దగాకోరుతనాలన్ని నేలరాసి రైతుకు న్యాయం చేయాల్సిన బాధ్యత అందరిపైన వుందనే విషయం ఈ కథ గుర్తు చేస్తుంది. రైతు ఆత్మహత్యలతో బలపడుతున్న దళారీ వ్యవస్థపై యుద్ధ ప్రాతిపదికన తిరుగుబాటు చేయాల్సి వుందని, అటు ప్రజానీకాన్ని ఇటు ప్రభుత్వాన్ని మేల్కొలిపే ప్రయత్నాలు చేసిన కథ ఇది. ఇది రైతుకు బలాన్నిచ్చిన కథ.

Vote this article
Prakasika
Author: Prakasika

Related Articles

Latest Articles