గురజాడ జీవిత గమనం,
భాషా విప్లవం
గురజాడకి తండ్రంటే ఎంతో భక్తి గౌరవాలు. తండ్రికీ
కొడుకంటే అపరిమితమైన వాత్సల్యం. మొదట 10 ఏళ్ళ
వరకు చదువు చీపురుపల్లి, తరువాత రంగం విజయనగరం.
ఇక్కడనే మహాకవి విద్యాభ్యాసం, సాహిత్య రచన, ఉద్యోగం,
మిగిలిన జీవితం అంతా గడిచింది. చిన్నప్పటినుండీ చిలిపి
ప్రశ్నలే, వాద- ప్రతివాదాలే, ‘తర్కవితర్కాలే’. అయినా
ఎక్కువకాలం చదువుమీదే ధ్యానం, దీక్ష. పట్టిన పుస్తకం
పూర్తయ్యేవరకూ విడిచేది లేదు. చిన్నతనం నుండి
పరిశీలనా, విమర్శనా దృష్టే. పుస్తకాల్లోని మాటలు
రామచిలకల్లా పలికితే లాభం లేదు. చదవాలి. చదువుకంటే
ఎక్కువ- చూడాలి. చూసి కనిపెట్టాలి. ప్రకృతి అనేది అన్ని పుస్తకాలకంటే గొప్పది. అది
చదవటమే పరమావధి అన్నట్లు ఉండేవారు.ఆయనకి రెండు ‘దురలవాట్లు’ అని
గిడుగు రామ్మూర్తి పంతులు అనేవారు.
1. కనిపించిన ప్రతి పుస్తకాన్నీ చదవటం
2. ప్రకృతి అనే గ్రంథాన్ని పరిశీలించటం.
గురజాడ స్వతంత్ర యోచనాపరులు. బి. ఎ.పరీక్షల్లో ఫిలాసఫీ సబ్జెక్టులో అడిగిన చుప్పనాతి ప్రశ్నలకు ముక్కు, చెవులు కోసి విమర్శించినవారు!
పరీక్ష పాసయి పెద్దబట్ల శాస్త్రి “నువ్వు మా అందరికన్నా చురుకుపాలున్న వాడివి కదా, పరీక్ష ఎందుకు పోయింది” అని అడిగితే
“మనలో చురుకుపాలు హెచ్చయిందోయ్” అని
వీరజవాబు!! పాతికేళ్ళ వయస్సుకి గురజాడ 1886లో
పట్టభద్రులయ్యారు. తత్వశాస్త్రం అభిమాన
విషయంగా, సంస్కృతం రెండవ భాషగా బి.ఎ.
పాసయ్యారు. పెద్ద పదవులు కావాలని కలలు
కనలేదు. ఒక కుర్చీలో కూర్చుని పిల్లల్ని చుట్టూ
చేరదీసి వాళ్ళతో అచ్చట్లు, ముచ్చట్లు
చెప్పుకొంటూ “మాష్టారు ఉద్యోగం చేయాలని
నా మొట్టమొదటి కోరిక. తీరా అయ్యాక అందులో ఆనందం లేదనిపించింది. కోర్టు
మునసబు అయితే బావుణ్ణనిపించింది, కానీ కాలేదు. లాయరునవుదామని ఉత్సాహం.
అదీ కాలేదు. కాకపోయినా ఎన్నో కేసులను కోర్టులో నడిపాను” అని చెప్పేవారు.
ఆయనే గనక కేవలం లాయరయితే ఈ ఆంధ్ర సాహిత్యం ఏమైపోను?
విజయనగరం కళాశాలలో లెక్చరరుగా…నెలకు వంద జీతం. గట్టిగా విషయ
సేకరణ చేసి ఎఫ్.ఎ; బి. ఎ.లకు ఇంగ్లీషు, వ్యాకరణం, సంస్కృత సారస్వతం,
అనువాదం, రోమన్ చరిత్ర క్లాసులకు వెళ్ళేవారు. బహు విధాలా వివిధ విషయాలను
బేరీజు వేసి నిగ్గుతేల్చడం ఆయనకు అభ్యాసం.విద్యావేత్తగా, సాహితీ యుగపురుషుడిగా,
మహాకవి, తత్వవేత్తగా పరిణతి చెందారు. సమాజ చైతన్యాన్ని కలిగించే మనోబలాన్ని,
ధైర్యాన్ని, సాహసాన్ని, నూతన దృష్టినీ ఆయనకిచ్చిన దశ ఇదే.చదివిన గ్రంథాలు,
లెక్కకి మించినన్ని పరిశోధనలు, ఎప్పుడూ విద్వద్గోష్ఠులు. చుట్టూస్నేహితులే, అంటే
పండితులే. కిళాంబి రంగాచార్యులు, యనమండ్ర నారాయణమూర్తి, లింగం లక్ష్మీజీ
పంతులు, అనాసపురపు రామ్మూర్తి పంతులు- ఒక్కొక్కరూ ఒక్కో భాషలో
మహాపండితులు, అనేక భాషలతో పరిచయం గ లవారు. సంస్కృత, ఆంగ్ల, ఆంధ్ర
భాషలలో ఘనులు. గురజాడ అనేవారు “నా అదృష్టం ఏమిటో గానీ- నాకు పరిచయం
కలిగే మనిషల్లావేలలో,కోట్లలో ఎన్నదగినవాడై ఉంటాడు’. ఆ మాట అక్షరాలా నిజం.
