మీ అమ్మాయి నచ్చింది
– బివిడి ప్రసాదరావు
సర్రున తలెత్తింది అనుపమ. ముకుందరావుని చూస్తోంది. ఆమె చూపులు భగభగలాడుతున్నాయి.
ముకుందరావు కూడా అనుపమనే చూస్తున్నాడు. అతడు చిన్నగా నవ్వుతున్నాడు. మళ్లీ చెప్పాడు: “మీ అమ్మాయి నచ్చింది” అని.
అనుపమ గిర్రున తల తిప్పేసింది. ఆమె లోలోపల చిందరవందరయ్యి పోతుంది. ఆమె తలలో కొద్ది నిముషాలు క్రితం జరిగింది గమ్మున కదిలింది.
***
పెళ్లి చూపుల కార్యక్రమం సాగుతుంది.
“అబ్బాయితో అమ్మాయి విడిగా మాట్లాడాలంటుంది” చెప్పాడు మధ్య మనిషి.
“దాని మొహం. అలా అక్కరలేదు.” అన్నాడు అనుపమ తండ్రి. ఆ వెంబడే అనుపమని కోపంగా చూస్తున్నాడు.
అంతలోనే, “పర్వాలేదు. నేను మాట్లాడతాను” చెప్పాడు ముకుందరావు.
దాంతో అనుపమ తండ్రి, “పెరటన అనువుగా ఉంటుంది. పచ్చదనం చల్లదనం పుష్కలంగా ఉంటుంది. రెండు కుర్చీలు వేస్తాను. రండి” అనని అటు విసురుగా వెళ్లి ఆ పనిని చేసి వచ్చాడు అంతే వేగంగా.
“వెళ్లండి” చెప్పాడు మధ్య మనిషి.
అనుపమ లేచింది. ఆమె వెంట కదిలాడు ముకుందరావు.
ఆ ఇద్దరూ ఎండున్న చోట వేసిన ఆ కుర్చీల్లో కూర్చున్నారు ఎదురెదురుగా. వాళ్ల మధ్య దూరం జాస్తీగానే ఉంది.
“దయచేసి నేను నచ్చలేదని చెప్పేయండి” అని చెప్పింది అనుపమ టక్కున.
“అదేమిటి” అశ్చర్యపోయాడు ముకుందరావు. ఆ వెంటనే, “కారణం” అన్నాడు.
“అమ్మ కోసం పెళ్లి వద్దనుకుంటున్నాను” చెప్పింది అనుపమ.
“అంటే!” అడిగాడు ముకుందరావు.
“మా అమ్మ అకాలంగా అనారోగ్యం పాలవుతుంటుంది. రెండు మూడు రోజులు లేవ లేని స్థితికి గురవుతుంటుంది. అప్పుడు నా చేదోడు ఆమెకి తప్పనిసరి. వీళ్లకి నేనొక్కత్తెనే” చెప్పింది అనుపమ.
“నాకు అర్థం కాలేదు. కాస్తా వివరించగలరా” అడిగాడు ముకుందరావు.
“అదే. నాన్న తాగుడుకు పరమ బానిస. తాగి అమ్మని వణికిస్తారు. దారుణంగా కొడతారు. అమ్మ పరువు అంటూ కిక్కురమనదు. నాన్న దాష్టీకాన్ని భరిస్తుంది. దిగమింగుకుంటుంది. నాన్నకి అది ప్రతి మారు అలుసవుతుంది.” చెప్పింది అనుపమ.
“మరి మీరు ఏం చేస్తున్నారు. వారించాలి కదా.” అన్నాడు ముకుందరావు.
“అమ్మ తన ఒట్లుతో నన్ను కట్టి పడేస్తుంటుంది. నేను కలుగుచేసుకుంటే తను చస్తానని తెగేసి చెప్పుతుంది. తను మొండిది. అందుకే నేను తగ్గుతుంది” అనని, “పెళ్ళికై వచ్చిన ప్రతి వారిని నేను ఇలానే కోరుతున్నాను” చెప్పింది అనుపమ.
“ఆహా. ఇదేం పోకడ. మీ సమస్యకి ఇది పరిష్కారం కాదు” చెప్పాడు ముకుందరావు.
“మరి నాకిదే చేతనవుతుంది.” చెప్పింది అనుపమ.
“ఇప్పటికి ఎన్ని సంబంధాలు తప్పించారు” అడిగాడు ముకుందరావు చిత్రంగా.
“మీదీ తప్పితే ఆరు” చెప్పింది అనుపమ. ఆమె ముకుందరావుని చూస్తుంది.
“అరె. ఐనా ఎందుకు ఇంత వరకు. తొలుతనే సంబంధాలు లేకుంటా లేదా రాకుంటా మీరు ఆపిస్తే పోలే. ఆఁ.” అన్నాడు ముకుందరావు.
“చెప్పా. నాకు పెళ్లి వద్దని. నాన్నా వినరు. అమ్మ మాట కాదు. అందుకే నా తంటాలు నావి.” చెప్పింది అనుపమ నిస్సహాయతగా.
