నేటి యూరప్ లోని విద్యావిధానాల
(భారతి_1945_issue1Vol22)
నేటి నవీనకాలంలో యూరోపునందలి విద్యావిధాన సూత్ర క్రమమందు విచిత్రమైన పరిణామం గోచరము కాజొచ్చింది. యూరోపుచరిత్రలో ఆధునిక యుగమన్నది 14వ శతాబ్దం నాటి సంప్రదాయ విద్యా పునరుద్ధరణతో ప్రారంభ మయినట్లు చెప్పవచ్చు. నాటి మొదలుకొని యింతవరకు వరుసగా (కావలసి
నంత కలగాపులగంగానే అనుకోండి) నాలుగు సూత్రపద్ధతులు చూపట్టాయి. వాటిని మనం మానవీయ సూత్ర పద్ధతి అనీ, వాస్తవిక సూత్ర పద్ధతి అనీ,
ప్రాకృతిక సూత్రపద్ధతి అనీ, సామాజిక సూత్ర పద్ధతి అనీ నాల్గింటినీ నాలుగు పేర్లతో పిలవవచ్చు. ఆ చతుస్సూత్రి (Humanistic Theory; Realistic Theory;
Naturalistic Theory; Sociological Theory.) ఊదిఉద్ఘాటిస్తూ వున్న విద్యావిశేషాలను సమ్యగ్విచారణ చేసి, వాటిని మన ప్రాచీన భారతదేశంలోని విద్యాసూత్రక్రమాలతోనూ, ఆచరణ ప్రచారణలతోనూ పోల్చి పరిశీలించడం అతి ఆహ్లాదకారిగా ఉండగలదని నా విశ్వాసం.యూరపులో పైన చెప్పిన మానవీయ విద్యాసూత్రక్రమమన్నది సంప్రదాయబద్ధమైన కావ్యవిద్యా పునరుద్ధరణకు సాక్షాత్ ఫలితంగా ఏర్పడింది. ఈ పద్ధతి ప్రకారం గనక చూస్తే సలక్షణమైన వాఙ్మయాన్ని పిల్లచేత లక్షణంగా చదివింపజేసి, వారి కవి చక్కగా బోధపడేటట్టు చేయడమే పిల్ల విద్యాబోధనకు ప్రశస్తమైన మార్గంగా ఏర్పడుతున్నది.
ఎందుకంటారేమో! కావ్యవాఙ్మయమనేది మానవీయ మహిత అనుభవాలకు మహోత్తమమైన ఆకారం వంటిది. కావ్యవాఙ్మయంలో యుగయుగాల నాటి జ్ఞాన పుంజమంతా నిండి నిబిడీకృతమై వుంటుంది. ఏతావాతా ఏమి చేయవలసి వుంటుందంటే, పసిపిల్లలు చదువనూ రాయనూ నేర్చిన వెనువెంటనే వారు గ్రీకు లాటిను గ్రంథాలను చదివి అర్థం చేసుకొని సరిగా సమన్వయపరచుకొనేటట్టు వారికి
నేర్పవలసి వుంటుంది. ఈ పని నెరవేర్చవలెనంటే, మరి వారికి ఆ భాషల వ్యాకరణ పరిజ్ఞానం అత్యవసరంగా ఏర్పడింది. దాని ఫలితంగా లెక్కలేనన్ని వ్యాకరణపు బళ్ళు బయలుదేరాయి. వాటిలో కావ్యకలాపం క్రమానుక్రమణికగా నేర్పుతూ వచ్చారు. శిక్షణ సమస్తమూ భాషావాఙ్మయాలకు మాత్రమే నియంత్రితమవుతూ వచ్చింది. పిల్లలందరూ ఈ ప్రాచీన భాషల వ్యాకరణాల్లోని వివిధ సూత్రాలనూ కంఠాపాఠంగా విధిగా నేర్వవలసి వచ్చింది.
