10.7 C
New York
Tuesday, November 26, 2024

కన్యాశుల్కంలో గిరీశం

కన్యాశుల్కంలో గిరీశం

సంస్కృతభాషలో గొప్ప నాటకరచయితలుగా పేరొం
దిన భాసుడు, భవభూతి, కాళిదాసు నాటకాల్ని క్షుణ్ణంగా
అధ్యయనం చేసిన కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ
గారు గురజాడ కన్యాశుల్కం నాటకాన్ని సంస్కృతరచయితల
నాటకాలతో సరిపోలుస్తూ గురజాడ వారి కన్యాశుల్కం
నాటకమే కాదుపొమ్మన్నారు. అయినాసరే ఈనాటికీ
కన్యాశుల్కం పాఠకులు చదువుతూనే వున్నారు. అడపా
దడపా దానిగురించి కొత్తకోణాల్లో విశ్లేషిస్తున్నారు. తెలుగు
కథాసాహిత్యంలో కాళీపట్నం రామారావుగారు రాసిన
“యజ్ఞం” కథ గురించి జరిగిన చర్చ ఏ యితర కథ గురించి
జరగలేదు అలాగే కన్యాశుల్కం నాటకం గురించి జరిగినంత విశ్లేషణ, పరిశోధన
యింతవరకు ఏ నాటకం గురించి జరుగలేదు. బహుశా జరగదేమో కూడా.
మహాకవి శ్రీశ్రీ కన్యాశుల్కం నాటకం గురించి మాట్లాడుతూ ఆ నాటకంలో
జీవితానికి సంబంధించిన ఏ సందర్భానికైనా సరిపోయిన వాక్యాలు వున్నాయని
అన్నారు.
కన్యాశుల్కం నాటకం గొప్పతనానికి గల కారణాలు ఎన్నో వున్నాయి. ముఖ్యంగా
చెప్పుకోవాల్సిన పాత్ర గిరీశమే. ప్రముఖ సాహితీవిమర్శకుడు ఆర్.ఎస్. సుదర్శనంగారు
ఈ పాత్రని విశ్లేషిస్తూ “గిరీశం పాత్రలో హాస్యరసానుభూతి పొందాలంటే నీతి అనే
కొలబద్దను తాత్కాలికంగానైనా అవతలపెట్టాలి. అప్పుడే గిరీశం మాటలూ,
సమయస్ఫూర్తీ, అతను పొందే విజయాలూ మనకు ఆహ్లాదకరంగా వుంటాయి”
అన్నారు.
ప్రొఫెసర్ బ్రాడ్లే మూడు షేక్స్పియర్ నాటకాల్లో కనిపించే ఫాల్ట్స్ ఆఫ్ పాత్రకు చేసిన
విశ్లేషణ గిరీశం పాత్రకూ అన్వయించుకోవచ్చు అన్నారు. బహుశా అసంపూర్తిగా
వుండిపోయిన గురజాడ నాటకంకొండుభట్టీయంలో కూడా గిరీశంపాత్ర కనిపించడం
వలనేమోకానీ ఈ పోలిక సరికాదు.
గురజాడ కన్యాశుల్కం నాటకాన్ని రాయకముందే‌బాల్యవివాహాల, విధవా
వివాహల గణాంకవివరాలు పరిశీలించిన దాఖలా వుంది. ఆ వివాహాల్లో తలెత్తే
సమస్యల గురించి అవగాహన వుంది. రాచమల్లు రామచంద్రారెడ్డిగారు కన్యాశుల్కం
నాటకం గురించి రాస్తూ పైసమస్యలపై గురజాడకు వున్నంత అవగాహన ఆనాట

“I wrote it to advance the cause
of social reform and to combat a
popular prejudice that the Telugu
language was unsuited to the stage”
-Gurajada


సంఘసంస్కర్తలకి కూడా లేదేమో అన్నారు. అంతేకాదు వీరేశలింగం వంటివారు
చేపట్టిన వితంతు వివాహఉద్యమం మంచిదైనా ఆచరణలో ఊహించినంత
సత్ఫలితాలు యివ్వకపోవడం వలన గురజాడకు అసంతృప్తి ఏర్పడివుంటుందని
అభిప్రాయపడ్డారు. ఆ ఉద్యమంలో గిరీశంలాంటి వ్యక్తులను గమనించాకే ఆ పాత్ర
సృష్టి గురజాడ చేసివుంటారు. కన్యాశుల్కం తొలికూర్పు మలికూర్పుల మధ్య పన్నెండు
సంవత్సరాల వ్యవధి వుంది. తొలికూర్పుముందుమాటలో…
“I wrote it to advance the cause of social reform and to combat a popular prejudice that the Telugu language was unsuited
to the stage” అని తన ఉద్దేశం స్పష్టంగా గురజాడవారు తెలిపారు.


