తెలుగుసినిమా పాటసాహిత్యసౌరభాలు
-విమర్శ
వర్తమానతెలుగు సినిమా పాటలలో సాహిత్య గుబాళింపులు క్రమేణా తగ్గుతోన్న వైనం కనిపిస్తోంది. తెలుగు పలుకే బంగారమైన పాటలలో తెలుగేతర పదాల
అక్రమ చొరబాటు తెలుగుతనాన్ని పరిహసిస్తోంది. గీతరచనలో పాటించాల్సిన కనీస ప్రమాణాలను త్రోసి రాజని వింత పోకడలవైపు తెలుగు పాట పయనిస్తున్న తీరు భాషా ప్రేమికులకు ఆవేదన కలిగిస్తోంది. చలన చిత్ర
నిర్మాణంలో పెరిగిన వేగం పాటల సాహిత్యాన్నీ దెబ్బ తీసినట్లుసినిమా రంగ విమర్శకుల అభిప్రాయం. సినిమా పూర్తిగా వ్యాపారదృక్పథంగా మారిన సమయంలో సంగీతం, సాహిత్యం వాస్తవికతను దూరం చేసుకోవడం అనివార్యం. సృజన స్థానాన్ని కృత్రిమత్వం కబళించడంతో ప్రస్తు సినిమా ఒకనాటి సహజ సౌరభాన్ని కోల్పోయింది. సాంకేతిక రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పుల కారణంగా వివిధ వనరులు అందుబాటులోకి వచ్చాయి. కథలు, కథనాలు, సంగీతం, సాహిత్యం సహా సినిమారంగానికి సంబంధించిన అన్నిప్రక్రియలను దిగుమతి చేసుకునే వీలు చిక్కింది.
సినిమా రూపకల్పన కోసం వివిధ వనరుల నుంచి సేకరించిన (తస్కరణ కు పర్యాయ
పదం) ముడిసరుకులకు ప్రాంతీయతను జోడించి వండి వార్చడంలో సిద్ధహస్తులన్న
ముద్ర తెలుగు సినిమారంగంపై పడింది. సృజనకు తిలోదకాలిచ్చి అన్య భాషా
చిత్రాలనుంచి అరువుతెచ్చుకున్న ఆలోచనలకు తెరరూపం ఇవ్వడానికి తెలుగు సినీ
నిర్మాతలు వెంపర్లాడడం విస్తుగొలుపుతోంది. ఒకనాడు వెండితెరకు అపురూప
చిత్రాలు అందించి ఇతర ప్రాంతాలవారికి ఆదర్శంగా నిలచిన తెలుగు సినిమా క్రమేణా
ప్రాభవాన్ని కోల్పోవడం శోచనీయం.
1950 దశకంలో వచ్చిన తెలుగు చలనచిత్రాలు స్వర్ణయుగాన్ని ఆవిష్కరించాయని
సినీరంగవిశ్లేషకుల ఏకాభిప్రాయం. ప్రధానంగా తెలుగు పాటల మాధుర్యాన్ని
ప్రేక్షకులకు అందించిన దశాబ్దంగా ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. తేట తెనుగు
పదాలతో రసరమ్య కావ్యాల స్థాయిలో తెలుగు గీతాలను సృజియించిన మహాకవుల
కృషితో తెలుగువెండితెర పునీతమైంది. ప్రాతః స్మరణీయులు మల్లాది రామకృష్ణ శాస్త్రి,
పింగళి నాగేంద్ర రావు, సదాశివబ్రహ్మం, సముద్రాల ద్వయం, దేవులపల్లి కృష్ణశాస్త్రి
వంటి ప్రసిద్ధ కవుల కలాలనుంచి జాలువారిన గీతాలు తెలుగువెండితెరకు అక్షర
హారతులై ప్రభాసించాయి. భక్త ప్రహ్లాద, మాలపిల్ల, రైతుబిడ్డ, పాతాళ భైరవి,
మాయాబజార్, దేవదాసు, చిరంజీవులు, మల్లీశ్వరి, అనార్కలి, లవకుశ వంటి ఎన్నో
అజరామర చిత్రాలకు హృద్యమైన పాటలతో అమరత్వం అందించిన ఆనాటి గీత
రచయితలకు తెలుగుజాతి ఋణపడి ఉంది.
