పెన్నేపల్లి గోపాలకృష్ణ చెక్కిన సజీవశిల్పం మధురవాణి
“మధురవాణి ఊహాత్మక ఆత్మకథ”కు మూలం
గురజాడ వారి కన్యాశుల్కం. ఈ నాటకంలో వైవిధ్యంగా
మలచిన ఒక పాత్ర మధురవాణి. ఒక సామాన్యవేశ్య
ఆత్మనిబ్బరంతో అన్యాయాన్ని ఎదిరించి, ధైర్యంగా ఎలా
పోరాడగలదో చిత్రిస్తారు. ఆ పాత్రను చూసి, అబ్బుర పడిన
గోపాలకృష్ణ గారు “మధురవాణి
ఊహాత్మక ఆత్మకథ” వ్రాశారు
2007లో.
మధురవాణి భావాలను,
అనుభవాలను, ఆలోచనలను ఆమె నోటివెంట ఆమె భాషలో
పలికిస్తే, ఆమె కథను ఆమె మాటలతోనే చెప్పిస్తే
ఎలావుంటుందన్న ఆలోచన – ఒక గొప్ప వినూత్నమైన
ఊహ – గోపాలకృష్ణ గారి మనస్సులో మెదిలింది. ఆ
ఆలోచనారూపమే ఈ ఊహాత్మక ఆత్మకథ! కేవలం
నాటకంలోని కల్పిత పాత్రగా కాకుండా, మనసున్న
మనిషిగా ఊహించుకొని, ఆమె కథకు శ్రీకారం
చుట్టారు. ఆమె పాత్రను పూర్తిగా అర్థం చేసుకొని,
తన జీవితంలో జరిగిన వివిధ సంఘటనలు,
తనచుట్టూ చేరే మగవాళ్ళు, వారి కపటపూరిత
మాటలు, నటనలు, తన మర్యాదలేని జీవితం – ఆమె
మనోనేత్రంతో చూసి, ఆమె మనోభావాలను, మనస్త
త్వాన్నీ ఊహించి కథ రాయటం అంత సులభతరం
కాదు.
రచయిత తానే మధురవాణియై, ఆ పాత్రలో లీనమై
జీవిత కథ చెప్పటం – ఒక అద్భుతమైన సృష్టి! ఇలాంటి
ఊహాత్మక ప్రయోగం బహుశా తెలుగు సాహిత్యంలో
ఇదే ప్రథమం! ఆమెనొక అసాధారణ స్త్రీమూర్తిలా తలపొసినందునే ఒక సజీవశిల్పంగా
పాఠకుల ముందు వుంచగలిగారు. చదువుతున్నంతసేపు మధురవాణి పాఠకుల
కళ్ళముందు కదలాడుతూ ఉంటుంది. మనతో మాట్లాడుతూ తన భావాలు
పంచుకుంటున్నట్లేవుంటుంది.
నాటి సామాజిక పరిస్థితులలో దేవదాసి పద్ధతి క్రమేపీ కాలంలో మార్పుచెందుతూ,
డబ్బుకు శరీరాన్ని అమ్ముకొనే వృత్తిగా ఎలా మారిందో తెలుసుకున్నాక అందులో
నుంచి ఎలా బయటపడాలన్న స్పృహ, ఆలోచన, వేశ్యావృత్తికి సాక్షిగా, కొత్తరానికి
ప్రతినిధిగా నిలిచిన ఆ సంఘర్షణను, కాలంతోపాటు ఆమె జీవనవిధానంలో కలిగిన
మార్పును సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఆమె నోటే వినాలి! అందుకే ఆమె ఆత్మకథ!!
“ఆత్మగౌరవం వున్న ఏ మనిషీ తాను బ్రతుకుతున్నది గంజిగుంటని గుర్తెరిగిన
తరువాత కూడా అందులోనే హేయంగా ఎందుకు బ్రతుకు గడపాలనుకుంటుంది?”