ఆ నేర్వడం కూడా వట్టినే కాదు. ఉదాహరణ ప్రత్యుదాహరణతోనూ, అపవాద ప్రత్యపవాదాలతోనూ సహా నేర్వవలసి వచ్చింది. పురాణ కావ్యవాఙ్మయంలోని గాథోపగాథల వివరాలనన్నిటినీ కూడా వారు వాటి భూగోళ విశేషాలతోనూ, చారిత్రక సన్నివేశాలతోనూ సహాక్రమంగా తెలుసుకోవలసి వచ్చింది. ఈరీతిగా వారు పాత్రపరిశీలన చేసి ప్రస్తుతించడమో, లేక జీవితంలోని ఉన్నతోన్నతమైన ఆదర్శాలతో సానుభూతి కనపరచడమో చేయగలిగేలోపుగానే వారి మనస్సులు వట్టి నిష్ర్పయోజనమైన జ్ఞానపుంజంతో తలమున్కలుగా క్రుంగిపోవలసి వచ్చింది. ఇంతకూ ఆమానవీయవిద్యావిధానం మనసులోపెట్టుకొని యుండిన ఆదర్శమేమో తెలుసునా? కావ్యవాఙ్మయనిష్ణాతుడే ఆ విధానానికి ఆదర్శమూర్తి. కాని ఆ ఆదర్శాన్ని అందుకొని ఆదరించడానికి పూర్వం ఈ విద్యావిధాన ప్రయత్నాలలో బోలెడంత దండగమారి వ్యవహారం జరుగుతూ వచ్చింది. ఆదర్శాన్ని అందుకోగలిగిన పిమ్మట కూడా అందులో ఏవో అనేక జీవితావసరాలు లోటుపాటుకు లోనైయున్నట్టు ద్యోతకమయ్యేది.
ఈ పద్ధతిమీద సంపూర్ణంగా ఆధారపడిన విద్య గట్టిగా చేయగలిగితే గనక చిత్తసంస్కారంగల చిన్మయవ్యక్తిని – సౌందర్యమంటే చెవికోసుకొనే సహృదయుణ్ణి – మానసిక వాసనలలోని మహితచ్ఛాయలను ప్రస్తుతింపగలిగే మహితాత్ముణ్ణి – మానవ ప్రకృతిని గురించిన పరిజ్ఞానం ప్రకృష్టంగా గలిగిన ప్రబుద్ధుణ్ణి సృష్టింపగలిగే మాటయేమో వాస్తవమే. కాని, అత్యధిక సంఖ్యాకమైన సందర్భాల్లో ఈ పద్ధతి నిజానికి మాటలు, మాటలు, మాటలు వట్టి మాటల పోగులైన మనుష్యులను మాత్రమే – తాము సాక్షాత్తుగా నివసిస్తున్న ఈ ప్రపంచమంటే యేమిటోకూడా సరిగా యెరుగని శుద్ధ బుద్ధ స్వరూపులను మాత్రమే – వాస్తవ జీవితంతో అణుమాత్రమైనా సంబంధ సంపర్కాలకు నోచుకోని ఛాందసులను మాత్రమే సృష్టింప గలిగింది. ఈ మానవీయ విద్యావిధానానికి పరిణామఫలంగా వచ్చిపడింది రెండవదయిన వాస్తవికవిధానం. ఏతత్సంప్రదాయవాదులు వాదిస్తూ వచ్చిందేమిటంటే? వారి ప్రకారం మనము మన పిల్లకు నేర్పవలసింది అసలయిన వస్తువులను గురించి కాని వట్టి మాటలు కాదు. గ్రంథాల్లోని వ్యక్తులను గురించి చెప్పవలసింది వారి జీవితాలలోని
వస్తుస్థితిగతులనే కాని వాటిని క్రీనీడలను కానేకాదు. ఈ వాస్తవిక ప్రపంచంలో బ్రతికి బాగుపడవలసిన బాలకులకు ఎంత మొత్తుకున్నా బుర్రకెక్కని వ్యాకరణాలతో సంకులమైన ఆ మృతభాషలు (గ్రీకు లాటిను) ఏమి అక్కరకు వస్తాయి? దేవుళ్ళూ, దేవతలూ అని లేనిపోని కల్ల బొల్లి కబుర్లతో నిండిన ఆ పాత పురాణగాథలు మాత్రం ఏమి ఉపయోగపడతాయి? ఇటువంటి చదువుకున్న చట్టుబండల పరిజ్ఞానం కంటె మబ్బులెలా ఏర్పడుతున్నాయి, ఋతువులెలా ఏర్పడినాయి, పంటలెలా పండుతున్నాయి మొదలైనటువంటి సర్వసాధారణమైన ప్రకృతి
సూత్రాల పరిజ్ఞానమే ఎన్నోరెట్లు ఎక్కువ
ఉపయోగకారిగా ఉంటుంది. చచ్చిన భాషలను
పట్టుకొని, క్రియలేవి, కర్మలేవి – ప్రకృతులేవి,
ప్రత్యయములేవి – వచనములేవి, విభక్తులేవి ఇత్యాది
అనవసర ప్రసంగంకంటేనూ, స్వప్న
