కరుణశ్రీ గారి కావ్యత్రయ దర్శనం
–సాహిత్య ప్రకాశిక
క్రౌంచపక్షుల వియోగాన్ని చూసి విచలితుడైన వాల్మీకి
మహర్షి శోకంశ్లోకంగా మారినట్లుపాయిఖానాలు పరిశుభ్రం
చేసే పాకీపిల్లను చూసి బాధపడిన నాన్న నోటి వెంట
వెలువడిన పలుకులే పద్యంగా మారాయి –
ఒక్క రోజీవు వీథుల నూడ్వకున్న
తేలిపోవును మా పట్టణాల సొగసు;
బయటపడునమ్మ ! బాబుల బ్రతుకులెల్ల;
ఒక క్షణమ్మీవు గంప క్రిందకును దింప.
“సామాజికస్పృహ కవిత్వంలో ఉండితీరాలి’’ అని గొంతు చించుకొనే విమర్శకులకు
ఆనాడే తన తొలి పద్యం ద్వారా సమాధానమిచ్చారు ఆయన.
“పాకీదానిగ నాడిపోసికొను ఈ పాపిష్టిలోకమ్ము నీ
బాకీ తీర్చుకొనంగలేదు జగదంబా! జన్మజన్మాలకున్”
అని పాకీపిల్లను “జగదంబా” అని సంబోధించటం ఆయనకే చెల్లింది.
“ పాకీదే కద మాకు మా జనని బాల్యమ్మందు సంజీవనీ !” అని ప్రతి తల్లీ మా
చిన్నప్పుడు మాకు నీవు చేసిన పనే చేసిందని ఆ పవిత్రమూర్తికి నమస్సులర్పిస్తారు
పన్నెండు పద్యాలలో.
ఆనాటి నుండి జీవితాంతం వరకు సమాజంలో ఏ చిన్న సంఘటన తనను
కదలించినా, కరగించినా దానిని కవితా శిల్పంగా తీర్చిదిద్దిన ఘనత ఆయనది. ఇలా
శతాధికమైన అంశాలపై తాను రాసిన కవితలను ఐదు భాగాల ఉదయశ్రీ కావ్యంగా
రూపొందించారు.
ఆయన దృష్టిలో “ కవిత్వం ఒక కమ్మని అనుభూతి. మానవత్వంలో నవత్వం
చూపించే అందాల ఆశాజ్యోతి. అది జీవిత విపంచి మేళవించి మ్రోగించిన కల్యాణ
గాంధర్వగీతి. అది ఎదలో మెదులుతుంది. పదంలో కదులుతుంది. ఉదయాన్ని
సృజిస్తుంది. అభ్యుదయాన్ని అందిస్తుంది. అది సత్యసనాతనం. నిత్యవినూతనం.”
సమత, మమత, దయ, సానుభూతి, సంస్కృతి, జాతీయత, దైవభక్తి, దేశభక్తి వంటి
ఆదర్శగుణాలను రంగరించి ఆ కవితామృతాన్ని ఆంధ్రులకు అందించి ఆబాలగోపాలాన్ని
ఆనందింపజేసిన నిజమైన ప్రజాకవి నాన్న. కరుణాసింధువైన బుద్ధుణ్ణి “కరుణశ్రీ”గా
ఆయన భావించారు. అదే కలం పేరుగా గ్రహించారు. ఎందరెందరో “నామాంత
శ్రీమంతుల”కు మార్గదర్శకులైనారు.
నాన్నగారి గ్రంథాలు చిన్నవీ పెద్దవీ మొత్తం 76. వాటిలో అత్యంత ప్రధానమైనవి
మూడు- ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ. “ఈ కావ్యత్రయంలో మీ కిష్టమైన కావ్యం
ఏది?” అన్న పాఠకుల ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం – “ ఉదయశ్రీ నా హృదయం.
విజయశ్రీ నా శిరస్సు. కరుణశ్రీ నా జీవితం.”