(పే. 115)
తన వృత్తి హైన్యతను తెలుసుకొని మారాలనుకున్న మధురవాణి ప్రశ్న. ఇకనుంచీ
తను ‘వన్నెల చిన్నెల వయ్యారి వగలాడి కాదు. ఒక గొప్ప శిల్పకారుడు మనస్సుతో,
మేధస్సుతో శిల్పించిన సంపూర్ణ ప్రతిమ! సృష్టికర్తే మురిసిపోయి, ముగ్ధుడైనట్టి
ముత్యాలసరం ఈ మధురవాణి!” ఎంత ఆత్మవిశ్వాసం! ఎంత గొప్పభావం
మధురవాణి నోట పలికిస్తారు రచయిత!
సృష్టికర్తయేమో గానీ, ఆత్మకథతో మధురవాణిని శిల్పంగా మలచిన గోపాలకృష్ణ
గారు మాత్రం మురిసిపోయి, ఉబ్బితబ్బిబ్బయ్యారు నిస్సందేహంగా! అందుకే,
“మధురవాణి అనే సృష్టి జరక్కపోయివుంటే సాహిత్యలోకానికి ఎంతలోటు
కలిగివుండును?” అంటారు. మధురవాణి, రచయిత ఊహకు కూడా అందనంత
ఎత్తుకు ఎదిగిపోయింది ఆమె ఆత్మకథతో.
తన ఆత్మకథ ఎవరు రాశారని సరళ అడిగినట్లు, దానికి మధురవాణి, “నా ఆత్మ
కథ రాసింది నేను కాదు. పెన్నేపల్లి గోపాలకృష్ణ రాసి పెట్టాడు. పేరు నాది. ఊహ, రాత
అతనిది. అతనికి నాపై మమకారం మెండు!” అని చెప్పినట్టు కవరుపేజి మీద
పుస్తకపరిచయం!
మధురవాణి మనస్సెరిగిన పెన్నేపల్లి:
మధురవాణి కథ కడపటి మజిలీ తన క్రొత్త జీవితంలోకి అడుగువేస్తున్నప్పుడు
మొదలుపెడ్తుంది. అక్కడ నుంచి తన గత అనుభవాలను చెప్పుకుంటూ వెళ్తుంది.
వేశ్యకు నాట్యం, సంగీతం, అందం – యివే జీవనాధారం. ఈ కళలను నమ్ముకొని కాక
దేహాన్ని అమ్ముకొని జీవించమని శాసించినప్పుడు సమాజం మీద తిరుగుబాటు
చేస్తుంది. సరియైన దారిలో గురజాడవారి ఉదాత్తభావాలే నడిపించాయంటుంది.
వేశ్యావృత్తిని నిర్మూలించాలంటే ముందు వారిని మనుష్యులుగా చూడడం అవసరం అని, గురజాడ వారు అన్నప్పుడు,
“ఆ ఎముకల పోగులాంటి బక్కపలచని మనిషిలో ఎంత గొప్ప ఆలోచనలో?” అని
ఆశ్చర్యపోతుంది. (పే. 156)
తన జీవిత విధానాన్ని, తనలో కలిగిన మార్పులను చెప్పుకుంటుంది. తన వృత్తికి,
పరిస్థితులకు మధురవాణి కట్టుబడి జీవిస్తుంది. ఆమెలో వున్న సంస్కారం, ఆలోచనలు
ఉదాత్తమైనవి. కాలంతోపాటు హీనస్థితికి దిగజారిన ఈ వ్యవస్థపై తిరగబడాలని, తన
కంటిన బురద తనే కడిగేసుకోవాలన్న కోరిక తనలో మార్పుకు నాంది. లోకం పోకడలు
గమనించి, నిర్మలమైన అంతఃకరణతో మంచిచెడులు చూసింది. ఒక్కొక్క అనుభవం
నుంచి ఒక్కోపాఠం నేర్చుకొంది. చెడ్డతో స్నేహంగా వుండటం తప్పకపోయినా
కడవరకు దాన్ని ఓడించడానికే ప్రయత్నం చేస్తుంది. మనసుకు మలినం అంటనంత
వరకూ తాను పవిత్రురాలనని చెప్పగలిగిన ఆత్మస్థైర్యం. వృత్తిరీత్యా వేశ్య అయినా
ప్రవృత్తిరీత్యా మనసున్న మంచి మనిషి.