సామ్రాజ్యసమానమైన పురాణోక్తస్వర్గంలోని
కిన్నరకింపురుషాది దేవతాగణం యొక్క వంశావళీ
నామావళీల పారాయణం కంటెనూ కూడా నేటికాలపు
బాలకులకు భౌతికరసాయనాది శాస్త్రాల (పరినిష్ఠిత
జ్ఞానం లేకపోతే పోయింది. పట్టుమని) ప్రాథమిక
పరిజ్ఞానం ఏర్పడ్డా చాలు ఎంతో లాభకారిగా
ఉంటుంది. మూడేమూడు ముక్కల్లో గనక
చెప్పవలసివస్తే – విద్యావిధానానికి పరమప్రాప్యం
శాస్త్రపరి జ్ఞానమూ, శాస్త్రీయపద్ధతుల పరిజ్ఞానమే
అయి వుండవలెకాని భాషా సాహిత్యాలు వాటి ప్రాప్యం కారాదు; వస్తువులూ, వస్తువుల వాస్తవిక జ్ఞానమే దాని లక్ష్యం కావలెకాని కల్లబొల్లికట్టు కథలూ, కోటలకెక్కే వట్టిమాటలూ దాని లక్ష్యం కారాదు. ఈరీతిగా ఈ వాస్తవిక పద్ధతి హృదయంలో ఆరాధిస్తూ వచ్చిన
ఆదర్శమూర్తి మన ప్రకృతి పరిజ్ఞానసీమావధులను విస్తరింపజేయడానికి బద్ధకంకణుడైన శాస్త్ర పురుషుడు. ప్రత్యేక దీక్షతో గనక పూనుకొని పనిచేసేటట్టయితే ఈ పద్ధతి సదా సత్యశోధనకి సాహసించే వివేకానందులనూ, మొక్కవోని ఉపకరణాలతో ప్రకృతి కార్యకలాపాలను గురించిన నిర్దుష్ట జ్ఞానంగల మేధావంతులనూ సృష్టింపగలిగేమాట యేమో వాస్తవమే. కాని, ఆదరాబాదరాగా పనిచేసేటట్టయితే ఇది అనేక సందర్భాల్లో కేవలమూ స్తబ్ధచైతన్యంతో కూడి చిత్తవికాసశూన్యమైనట్టి,
నైతికనిష్ఠలేని, ధర్మాధర్మ పరిజ్ఞానరహితమైన యంత్రమూర్తులను మాత్రమే కనిపార
వేస్తుంది.
ఇక మూడవదానికి వద్దాము. అది ప్రాకృతిక సూత్రపద్ధతి. ఈ పద్ధతి మూలంగా
జ్యోతిశ్శాస్త్రంలో కోపర్నికస్ సూత్రపద్ధతి తెచ్చిపెట్టినంత విప్లవానికి సరిగ్గా దీటురాగల
విప్లవమొకటి విద్యావిధానచరిత్రలో బయలుదేరింది. మానవీయ సూత్రవాదు
లేమన్నారు? సారస్వాతశిక్షణ కావలెనన్నారు. వాస్తవిక వాదులేమన్నారు? శాస్త్ర శిక్షణ
కావలెనన్నారు. ఆ ఉభయసంప్రదాయవాదులూ కూడా నేర్పవలసింది పదములా, లేక
వస్తువులా అనే ఒక్క ప్రశ్న మీదనే వాదవివాదాలు పడుతూ వచ్చారు. ఇక ఈ తృతీయ
పద్ధతి ఏమి చేసిందో చూడండి. నేర్పవలసినదేదో ఎలాగయినా కొల్లబోనివ్వండి,
ఎవరికి నేర్పవలెనో వారిని ముందు కాస్త గట్టిగా గమనించండి అని అసలు విషయాన్నే
పూర్తిగా మార్చివేసింది. దీనిప్రకారం చూడబోతే ఉపాధ్యాయుని లక్ష్యం పిల్ల
పసిమనసులో యోగ్యతకు మించిన విషయాలను (పదాలను గురించే కానివ్వండి,
లేదా వస్తువులను గురించే కానివ్వండి) బలవంతంగా నూరినూరి పోయడం కారాదు.
ఆ పసిమనసుల్లోనూ ఒకే విధమైన మానసికశక్తులుండవు. ఒక్కొక్క పిల్లవానికి
ఒక్కొక్క విధమైన సొంత అభిరుచులూ, సొంత అభిప్రాయాలూ, సొంత వాంఛలూ
ప్రత్యేకంగా వుంటాయి. ఒక పిల్లవానికి సారస్వత శిక్షణ అవసరమై వుండవచ్చు.
ఇంకొకనికి శాస్త్ర శిక్షణ కావలసి వుండవచ్చు. ఒకనికి భాషలను నేర్చుకోవలెననే
అభిలాష ఉండవచ్చు; ఇంకొకనికి సారస్వతం మీద శ్రద్ధాసక్తులుండవచ్చు; మరో
మూడో వ్యక్తికి ప్రయోగాలు చేసి చూడడంలో ప్రత్యేక వాంఛ ఉండవచ్చు; అదీ ఇదీకాక
నాలుగోవానికి కొత్త కొత్త పరిశోధనలు సాగించడంలో ఎక్కువ కోరిక ఉండవచ్చు.