ఉదయశ్రీ :
“ సాంధ్యశ్రీ” అనే కవితలో – “సంజ వెలుంగులో పసిడిచాయల ఖద్దరుచీర కట్టి
నారింజకు నీరువోయుశశిరేఖవె నీవు” అన్న పద్యంలో శశిరేఖ చేత ఖద్దరు చీర
కట్టించటం కవికి స్వదేశీవస్తువైన ఖద్దరు మీద గల మమకారానికీ, గాంధీజీ బోధనల
పట్ల ఉన్న ఆసక్తికీ తార్కాణం. అలాగే “ప్రాభాతి” అన్న కవితలో “లెమ్ము పోదము
ప్రమోదముతో మన మాతృపూజకున్” అని నాయకుడు నాయికతో పలకటం
భారతమాత పట్ల ఆయనకు గల భక్తిని తెలియజేస్తుంది.
“ధనుర్భంగం” అన్న కవితలో శ్రీరాముడు శివధనుస్సును విరచి వీరరాముడైన
సందర్భాన్ని కవి ఎలా వర్ణించారో గమనించండి –
ఫెళ్లుమనె విల్లు; గంటలు ఘల్లుమనె; గు
భిల్లుమనె గుండె నృపులకు; ఝల్లుమనియె
జానకీదేహ; మొక నిమేషమ్మునందె
నయము జయమును భయము విస్మయము గదుర.
ఇందులో ద్విత్వలంకారావృత్తితో కూడిన వృత్త్యనుప్రాసాలంకారం, త్రివర్ణావృత్తితో
కూడిన అంత్యానుప్రాసాలంకారం చోటుచేసుకున్నాయి. ఇంకా విల్లు విరవటంలో
నయం, గంటలు మోగటంలో జయం, రాజుల గుండె అదరటంలో భయం, సీతాదేవి
దేహం గగుర్పొడవటంలో విస్మయం క్రమం తప్పకుండా వర్ణింపబడటం వల్ల
క్రమాలంకారం వెల్లివిరిసింది. ఇవన్నీ ఒకేఒక తేటగీతిలో తేటతెల్లం చేయబడ్డాయి.
చెల్లరే విల్లు విరచునే నల్లవాడు!
పదిపదారేండ్ల యెలరాచ పడుచువాడు!
సిగ్గు సిగ్గంచు లేచి గర్జించినారు
కనులు కుట్టిన తెల్లమొగాలవారు.
అన్న పద్యంలో రాముణ్ణి నల్లవాడు – అనీ, వెలవెలబోయిన రాజుల్ని
తెల్లమొగాలవారు- అనీ పేర్కొనటం వల్ల భారతీయులు, ఆంగ్లేయులు స్ఫురింపజేయ
బడటం విశేషం. శివధనుస్సు నెత్తటం స్వాతంత్ర్యఫలప్రాప్తిగా భావింపవచ్చు.
విజయశ్రీ :
విజయశ్రీ కావ్యంలో మొత్తం 205 పద్యాలూ, ఐదు విభాగాలూ ఉన్నాయి.
మంత్రాలోచనం, స్కంధావారం, విషాదం, ప్రబోధం, విజృంభణం అనే శీర్షికలలో పంచ
పాండవుల మనోభావాలు ప్రతిబింబిస్తాయి.
కురుక్షేత్రసంగ్రామంతోపాటు భారతస్వాతంత్ర్య సంగ్రామాన్ని కూడా స్ఫురింపజేస్తూ
రాయబడిన ధ్వనికావ్యం విజయశ్రీ. రాయబారం విఫలమై – “ఐనవి సంధిసంబరము
లాయుధము ధరియింపుడయ్య! దాపైనది వీరభారత మహారణరంగము” అని పలికిన
శ్రీకృష్ణుడితో ధర్మరాజు ఇంకా శాంతివచనాలు వల్లిస్తుంటే ద్రౌపది తన పలుకుల
ములుకులతో పాండవులలో రణోత్సాహాన్ని రగుల్కొలుపుతున్నది.
భుజాగ్రముల్ పొంగ పురోగమింతురో?
ధ్వజాగ్రముల్ వంగ తిరోగమింతురో?
శరమ్ములన్ దాల్చి పరాక్రమింతురో?
కరమ్ములన్ మోడ్చి పరిక్రమింతురో?