“మీ ఆలోచన తప్పు. మీ పెళ్లి ఆపుకొని మీ అమ్మకి మీరు అండగా ఉండాలనుకోవడం సరి కాదు. మీరు బయలవ్వాలి. మీ నాన్నని నిలదీయాలి. అదే కరెక్టు” అనని, “మీ కుటుంబ పెద్దలకి ఈ తతంగం తెలుసా. వాళ్ల జోక్యం లేదా” అడిగాడు ముకుందరావు చిరాకుగా.
“అమ్మ వైపు వారు లేరు. నాన్న వైపు వారు ఉన్నా పట్టించుకోరు” చెప్పంది అనుపమ.
“ఛఛ.” అనంటూనే గట్టిగా నొసలు నొక్కుకుంటున్నాడు ముకుందరావు.
అనుపమ అయోమయమవుతుంది. “ప్లీజ్. నన్ను కాదనేయండి” అంది దీనంగా.
ముకుందరావు ఏమీ అనడం లేదు.
మూడు నిముషాలు మౌనంగా పోయాయి.
“చాలా సేపు ఐంది. నాన్న పిలిచేస్తారు. దయచేసి నేను నచ్చలేదని చెప్పండి. నా పాట్లు నేను పడతాను. మీదీ తప్పిపోతే చాలు” అంది అనుపమ రెండు చేతులు జోడించి.
“అదేదో మీరే చెప్పేయవచ్చుకదా. నేనే మీకు నచ్చలేదని” అనేశాడు ముకుందరావు గబుక్కున.
“అమ్మో. నాన్న మరీ రెచ్చిపోతారు. అమ్మనే చావ బాదుతారు” అంది అనుపమ బెంబేలుగా.
“ఓహో. అదీ చవి చూసేశారా” అన్నాడు ముకుందరావు.
“నాన్న తాగితే మనిషికారండీ” చెప్పింది అనుపమ.
అనుపమనే చూస్తున్నాడు ముకుందరావు. అంతలోనే అనుపమ తండ్రి అక్కడకి వచ్చేశాడు. వాళ్లని తనతో పాటు లోనికి తీసుకు వెళ్లాడు.
***
“అబ్బాయి నచ్చాడు. ఇక అమ్మాయి…” అంటూ ఆగాడు మధ్య మనిషి.
“తనేం చెప్పుతుంది. మాకూ ఈ సంబంధం ఇష్టమే” అనేశాడు అనుపమ తండ్రి.
“అయితే మిగతా మాటలు కానిద్దాం” అనేశాడు మధ్య మనిషి భుజాలెగరేస్తూ.
“లేదు లేదు. ముందు నాకు ఒకటి తేలాలి.” చెప్పాడు ముకుందరావు టక్కున.
అందరూ అతనినే చూస్తున్నారు. అనుపమ మరిన్నూ.
“అమ్మాయి అందం చదువు సామాన్యం. కానీ ఆమె రీతి అమోఘం. కనుక నేను ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. కానీ దానికి ముందు నాకు ఒకటి కావాలి” అని చెప్పాడు ముకుందరావు.
“ఏమిటి బాబూ” అన్నాడు మధ్య మనిషి.
“వీరు” అంటూ అనుపమ తండ్రిని చూపిస్తూ, “ఇకపై తాగుడు మానేయాలి. పైగా తాగుడు మానేస్తానని, మాట తప్పితే నేను తీసుకున్న ఏ నిర్ణయానికైనా సమ్మతిస్తానని పత్రం వ్రాసి వీరు నాకు ఇవ్వాలి.” చెప్పేశాడు ముకుందరావు.
అనుపమ తికమకవుతుంది.
అనుపమ తండ్రి, “ఇదేమిటి” అన్నాడు అయోమయంగా.
“అంతే. ఇదంతే. లేకపోతే మీ తీరు ఏమిటి. మీ భార్య మీ కుటుంబం పరువు కోసం తపిస్తున్నారు. మీ అమ్మాయి తన తల్లి కోసం దీనురాలవుతుంది. వీటిని మీరు గ్రహించలేకపోతున్నారు. గుర్తించలేకపోతున్నారు. కారణం మీ తాగుడే.” అననేశాడు ముకుందరావు విసురుగా.
అనుపమ తండ్రి నివ్వెరపోయాడు.
“మీరు పెళ్లికి కాదన్నా నేను మాత్రం మీ భార్య, మీ అమ్మాయి తరుపున నిలుస్తాను. మిమ్మల్ని నిలవరించే వరకు పోరాడతాను. నేను చేపడుతుంది మంచిదే. ఇక మీరే అల్లాడుతారు. ఆలోచించుకోండి” అన్నాడు ముకుందరావు నిలకడగా.
అనుపమ తండ్రి గజిబిజి అయ్యాడు. ముకుందరావు పట్టుగా నిలిచాడు.
చివరాఖరున, “ఇది మన మధ్యనే సమసి పోవాలి. నేను మరింత అలుసు కాను.” అనని, “బాబూ నువ్వు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటాను. మా అమ్మాయిని పెళ్లి చేసుకోండి” అని కోరాడు అనుపమ తండ్రి.
అనుపమ సంబరమయ్యింది. ముకుందరావు చక్కగా నవ్వుతున్నాడు.
“శుభం” అన్నాడు మధ్య మనిషి.
***