కాబట్టి ఇందువల్ల ఏమి తేలుతున్నదంటే? అధ్యాపకుడైనవానికి పిల్లమనస్సే ఎక్కువ
ముఖ్యం కాని, వారికి నేర్పవలసిన విషయాలు అంత ముఖ్యమైనవి కావు.
ఉపాధ్యాయులైనవారు పిల్ల మానసిక తత్వాలను బహు శ్రద్ధగా పరిశీలించాలి.
ఒక్కొక్క పిల్లవానిలోనూ గుప్తంగా అణగియున్న శక్తులను బయటికి జాగ్రత్తగా లాగి,
వాటిని యథోచితంగా పెంచి పెద్దచేసి, ప్రతిపిల్ల వాని ప్రత్యేక వ్యక్తిత్వాన్ని పోదిగా
పోషించడమే ఉపాధ్యాయులు ముఖ్య లక్ష్యంగా పెట్టుకోవాలి. ఈ పద్ధతివాదులు
ఆదరించి ఆరాధించే ఆదర్శమూర్తి యెవరంటే? సర్వాంగీణంగా అభివృద్ధి పొందిన
తన సహజశక్తులతో విలసిల్లే అసాధారణవ్యక్తియే వారి ఆరాధ్యమూర్తి ఒక విధంగా
చూడబోతేనేమో ఈ పద్ధతి వారి వారికి దేవుడు ప్రసాదించిన శక్తి సామర్థ్యాలకు చక్కని
దోహదం కల్పించి పెట్టింది; విద్యాశిక్షణను అవరోధం లేని పద్ధతుల మీద నడపనూ
నడప గలిగింది. కానీ ఇంకొకవిధంగా చూడబోతే ఇది
మనుష్యులను ఇంత వారిని అంతవారినిగా పేర్కొని,
వారు ఉబ్బి తబ్బిబ్బు లయేటట్టు చేసింది; వారి వెర్రి
వేషాలకూ, పిచ్చి పిచ్చి తలపులకూ
ప్రోత్సాహమిచ్చింది; మీరు ఈయీ ఆదర్శాలు
సాధించండర్రా అని వారికి ఏ ఆదర్శాలూ
చూపించకపోయింది. అది అహంప్రత్యయాన్ని నేర్ప
గలిగిందే కాని వికాసాన్ని నేర్పలేకపోయింది.
19వ శతాబ్దంలో ఓ ప్రాకృతిక సూత్ర పద్ధతి
యందు వ్యక్తిత్వం విషయమై కనపరచిన అతి
మాత్రమైన ఊతంతో 20వ శతాబ్దమందు ఇంకొక
కొత్తపరిణామం ఏర్పడింది. ఒకనిలోని ఒక వ్యక్తిత్వాన్ని మనం పెంచి
పోషించవలెననుకొంటే ఆ మనిషి యే సంఘానికి చెందుతాడో ఆ సంఘ విషయం కూడా మనం జ్ఞప్తిలో పెట్టుకోవలసి వుంటుందని ఒక కొత్త సిద్ధాంతం వెల్లడిచేయబడింది. వ్యక్తిత్వాన్ని పట్టుకొని విద్యాసంబంధమైన ఒక శూన్యకాశంలో
పోషించడానికి ససేమిరా వల్ల కాదు. ఒక పిల్లవానిని ఒక ఉపాధ్యాయుడు తరిఫీదు గనక చేయవలెననుకొంటే ఆ పిల్లవాని కర్మకాండ అంతా ఏ సంఘాని కోసమైతే ఉద్దిష్టమైయున్నదో ఆ సంఘంలో వాడు అతుకుకొని పోయేటట్టుగా వాని నతడు తరిఫీదు చేయాలి. తాను తరిఫీదు చేయదలచుకొన్నపిల్లవాడు ఒక ప్రజాస్వామిక సంఘానికి చేరినవాడై వుంటాడను కోండి. అప్పుడు వానికి ప్రజాస్వామిక సూత్రాలను బాగుగా మప్పి అందులో వానిని బాగా తయారుచేయాలి. లేక వాడు ఒక వ్యవసాయ కుటుంబానికి చేరినవాడై వుంటాడనుకోండి. అప్పుడు వానికి వ్యావసాయిక జ్ఞానాన్నే
విస్తారంగా నూరిపోయాలి. వర్తక వాణిజ్యాల బాపతయితే వాటిలోనే వానిని సవ్యంగా తయారుచేయాలి. ఏతావతా, ఏమి తేలుతున్నదో తెలుసునా? మనం పెంచి
పోషించవలసింది కేవల నిరంజనమయిన వ్యక్తిత్వం కాదు. మరి యేమంటే? సాంఘిక
వ్యక్తిత్వం. సాంఘిక వ్యక్తిత్వమంటే, మన వ్యక్తి ఏ సంఘానికి అయితే చేరివుంటాడో ఆ
సంఘం సంబంధ బాంధవ్యాలతో సమేతమైన వ్యక్తిత్వమన్న మాట. ఈ సాంఘిక
సమన్వయ సూత్రక్రమమే ఇటీవల కేవల సాహిత్య, కేవల శాస్త్రీయ విద్యాస్థానాల్లో వృత్తి,
సాంకేతిక విద్యలు తామేర్పరచుకోవడానికి ఆస్కారం కల్పించింది.