సంఘసంస్కర్తలమన్న ముసుగులో పెద్ద మనుషులు ఆడుతున్న కపటనాటకాలను
సమయోచిత ఆలోచనతో ఎత్తిచూపి బుద్ధి చెప్పగలదు, నిలదీయగలదు. ‘అంతా
దైవనిర్ణయం, విధిరాత’ అనే కరటక శాస్త్రుల్ని పట్టుకుని మనం చేసే వెధవ పనులన్నిటికీ
దేవుడిమీద నిందలేయడమేమిటని దులిపి పారేస్తుంది.
“మధురవాణి అనే నేను యిలాంటి జీవితం గడపటానికి ఎవరిది పూచి?
నా నుదిటి వ్రాత ఎవరు వ్రాశారు? మనుషులా? దేవుడా? భూమ్మీద పడిన శిశువు
నుదిటిపై యిది సాని, యిది సంసారి అని రాసి వుంటుందా?” (పే. 13)
అన్న తర్కానికి కరటక శాస్త్రి దగ్గర ఏ సమాధానమూ లేదు.
రంగనాధ అయ్యరు సానినుద్ధరించే నెపంతో భార్యను పుట్టింటికి పంపీ,
గోపాలరావు సంఘ సంస్కరణకు, మీటింగులకు వెళ్తున్నానంటూ భార్యకు చెప్పీ
సానివాడలకు వెళ్తూ వుంటారు. ప్రేమ సముద్రంలో పీకల వరకు మునిగిపోయిన వీళ్ళా
తమను వుద్ధరించే సంస్కర్తలు? అంటూ ఎకసెక్కాలాడటం మధురవాణికే చెల్లు.
ఇటువంటి పతిదేవుళ్ళ నీడలో బతికే ఆ మహాస్వాధీమణులకన్నాతానే పవిత్రురాలనని,
నిజాన్ని నిర్భయంగా మాట్లాడే తానే గొప్ప నీతిగలదాన్నని అంటుంది. తన వృత్తిలో
రహస్యం లేదు, దాచుకోవడం లేదు. మర్యాద ముసుగులో వాళ్ళు చేసే అవినీతి
వికృతచేష్టలకంటే ఎప్పుడూ అబద్ధమాడని తానే మర్యాదస్తురాలనంటుంది. ఈ
పెద్దమనుషులంతా ‘నిజాయితీపరులైన, తన వృత్తికి బద్ధురాలైన వేశ్యకంటే ఏవిధంగా
మిన్న? (పే. 41) ఇలా తమ నిజాయితీ గురించి నిర్భయంగా చెప్పగలిగిన గుండె
ధైర్యం ఈ పెద్దమనుషులకు వుందా? అని ప్రశ్నిస్తుంది.
రామప్పపంతులు తనను పొరుగూరు లేవదీసుకుపోయినప్పుడు, దర్జాగా
గ్రామంలో ఇంటిలోనే మకాం పెట్టించాడు. అప్పుడు మధురవాణి, ‘ప్రేమకు పెళ్ళాం,
మోహానికి వేశ్యా’ అంటూ ఎగతాళి చేస్తూ యిదంతా పురుషకుట్ర అంటుంది.
వేశ్యలంటే అంత చులకనా? అంటూ నిలదీస్తుంది.
“ఔరా! ఆడదాన్ని వేశ్యగా ఫిరాయింపు చేసి జాతిని ఎంత అనాడీ చేసిందీ పురుష
ప్రపంచం?” (పే. 36) రామప్పపంతులంత చెడ్డవాడు ముల్లోకాలు కాగడావేసి
వెతికినా వుండడంటుంది. అయినా అతని ఎడల మంచిగా వుండటానికే ప్రయత్నిస్తుంది.
