9.8 C
New York
Monday, November 25, 2024

మాను మనిషి

రాయప్రోలు వెంకట రమణ

2023 దీపావళి కథల పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ

“కారు గొన్న కాడి నుండీ పోరుతుంటే ఇయ్యాల్టికి తీరింది నీకు మా ఊరు తీసికెళ్ళేందుకు” కోరిక తీరుతున్నా ఏదో ఒక అసంతృప్తి వ్యక్తపరవడం అలవాటైన శకుంతల అదే ధోరణిలో అంది కారు నడుపుతున్న భర్త శ్రీశైలంతో.

“సర్లే … కుదరొద్దేందీ నువ్వడిగితే మాత్రం! మొన్నటి దాకా పనులు తగుల్లనే ఉన్నయ్‌ గదా! ఇప్పుడు ఆషాడం వొచ్చింది గన్క పనుల్లేవ్‌ . కొంచెం తీరుబడగానే బయల్దేరితివి” సమాధానంగా అన్నాడు శ్రీశైలం.

“అది సరే గానీ… నిన్న మాల్‌ లో మీ అమ్మానాయన్ల కోసం గొన్న బట్టలు పెట్టినావా లేదా కార్లో?” మళ్ళీ శ్రీశైలమే అన్నాడు.

“పెట్టినా” వెనక సీట్లో పెట్టిన బట్టల కవరు వైపు చూసి చెప్పింది శకుంతల.

“ఎప్పడ్నుండో అనుకుంటంటే ఇప్పటికుదిరింది అమ్మకి మంచి పట్టుసీరె పెట్టనికి. రంగు అమ్మకి చానా నప్పుద్ది” తల్లిని తలుచుకుంటూ అంది శకుంతల.

శ్రీశైలం కారు వేగాన్ని పుంజుకుంది.

మరికొద్ది సేపటికే “ఏవండీ!!” అని శకుంతల పేద్దగా అరవడంతో, కారుని ప్రక్కకి తీసి ఆపి, ” ఏవైందే… అట్లా అరిసినావు. భయపడి సచ్చేట్టు” అన్నాడు.

“ పోయిన్నెల మన పెళ్ళి రోజుగ్గోన్న పట్టు సీరె పొద్దున మిద్దె మీద తీగె మీద ఆరేసి వొచ్చినా”.
“అయితే ఇప్పుడు నేనేం సేయాల?” చిరాకు పడుతూ శ్రీశైలం.
“తిప్పి ఎనక్కి పోనీయ్యి…. నాకు బయ్యంగుంది, ఉంటదో ముక్కలైపోద్దో! “ హుకూం జారీ చేసింది శకుంతల.

“ ఏందీ ? యెనక్కి తిప్పి ఇంటికి పోనీయాలా? ఎంత దూరమొచ్చినమో దెల్సా ఇంటి కాడ నుండి, ముప్పెయయిదు కిలో మీటర్లు”

“ అయితే? ఆ సీరె ఎంత బెట్టి గొన్నామో ఎరుకేగా! ముప్పై ఏలు! అది గానీ మన పక్కవోళ్ళ యింట్లోకి గాలికి గాని ఎగిరి బడిందంటే నాకు మిగిలేది సీర ముక్కలే“ భవిష్యవాణి పలికినట్లు పలికింది శకుంతల.

“అంతే నంటవా…” అంటూ కారుని వెనక్కి తిప్పి ఇంటి వైపు పోనిస్తూ శకుంతల లోని ఆరాటాన్ని చూసి, “గాబరా పడకే! ఏవీ గాదులే నీ సీర“ ధైర్యం చెప్పాడు శ్రీశైలం.

