శ్రీ శాంతినారాయణ
“నమస్కారమన్నా రామప్పన్నా…. రారా. యేం శానా దినాలకొస్తివే. పంటలన్నీ బాగనే ఉండాయేమన్నా?” చాలా ప్రేమగా అడిగాడు లారీ బ్రోకరాఫీసులో ఫోన్ దగ్గర కూర్చున్న సుబ్బరాయుడు.
“ఏం బాగులేప్పా, సెప్పుకుంటే సిగ్గు బోతాది” అంటూ తలకు చుట్టుకొన్న టువ్వాలు తీసి భుజం మీద వేసుకొని, పబోకరాఫీసులో పక్కనున్న బెంటీ మీద కూర్చున్నాడు రామప్ప. అతని పక్కనే ఇంకా ఇద్దరు ముగ్గురు రైతులు ముందే కూర్చొని వున్నారు.
“అదేమన్నా, అట్లంటావ్? ఈసారి వాన్లు బాగొచ్చినాయి గదా” మాటల్లోకి దిగాడు సుబ్బరాయుడు.
“వాన్లు బాగానే వచ్చినాయనుకో, అయితే యేం జేత్తావ్? పైర్లకంతా నున్నగ రోగాలు. టమేటా, ఉల్లిగడ్డ యేసుకున్న మాయట్లా రైతుల గతి ఆ దేవునికే దెల్సు. అంబంలో కుంబమని రేట్లు జూత్తామంటే ముండ మోసినాయ్. అంతో యింతో టమేటా వత్తావుంటే దాన్ని అడిగే నాతుడే లేడు. మార్కెట్టుకు పది గంపలు టమేటా యేసకొస్తే కమిసనూ గిమీసనూ పొయ్, యాభై రూపాయలు సేతికొస్తే దాంట్లో శార్డిలేమీ, క పీకిన కూల్లేమి, గంపల కరీదేమి? కరువులో అధిక మాసమన్నట్లు అడేందో గంపకు పావలా దానమంట… . ఇంగ వుల్లిగడ్డదనుకుంటే అంతా గబ్బుగబ్బు లేప్పా. నాటినప్పట్నుండే సన్నబిల్లో న్ని జూసుకున్నట్లు సూసుకొని కాపాడుకుంటే తీరా నోటికొచ్చినంక ఈ గబ్బునాకొడుకు వానతో యాడిదాడ కుళ్ళుతాంది. భూమిలో ఉండేది భూమిలోనే, పీకింది పీకినట్లే, తరిగింది తరిగినట్లే కుళ్ళిపోతాంటే ఇంగేమి మొత్తుకుండేది! యాల్టెప్పల్లలేప్పా, రైతు బతుకే అద్దుమాన్నమయిపోయింది” లోనున్న బాధనంతా బయటికి కక్కేసి నిట్టూర్చాడు రామప్ప.
“రైతు బతుకే గాదు, అందర్జీ అట్లే అయిపోయిందిలేన్నా” ఓదార్చాడు
“మీకేమప్పా, మారాజులూ! వాన్రాలేదని బాధుందా, ఇత్తనాలెయ్యల్లని బాదుందా, కలుపుదియ్యల్లని – మందు గొట్టల్లని బాదుందా! ఆయిగ నీడపట్టున కాలిమీద కాలేసుకొని సంపాయితారు. మీకేం బాద నాయనా?” పట్నంవాళ్ళ సుఖాన్ని ఎత్తి చూపాడు రామప్ప.
రైతులందరూ గుంటినే రా” మా వ్యాపారం సాగేది… ఇంతకూ ఉల్లిగడ్డ పంట యామాత్రమన్నా?”
“యామాత్రమన్నా యాడిదప్పా, నాల్గెకరాలు నాటింటే వొగలోడు గడ్డలు కూడా నమ్మకం లేదు” అసంతృప్తిని వ్యక్తం చేశాడు రామప్ప.
“అయితే లారీ కావల్లేమన్నా?” గిరాకీ వచ్చిందన్న ఆశతో సుబ్బరాయుడు. “అందికే గదప్పా వచ్చిండేది. శ్యాకుంటే యేం ప వచ్చిన సంగతి చెప్పాడు. రామప్ప.