సౌజన్యరావు పంతులకి వేశ్యలంటే చులకన. వాళ్ళకు మంచి ఉండదని
నమ్ముతాడు. అందుకే వాళ్ళలో మంచితనం గుర్తించడానికి యిష్టపడడు. అతను
వేశ్యలవైపు కన్నెత్తి చూడడని, అది అతని వ్రతమని కరటక శాస్త్రి చెప్పినప్పుడు, “అదేం
వ్రతం? వేశ్యాతృణీకార ఛీత్కార వ్రతం కాబోలు! వేశ్యను చూడరాదు. తాకరాదన్న
కఠోర నియమం తప్ప సంస్కరించాలన్న ఆలోచన ఆయనకు లేదా?” (పే 75)
ఇటువంటి చమత్కారమాట విరుపులు మధురవాణి నోటివెంట పలికిస్తారు
రచయిత. ఇంత కఠోరమైన వ్రతం చివరకు మధురవాణి చేసిన సాయానికి షేక్ హ్యాండ్
ఇచ్చినప్పుడు ఏమౌతుంది? మధురవాణి అడుగుతుంది నిస్సంకోచంగా, “ఏమిటి
తాత్పర్యం? వేశ్యశరీరం తగిలితే తగిలిన శరీరం కోసేసుకుంటానన్న ఆదర్శం
హాస్యాస్పదమని తానే గుర్తెరగడం! అవునా”?! (పే. 75)
ఈ మగవాళ్ళ తత్వాలు లోతుపాతులు పట్టి చూడగలిగింది కాబట్టి, వాళ్ళకు
సమాధానం దొరక్కుండా, తన మాటల చమత్కారంతో వాళ్ళనోళ్ళు
మూయించగలిగింది. గిరీశం అధునాతన భావాలున్న వాడినని గొప్పలుపోతూ
బుచ్చమ్మలాంటిబాల్యవితంతువులను పెళ్ళిపేరుతో మోసం చేయడానికి సిద్ధపడ్డప్పుడు
ఏకిపారేస్తుంది. యిదేనా సంఘసంస్కరణ అంటే? అని. గిరీశం సిగ్గు, ఎగ్గు వదిలేసిన
వాడు కనుక అవమానానికి, ఓటమికీ ఎన్నడూ వగచడు. దూషణభూషణ
తిరస్కారాలకు అతీతుడు. సంఘసంస్కర్తలంటూ జారిపడిపోతూ వుంటారని, చివరకు
తనలాంటి వాళ్ళ చేయే ఆసరా అవుతుందని అంటుంది తరతరాలుగా ఆ వృత్తినే
నమ్ముకొని బతుకుతున్న అభాగినులకు మరొక జీవనమార్గం చూపకుండా, వారి
కడుపుగొట్టడం ఎంతవరకూ న్యాయమని ప్రశ్నిస్తుంది. “వేశ్యను చావగొట్టి వల్లకాటికి
సాగనంపటానికి పంతులుగారు అందిపుచ్చుకోని ఆయుధం లేదు కదా?” (పే. 53)
వేశ్యలు నశించని సమాజం బాగుపడదని చెప్పడం, తమతో సంబంధం వున్న
వారిని మాత్రమే ఉద్ధరించాలనటం – మధురవాణికి కోపం తెప్పిస్తుంది. “ఈ భూమి
మీద వున్న యావన్మంది సానుల్ని కట్టగట్టి రాజమేంద్ర నడివీధిలో భోగిమంటవేసి
వెచ్చగా చలికాచుకోరాదో?” (పే 57) అని సూటిగా ప్రశ్నిస్తుంది. నిర్భాగ్యవేశ్యావృత్తిని
మట్టుకు నిప్పులుకురిసే మూడో కంటితో చూశారంటుంది. ఎదుటివాళ్ళు ఆత్మరక్షణలో
పడేలా మాట్లాడగల నేర్పు తనది.