సాంఘికయంత్రంలో తన స్థానమందు తాను కూర్చొని, అది సక్రమంగా, సవ్యంగా
ఆడేటట్టు చేయగల పూర్ణపురుషుడైన పౌరుడు ఈ సంప్రదాయవాదులకు ఆదర్శమూర్తి.
అందువల్లనే ఈ మధ్య కొన్ని సంవత్సరాలబట్టి ఎక్కడ చూచినా మనకు ‘పౌరత్వానికి
శిక్షణ, పౌరత్వానికి శిక్షణ’ అనే కేకలు పదేపదే వినిపిస్తూవున్నాయి. ఈ సాంఘిక సూత్ర పద్ధతి సర్వదుంబాలా రాజ్యాలలో దాని పరమావధి
ప్రమాణానికి వెళ్ళింది. నాజీఫాసిస్టు రాజ్యాలలోనే చూడండి కావలిస్తే. అక్కడ పౌరత్వం కోసమై వ్యక్తులను తరిఫీదు చేయడమనేది ఎంత సలక్షణంగా సాగిస్తూవున్నారో కాస్త గమనించండి. వ్యక్తులనబడే
వారందరూ రాజ్యాంగంలో తదేకంగా తన్మయులయి పోతున్నా రనడమే అందుకు తగిన తార్కాణ. అక్కడ వ్యక్తులకు నావి అంటూ వేరే అభిప్రాయాలు లేవు; వేరే విశ్వాసాలు లేవు; వేరే ఆదర్శాలు లేవు. రాష్ట్రీయ అభిప్రాయాలే, రాష్ట్రీయాదర్శాలే వారి అభిప్రాయాలూ,
వారి విశ్వాసాలూ, వారి ఆదర్శాలున్ను. ప్రత్యేక వ్యక్తులనేవారు బ్రహ్మాండమై, మహాగందరగోళమైన రాజ్యాంగయంత్రంలో నిర్దుష్టమైన
చిన్న చిన్న చక్రాలుగా ఉండవలసినవారు మాత్రమే. ఈ సాంఘిక సూత్రపద్ధతి మూలాన తలవనితలంపుగా వచ్చిపడ్డ ఈ ఫలితం ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒక విద్యాహృదయాన్వేషణకు దారితీస్తున్నది. విద్య యొక్క లక్ష్యం కేవలమూ ఉన్నపాళాన ఉన్న వ్యక్తిత్వమూ కాదు; ఉన్న పాళాన ఉన్న రాజ్యాంగపౌరత్వమూ అనిన్నీ మళ్ళీ క్రొత్త వక్కాణింపులు బయలుదేరాయి. అంటే, మరొక సూత్రపద్ధతికి – అయిదవదానికి అంకురార్పణ ఏర్పడిందన్నమాట. ఈ క్రొత్తదానిని ఆదర్శ సూత్ర పద్ధతి (Idealistic Theory) అనే పేరుతో పిలువవచ్చు.