తొలికూర్పులో గిరీశం పాత్ర:
విజయనగరంలో ట్యూషన్లు చెబుతూ సంపాదనతో పూటకూళ్శమ్మ భోజనం,
వేశ్య మహాలక్ష్మిని వుంచుకోవడం, దానితో ఫొటోలు దిగాక ఫొటోగ్రాఫరుకు డబ్బులు
చెల్లించలేక శిష్యుడు వెంకటేశంతో కృష్ణరాయపురం అగ్రహారం చేరుకుంటాడు.
ఆంగ్లభాషాప్రవీణుడనని అగ్నిహోత్రావధానులను భ్రమింపజేసి, కోర్టువ్యవహారాలు
తెలుసని నమ్మించడం, విధవావివాహం శాస్త్రసమ్మతమని బుచ్చమ్మని నమ్మించటం,
కోర్టువ్యవహారం సందర్భంగా విశాఖలో సౌజన్యారావుని కలుసుకోవటం, అక్కడే
లుబ్దావధానుల్ని కలిసి ఆస్తి దక్కించుకోవాలని విఫలం కావడం, అబద్దాలాడి
సౌజన్యారావు అభిమానం కోల్పోవడం, బుచ్చమ్మతో పెళ్ళి తప్పిపోవడం, గిరీశం
కంటబడితే తలలు పగుల్తాయని తనని చదువుకోమని సౌజన్యారావు
రాజమహేంద్రవరం పంపడం, దానితో “డామిట్” వ్యవహారం అడ్డంతిరిగిందని
గిరీశం నిష్క్రమించడంతో పాత్ర ముగుస్తుంది.


మలికూర్పులో గిరీశం :
మలికూర్పులో గిరీశం ఆంగ్లవిద్యావిధానంలో చదువుకున్నా డిగ్రీ లేనివాడు. కాన
వచ్చిన ఆంగ్లంతోనే తనతో మాట్లాడ్డమే ఓ “ఎడ్యుకేషన్” అని అందరినీ బోల్తా

కొట్టించగల చతురుడు. శిష్యుడు వెంకటేశం అమాయకత్వాన్ని ఆధారం చేసుకుని
అప్పుల బారినించి తప్పించుకోవడానికేకాక “కంట్రీలైఫ్” హాయిగా అనుభవించవచ్చని
ఎత్తుగడ వేస్తాడు. గిరీశానికి వచ్చిన ఆంగ్లభాషముక్కలకే భ్రమపడి తనకు అల్లుడైతే
బాగుండేది అని అగ్నిహోత్రావధానులను అనుకునేలా ప్రవర్తిస్తాడు. ఓ పక్క కన్యా
శుల్కం, బాల్యవివాహాలని అగ్నిహోత్రావధాన్లముందు సమర్ధిస్తూ మరోపక్క బుచ్చమ్మ
అందానికి మోహితుడై ఆస్తినీ ఆశిస్తూ విధవలు పునఃవివాహం శాస్త్రసమ్మతమేనని
నమ్మిస్తాడు.
పాశ్చాత్యరచయితల పేర్లూ, వేదాలూ తెలిసినట్లుగా మాటలమధ్యలో చెబుతాడు.
ఇతరులను బోల్తా కొట్టించడానికి ఆంగ్లపదాలు తరచుగా వాడతాడు. ఆనాడు
జరుగుతున్న సంస్కరణోద్యమాల గురించి, జాతీయఉద్యమాల గురించి చెబుతాడు.
వాస్తవానికి వాటిపైన తనకు ఏ విధమైన విశ్వాసం లేదు.
గురజాడగారు ఒక బెంగాలీ మిత్రునికి రాసిన అసంపూర్తి వుత్తరంలో గిరీశంలాంటి
వ్యక్తుల గురించి రాస్తూ యిలా అంటారు. “కొందరు పాశ్చాత్యభావాలు మూలతత్వాన్ని
సరిగ్గా అర్థంచేసుకోవడం లేదు. వస్తువుల బాహ్యస్వరూప మిడిమిడిజ్ఞానంతో తాము
విద్యాసంపన్నులమనుకుంటున్నారు. సంస్కృతిపరులమని అనుకుంటున్న భారతీయు
లలో చాలామంది ఇంతేనని నా నమ్మకం.” అయితే గిరీశం వ్యక్తిగతంగా ఎటువంటి
మూఢనమ్మకాలు లేనివాడు. బాల్యవివాహాలు, కన్యాశుల్కం దురాచారాలని
సమయానుగుణంగా వాటిని సమర్థించడమో ఖండించడమో తెలిసిన నేర్పరి. ఆ
నేర్పుతోనే అగ్నిహోత్రావధానుల్నీ బుచ్చమ్మనూ బుట్టలోవేసుకోగలుగుతాడు. అలా
అని మూఢవిశ్వాసాలకు గిరీశం ప్రతీకా కాడు. ఓటమిని ఎదుర్కొనలేడు. అందువలనే
పూటకూళ్ళమ్మకు డబ్బులు యివ్వలేక విజయనగరం నించి శిష్యుడు వెంకటేశంతో
ఉడాయిస్తాడు. ఫోటోగ్రాఫర్ పంతులుకి డబ్బులివ్వలేక చెవుడు నటిస్తాడు.
మధురవాణిని పోషించలేక వదిలించుకుంటాడు. బుచ్చమ్మ కూడా తన మాటలకు
పూర్తిగా పడి పోలేదని గ్రహించి నూతిలో పడిన వెంకమ్మని కాపాడి బుచ్చమ్మ
హృదయంలో స్థానం సంపాదించుకుంటాడు. మిడిమిడి ఆంగ్లభాషాభేషజంతో
అగ్నిహోత్రావధానుల్ని పడేస్తాడు.
గిరీశం పూర్తిగా చెడ్డవాడూ కాదు. ప్రతీ మనిషీ నూరుశాతం మంచివాడూ కాలేడు
నూరు శాతం చెడ్డవాడూ కాలేడు. ఎంతో కొంత రెండు గుణాలూ ప్రతీమనిషిలో
కలగలిసే వుంటాయని గురజాడవారు భావించారు కనుకనే సుబ్బిని లుబ్ధావధానుల
కిచ్చి వివాహం చేయబోతున్నారని తెలియగానే రెండుఠావుల ఆకాశరామన్నవుత్తరం
గిరీశం రాశాడని చిత్రించారు. అయితే ఆ కాస్త చూపిన మంచితనాన్నీ తనకు
ఉపయోగపడేలా మలుచుకుంటాడు. అప్పటికీ బుచ్చమ్మ తనతో రావడానికి పూర్తిగా
సమ్మతించకపోయేసరికి, తనతో లేచిపోతే చెల్లెలి పెళ్ళి ఆగిపోవటం ఖాయమని ఠస్సా

