9.8 C
New York
Monday, November 25, 2024

గొడుగు

జి.అనసూయ

2023 దీపావళి కథల పోటీలో నాల్గవ బహుమతి పొందిన కథ

బాగా రద్దీగా ఉన్న కాలి జోళ్ళ కొట్టు లోపలికి అడుగు పెట్టాడు, నడివయసు గల ఆనందరావు. లోపల కాళ్ళకు కొత్త జోళ్లు తొడిగే వాళ్ళతో, కనుక్కొనే వాళ్ళతో… అన్ని వయసుల వారితో అక్కడంతా కోలాహాలంగా ఉన్నది. అసలు ధరలో ముప్పై శాతం తగ్గింపు అని ప్రకటించడంతో, ఆ కొట్టంతా చాలా రద్దీ గా ఉంది. కౌంటర్‌ దగ్గర అయితే వరుసలే కట్టారు జనం.

ఆనందరావు లోపలికి వచ్చి అక్కడున్న ఒక బల్ల మీద కూర్చున్నాడు. అందులో పనిచేసే ఒక కుర్రాడు, పేరు కృష్ట, ఆయనకు దగ్గరగా వచ్చి, ఏమండి మీకు ఎలాంటి చెప్పులు కావాలి అని అడగ్గా, తను తెచ్చుకున్న పేపరు ముక్క ను కృష్ణకు చూపించి, ఇలాంటి రకం పాదరక్షలు కావాలన్నాడు. ఇంచుమించు ఇదే రంగులలో కావాలన్నాడు. అయితే మీరు కొంచెం సమయం వేచి ఉండవలసి వస్తుంది. అని మర్యాదపూర్వకంగా ఆనందరావు గారితో చెప్పి వేరే వినియోగదారుని దగ్గరకు వెళ్ళాడు.

ఇప్పుడే వస్తానని వెళ్ళిన కురోడు చాలా సేపటికి కూడా రాలేదు. మిగిలిన వాళ్ళు కూడా ఎవరి హడావుడిలో వాళ్ళు ఉన్నారు. ఆ కుర్రాడు అందరికీ చూపిస్తున్నాడు, కానీ తన దగ్గరకు మాత్రం రావడం లేదు.

చివరకు వేచి చూసి, చూసి, లేచి వెళ్ళబోతు౦శే అప్పుడు వచ్చాడు కృష్ణ, అటువంటి రకం బూట్లను తీసుకొని. సార్‌ ఏమనుకోకండి. వాళ్లు పెద్దవాళ్లు, ఆలస్యం అయిందంటే గొడవ చేసేస్తారు, అని ఎందుకు ఆలస్యం అయ్యిందో వివరంగా, వినయంగా చెప్పాడు. అప్పుడు గాని తనని తను చూసుకోలేదు ఆనందరావు. ఎదురుగా ఉన్న అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకున్నాడు. కొంచెం మాసిపోయిన దుస్తులతో, చెదిరిన జుట్టుతో, అలసిపోయిన శరీరంతో సాదాసీదాగా ఉన్నాడు, అని గ్రహించుకున్నాక చిన్నగా చిరునవ్వు నవ్వుకున్నాడు తనలో తనే. తిరిగి, కృష్ణ చేత, తనకు నచ్చిన బూట్లలో అన్ని రకాలను బయటకు తీయించి, వాటిని కాళ్ళకు తోడుక్కొని మెత్తగా ఉన్నాయా లేవా, సరిగ్గా సరిపోయినాయా లేదా అని ఒకటికి పది సార్లు తనిఖీ చేయించుకున్నాడు.

కృష్ణకి విసుగొచ్చి, సార్‌ ఇవన్నీ బానో ఉంటాయి. మీకు నచ్చిన రంగు తీసుకోండి చాలా సౌకర్యంగా ఉంటాయి. మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే, వెంటనే తీసుకురండి. నేను మా యజమానితో మాట్లాడి, మీరు తీసుకున్న వాటికి బదులుగా వేరేవి ఇప్పిస్తాను అన్నాడు. బదులుగా మార్చుకుంటాను, అని భరోసా ఇచ్చాక వాటిల్లో నుంచి ఒక జతను ఎంచుకున్నాడు ఆనందరావు. ధరలో ముప్పై శాతం తగ్గింపు కూడా వచ్చింది. చాలా సంతోషంతో ధర చెల్లించి, ఆ కొట్టు నుండి వెలుపలకు వచ్చాడు. కృష్ట కూడా వాళ్ళ యజమానితో , ఇప్పుడే అలా వెళి తేనీరు తాగి వస్తానని చెప్పి బయటకు నడిచాడు.