దీని అస్పష్టమైన నూతన స్వరప్రస్తారము ఇప్పటికప్పుడే ఈ యుద్ధపు మసకచీకట్ల
వెనకలనుంచి వినవస్తూవున్నది. మానవుడు కేవలమూ రాజ్యాంగంలోని ఒక పౌరుడు
మాత్రమే కాడని తెలియచేయబడింది. అతడు రాజ్యాంగంలో ఒక పౌరుడయ్యేముందర
మొట్టమొదట అతడు ఈ విశాలవిశ్వంలో ఒక కాపురస్థుడు. కాబట్టి ఈ విశ్వంలో తన
స్థానమేదో అతడు తెలుసుకోవాలి. జీవితానికి నిజమైన లక్ష్యమేమిటో, దానిని
అందుకోవడానికి తాను ఏయే సాధనోపాయాలను అవలంబించవలెనొ కూడా అతడు
తెలుసుకోవాలి. వట్టి జీవితోపాయాలను మాత్రమే కాక సుఖసుందర జీవితోపాయాలను
కూడా అతడు బడి చదువుల కింద నేర్చుకోవాలి. విద్యవల్ల వృద్ధి చేసుకోవలసినవి
అతని ప్రాకృతిక శక్తులొక్కటి మాత్రమే కావు. ధర్మాధర్మవివేచన చేయగలగడానికిన్ని,
ఎక్కువ తక్కువ విలువలు రూపించగలగడానికిన్ని, మలిదాన్ని కాకుండా తొలిదాన్నే
అనుసరించగలగడానికిన్ని సాధనభూతమైన ఆధ్యాత్మిక శక్తులను కూడా వాటితో
సరిసమానంగా వృద్ధిచేసుకోవాలి. వ్యక్తిత్వం అన్నంత మాత్రంచేత ఒక్క నైసర్గిక
మానవుని మహితస్వరూప కీర్తనమే కాదు; వానితో సరిసమానంగా ఆధ్యాత్మిక
మానవుని మహితస్వరూపకీర్తనం కూడా దీని కిందికే వస్తుంది. మానవుడన్న
ప్రతివానిలోనూ కొద్దోగొప్పో దైవికాంశ లేశమాత్రమయినా వుండనే వుంటుంది. ఏ
రాజ్యాంగమయినా సరే, లేక ఏ సంఘమయిన సరే దాన్ని తన తన అవసరానుకూలాలకు
అనుగుణంగా లొంగదీసుకోవడానికి సుతరామూ సాధ్యంకాదు. సాంఘిక వ్యక్తిత్వాన్ని
తప్పక సమకూర్చుకోవలసిందే; అందుకు సందేహం ఎంతమాత్రమూ పనిలేదు
నిజమే. కాని, ఆ సాంఘికవ్యక్తిత్వం సదా ఆధ్యాత్మిక వ్యక్తిత్వానికి లోబడిందిగానే వుండి
పోవాలి. రాజ్యంలో కొంతమంది వ్యక్తులు రాజ్యాంగానికంటె ముందుదారి పట్టినవారు
ఉండి, భావస్వాతంత్ర్యమూ వాక్స్వాతంత్ర్యమూ కలవారై, రాజ్యాంగచక్రప్రవర్తకుల
నిర్ణయాల సందర్భంలో తాము వారితో సమానంగా కూర్చోగలిగినవారు ఉంటేనే ఆ
రాజ్యం సక్రమపరిస్థితుల మీద ముందుకు వెళ్ళిపోగలుగుతుంది; శ్రేయస్సౌఖ్యాలకు
ఉపకరణమూ కాగలుగుతుంది. కాబట్టి రాజ్యాంగం అనేది ఎన్నటికీ విద్యమీద గుత్తకు
పుచ్చుకొన్నట్టుగా సంపూర్ణ పెత్తందారీ పెట్టుకోరాదు. అది చేయవలసిందల్లా
ఏమిటంటే? కావలసింది కావలసినట్లు ద్రవ్య సహాయం చేయడమూ, జాతి మొత్తాని
కంతటికీ చదువు సంధ్యలబ్బేటట్టు చూడడమూ, విద్యాసంస్థలు సక్రమంగా, చక్కగా,
నేర్పుతో నిర్వహింపబడేటట్టు నిఘా పెట్టివుండడమూ ఇవే వారు చేయవలసిందల్లా.
లక్ష్యాలేమిటో, లక్షణాలేమిటో, పద్ధతులేవో, మార్గాలేవో మొదలైన తక్కిన తతంగాన్ని
నిర్ణయించే పూచీయావత్తూ వారు సమాజంలోని విషయజ్ఞులయిన పెద్దల బుద్ధులకే
విడిచిపెట్టాలి.
పరిశీలన చేసి చూస్తే ఈ అన్ని పద్ధతుల్లోనూ సత్యాంశలు ఉన్నట్టే కనబడుతున్నది.