“యాటికి, బెంగుళూరికా గుంటూరికాన్నా?” పక్కనున్న వెంకటేశ్వరస్వామి పటానికి ఊదుబత్తి నంటించి చెక్కుతూ అడిగాడు
“యాటికో వొగసోటకి తప్పదుగిదప్పా. యీడజూత్తే ఈ మార్కెట్లోల్లు మాయట్లాంటి రైతుల్ని బతకనిచ్చేతట్ల లేరు. ఈ అనంతపురమంత ముండమోసిన మార్కెట్టు పెపంచంలో ఇంగెక్కడా ఉండదేమోనప్పా. థూథూ…. మల్లా అంత మోసమా! యేదో బొత్తిగా సేతులాడకుంటే మొన్నవొగ పది ప్యాకెట్లు వుల్లిగడ్డ లేసకొత్తే రేటీమో ముప్పెజెప్పినారు. తీరా జూత్తే అదీయిదీ అని యేండేందో తీసేసి ఇరవై పకారం సేతికిచ్చినారు దొంగనా కొడుకులు.” మార్కెట్టు మోసాన్ని తలచుకొని దేవురించాడు రామప్ప.
“అవునన్నా నువ్వనేది కరెట్టే… ల్యాకుంటే, వొగొగుడు అంతింత సంపాదిత్రారేమన్నా? వాళ్ళ బిల్డింగులేమి, వాళ్ళ జల్సాలేమి…అంతా కలికాలమన్నా!” పక్కనున్న రైతు, రామప్ప మాటల్ని సమర్థించాడు.
“ఇక్కడంతేనన్నా. ఒక్కటేనాడు షావుకార్లు కావల్లని జూస్తారీ లషీ కొడుకులు. రైతును కడుష్మీద గొడికే బాగుపడతారేమన్నా…. దేవుడనేవాడు ఊరకనే ఉంటాడా?” తన నిజాయితీని వ్యక్తం చేశాడు బ్రోకర్.
“కడుప్క్మీద కొడతానే వుండారు, బాగుపడతానే వుండారు గదప్సా… యాదేవుడు గాంగ యేం జేత్తాండాడు? యేందోలే, యేమనుకొని యేం లాభం?… మాతిప్పలు తప్పవుగాని, యాదోవొగ లారీ సూడు పొద్దుగలగ” తమ బాధ లెవరూ తీర్చలేరన్నట్లు దిగాలుగా అడిగాడు రామప్ప.
“గుంటూరు, బెంగుళూరు పొయ్యే బండ్లేవీ లేవు గదన్నా…
ఇదిగో వీళ్ళుగూడా చియ్యేడు నుంచీ వచ్చినారు. బెంగుళూరికి చీనాకాయలలోడ్లుండాయంట. యేందిలే,
ఎన్ని లారీలొచ్చినా ఈ చీనాకాయల సీజన్లో సాలకొస్తాండాయ్. వూరకనే నామాటిని హైదరాబాద్ కేసకపోన్నా, రేటు గూడా బాగానే వుందంట… ఒగ్గంటలో మంచి బండి చూసి పంపిస్తా, బాడిగూడా కాస్తా సలీసేగదా” ఆశపెట్టాడు బ్రోకర్.
“యాల్లేప్పా, ఐదురాబాదంటే బయమయితాది. అది శానా అద్డువాన్నం మార్కెట్టని బొగుజెప్తారు. యెట్లో గుంటూరికే జూడు, రేటు గూడా పర్వాలేదంటాండారు.”
“అది సరేనన్నా, ఆ పక్క బొయ్యే లారీలే లేవు గదా! అదే పనిగ గుంటూరికి రమ్మంటే డ్రైవర్లు బాడిగ శానా డిమాండ్ చేస్తారన్నా. ఇంగ ఆ సిక్కుగాళ్ళుండారే నాయాళ్ళు ససేమిరా అంటే తగ్గించుకోరు… సరే…” అని యేదో చెప్పబోతుండగనే ఫోన్ రింగయింది. సుబ్బరాయుడు.
రిసీవర్ పైకెత్తి, “అలో… బెంగుళూరు నుంచేనా!… యెవురు మాట్లాడేదీ…ఫకర్టీనా… సలాం బై… నేను, అనంతపురం నుండి తిరుమలా బ్రోకర్ సుబ్బరాయుడు మాట్లాడుతాండా, యేం లేదుభై… అక్కడ చీనాకాయల రేటెట్లుంది? ఆం… టన్ను నాలుగువేలా? సరుకు బాగుందిలే భై, మా ఆసాములవి రెండు లోడ్లు పంపుతాండా, మంచి రేటుతో అమ్మించుభై…. అవును భై, ఉల్లిగడ్డ మార్కెట్టు వీకంటాండారు, నిజమేనా… యెంతా…. కింటాల్ డెబ్బె రూపాయలా? మాలు బహుత్ అచ్చాభై …. ఆం… అంతేనంటావా? సరేభై, పెట్టేస్తా” రిసీవర్ పెట్టేశాడు సుబ్బరాయుడు.