లలితమైన పదాలతో లోతైన భావాలను సృజియించడంలో ఎవరి ప్రతిభ వారిదే.
నటీనటుల పాత్రోచిత సంభాషణలకు సమన్వయంగా పాటలు ఉండాలన్న జిజ్ఞాసతో
మాటలు, పాటలు ఒక కవితోనే రాయించిన సందర్భాలు అనేకం. సన్నివేశాలకు
అనుగుణంగా ప్రవేశించే పాటలు చలనచిత్ర గమనానికి దిశా నిర్దేశం చేస్తాయనడంలో
అతిశయోక్తి లేదు.
మాయాబజార్, పాతాళభైరవి, గుండమ్మ కథ వంటి విజయావారి చిత్రాలకు
పింగళి నాగేంద్ర రావు రచనచేయగా దేవదాసు చిత్రానికి సీనియర్ సముద్రాల,
చిరంజీవులు సినిమాకు మల్లాది రామకృష్ణ శాస్త్రి మాటలు, పాటలు అందించారు.
దశాబ్దాలు గడుస్తున్నా ఈనాటికీ పాత చిత్రాల గీతాలు ప్రజల హృదయ ఫలకాలపై
చెరగని, చెదరని తీపి జ్ఞాపకాలుగా ఉండడం విశేషం.
వినసొంపైన సంగీతసాహిత్యాలతో తెలుగువారి మదిని దోచుకున్న సలలిత
సుస్వర గీతాలలో మచ్చుకుకొన్ని ప్రస్తావించుకుందాం. ‘ఆడువారి మాటలకు అర్థాలే
వేరులే’, ‘రావోయిచందమామా! మా వింత గాథ వినుమా! ‘జగమే మాయ, బ్రతుకే
మాయ’, ‘కుడిఎడమైతే పొరపాటు లేదోయ్’, ‘వివాహ భోజనంబు వింతైన
వంటకంబు, వియ్యాలవారివిందు అహహ్హ నాకె ముందు’, ‘ లాహిరి లాహిరి లాహిరిలో
జగమే ఊయల ఊగెనుగా’, ‘ కనుపాప కరవైన కనులెందుకో ‘, ‘ మది శారదాదేవి
మందిరమే’, ‘మనసునమల్లెల మాలలూగెనే’, ‘రాజశేఖరా ! నీపై మోజు తీరలేదురా ‘
… ఓపిగ్గా వెతికితే దొరికేవి ఆణిముత్యాలే. అమూల్య నవరసాల వర గీతికలే.
సన్నివేశాలకు అనుగుణంగా ప్రవేశించే పాటలు చలన చిత్ర కథన శిల్పానికి
నిలువెత్తు భూషణాలై వీక్షకులను ఎంతగానో అలరించాయంటే అతిశయోక్తి కాదు.
చలన చిత్ర నిర్మాణానికి ఆయువు పట్టయిన 24 కళలు నిష్ణాతులైన సమర్ధుల
సృజనలోంచి జీవం పోసుకునేవి. చిత్ర నిర్మాణాన్ని ఒకపవిత్ర యజ్ఞంలా స్వీకరించిన
మహానుభావుల మేధోమథనంనుంచి కళాఖండాలుగా ప్రశంసలు పొందిన చలన
చిత్రాలు వెండితెరపై దర్శనమిచ్చేవి. నైతిక విలువలు, నిబద్ధత, అంకితభావం పరమ
లక్ష్యాలుగా చలన చిత్రాలలోఅంతర్లీనంగా ఆవిష్కృతమయ్యేవి. సినిమా అంటే కేవలం
వినోద ప్రధానమైన ఆటవిడుపు సాధనంగానే కాక సమాజానికి ఎంతో కొంత మేలుచేసే
స్పృహ కలిగి ఉండేవి. నిర్మాతలు నైతికధర్మాన్ని పాటించి సమాజ హితంకోసం
సినిమాలు తీసేవారు. సమకాలీన సామాజిక రుగ్మతలను నిరసించే విధంగా చలన
చిత్రాలు రూపుదిద్దుకునేవి. ముందడుగు, మాలపిల్ల, వందేమాతరం, వరవిక్రయం,
కన్యాశుల్కంమొదలైన చిత్రాలు సామాజిక దృక్పథంతో నిర్మించినవే. ఆ సినిమాలలోని
పాటలు కవుల తాలుకు భావుకతతో పాటు వారికి దేశంపట్ల ఉన్న భక్తినీ చాటిచెప్పడం
విశేషం. తెలుగు పలుకుబడులు, నుడికారాలకు సినిమా పాటల ద్వారా
గణనీయప్రాచుర్యం కల్పించి అమ్మభాషకు వారు చేసిన సేవ నిరుపమానం.