కాని, మనకే గనక నిజంగా చక్కని విద్యాప్రణాళిక కావలసివున్నట్టయితే ఈ అన్నింటినీ
ఏకసూత్రానికి తెచ్చి కలిపివేయాలి. కేవల సారస్వత విద్యగాని, కేవల శాస్త్ర విద్యగాని,
కేవల సాంకేతిక విద్యగాని, కేవల పారిశ్రామిక విద్యగాని, లేదా కేవల మతనైతిక
విద్యలు గాని మన కార్యసాధనకు ఉపకరించేవి కావు. పాక్షికమైన ఈ అన్నిపద్ధతుల్లోనూ
చెప్పినట్టి యావత్తు విద్యాప్రణాళికల విశేషాలనూ ఒక్కసూత్రానికి తెచ్చి సమన్వయ
పరచి ఆచరణలో పెట్టవలసి వున్నది. ఆధునిక యూరోపియ విద్యావిధానాల
బాగోగులను గురించి ఇంతవరకూ సవివరంగా చర్చించడమయింది. ఇప్పుడు ఈ
యూరోపీయ పద్ధతులనూ, భారతీయుల ఆచరణ ప్రచారణలను బట్టి ఊహింప
నయ్యున్న ప్రాచీన భారతీయ విద్యాపద్ధతులనూ పరస్పరంగా పోల్చి చూచి మంచి
చెడ్డలను తేలుద్దాము. బాగా పరీక్ష చేసి చూస్తే, బహుశా ఒక్క ప్రాకృతిక పద్ధతిని
మాత్రం తప్పనిచ్చి మిగిలిన ఈ యావత్తు ఆధునిక పద్ధతులూ అలనాడు మన దేశంలో
ఆదరించి అంగీకరించి ఆచరణలో పెట్టిన బాపతుగానే గోచరమవుతున్నది. ఇంకా ఒక
మిక్కిలి ముఖ్యమైన విషయమేమిటంటే, యూరోపులో ఇటీవలనే పొడసూపిన
ఆదర్శపద్ధతి, సాంఘిక పద్ధతులనేవి ప్రాచీన భారతదేశంలో ఏనాడో అసలు
విద్యాప్రణాళికకే మూలకందంగా వుంటూవచ్చాయి. తమ ఆశ్రమాలకో, లేక తమ
గృహాలకో మూలమూలలనుంచి శిష్యగణాలను ఆకర్షించుకొంటూ వచ్చిన మన
సుప్రసిద్ధ గురుకులపతులందరూ రాజ్యాంగసంబంధాలకు దూరులై సర్వస్వతంత్రులైన
వ్యక్తులుగానే తమ గురుకులాలను నడుపుకొంటూ వచ్చారు. ధర్మమే వారి
అధ్యాపనలోకెల్లా సారములో సారముగా వుంటూ వచ్చింది. శిష్యులు కూడా వారివారి
కులానుసారంగా వారి వారి పరిసరాల్లో సమ్మసరిగా ఇమిడిపోయేటట్టు మాత్రమే కాక
అవసరమయితే ఆ పరిసరాలను అభివృద్ధి చేసుకొనేటట్టు కూడా తరిఫీదు పొందుతూ
వచ్చారు. బ్రాహ్మణజాతి ఛాత్రులకు పురోహితులుగానో, లేక ఉపాధ్యాయులుగానో
అయ్యేందుకు తగిన శిక్షణ ఇవ్వబడుతూ వచ్చింది. అలాగే క్షత్రియ శిష్యులకు
యుద్ధవీరులుగానో, లేక పరిపాలకులుగానో అయ్యేందుకున్ను, వైశ్య శూద్ర శిష్యులకు
వారివారి వర్తక వాణిజ్య కృషి పరిశ్రమలలోనూ దానిదానికి తగిన శిక్షణ ఇవ్వబడుతూ
వచ్చింది. కాని, అందరి విషయంలోనూ అన్నిటా ధర్మమే సకలశిక్షణకూ
మూలకందంగా వుంటూ వచ్చింది. ప్రతివిద్యార్థికీ వృత్తి శిక్షణ ఇస్తూ వచ్చారు. కాని, ఆ
ఇవ్వడం మట్టుకు సర్వదా ఒక ఆదర్శాత్మక లక్ష్యంతోనే ఇస్తూ వచ్చారు. ఉపనిషత్తులో
మనము చూస్తూ వున్నరీతిని ఆనాడు బ్రాహ్మణ బాలురకు నేర్పుతూ వుండిన విషయాల
పట్టీలనూ బట్టి చూస్తే ఆ పాఠ్యప్రణాళికలలో వారివారి వృత్తివిద్యలే కాక వాటికి తోడు
సారస్వతవ్యాసంగమూ, ఆనాటి శాస్త్రాల చదువూ కూడా కలిసియుండినట్టు
కనబడుతున్నది. ఉదహరణకు కావలిస్తే ఛాందోగ్యోపనిషత్తులోని ఈ కథను
చిత్తగించండి.