ఎంతమంది సంస్కర్తలు వచ్చినా ఎవరు ఏమి ఉద్ధరించగలిగారని ఆక్రోశిస్తుంది.
అభంశుభం తెలియని పసిపిల్లను
కన్యాశుల్కానికి ఆశపడి
ముసలివాళ్ళకిచ్చి పెళ్ళిచేయటం, వాళ్ళు
బాల్యవితంతువులుగా దుర్భరజీవితం
గడపడం వేలెత్తి చూపుతుంది.
అగ్నిహోత్రావధానులు రెండవ
కూతురును ముసలాడికిచ్చి పెళ్ళి
చేయాలనుకున్నప్పుడు, ఎంత చెప్పినా
వినడు. ఎందుకంటే బుచ్చమ్మ వైధవ్యం దాని తలరాతట! ‘ప్రాలుబ్ధం’ చాలక
ప్రాప్తించిందట. తలరాతను ఎవరూ, తప్పించలేరన్నప్పుడు, “ఎవరు రాసిన రాతో?
స్వార్థచింతనతో తనలాంటి తండ్రులు రాసింది కాదూ? మన తలరాత ప్రాలుబ్ధం అని
ఏ విషయాలు వదిలేస్తున్నారు?” (పే.89)
అవధానులు చేస్తున్నది న్యాయమేనా అని మధురవాణి ప్రశ్నిస్తే, తగిన సమాధానం
చెప్పలేక మాట దాటవేస్తాడు. ఇటువంటి దురాశాపరులే ఆడవాళ్ళ శత్రువులంటుంది.
“ఆడదాని బ్రతుకు మట్టిపాలైనా మగవాడికేమిటి ఖాతరి?
ఎన్ని అనర్థాలు? ఎంత ఆక్రూరం?” (పే. 99)
నిస్సహాయులైన ఈ ఆడవాళ్ళంతా తిరగబడాలని కోరుకుంటుంది. వితంతువులకు
తమ బ్రతుకులో అపశ్రుతిని సరిదిద్దుకునే అవకాశం వీరేశలింగం పంతులు గారు
కల్పించి, పునర్వివాహాలు చేసినప్పుడు చాలా సంతోషపడుతుంది. ఈ దురాచారం
తుదముట్టించే ప్రయత్నం కొంతమేర విజయవంతం అయినందుకు. ఈ విషయంలో
ఆయన నిస్సంశయంగా మహాపురుషులు. ఇదే ప్రయత్నం, ఇంత కనికరం వేశ్యల
విషయంలో ఎందుకు చూపరని బాధపడుతుంది.
అప్పుడప్పుడు తన పాట వినటానికి వచ్చే గురజాడ పంతులుగారంటే చెప్పలేని
అభిమానం, భక్తి, గౌరవం. ఒకసారి మాటల్లో తనతల్లి, “వేశ్యకు మాత్రం నీతి
వుండొద్దూ?” (పే.31) అంటుంది. పంతులుగారు ఒక్కక్షణం నివ్వెరపోతారు.
తేరుకొన్నాక, “ఔరా! ఇంతకాలానికి వేశ్యనోట నీతి అనేమాట వినరావటం
ఆనందంగా వుంది సుమా!” అంటారు. ఏ వృత్తికైనా ఒక నీతి, సంప్రదాయం వుండాలి
కదా? మరి వేశ్యవృత్తికి కూడా నీతి వుండొద్దూ అని ప్రశ్నించడంలో, సానిదాని నీతి
గురించి పంతులుగారు ఆలోచించేలా చేయగలిగిన వ్యక్తిత్వమున్న మనిషిగా
మధురవాణిని రచయిత మలిచారు. మధురవాణి దృష్టిలో మానవీయదృష్టి కలిగి,
వారిలోని మానవత్వాన్ని గుర్తించి, గౌరవించి, వారి కన్నీళ్ళకు కారణం ఎరిగినవారు
పంతులుగారు ఒక్కరే. అట్టి సత్పురుషుని దయ సంప్రాప్తం కావడం మధురవాణి
అదృష్టం కాదూ? అనుకొంటుంది.