అలా రోడ్డు మీద వెళ్తున్న కృష్ణను చొక్కా పట్టుకుని గట్టిగా వెనక్కి లాగేడు ఆనందరావు. ఆ ఉదుటకు ఎవరా అని వెనక్కి చూశాడు కృష్ణ. వెనక ఉన్నది ఆనందరావు.

సార్‌ మీరు.. అని కృష్ట అనేంతలోపే, బాబు కాస్త చూసుకుని నడువ్‌ అని తనకు దగ్గరగా వచ్చిన వాహనాన్ని చూపించాడు. తనను ప్రమాదం నుండి కాపాడినందుకు కృతజ్ఞతలు చెప్పాడు కృష్ణ.

జాగ్రత్తగా వెళ్ళు బాబు అని మరోమారు హెచ్చరించి, తను రోడ్డు ప్రక్కకు నడుచుకుంటూ
వెళ్ళిపోయాడు ఆనందరావు.

కృష్ణ, ఆనందరావు వెళ్ళే వైపే చూస్తు, పరిశీలనగా చూశాడు. చేతిలో చెప్పుల సంచి ఉంది, మరి
కాళ్ళకి చెప్పులు లేవు, ఉత్తకాళ్ళ తో వెళ్తున్నాడు ఏంటి అనుకుంటున్నంతలోనే, ఆనందరావు
ఒకచోట ఆగాడు.

అక్కడ, రోడ్డు ప్రక్కన చెప్పులు కుట్టే అతను, ఆనందరావు ని చూసి ఇదిగోండి, మీ చెప్పులు.
బాగా సరి చూసుకోండి సరిపోయాయో,లేదో.. అంటూ చెప్పుల జతను ఆనందరావు కి ఇచ్చాడు.

వాటిని చేతిలోకి తీసుకొని,ఇదిగో ఇక్కడ చూడు, అతుకు కనపడుతుంది, దీన్ని కనిపించనీకుండా ఇంకొంచెం గట్టిగా ఉండే మందపాటి రబ్బరు వేసి కుట్టు, కొంచెం పాలిష్‌ కూడా సెట్టు, అతుకు కనపడకూడదు, అంటూ దగ్గరుండి మరీ పాత చెప్పులకు కొత్త రంగును అధించుకున్నాడు.

తర్వాత వాటిని తీసుకొని, ఇదిగో నీ డబ్బులు అంటూ చెప్పులు కుట్టిన అతనికి డబ్పులు ఇచ్చేసి, చెప్పులను కాళకు తొడుక్కున్నాడు. ఈ చెప్పులు జతను బాగా కుట్టావయ్యా అన్నాడు మెచ్చుకోలుగా ఆనందరావు.

ఈసారికి కుట్టాను కానీ, తర్వాత మాత్రం మీరు ఆ జోడిని మార్చాల్సిందోనండి, అయినా కొత్తవి
కొన్నట్లు ఉన్నారుగా అని అతని చేతిలోని సంచిని చూసి అనుమానంగా అడగ్గా,

ఇవా! మా అబ్బాయికి. వాడికి ఏదో పోటీలకు కావాలంశేను, అంటూ తన చేతిలో ఉన్న సంచిని
చాలా ప్రేమగా స్పృశించి, కాళ్ళకు తను అతుకు వేయించుకున్న పాత చెప్పులు తొడుక్కున్నాడు.

ఇదంతా గమనించిన కృష్ణకు, కళ్ళు చమర్పాయి అప్రయత్నంగానే, తన తండ్రి గుర్తొచ్చి. ఆనందరావు వెళ్తున్న వైపే చూస్తుండిపోయాడు కృష్ణ. పాదాలకు చెప్పులు రక్షణ అయితే, పిల్లలకు తండ్రి.. గొడుగు లాంటివాడు. ఎండకి ఎండుతా, వానకు తడుస్తా.. గొడుగు లాగా కాపాడే వాడే నాన్న అనుకుంటూ కళ్ళు తుడుచుకున్నాడు.

Vote this article
Prakasika
Author: Prakasika

Related Articles

Stay Connected

Latest Articles