ఫోన్లో సుబ్బరాయుడు మాట్లాడింది విని రామప్ప. “థూ దానెమ్మ” అని నిరుత్సాహ పడ్డాడు. పక్కనున్న రైతులిద్దరూ కాస్త సంతోషంగా ఉన్నారు.
“ఏంరా దస్తగిరీ, ఇంతాలస్యంగ వొస్తివి! పొద్దన్నే ఆసాములొస్తారు, కాఫీగీఫీ తెచ్చే పనుంటుందని యెన్నిసార్లు చెప్పాల్రా గాడిదా?” అప్పుడే సైకిల్ బయట పెట్టి లోనికి వస్తున్న దస్తగిరిని దండించాడు సుబ్బరాయుడు.
“లేదయ్యా, అమ్మయ్య గచ్చులోకి నీళ్ళు పొయ్యమంటే పోసొస్తినయ్యా” ఆలస్యానికి కారణం చెప్పాడు దస్తగిరి.
“సరే ఘనకార్యం జేసినావుగానీ, పొయ్ అన్నోళ్ళకు నాలుగు మంచి టీలు తీస్కరా” ఆర్డరిచ్చాడు సుబ్బరాయుడు. దస్తగిరి వెళ్ళి పోయాడు.
“మరేమన్నా, గుంటూరుకు ఫోన్సేసి రేటు కనుకోమంటావా యెట్లా?” రామప్ప నడిగాడు సుబ్బరాయుడు.
“సరే ఫోన్ జెయ్యప్పా, దాని బండవాలమేమో తెల్సిపోతుంది. పచ్చిసరుకు… మల్లాయాడ…” ఫోన్ చేయడానికి ఒప్పుకున్నాడు రామప్ప. సుబ్బరాయుడు ట్రంకాల్ 2 బుక్ చేశాడు.
రామప్ప పక్క జేబులో ఉన్న బీడికట్ట బయటికి తీసి బీడీ మొనభాగాన్ని రెండు వేళ్ళతో ఒత్తి నోట్లో పెట్టుకుని అంటించి దమ్ములాగి పొగ బయటికి వదిలాడు. ఆ పొగలో గుంటూరు మార్కెట్టు వైప చూస్తున్నట్లు దీర్ధంగా ఆలోచిస్తున్నాడు.
చియ్యేడు రైతులకు రెండు లారీలు ఏర్పాటు చేశాడు సుబ్బరాయుడు. ఇద్దరూ చెరి యాభై రూపాయలిచ్చారు. ఫోన్ బిల్లు ముఫ్ఫె రూపాయలిమ్మన్నాడు.
“యేందప్పా, యీడుండే బెంగుళూరికి ఫోన్ జేత్తే ముఫ్ఫె రూపాయలా” అంటూ గొణిగాడొక రైతు.
“మొన్ననే ఫోన్ చార్జీలు పెంచినారన్నా. ఇంకా మేలనుకో, టెలిఫోనాఫీసులో మనకు తెల్సినోళ్ళుండారు గాబట్టి మానమయింది. అందాజుగా ముఫ్ఫె అన్నాను గానీ నాల్లెదు రూపాయలెక్కువే అయ్యుంటుంది. అవన్నీ నేను పట్టించుకోనన్నా. అట్ల పట్టించుకుంటే సాయంత్రానికి యాభై రూపాయలు కాఫీ టీలకే అయితుంది…” అంటుండగనే దస్తగిరి టీలు తెచ్చాడు. వాడు అందరికీ టీ గ్లాసులందిస్తూ రామప్ప వైపు ఎగాదిగా చూశాడు. రామప్ప బెంచీపక్క భాగానికి బీడినొత్తి ఆర్పేసి టీ గ్లాసందుకొని టీ చప్పరిస్తున్నాడు.