ఈనాటికీ జానపదులు పాడుకునే పాటలకు సినిమాబాణీలు ప్రామాణికంగా
నిలుస్తున్నాయి. జోలపాటలు, లాలి పాటలు, పెళ్ళి తంతులో వచ్చే పసందైన పాటలు,
బావామరదళ్ళ సరసగీతాలు, ప్రేయసీప్రియుల ప్రణయరాగాలు, జీవన సూత్రాలు
తెలిపే సుభాషితాలు, బతుకు అర్థాన్ని విపులీకరించే తత్త్వ గీతాలు…. మానవజీవితలోని
ప్రతీ పార్శ్వాన్ని తెలుగు సినీ గీతాలు స్పృశించాయంటే అతిశయోక్తి కాదు.
అనంతర కాలంలో లబ్ధప్రతిష్టులైన తెలుగు కవివరేణ్యులు సినిమా రంగానికి
పరిచయమైనారు. శ్రీరంగం శ్రీనివాస రావు, దాశరథి కృష్ణమాచార్య, ఆత్రేయ, ఆరుద్ర,
సి.నారాయణరెడ్డి, కొసరాజు, రాజశ్రీ, సహజ కవి మల్లెమాల, ఎం. గోపి, జాలాది
మొదలైన గీత రచయితలు వైవిధ్యభరితమైన పాటలతో తెలుగు సినిమాకు అక్షరార్చన
చేశారు. ఆణిముత్యాలవంటి పాటలను సృష్టించి తెలుగు సినిమాకళామతల్లికి
కంఠాభరణాలై భాసిల్లారు. అల్పపదాలతో అనల్ప భావార్థాలను పలికించి తెలుగు
గీతాన్ని పరిపుష్టం చేశారు.
విప్లవ కవి శ్రీశ్రీ రాసిన సినీగీతాలు తెలుగు చిత్ర మణిపూసలు. అల్లూరి
సీతారామరాజు సినిమా కోసం శ్రీశ్రీ కలం నుంచి దుమికిన ‘తెలుగువీర లేవరా! దీక్ష
బూని సాగరా’ గీతం జాతీయస్థాయి పురస్కారం అందుకుంది. ‘చల్లని రాజా ఓ
చందమామా’, ‘పాడవేల రాధికా ప్రణయ సుధా గీతికా’, ‘దేవుడు చేసిన మనుషుల్లారా
- మనుషులు చేసిన దేవుళ్ళారా’, ‘కలసి పాడుదాం తెలుగు పాట – కదలి సాగుదాం
వెలుగు బాట’ వగైరా సినీ పాటలను తెలుగు చిత్ర సీమకు శ్రీ శ్రీ అందించారు.
దాశరథి తెలుగు సినీ గీతాలు ఆనాటి యువ భావకవులకు మార్గదర్శకాలుగా
నిలిచాయి. ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో – ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో’, తనివి
తీరలేదే – నా మనసు నిండలేదే’, ‘నన్ను వదలి నీవు పోలేవులే – ఇది నిజములే’,
‘గోదారీ గట్టుంది – గట్టుపైన పిట్టుందీ’ … అసంఖ్యాకమైన లలిత గీతాలు దాశరథి
కలం నుంచి జాలువారి రస హృదయాలను రంజింపచేశాయి.