ఆనందగజపతి విజయనగరం మహారాజు ‘వ్యసనం’ విద్యాగోష్ఠి. అక్కడే చర్చలు.
అపార గ్రంథపఠనా కావ్యాలు, విమర్శలు, నాటకం మీద ప్రత్యేక కృషి.
తెలుగులో నాటకాలే కాకుండానవలలు కూడా రాయాలనే కుతూహలం
గురజాడకు కలిగింది. 1896-97 మధ్య రచించినట్లు తెలుస్తోంది. మహారాజు
మరణానంతరం, ఆయన సోదరి రీవా మహారాణికి కార్యదర్శిగా నియమి తులయ్యారు.
ఈ కాలంలోనే ఎన్నో రచనలు చేశారు. కొండుభట్టీయం, కన్యాశుల్కం రెండవకూర్పు,
దేశభక్తి, కన్యక, బిల్హణీయం, లవణరాజుకల, పూర్ణమ్మ. ఆంధ్ర సాహిత్యంలో ఇదొక
అపూర్వ విప్లవదశ. గురజాడే దానికి నాయకుడు. “నాది ప్రజల ఉద్యమం. దానిని
ఎవరిని సంతోషపెట్టడానికీ వదులుకోలేను” అన్నారు. ఈ ప్రజాస్వామికోద్యమ
విజయసాధనకు వాగనుశాసనులు రామ్మూర్తి పంతులుగారు, మహాకవిగారు.
గురజాడ దుర్బల శరీరులు. ఒంటి పూట భోజనం. చారూ అన్నం. పాలూ రొట్టె.
పిసరంత ఎండకీ గాలికీ శరీరం తట్టుకునేది కాదు. ఒంట్లో నిస్త్రాణ. కడుపులో భగభగ.
నరాలూ పేగులూ తోడుకుపోవటం. కార్యభారం మోయలేనిది. అయినా బహుముఖ
కార్యకలాపాలు, విద్యాసమస్యలపై చర్చలు, పండిత గోష్ఠులు, వివిధ దేశాల సారస్వత
ఉద్యమాల సమీక్ష, వ్యావహారిక భాషావిజయం కోసం ఇటు విశ్వవిద్యాలయాల్లో అటు
పండితులతో ‘యుద్ధం’. కోర్టుకేసులు, మేధస్సుకి శ్రమ. డాక్టర్లు విశ్రాంతి తీసుకోమంటే
“అది నావల్ల కాదు. పని… పనిచేయటమే నాకెంతో ఉత్సాహం, దానిమీదనే పరిపూర్ణ
విశ్వాసం. పనీపాటూ లేకుండా ‘అభివృద్ధి రావాలి, అభివృద్ధికి రావాలి’ అని
పలవరించేవాళ్ళంటే మటుకు నాకు సుతరామూ సానుభూతి లేదు. పనిచేయటం నాకు
ఒక అలవాటు, అదే ధ్యేయం. దానికదే పరమావధి” అనేవారు.
ఆయనకు క్రోధమనేదే లేదు. మీదపడి కొట్టవచ్చినా, నవ్వి ఎదుటివాడి కోపం
చల్లార్చే స్వభావం. ఒక అపరిచిత వ్యక్తినైనాచూసి చూడగానే అతని గుణశీలతను ఇట్టే
పోల్చుకోగల ప్రతిభ. తాను చూసేదానిని, వినేదానిని ప్రతి విషయాన్నీ పరిశీలన చేసి,
బాగోగులు నిర్ధారించుకొని, వస్తుత్వంలో మెరుగులు గ్రహించేంత శక్తి. రీవారాణి
అనేవారట-‘అప్పారావు చూస్తుండగారాయకు. ఏమి రాస్తావో దూరంనుండే నీకలం
తిరుగుడునుబట్టే పోల్చేస్తాడు’. ఈ పరిశీలనాశక్తి, దృష్టి ఆయనకు
అలవాటయిపోయింది. ఇతరులలో కనిపించే నవ్వు పుట్టించే అంశాలు(చప్పున
పొడగట్టేవి) తనలో తాను చూచుకొని నవ్వుకొనే అంతర్ముఖుడు. తనపై తానే ఛలోక్తులు
విసురుకునే సరసత. ఏ ఊరు వెళ్ళినా అక్కడ వీధులు, బజార్లు, పఠనాలయాలు ఎలా
ఉన్నాయనేది పరిశీలించి ఏ ఏ పుస్తకాలు ఉన్నాయో కనిపెట్టేవారు.