ఎదురుగా ఉన్న లారీ నీడలో నేలమీద లారీ సీట్ వేసుకొని కూర్చున్నాడు డ్రైవర్ సర్దార్జీ. క్లీనర్లిద్దరూ జాకీ ఎత్తి టైర్ బయటికి తీయడానికి నట్లు విప్పుతున్నారు. దస్తగిరి ఖాళీ టీ గ్లాసులు తీసుకొని బయటికి పోతూ ఉంటే రామప్ప ఆ కుర్రోణ్ణి చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు.
“ఆవో బై, సర్దార్జీ” సుబ్బరాయుడు పిలిచాడు.
లారీ నీడలో కూర్చున్న సర్దార్జీ వచ్చాడు. అతనికి రైతుల్ని చూపించి బెంగుళూరుకు చీనాకాయలు : వేసుకుపోవాలని ఉర్దూలో చెప్పాడు టోకర్, లారీ బాడుగ వెయ్యి రూపాయలన్నాడు. పది పర్సెంటు తన కమీషనన్నాడు. రెండు బండ్లకూ కమీషన్ రెండొందలిప్పించుకొని జేబులో పెట్టుకున్నాడు. రైతులిద్దర్నీ డ్రైవర్ తోబాటు పంపించేశాడు. సుబ్బరాయుడు బయటకెళ్ళి వాళ్లతో ఏదో చెప్పి లోనికి వస్తూండగానే ఫోన్ రింగయింది.
రిసీవర్ పైకెత్తి, “అలో గుంటూరా? యెవురు మాట్లాడేదీ? నమస్కారమన్నా కోటప్పన్నా! నేను, అనంతపురం లారీ బ్రోకర్ సుబ్బరాయుడు మాట్లాడుతాండా.
ఏం లేదూ, ఉల్లిగడ్డ రేటెట్లుందన్నా?… ఆః… నూటా ఇరవై రూపాయలా, రెండు మూడు రోజుల్లో రైజయ్యే పొజిసనుందా, సరేనన్నా… సరుకా… బ్రహ్మాండగా వుందిలేన్నా, సరే, పెట్టేస్తానన్నా” రిసీవర్ పెట్టేశాడు సుబ్బరాయుడు.
రామప్ప మొగంలో చిరునవ్వు చిందులాడింది.
“అదృష్ట వంతునివిలేన్నా, నువ్వు జెప్పినట్లే గుంటూర్రేటు బాగనే వుంది. పది నిమిషాలు కూచ్చో, లారీ మాట్లాడొస్తాను” అంటూ బయటికెళ్ళాడు రాయుడు. అప్పుడే ఎన్.పి. బండి వచ్చి దూరంగా గుడి దగ్గర ఆగింది.
రామప్ప మళ్ళీ ఒక బీడీ తీసి నోట్లో పెట్టుకొని అంటించాడు. రెండు మూడు దమ్ములకి బీడి బాగా అంటుకుంది. నాలుగో దమ్ములాగి పొగ బయటికి వదిలాడు. ఆ పొగల రింగుల్లోకి చూస్తూ ఉల్లిగడ్డ పంటవల్ల తన చేతికి ఎంతొచ్చేదీ లెక్కవేసుకుంటూ ఆలోచిస్తున్నాడు. తమ వుల్లిగడ్డల్ని చూడకపొయినా ఫోన్లో సరుకు బ్రహ్మాండంగావుందన్న సుబ్బరాయుని మాటల్ని జ్ఞప్తికి తెచ్చుకొని మరో దమ్ము లాగాడు రామప్ప. మరో ఇద్దరు రైతులు వచ్చి పక్కన కూచున్నారు.
“నేం జెప్పలేదేమన్నా గుంటూరంటే ఆ సిక్కు నాయళ్ళు రారనీ. ఆ నాయాళ్ళని వొప్పించాలంటే దేవుడు దిగొస్తాడు. ఎట్లోగట్ట వొప్పిస్తే బాడిగ దిక్కులేకుండా అడుగుతారు” అంటూ లోనికివచ్చి సుబ్బరాయుడు కొత్తగా వచ్చిన రైతుల్ని మాట్లాడించి ఫోన్ దగ్గర కూర్చున్నాడు.
“యామాత్రం అడిగినారప్పా?” బరువుగా అడిగాడు రామప్ప.
“అయ్యో, వాళ్ళడిగినంతిస్తే రైతేమైపోవాలన్నా? మల్లా అంతాశా? రెండువేలడుగుతాడు గలీజు నాకొడుకు… ఒగ్గంట సేపు కూచ్చోన్నా, యేదో ఒకటి అరేంజేస్తాను” తేలిగ్గా చెప్పాడు సుబ్బరాయుడు.