ఒకనాడు నారదుడు సనత్కుమారుని వద్దకు వెళ్ళి తనకు చదువు చెప్పమని
అడిగాడట. అడిగితే, ఇంతవరకూ నీవేమేమి చదువుకున్నావో, ఏయే విషయాలు
తెలుసో చెప్పమన్నాడట సనత్కుమారుడు. నారదుడు తనకు తెలిసినవన్నీ ఒక పట్టీకట్టి
చెప్పాడట. ఆ పట్టీలో ఒక్క వేదాలు మాత్రమే కాక ఆనాటికి సారస్వత గ్రంథాలుగా
ఉంటూ వచ్చిన ఇతిహాసాలూ, పురాణాలూ, ఆనాటికి శాస్త్రాలుగానూ, ఇతర
కళలుగానూ వుంటూ వచ్చిన జ్యోతిర్గణితాలూ, తదితర అనేక విద్యలు కూడా
కనిపించాయి. ఇన్ని విద్యలు నేర్చి, ఆనాటి సారస్వతంలోనూ, ఆనాటి శాస్త్రాల్లోనూ
ఇంత పరిజ్ఞానం సంపాదించి కూడా తనకు ఆత్మజ్ఞానమనేది ఒకటి లభించకపోబట్టి
తన చదువు పూర్తిగా ముగియనట్లే నారదుడు తలపోశాడు.
జ్ఞానం అబ్బినవారికి మరిదుఃఖాలే వుండవని ఆయన ఎవరో చెప్పగా వినివున్నాడు.
ఇన్ని చదువుల్లో ఆరితేరి ఇంత జ్ఞానభాండారం ఆర్జించివున్నా ఆయన ఇంకా దుఃఖాలకు
దూరుడు కాలేకపోయినాడు. అందుకోసమని ఆయన విద్యలలోకెల్లా విశిష్టవిద్య
అయిన ఆత్మవిద్య నేర్చుకొందామని వెళ్ళి సనత్కుమారుని ఆశ్రయించాడు.
ఈ కథవల్ల మనకు ప్రాచీనభారతదేశంలోని విద్యాప్రణాళిక ఆదర్శాలన్నీ స్పష్టంగా
తెలియవస్తున్నాయి. ఆనాటి విద్యాప్రణాళికలో కనిపించిన లోపమల్లా ఒక్కటే. అది
యావద్దేశ ప్రచార దృష్టితో సాగకపోయింది; పూర్తిగా కులవిచక్షణలతో కొనసాగింప
బడింది. అందువల్ల అది ఇంచుమించు అనేక సందర్భాలలో తొంభైతొమ్మిదిపాళ్ళు
వృత్తివిద్యలతోనే పర్యవసిస్తూ వచ్చింది. అది యెల్లాగయినా పోనివ్వండి కాని ప్రాచీన
భారతదేశంలోని విద్యాప్రణాళిక తన ఆదర్శాత్మకమైన గాడినుండి కాని, వృత్తివిద్యా
ప్రధానమైన మూలసూత్రం నుంచి కాని ఏనాడూ దాటిపోయి దారితప్పి యెరిగింది
లేదు. కుంఫిణీ ప్రభుత్వం బ్రిటిషు ఇండియాలోని విద్యావిషయక సమస్యలను
స్వయంగా చేపట్టడానికి పూర్వం – మొన్న మొన్నటి 19వ శతాబ్ది ప్రారంభంలో కూడా
మన యావత్తు గ్రామాలయందూ చిరకాలంగా నెలకొని పోయివుండిన ప్రాచీన
పాఠశాలలు తమ పాత సంప్రదాయాలను లేశమయినా వదలకుండా ఆ వెనుకటి
పాఠ్యక్రమాన్నే గట్టిగా అంటిపెట్టుకొని పల్లెటూరి పిల్లకు యథాప్రకారంగా వ్రాతా,
చదువూ, పల్లెటూరి లెక్కాచారాలూ, గ్రామసీమలను గురించిన లోకజ్ఞానమూ, ఈ
అన్నిటికీ మించి ఇతిహాసపురాణాల మూలంగా ధర్మబోధా ఇత్యాది విషయాలను
నిరాఘాటంగా సాగిస్తూనే వుండినాయి. అటుపిమ్మట మన దేశచరిత్రలో బ్రిటిషు
యుగం ప్రారంభమయింది; ప్రాచీనకాలపు విద్యాబోధన పద్ధతులన్నీ అడుగంటి
పోయాయి. నేటి మన పాఠశాలలలోనూ, కళాశాలలలోనూ నేర్పబడుతూ వున్న విద్య
(ఇతర లక్షణాలు ఎన్ని వుంటేనేమి గాక) వృత్తివిద్యాత్మకమూ, ఆదర్శస్వరూపమూ
అయిన తన ఆధారం నుంచి పట్టు తప్పిపోయి వేరుదారి పట్టింది. నిర్జీవమైన
ప్రణాళికలతో వేలాదిమంది నిరుద్యోగ యువకులను తయారుచేసి వారి నెందుకూ
కొరగాని వారినిగా, ఎలాటి జీవితతత్వాలూ లేనివారినిగా, తరిఫీదు చేసి పాడుచేసింది.