పెద్దకళ్ళు, సొగసైన ముక్కు, విశాలమైన నుదురు, ఆజానుబాహువు, తెల్లని
అతిచక్కని మనిషి. ఉన్నిచొక్కా, దానిమీద కోటు, పైన శాలువా. మేజోళ్ళు, కాళ్ళకు
బూట్లు, శీతాకాలంలో కూడా మీదను గొడుగే. ఆలోచనలను రేకెత్తించే చూపులతో,
దారిన ఎదురయ్యే నేస్తులను నవ్వుతూ పలుకరించే మనస్త ్వం. వేషం పాత ఫక్కీ.
సభలకు – రెండెడ్ల విశాలపు బండిలో పరుపులు,తలగడాలు వేసుకొని సుఖాసీనులై
వచ్చేవారు. తన మాట చెల్లిన చోటనల్లా మన ఆంధ్రులకు, ఆంధ్ర సంస్థలకు సాయపడిన
సిసలైన దేశాభిమాని. తన వద్ద ఉన్న తెలుగు సంస్కృత గ్రం థాలు, మన దేశంలోని
శిలాశాసనాలు, రికార్డులు, నెల్లూరు జిల్లా శాసనాలు ఒంగోలు సుబ్రహ్మణ్యానికి
సాయంచేసి విద్యాధికుడిని చేశారు.”ముందురానున్న తరం- ఆ యువకులు అంటే
నాకెంతో అభిమానం, ప్రేమ, ఆప్యాయత. నాజూకైన వచనంగల వాడుక భాషలో గ్రంథ
రచన సాగించే సంప్రదాయం ఆరంభించాలంటే యువకులు నా ఉద్యమానికెంతో
అవసరం’ అనేవారు. సాటి, తోటి మానవుణ్ణి హృదయమిచ్చి ప్రేమించు. ఎల్లలోకము
లొక్క ఇ ల్లయి, మతములన్నీ మాసిపోయేలా, అలా విశ్వమానవ కళ్యాణాన్ని ఆశించే
యువకుల కోసం ఆయన హృదయం ఆరాటపడింది.ముత్యపు చిప్పలవలె
ఎదురుతెన్నులు చూస్తున్న ప్రజల హృదయాలలో కురిసిన స్వాతివాన గురజాడ
సందేశం.‘చిత్తా స్వాతి వాన జోడించి కురియగాచిప్పలోన బడె చినుకొక్కటి/ఆ చుక్క
ముత్యమయి మునిగిపోయే ముందు చిప్పతో చెప్పింది మాటొక్కటి’. అదే చుక్క
ముత్యంగా మారి ఆంధ్ర కవితామతల్లి మెడలో ముత్యాల సరాలుగా అమరింది.
దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. అటువంటి దేశం,
అందులో మనుషుల కోసం ఆయన కవిత్వమనే మబ్బులు స్వాతివాన జల్లులను
కురిపించాయి. రంగు రంగుల ఇంద్రధనుస్సులనూ, తారలనూ, కాంతినీ ఆంధ్రకవితా
గగన వీధిన అవతరింపజేసిన మహాకవి…53 సంవత్సరాల జీవితకాలం తేదీలనూ
నెలలనూ సంవత్సరాలనూ దశలనూ నాటి చరిత్రనూ పూర్తిగా మార్చివేసింది.
కాలగమనాన్ని ఇంకొక దిక్కుకు మళ్ళించింది.
అప్పారావుగారి గొప్పతనం చాటడానికి ఆయన భాష, శైలి, వ్యక్తిత్వమే రుజువు.
కాలానుగుణం అయిన కవిత ఆయనది.మహానుభావులు, కవీశ్వరులు, జ్ఞాన
సంపన్నులైనవారు ఏది రాసినా వైశిష్ట్యం ఉంటుంది. తెలుగును అభివృద్ధి
చేయటమంటే- భాషను ఆరాధిస్తూ, దానిలో ఉన్నతి ఉన్నవారిని గౌరవించి
ప్రోత్సాహమివ్వడం. అన్న దమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయ్
అని ఆయన ప్రబోధించారు. ఆ మహాకవికి జేజేలు అర్పించడం మనందరి విధి.