ప్రతి రోజూ ఉల్లిగడ్డ మార్కెట్టు డవునయ్యే పోజిషన్ తలుచుకొని రామప్ప ఆందోళన చెందాడు. అతనికి ఉల్లిగడ్డ మార్కెట్టును గురించి రెండు మూడేళ్ళ అనుభవముంది. అందుకే మనసు వేగిరపడింది. గుంటూర్రేటు బాగానే ఉంది. బాడిగ రేటు దుబారా అయినా వేసుకుపోవడం మంచిదనిపించింది. పైగా ఇప్పుడు డబ్బులో శానా కసాలాగా ఉంది. శానా రోజులు పెట్టుకుంటే సరుగ్గూడా దెబ్బతింటుంది, వచ్చినంత రానీ – అనుకున్నాడు.
“యెట్ల న్నాగానీ పదైదు నూర్ణకొప్పించప్పా” మెల్లగా అడిగాడు. ఆ మాటల్లో చెప్పరానంత దైన్యం. ఈ బాధల్ని తప్పించుకోలేనంత నిస్సహాయత.
“పదైదుకయితే వొప్పుకుంటాడనుకో, అయినా యెందుకన్నా అంతాత్రం? సాయంత్రం దాకా తట్టుకుంటే చెల్ళికెరకు పోయిన బండ్లొస్తాయి.
యాదో వొకటి మాట్లాడి రేప్పొద్దున పంపిస్తాను గదా” రామప్ప ఆదుర్దాసు పరీక్ష చేస్తున్నట్లు చెప్పాడు సుబ్బరాయుడు.
గంట లోపల ఏదో ఒక లారీని పంపుతానన్న సుబ్బరాయుడు ఇంతలోనే రేప్పొద్దున పంపుతాననడం రామప్పకు ఆందోళన కలిగించింది. బాడుగ దుబారా అయినా చింతలేదనుకున్నాడు. పదైదు నూర్లకే మాట్లాడమన్నాడు. సరేనని సుబ్బరాయుడు మళ్ళీ బయటికెళ్లి లారీ డ్రైవర్ తో తిరిగొచ్చాడు. రామప్పను చూపించాడు. బాడుగ పదైదు నూర్లన్నాడు. తన కమీషన్ పది పర్సెంటన్నాడు. డ్రైవర్ దగ్గర్నుండీ నూటాయాలభై రూపాయలిప్పించుకొని జేబులో పెట్టుకున్నాడు. “ఇంక నువ్వూ” అన్నట్లు రామప్ప వైపు చూశాడు బ్రోకర్.
రామప్ప లోపలి బనీన్ జేబులో నుంచీ తీసి చిల్లర నోట్ల కట్ట ఇచ్చాడు. సుబ్బరాయుడు నోట్లెంచుకొని “యాభై ఇస్తే యెట్లన్నా?” అనడిగాడు.
“ఫోన్ జేసిందొకటే గదప్పా యింగ ఇయ్యల్సింది? పదో యిరవయ్యో యియ్యల్సింటే, లేదు, ఇసారొచ్చినప్పుడిత్తాలే” భుజమ్మీద టువ్వాల మార్చుకొంటూ చెప్పాడు రామప్ప.
“అదేందన్నా ఇరవయ్యంటావ్, నూటికైదు ప్రకారం కమీషనే డెబ్బె. ఇంగ ఫోన్ బిల్లు కనిష్టమంటే యాభ్లే. అంతా నూటా యిరవై అయితుంది.” లెక్క చెప్పాడు బ్రోకర్.
“గుంటూరుకు ఫోన్ చేత్తే యాభై రూపాయలేమప్పా?” బాధగా ప్రశ్నించాడు రామప్ప.
“అదే మీ రైతుల్లో వచ్చిండేదన్నా! ఫోన్ బిల్లు మా యింటికొచ్చినట్ల బాధపడతారు. ఇపుడు నీ యెదురుగానే ఫోన్ బిల్లెంజైందో అడుగుతాను. నువ్వే వినన్నా” అంటూ కాస్తా కోపంగా రిసీవర్ యెత్తబోయాడు సుబ్బరాయుడు.
“యాలడుగుతావు లేప్పా, పదీ పదైదు రూపాయలకాడేమి గానీ, మల్లాయితాలే” వెగటుగా నవ్వాడు రామప్ప.