“నువ్వు ఆళ్ళ సెట్టు కొమ్మలు నరికేసిన కాడి నుండి కళ్ళు నిప్పులు జేసుకొని వుంటోంది బుజ్జెమ్మ. అవకాశమొస్తే వూరుకుంటదా! నా సీరె గాని వాళ్ళ యింట్లో బడిందంటే దాన్ని ముక్కలు ముక్కలు జేసి ఆళ్ళ కుక్క మెడకి తాడు లాగా కట్టి తిప్పుతది” కళ్ళూ, నోరూ పెద్దవి చేస్తూ చెబ్లూంటే టీవీ సీరియల్స్‌ లో అత్త గారిలా కన్పించింది శకుంతల శ్రీశైలానికి. తను ధైర్యంగా ఉన్నా శకుంతల భయానికి కారణం ఉందని గ్రహించి, కారు వేగం పెంచాడు శ్రీశైలం.

గతవారం శ్రీశైలం చేసిన ఘనకార్యం –

శ్రీశైలం భార్య శకుంతలతో, నాగబాబు భార్య బుజ్జమ్మతో ప్రక్కప్రక్క ఉండే ఇళ్ళ యజమానులు. శ్రీశైలం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తుంటే, నాగబాబు ఫర్నీచర్‌ దుకాణం నడుపుతున్నాడు. రెండు ఇళ్ళనీ వేరు చేస్తూ ఓ ప్రహరీ గోడ, ఆ గోడ మొదట్లో, ఇంటికి ముందు వైపు నాగబాబు పెంచిన మామిడిచెట్టు. ఆ చెట్టు చాలా తొందరపడి పెరిగేసి బోల్డు కాయలు కాయడం మొదలు పెట్టింది రెండేళ్ళ నుండి. మామిడి చెట్టు అడ్డుగోడకి ప్రక్కనే ఉండడం వల్ల మూడో వంతు కొమ్మలు శ్రీశైలం ఇంట్లోకి వాలి ఉన్నాయి. “మీ వైపు పడిఉన్న కొమ్మలకి కాసే కాయలన్నీ మీవే సీశైలం” అంటూ హక్కు భుక్తం చేశాడు నాగబాబు చెట్టు గోడదాటి పెరగడం చూసి. సంతోషంగా అంగీకరించాడు శ్రీశైలం. అలాగే రెండేళ్ళ నుండీ మామిడి
కాతంతా ఇరు కుటుంబాలూ అనుభవిస్తున్నాయ్‌.

నడమంత్రపు సిరి బుల్లెట్‌ టైన్‌ వేగంతో వచ్చి శ్రీశైలంని వాటేసుకోడంతో, అతని జీవితంలోకి ఖరీదైన కారూ, అతని భార్య వంటిమీదకి బంగారు నగలు, ఇంట్లోకి ఖరీదైన సామాన్లూ, బట్టలు వచ్చి చేరాయ్‌ . కొత్తదీ, ఖరీదైనదీ అయిన కారుకు పార్కింగ్‌ వసతి అడ్డుగోడ ప్రక్కన, శ్రీశైలం ఇంటి వైపు వాలి, పెరిగిన మూడో వంతు మామిడి కొమ్మల క్రింద మాత్రమే కుదిరింది. చక్కగా చెట్టు నీడ ఉందిలే అనుకున్నారు శ్రీశైలం దంపతులు.

రెండు రోజుల ర్యా చెట్టు నీడైతే ఉంది గానీ పైనుండి పడే ఆకులూ, కొమ్మలూ, పక్షుల రెట్టలూ చికాకు పెట్టసాగాయ్‌ . చికాకు ‘చీదరగా, ర అసహ్యంగా, కోపంగా మారడానికి ఎక్కువ కాలం పట్టలేదు. వాళ్ళకి.

ఓ రోజు నాగ బాబు బుజ్జమ్మలని పిలిచి “కారు పాడైతంది. మామిడి సెట్టు కొమ్మలు కొట్టింసేద్దాం” అన్నారు శ్రీశైలం, శకుంతల.

“అయ్యో! అందు కోసం కాయలు గాసే సెట్టుని కొట్టేస్తామా? షెడ్డు కట్టింసేసుకుంటే సరికదా” అని సలహా ఇచ్చారు నాగబాబు, బుజ్జమ్మ.