“ఉప్పొంగే భుజాలతో యుద్ధానికి సన్నద్ధం అవుతారా? కిందకు దించిన జెండాలతో
పలాయనం చిత్తగిస్తారా? బాణాలు ధరించి విజృంభిస్తారా? చేతులు జోడించి వాళ్ల వెనక
నడుస్తారా? తేల్చుకోండి.” అన్న పాంచాలి పలుకులు అల్పాక్షరముల అనల్పార్థ రచనగా
వెలువరించిన కవి ప్రతిభకు నిలువెత్తు నిదర్శనాలు. కొడుకులకూ కోడళ్లకూ
మనుమళ్లకూ దూరమై ధృతరాష్ట్రుడి భవనంలో కాలం గడుపుతున్న కుంతీదేవిని కవి
ఎలా వర్ణించారో చూడండి –
విశ్వవిఖ్యాత భారతవీరమాత
కుంతి పడియుండె కురురాజు కొంపలోన;
అశ్రుధారలు తన లోచనాంచలముల
యమునలై గంగలై కృష్ణలై స్రవింప.
ఇక్కడ గంగ- కృష్ణ – యమునలుగా మారిన కన్నీటితో కుమిలిపోతున్న కుంతీ
మాతతోపాటు గంగ – కృష్ణ – యమన నదులతో నిండిన భారతమాత కూడా
అప్రయత్నంగా మనకు దర్శనమిస్తుంది.
కరుణశ్రీ :
ఈ కావ్యంలో మొత్తం 43 శీర్షికలు ఉన్నాయి. అయితే కవి పేరు, కావ్యం పేరు,
కావ్యనాయకుడి పేరు ఒక్కటే కావటం ఎంత విచిత్రం ! అదే కరుణశ్రీ కావ్యం విషయంలో
జరిగింది. బుద్ధుణ్ణి తన ప్రభువుగా, తన ప్రేమమూర్తిగా, తన ఆదర్శజ్యోతిగా, తన ఆరాధ్య
దైవంగా భావించిన నాన్న కరుణశ్రీ కావ్యాన్ని తన జీవితలక్ష్యంగా చేసికొని మొదటిభాగం
రచించిన నలభై సంవత్సరాల అనంతరం రెండవభాగం రాసి సిద్ధమనోరథులైనారు.
సిద్ధార్థ రాకుమారుడు శ్రీనీ, శ్రీమతినీ, చిరంజీవినీ, సింహాసనాన్నీ పరిత్యజించి
మహాభినిష్క్రమణం చేసి మర్రిచెట్టు నీడల్లో బుద్ధుడై ప్రపంచానికి అమరసందేశాన్ని
అందించిన విషయం “కరుణశ్రీ’’ కావ్యంలో రసజ్ఞమనోజ్ఞంగా వ్యక్తీకరింపబడింది.
అసూయాద్వేషాలతో, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలతో, అస్తవ్యస్త
పరిస్థితులతో అలమటించే లోకానికి శాంతి, ప్రేమ, కరుణ, అహింసలను బోధించిన
బుద్ధభగవానుడికి ఇలా పునరాహ్వానం పలికారు ఆయన –
దయసేయంగదవయ్య శాక్యమునిచంద్రా! నీ పదస్పర్శచే
గయిసేయంగదవయ్య భారతమహీఖండంబు; దివ్యత్కృపా
మయమందారమరందబిందులహరీ మందస్మితాలోకముల్
దయసేయంగదవయ్య మానవ మనస్తాపంబు చల్లారగన్.
“మహాభినిష్క్రమణం” ఘట్టంలో సతీసుతులను వీడి వెళ్లటానికి డోలాందోళిత
హృదయుడైన సిద్ధార్థరాకుమారుడి పరిస్థితికి తగ్గట్లు సెమ్మెలలోని దీపాల కదలికను
ఎంత సహజంగా చిత్రించారో కవి –
పొమ్మనినట్లొ ! పోవలదు పోవలదంచనినట్లొ ! వెన్కకున్
రమ్మనినట్లొ ! రావలదు రావలదంచు వచించినట్టులో !
సెమ్మెలలోని దీపములు చిత్రముగా తలలూపె; రాజహ
ర్మ్యమ్మున వెచ్చనూర్చుచు నృపాత్మజుడిట్టటు సంచరింపగన్.
జీవించినంత కాలం కవిత్వం రాసి, కవిత్వం రాసినంత కాలమే జీవించిన మహాకవి
నాన్న గారు. తన కవిత్వాన్ని ప్రజల నాల్కలపైన నాట్యం చేయించిన ప్రజా
హృదయాస్థానకవి ఆయన.