“బ్రోకరాఫీసులో అప్పు బెడితే యెట్లన్నా? మీరు మల్లా వచ్చేది. సంవత్సరానికే. డ్రైవరో ఇప్పించుకుంటాను. సువ్వు బాడిగిచ్చే టప్పుడు అతనికిస్తువులి” అంటూ డ్రైవర్ దగ్గర్నుంచి డెబ్బె ఐదు రూపాయలిప్పించుకున్నాడు బ్రోకర్.
రామప్ప చిన్నగా నిట్టూరుస్తూ డ్రైవర్ వెంట బయటికి నడిచాడు. టైర్ మార్చుకొని గంట ‘లోపల లారీ రెడీ చేస్తామని, త్వరగా పని చూసుకొని రమ్మని వచ్చీరాని తెలుగులో చెప్పి రామప్పకు లారీ చూపించాడు డ్రైవర్.
టమేటా డబ్బులిప్పించుకొని బిరబిరా సంత చేసుకోవల్లని రామప్ప త్వరత్వరగా మార్కెట్లోకి నడిచాడు.
ఇంకా ఐదు గంపల్లో తమ టమేటా అట్లే ఉంది. సరుకు బాగా లేదనీ, అడిగే నాథుడే లేడనీ, చాలా కష్టపడి పది గంపలమ్మినామనీ కమీషనంగడి ఏజెంట్ జాఫర్ సాబ్ చెప్పుతూ ఉంటే రామప్ప నోరులేని వాడయ్యాడు. చిల్లరగా కేజీ మూడు రూపాయమ్ముతాండారు. ఈళ్లు జూత్తే మణువు గంపను పది రూపాయలకకడిగే వాళ్లు లేరంటాండారు, యెంతన్నాయం? సరుకు బాగ లేదంట! ఈనాయతళ్ల కేం, నీడలో గుచ్చోని యెన్నయినా మాట్లాడతారు” అని మథనపడ్డాడు రామప్ప.
జాఫర్ సాబ్ అమ్మిన పది గంపల టమేటాకు నూర్రూపాయలు లెక్కవేసి కమీషన్, కూలీ గీలీ, దానంగీనం, అన్నీ తీసేసి డెబ్బై రూపాయలు రామప్ప చేతికిచ్చాడు. రామప్ప నోట్లను లెక్క బెట్టుకుంటూ టమేటా నాటినప్పట్నుంచీ ఎండలో దాన్ని ఎలా కాపాడిందీ, ఎన్నిసార్లు కలుపు తీసిందీ, ఎన్నిసార్లు మందు కొట్టిందీ జ్ఞప్తికి తెచ్చుకునేసరికి ఆవేదనతో అతని పెదవులెండుకుపోయాయి.
ఇంకా మిగిలిన అయిదు గంపల టమేటా విషయం మాట్లాడాడు జాఫర్, సరుకు బాగాలేదనీ, మదనపల్లి సరుకు ముందు ఇది పనికి రాదనీ, మార్కెట్టు శానా మందమైపోయిందనీ, రేపెంతకుపోతే అంతకమ్ముతాననీ, లేకుంటే ఎనిమిది రూపాయలకు గంప ప్రకారం నలభై రూపాయలకు కమీషన్ పోనూ ముప్ఫెయారిస్తాననీ చెప్పాడు.
రామప్ప చెమట పట్టిన ముఖాన్ని టువ్వాలుతో తుడుచుకొని “మాకీ గతి కల్పించిన పాపానికి ఫలిత మనుభవించ” మన్నట్లు కోపంతో ఎర్రగా తన ముఖంలోకి చూస్తున్న గంపలోని టమేటా పళ్ళను అలాగే చూడసాగాడు కాసేపు.
అతని మౌనాన్ని అంగీకారంగా భావించి జాఫర్ సాబ్ ఆ పళ్ల గంపలన్నీ కట్టగట్టి అతని దగ్గర పడేశాడు. గంపల డబ్బులుపోనూ మిగతా పదారు రూపాయలు రామప్ప కందించాడు జాఫర్. అతని చేతులు అసంకల్పితంగా అందుకున్నాయి. కాళ్ళు బయటికి నడిచి మార్కెట్టు కెదురుగా ఉన్న కిరాణాషాపు దగ్గరికి చేరుకున్నాయి.