‘మనసుకవి’గా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేక గౌరవం పొందిన
ఆచార్యఆత్రేయ తెలుగు పాటకు అందమైన అక్షరాకృతిని కల్పించారు. లలిత పదాలతో
సన్నివేశానికి పరిపూర్ణతను చేకూర్చే విధంగా ఆత్రేయ పాటలు తెరపై ఆవిష్కృతాలై
ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్నాయి. ‘పాడుతా తీయగా చల్లగా’, నాలుగు కళ్ళు
రెండైనాయి – రెండు మనసులు ఒకటైనాయి’, ‘తేట తేట తెలుగులా -తెల్లవారి
వెలుగులా’, ‘మనసు గతి ఇంతే – మనిషి బ్రతుకింతే’, ‘సిగలోకి విరులిచ్చి – చెలి
నొసట తిలకమిడి’, ‘మౌనమే నీ భాష ఓ మూగ మనసా’, ‘ఈనాటి ఈబంధమేనాటిదో - ఏనాడు పెనవేసి ముడివేసెనో’… అక్షరలక్షల్లాంటి మధుర తేనె ఊటల ఆత్రేయ
పాటలు తెలుగు వారి నాలుకలపై నడయాడుతూనే ఉంటాయి.
సమగ్రాంధ్ర సాహిత్యగ్రంథ కర్త ఆరుద్ర తన సాహిత్యసేవతో తెలుగు సినీ రంగాన్నీ
మెప్పించారు. అరుదైన పద ప్రయోగాలతో తెలుగు పాటను కొత్త పుంతలు తొక్కించి
భాషా ప్రేమికుల మన్ననలను దక్కించుకున్నారు. ఆరుద్ర లిఖించిన తెలుగు సినీగీతాలు
అచ్చతెనుగు భావుకతకు సజీవ రూపాలు. ఉదాహరణకు ‘మనసే అందాల
బృందావనం’, ‘శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం’,‘అమ్మ కడుపు
చల్లగా – అత్త కడుపు చల్లగా – బతకరా’,‘అదిగో నవలోకం – వెలసే మనకోసం’,
‘పచ్చని చెట్టు ఒకటి – వెచ్చని చిలుకలు రెండు’ మొదలైన పాటలు రస రమ్య గీతాలై
తెలుగు ప్రేక్షకులను అలరించాయి.
వినసొంపైన పదచిత్ర వర్ణనలతో తెలుగు వారి మనసు దోచుకున్న సి. నారాయణ
రెడ్డి రాసిన పాటలు పండిత పామరుల ఆదరణ చూరగొన్నాయి. వ్యవహార భాషకు
పెద్దపీట వేస్తూనే, అవసరమైన చోట సరళ గ్రాంథికాన్ని పాటలలో చొప్పించి భళారే
అనిపించుకున్న ఆచార్య సి.నారాయణరెడ్డి వర్ధమాన తెలుగు గీత రచయితలకు
మార్గదర్శి. చెణుకులతో పాటలకు రససిద్ధి కల్పించిన భాషావేత్త నారాయణరెడ్డి.
ఆయన సృజియించిన పాటలు మచ్చుకు కొన్ని ప్రస్తావించుకుందాం. ‘నన్నుదోచు
కుందువటే వన్నెల దొరసానీ’, ‘తెలుగు జాతి మనది – నిండుగ వెలుగు జాతిమనది’,
‘నీ ధర్మం, నీ సంఘం, నీ దేశం నువు మరవొద్దు’, ‘ఈ నల్లని రాళ్ళలో ఏకన్నులు
దాగెనో’, ‘తెలిసిందిలే, తెలిసిందిలే, నెలరాజ నీ రూపుతెలిసిందిలే’…. పనస
తొనలవంటి, పంచదార గుళికలవంటి ఎన్నో పాటలను తెలుగుసినీరంగానికి
అందించిన ఆచార్య నారాయణరెడ్డి నిజంగా మేరునగధీరుడు. ఏకవీర చిత్రానికి
నారాయణరెడ్డి సమకూర్చిన సంభాషణలు ఆయన పాండిత్యానికి ఉత్తమోత్తమ
నిదర్శనంగా భాషావేత్తలు ప్రశంసించారు.