కట్టినా, గాలి వానలకి కొమ్మలు విరిగి, షెడ్డు మీదపడి, అది వచ్చి కారు మీద పడుతుందనీ, కొమ్మలు కొట్టిందాల్సిందననీ పట్టుబట్టారు శ్రీశైలం, శకుంతల.

మాటా మాటా పెరగడం, అది నువ్వెంతంటే నువ్వెంత అవడం, నువ్వు కొట్టేయకపోతే నేనే నరికి పారేస్తానని శ్రీశైలం శపథం చేయడం దాకా వెళ్ళింది. విషయం ఆ కాలనీ సొసైటీ వరకు వెళ్ళింది. వచ్చేనెల మీటింగు లో చర్చిద్దామని చెప్పాడు సెక్రెటరీ.

మరుసటి వారం నాగబాబు వాళ్ళు పనిమీద ప్రక్క ఊరుకి వెళ్ళారు. అదను చూసుకొని శ్రీశైలం అడ్డుగోడ దాటి తన ఇంటి వైపు పడే మామిడి చెట్టు కొమ్మలన్నీ నరికించేశాడు! ఊరు నుండి వచ్చిన నాగబాబు అది చూసి హుతాశుడయ్యాడు. చేయి తెగిన మనిషిలాగా కన్పడింది తను ఇష్టంగా పెంచుకున్న మామిడి చెట్టు నాగబాబుకు. దుఃఖం పొంగుకొచ్చింది అతనికి.

పెద్ద తగాదా అవడంతో సొసైటీ సెక్రేటరీ విచారణ జరిపి, శ్రీశైలం తొందరపాటుని తప్పుపట్టి, నాగబాబుకు శ్రీశైలం “కమాపణ” చెప్పాలన్నారు!

“నేను సెప్పను. ఏం సేసుకుంటారో సేసుకోండి” కర్కశంగా అని వచ్చేశాడు శ్రీశైలం.

ఇది జరిగి అయిదు రోజులే అయింది.

అందుకే తన ఖరీదైన పట్టుచీరె నాగబాబు వాళ్ళింట్లో పడితే వాళ్ళు వదులుతారా? చింపి పోగులు పెట్టి ప్రతీకారం తీర్చుకోరూ? – అనేది శకుంతల భయం!

కారు ఇంటి సందు మలుపు తిరుగుతూనే శకుంతలలో ఆదుర్దా ఎక్కువైంది. నాగబాబు కొడుకు, వాళ్ళింటిముందు గాలిపటం ఎగరేసుకుంటున్నాడు. గాలి పటానికి పెట్టిన తోక తన పట్టుచీరె అంచులాగా తోచింది శకుంతలకి. కీడు శంకిస్తున్న మనసు ” ఇంకేవుందీ! అనుకున్నంత పనీ అయింది” అని పలికింది.

ఇంటి ముందు కారుదిగి మేడ మీదికి పరిగెత్తింది. పట్టు చీరె అక్కడి తీగె మీద లేదు! పిట్టగోడ చుట్టూ క్రిందకి చూస్తూ తిరిగింది ఏ ప్రక్కైనా పడిందేమోనని! ఎక్కడా లేదు. కారు లోనే ఉండి మేడవైపు చూస్తున్న శ్రీశైలంకి చేత్తోనే సంజ్ఞ చేసింది లేదన్నట్టు. ఆమెకి దుఃఖం తన్నుకొస్తోంది. శ్రీశైలం కారు దిగి ఇంటి చుట్టూ చూశాడు, రెండిళ్ళ మధ్య ఉన్న అడ్డుగోడ మీద ఎక్కి నాగబాబు ఇంట్లో పడిందేమో చూశాడు. ఎక్కడా కన్పడలేదు ముప్ఫైవేల పట్టుచీర!