యూరియా సంచిలో సరుకులు మూట గట్టుకొని రామప్ప ముందుకు నడిచాడు. ఎదురుగా జామపళ్ళ బండి. దాన్ని చూడగానే ఇంట్లో సన్నోడూ, పెద్దోని కొడుకులూ, నడిపోని బిడ్డలూ కళ్ళముందు మెదిలారు. తాను టౌనుకొచ్చి వాళ్ళకేమైనా తీసుకుపోగల్లితే జామపండ్లు మాత్రమే. బేరమాడి
డజను పండ్లు తీసుకొని టువ్వాల్లో వేసుకున్నాడు.
“రామప్కామా, లారీ రెడీ అయిందంట, తొరగా రావల్లంట” ఎవరో పిలిచారు.
ఎవరో కొత్త మనిషి ‘మామా” అని పిలిచేసరికి ఆశ్చర్యంగా తలెత్తి చూశాడు రామప్ప. ఎదురుగా దస్తగిరి. ఎగాదిగా చూడసాగాడు రామప్ప.
“నేను మామా, గుర్తు బట్టలేదా! దూదేకుల వొన్నూరప్ప కొడుకును” పరిచయం చేసుకున్నాడు దస్తగిరి.
“వోర్నాయిలా నువ్వారా- నేను టీ తాగేటప్పుడే అనుకుండా, వీన్ని యాడో చూసినట్లుందే యెవురి పిల్లోడబ్బా అని. దొంగబడవా, “అప్పుడే చెప్పల్లా లేదా? మొన్నొగసారి మీ నాయిన కనిపిచ్చి నీ సంగతంతా సెప్పితే నేనేందోలే అనుకుండా అయితే యీడుండావన్నమాట” టువ్వాల్లో పండ్లు
మూటగట్టుకొంటూ అడిగాడు రామప్ప.
“అవును మామా, మనూర్లో బతకడానికి మల్లేముంది చెప్పు” తన పనిని సమర్ధించుకున్నాడు దస్తగిరి.
“మంచి పన్డేసినావు లేవోయ్. తప్పేముందిలే. అయితే సుబ్బరాయుడు దగ్గరుండావన్నమాట- సరే పదాం పద” అని మూటనెత్తుకోసాగాడు రామప్ప.
“కాఫీ తాగి పోదాంలే మామా, మూటిక్కడే బెట్టు. ఈ పండ్లాయన మనవాడేలే, చూస్తాంటాడు”.
కాఫీకి పిలిచాడు దస్తగిరి, రామప్పను. మూన్నాలుగేండ్లకే మాట తీరూ, వేషం అంతా మారిన దస్తగిరిని చూస్తూ ఆశ్చర్యపోతూ అతని వెంట నడిచాడు రామప్ప. ఇద్దరూ పోస్టాఫీసు దగ్గరున్న షన్ముగ విలాస్ వైపు నడవసాగారు.
“మా షావుకారి దగ్గరికి లారీ కోసమొచ్చింటివా మామా?” అడిగాడు
“వొగ లోడు వుల్లిగడ్డలుంటే గుంటూరు కేసకపోదామని వచ్చింటి” నిండుగా చెప్పాడు
“మరి లారీ కుదిరిందా?”
“లారీ యేమో కుదిరింది గానీ బాడిగే శానా దుబారప్పా, యేం జేతాం- నిర్వాకం లేదు”.
“మా షావుకారేమీ తగ్గించి మాట్లాల్లేదా మామా?”
“యేం తగ్గించడమో యేమోనప్పా, లారీకని వొత్తే “కమీసననీ ఫోన్ జేసిన దానికనీ అదనీ యిదనీ దుడ్లు మాత్రం బొలే గుంజుతార్రా నాయనా – సూత్తావుంటే మీ సావుకారిది మంచి శాన్సున్నట్లుంది- లెక్క బాగ సంపాయిచ్చినాడనుకుంటా”.
“ఎందుకు సంపాదించడు మామా? మీలాంటి రైతులొస్తే ఆయనకు పండగ. నిజం చెప్పితే నువ్ నమ్ముతావో లేదో గానీ దినానికి రెండు వేలు సంపాదిస్తాడనుకో. సంపాదించనీ, మల్లా అంత మోసమా మామా!” రామప్ప ముఖంలోకి చూస్తూ అన్నాడు దస్తగిరి. మోసమనే సరికి యేమీ అర్ధంగాక రామప్ప బిక్కమొగం వేశాడు.
