8.4 C
New York
Monday, November 25, 2024

భయం

– డాక్టర్‌ వి.ఆర్‌.రాసాని

పున్నమిరాత్రి నిండు చంద్రుణ్ణి పట్టుకొని
వెన్నెల తేనీటిని వంచుకొని తాగేయాలని వుంది

చీకటి కళ్లంలో జారిపోయిన
తారల గింజల్ని ఏరి ఏరి
ఉడ్డపెట్టి, ముత్యాల మాలల్డాకట్టి
నా ఇంటి గోడలకీ, గుమ్మానికీ వ్రేలాడదీయాలని వుంది

నాకే గనక రెక్కలొస్తే, ఆకాశంలోకెగిరి
పంచరంగుల సీతాకోకలతో విహరించి
రామచిలుకలతో ఖగభాషలో ఊసులాడి ఆనందించి
హాయిగా తిరిగి రావాలనివుంది

మధురంగాకూసే కోకిల పాటగా
పురివిప్పి ఆడే నెమళ్ల నాట్యంగా మారి
ఆడి, పాడి, అలసి సొలసిపోవాలని వుంది
మేఘాల గాలిపటాల మధ్యన కూర్చొని
ఆకాశమంతా తిరిగి ప్రకృతి అందాలను
వీక్షించి తరించి పోవాలనివుంది

ప్రాక్సొయ్యి మీద కొండల రాళ్ల మధ్యన
ఎర్రగా మండే సూర్యుని మంటలపైన
క్షీరఘటాన్నికాచి, తోడుపెట్టి
కొండకవ్వాన్నేసి చిలికిచిలికీ
అందులోనే తెల్లటి వెన్నముద్దనై తేలిపోవాలని వుంది

ఇంకా…ఏమేమోచేసి చేసీ
పరవసించి నిలువునా కరిగిపోవాలని వుంది
కానీ…. అవకాశమేదీ?

వైరస్‌ వైరిమూకలు మేనికోటలోకి దూకి ఖై
రక్తపుచుక్కల్ని పీల్చేస్తాయనీ, కరోనా కర్కోటకులు కసితో
కాటేసి కాలకూట విషంతో చంపేస్తారనీ
ఒకటే… భయం-భయం



5/5 - (1 vote)
Prakasika
Author: Prakasika

Related Articles

Latest Articles