తెలుగుసినీ గీత రచయితలలో కొసరాజు రాఘవయ్యది ఒక విలక్షణ శైలి. పొడి
పదాలతో జానపదులకు సైతం తేలికగా అర్థమయ్యే రీతిలో రాసిన తేట తెనుగు
పాటలకు పెట్టింది పేరు కొసరాజు. భాషా పాండిత్య ప్రదర్శనకు ప్రాధాన్యతను
ఇవ్వకుండా సులభంగా సుబోధకంగా ఉండేలా పాటలు రచించిన కొసరాజు
రసరాజుగా తెలుగువారి హృదయాలలో చిరస్మరణీయంగా ఉండగలరు. ‘మత్తు
వదలరా – నిద్దుర మత్తు వదలరా’, ‘ఏరువాకా సాగారో’, ‘మా ఊళ్ళో ఒక పడుచుంది
– దెయ్యమంటె భయమన్నది’,
‘దులపర బుల్లోడా – దుమ్ము దులపర బుల్లోడా’, ‘మా ఊరు మదరాసు – నా
పేరురాందాసు’, ‘భలే చాన్సులే, భలే చాన్సులే’…కొసరాజు కలం ఒలికించిన
భావగీతాలు ఎన్నో.. ఎన్నెన్నో.
మల్లెమాల, జాలాది, ఎం. గోపి… ఇంకా ఎందరో తెలుగు సినీగీత కవులు
చలనచిత్రసీమకు అమూల్యసేవలు అందించారు. అనివార్యమైతే తప్ప తెనుగేతర
భాషా పదాలకు వారి గీతాలలో చోటివ్వకపోవడం గమనీయం.
అనంతర కాలంలో తెలుగు గీత రచయితలుగా వేటూరి సుందర రామమూర్తి,
సిరివెన్నెల సీతారామ శాస్త్రి, భువనచంద్ర, చంద్రబోస్, వెన్నెలకంటి, భాస్కరభట్ల,
భారవి, జొన్నవిత్తుల, సుద్దాల అశోక్తేజ, రామ జోగయ్య శాస్త్రి, వనమాలి, అనంత
శ్రీరాం మొదలైనవారు ప్రసిద్ధులైనారు. తెలుగు భాషపై ఉన్న పట్టును ప్రదర్శిస్తున్నా గీత
రచనలో అలవోకగా వచ్చి చేరుతున్న తెనుగేతర పదాల ప్రయోగం నేటి తరం కవులపై
తేలికభావాన్ని ముద్రించడం సహజం. పాశ్చాత్య బాణీలను అనుకరిస్తున్న సంగీత
దర్శకుల పర్యవేక్షణలో తెలుగు పదాలకు ప్రత్యమ్నాయంగా తెనుగేతర పదాలు
ఆక్రమిస్తున్నాయి.
తెలుగుభాష అంతర్ధానమవుతుందన్న భయంతో భాషా ప్రేమికులు ఆందోళన
చెందుతున్న దశలో ఇటువంటి భాషాసంకరం మరింత చేటు కలిగిస్తుందన్న వాదం
సహేతుకమే. ప్రస్తు సినీ కవుల భాషా పటిమను హ్రస్వదృష్టితో అంచనావేయక వారి
సమర్ధతను పూర్తి స్థాయిలో వినియోగిస్తే పాత తరం పాటల సరసన కూర్చోబెట్టగల
పాటలు పుట్టుకొస్తాయనడంలో సందేహమే లేదు. వేటూరి, సిరివెన్నెల మొదలు నేటి
తరం యువకలాలు విశ్వా, శ్రీమణి, కృష్ణ చైతన్య వంటి రచయితలు తెలుగు భాష
సుసంపన్నం కోసం తమదైన ముద్రతో ఇంద్రధనువు వర్ణాలవంటి పాటలను
అందిస్తున్నారు.
సమాజాన్ని అత్యంత వేగంగా ప్రభావితం చేయగల సినిమా మాధ్యమాన్ని
తెలుగుభాష ఔన్నత్యం కోసం సక్రమ రీతిలో సాధనంగా వినియోగిస్తే తెలుగు పాట
భావితరాలకు మధురభాండంలా చేరువకాగలదు.