“నిజం మామా, నువ్వుండూరోనివి కాబట్టి నిజం చెప్పుతాండా, ఆ ఫోన్లూ గీన్లూ అంతా అపద్దం. ఫోన్లో గుంటూరోళ్ళతో మాట్లాదేదీ, బెంగళూరోళ్లతో మాట్లాడేదీ అంతా బూటకం. రెండు మూడు సార్లు నేను గమనించినాను, ఇంట్లో కొడుకుతో అంతా ముందే చెప్పి మీ యెదురూగ యా పూరికి ఫోనెయ్యల్లో ఆ పూరికి చేసినట్లు రింగు దిప్పడం, అర్థగంట తర్వాత యింట్లో నుంచీ కొడుకు ఫోన్ జేస్తే గుంటూర్నుంచో, బెంగుళూర్నుంచో ఫోన్ వచ్చిందని గట్టిగా అరుస్తూ, యా రైతు ఫోన్ జెయ్యమని చెప్పింటాడో ఆ రైతు కనుకూలంగా మాట్లాడి నమ్మించడం మా షావుకారికి బ్రహ్మాండంగా తెల్సు మామా. దాంతో రైతులూ, చిన్న చిన్న వ్యాపారస్తులూ నిజమేననుకొని నమ్మి తమ మాసూలుకు మంచి రేటుందని నమ్మి లారీ బాడుగ యెంత జెప్పితే అంతకే వొప్పుకుంటారు. మీ పిచ్చి కాకపోతే యేంది మామా, గుంటూరుకు పన్నెన్ఫూర్తిస్తే యా లారీ వాడైనా యెగురుతా వస్తాడు. ఇది తెల్సుకోకుండా మీరు బ్రోకర్ల దగ్గరికే వస్తారు, వీళ్ళు మీతో కమీషన్, డ్రైవర్లతో కమీషన్ కొట్టడమే గాకుండా మామూలుగా నడిచే బాడిగ కంటే యెక్కువ మాట్లాడిన దాంట్లో సగం గుంజుతారు లేకుంటే యేంది మామా, పది పైసలు పెట్టుబడి లేకుండా, పొట్ట చించితే అక్షరం రాకేపోయినా బ్రోకరాఫీసని బోర్డేసుకొన్న నాయాళ్ళు యేం సంపాదించినారనీ! చెప్పితే నువ్వాశ్చర్యపోతావ్, మా షావుకారి కట్టించిన బిల్డింగు చూస్తే కండ్లు తిరుగుతాయనుకో. నాలుగు లారీలు సొంతముండాయ్. మొన్ననే శ్రీ కంఠం టాకీసు దగ్గర నాలుగు షాపులు కట్టించినాడు. గుత్తీరోడ్లో రెండెకరాల
ప్లాటు కొన్నాడు. అనుకుంటే ఆశ్చర్యం మామా, ఇట్లా ట్రోకరాఫీసులు ఇంగా ఏడెనిమిదుండాయి టవున్లో. అందరూ యింతే- నీతేందో, న్యాయమేందో, ధర్మమేందో అంతా అయోమయం” దస్తగిరి బ్రోకర్ల కథంతా కక్కేశాడు.
ఆశ్చర్యంతో వింటున్న రామప్ప కాసేపు తేరుకోలేకపోయాడు. సుబ్బరాయుని బ్రోకరాఫీసంతా పొద్దున్నుంచీ గమనించిందతా కళ్ళముందు కనిపించింది. మరోవైపు కూరగాయల మార్కెట్టూ, టమేటా గంపలూ, జాఫర్, అతని కథా కమామిషూ అంతా కనిపించింది.
అప్రయత్నంగా అతని నోరు మెదలింది. “వారి యీనెమ్మ కడుపులు గాలా, ఎంత మోసంరా దొంగ నా కొడుకులు! థూ థూ, అంతా బద్దు నాయాళ్ళే!” అని కేకరించి ఉమ్మాడు.
అదేమీ పట్టించుకోకుండా బజా జార్లో రిక్షాలూ, సైకిళ్ళూ, కార్లూ, బస్సులూ అన్నీ తిరుగుతూనే ఉన్నాయి. కాలేజీ విద్యార్థులు దేని కోసమో ఊరేగింపుగా వస్తూనే వున్నారు. రాజకీయ నాయకులెందుకో్ “రేపు అనంతపురం బంద్” అని జీపులో కూర్చొని మైకులో ప్రకటన చేస్తూ ఉన్నారు.