రచయిత అప్పటి వాడుకభాష, మాండలీకాలు, పాత్రోచిత సంభాషణలు చక్కగా
వ్యక్తీకరించారు. మధురవాణిలో నీతితప్పని, ఆత్మవంచన చేసుకోని జీవితం.
అన్యాయానికి ఎదురొడ్డడం, చేతనయిన సాయం చేయటం, సమయస్ఫూర్తి,
చమత్కారపు మాటలు, అవినీతి కూపంలోను మంచిని పెంచడం, అందరినీ
ప్రేమించడం లాంటి గొప్ప లక్షణాలన్ని ప్రోదిచేసి మలచిన పాత్ర. ఆమెలో కలిగిన
మార్పు మారుతున్న సామాజిక పరిస్థితులకు, చరిత్రకు దర్పణం.
ఆత్మకథా ప్రారంభంలో సౌజన్యరావు ప్రశ్నకు తన పేరు మధురవాణి అని, ఊరు
విజయనగరం అని చెప్తుంది. ఇంటిపేరు అడిగితే ‘కన్యాశుల్కం’ అని చెప్పి వుండేదాన్ని
అనటంలో ఎంత విరుపు, చమత్కారం! అలాగే కథ చివర్లో గురజాడ గారి మరణం
హృదయానికి హత్తుకొనేలా రాస్తారు. పంతులుగారు పోయారని తెలియగానే ‘మా
గురువుగారు పోవడం ఏమిటి?’ అనుకుంటూ గాల్లో తేలుతున్నట్లు నడచివెళ్తుంది.
పంతులుగారి దగ్గర కూర్చోగానే మధురవాణిని చూసి, నవ్వి,
‘మధురం! వచ్చావా? కాస్తయిసుంటారా’
మీరు చనిపోయారంటగా? అన్నాను తలవంచుకొని.
‘పిచ్చిపిల్లా! నే చనిపోవడమేమిటే!’
కాసేపు మౌనంగా ఉన్నారు….
‘నీవు లేవూ? నేను అంతే!
నీవు వున్నంతకాలం నేనూ వుంటాను సుమా!’ చిరునవ్వుతో (పే. 157)
నువ్వున్నంత కాలం నేనూవుంటానని చెప్పించడంలో గురజాడ వారి కన్యాశుల్కం,
మధురవాణి – సాహితీ ప్రపంచంలో శాశ్వతంగా వుంటాయని ఎంత హృద్యంగా
చెప్పారు రచయిత!
‘పాట పాడు మధురం నీకిష్టమైన పాట’, అని పంతులుగారు అడిగినట్లు, ఆయనకు
ఇష్టమైన ‘దేశమును ప్రేమించుమన్నా….’ పాట పాడడం మొదలెట్టినట్లు రాస్తారు.
మధురవాణి పాట పాడుతూనే వుంటుంది. పంతులుగారిని సాగనంపే వరకూ.
పాడుకుంటూనే యింటికి వస్తుంది. ఇంట్లో అడుగుపెట్టగానే ఎదురుగా గురువుగారు
- కుర్చీలో కూర్చొని ప్రశాంతంగా చిరునవ్వు చిందిస్తున్నట్లు, తనతో పాటు ఆయనా
గొంతు కలిపినట్లు అనిపిస్తుంది. పాడుతూ కాళ్ళమీద పడిపోతుంది.
ఒంటిమీద సృహవచ్చేసరికి తూర్పున తెల్లవారుతూ ఉంటుంది. కోకిల కూస్తూ
ఉంటుంది. ఆమె జీవితంలో కూడా ఉషస్సు కొత్త జీవితానికి స్వాగతం పలుకుతూన్నట్లు
ముగిస్తారు.