స్వయంకృత తెలివి తక్కువ తనానికి పశ్చాత్తాపంతో మెట్లు దిగుతున్న శకుంతలతో “రా… కారెక్కు. సెక్రట్రీ దగ్గరే తేలుద్దాం” అన్నాడు.

సెక్రేటరి ఇంటికెళ్ళి విషయమంతా చెప్పి “నాగబాబుని పిలవండి. ఆ సీరె వాడింట్లోనే ఉంటది, తేమనండి” అన్నాడు శ్రీశైలం.

“పడిందే అనుకొ, నాగబాబు నా మామిడి కొమ్మలు నాకు తిరిగి చెట్టుకు తెప్పించండి అంటే?” సెక్రేటరీ శ్రీశైలం దంపతులులకి బుద్ధి చెప్పడానికి వచ్చిన అవకాశం పూర్తిగా వాడుకున్నాడు.

“సెట్టూ, అంత ఖరీదైన సీరే ఒగటెట్లా అయితయ్‌ ? సెట్టు మా యిల్లు, కారూ పాడు జేస్తంది. సీర అటుపడ్డే ఆళ్ళకేం నష్టమైతది?” బొంగురు పోతున్న గొంతుతో శకుంతల.

“ఎదిగిన కొడుక్కి చెయ్యి తెగినంతగా బాధపడ్డాడయ్యా నాగబాబు నువ్వు కొమ్మలు కొట్టించావని. మానుకు నష్టమొస్తే తట్టుకోలేనోళ్ళు, మనసుల్ని నష్టపెడతారాయ్యా వాళ్ళు!” అంటున్న సెకేటరీతో, “ మీరు పిలిపిస్తారా…. నన్నే తేల్పుకోమమంటారా ఆళ్ళతో” అన్నాడు శ్రీశైలం. మాట పెంచుకుంటున్న మొగుణ్ని చూసి చీర రాదని భయంతో, తగ్గమని చేయి చూపించింది శకుంతల.

“మీరు ఇక్కడ ఉండగా నేను రమ్మన్నా వాళ్ళు రారు. ఎందుకో తెల్సా…. మీతో మాట్లాడ్డమే ఇష్టం లేదు వాళ్ళకి” చెప్పాడు సెకేటరీ.

“మీతో సెప్పారా అట్లాగని?” అడిగింది శకుంతల.

“అవును” అంటూ సెక్రేటరీ తన ఎదురుగా ఉన్న టీపాయ్‌ క్రింద నుండి ఒక కవరు తీసి శకుంతల చేతిలో పెట్టాడు.

కవరు తెరిచి చూసిన శకుంతల కళ్ళు చెమ్మగిల్లాయ్‌ – అందులో ఉన్నది తన ముప్ఫైవేల రూపాయల చీరె! ఆ చీరె నిండా ఖరీదైన జరీ బుటాలో ఉన్న మామిడికాయల గుత్తులు “మేం పదిలమే” అంటూ వెక్కిరిస్తూన్నట్లు తోచినయ్‌ !

“సందర్భాలని ఘర్దణలకి దారితీసేలా మలుచు కోవాలా, గర్వపడేలా మలచు కోవాలా తెలియాలి శ్రీశైలం! నాలుగు రాళ్ళు సంపాదించగానే సరిపోదు! నాలుగు మనసుల్నీ గెలిస్తేనే జీవితం సఫలం! ” సెక్రేటరీ చెప్పిన చివరి మాటలు మళ్ళీ మళ్ళీ విన్పిస్తున్నయ్‌ శ్రీశైలంకి ఇంటికి వస్తూన్నంత సేపూ!

పాపం…. శకుంతల మళ్ళీ ఆ చీరె కట్టలేక పోయింది, నాగబాబు దంపతులు ఉపేక్షించి వదిలిన చేదు అనుభవం చీరంతా పెనవేసుకు పోవడంతో.

( సమాప్తం)

Vote this article
Prakasika
Author: Prakasika

Related Articles

Latest Articles