విసురుతాడు. అప్పుడుగానీ బుచ్చమ్మ తనతో లేచిపోవడానికి సరే అనదు.
సౌజన్యారావు ముందు అబద్ధాలు చెప్పి కట్టిన పేకమేడలు అక్కడ మధురవాణి
ఎదురైతే కుప్పకూలుతాయని గిరీశం ఊహించడు. ఎందుకంటే అబద్దాలాడి పబ్బం
గడపడం తన నైజం. తను పూర్తిగా పట్టుబడీ అందరిముందు తనేంటో యిక దాచడం
కుదరదు అన్న గ్రహింపు వచ్చాకే “డామిట్ కథ అడ్డం తిరిగింది” అనుకుంటాడు.
అయితే మలికూర్పులో సౌజన్యారావు గిరీశంతో నువ్వు బుద్ధిగా డిగ్రీ పూర్తి చేస్తే
బుచ్చమ్మతో పెళ్ళిజరిగేలా చూస్తానని చదువుకోడానికి పంపిస్తాడు. ఇది గిరీశం
ప్రవృత్తికి విరుద్ధమైనా గురజాడ గిరీశంలాంటి వ్యక్తి మారే అవకాశమూ వుందనే అలా
ఆ పాత్ర ముగించారనిపిస్తుంది.


మలికూర్పులో గిరీశం పాత్ర విశిష్టతలు:
1) గిరీశం కన్యాశుల్కం నాటకంలో అన్నిపాత్రలతో ఒకసారైనా ఎదురెదురుగా
రావడం జరుగుతుంది.
2) నాటకంలో వున్న అన్ని పాత్రల గుణగణాలూ గిరీశంలో కనిపిస్తాయి.
3) పాశ్చాత్యనాగరికతా ప్రభావానికి గురైనా అవసరమైతే అభివృద్ధినిరోధక
భావనలను సమర్థించడానికి వెనుకాడని ద్వంద్వప్రవృత్తి మరింత స్పష్టంగా
కనిపిస్తుంది.
4) తొలికూర్పుకీ మలికూర్పుకీ గిరీశం వాగ్థాటీ, కవిత్వచాతుర్యం కూడా వటు
డింతింతై అన్నంతగా పెరిగింది.
అయితే మధురవాణిపాత్ర కూడా మలికూర్పులో అంతగానూ పెరిగింది అందుకే
కేవీ. రమణారెడ్డిగారు గురజాడ రచనలపై రాసిన “మహోదయం” లో ఈ రెండు
పాత్రల గురించి “మరలో నుంచి బయల్పడ్డ వస్తువులాగా ఒక్కపెట్టున అప్పారావు
‘మనఃకార్మికశాల” నుంచి తయారై రాలేదు” అంటారు.
అబద్ధాలు చెబుతూ, లేని జ్ఞానం వున్నట్టు నటిస్తూ, అందరినీ మోసగిస్తూ జీవనం
సాగించే గిరీశం పాత్ర పాఠకులను యింత సమ్మోహపరచడానికిగల ముఖ్యకారణాలు
రెండు. మొదటిది గిరీశం మోసగాడేకానీ హానితలపెట్టేవాడు కాకపోవడం. ఇది
సాధారణంగా మధ్యతరగతి ప్రజల్లోవుండే మనస్త ్వం. రెండవది గిరీశం హాస్యప్రవృత్తి.
అందువలనే పాత్రల గుణగణాలు ప్రవర్తన దృష్ట్యా కాకపోయినా
మహాభారతమంటే కర్ణుడి పాత్ర గుర్తొచ్చినట్లు కన్యాశుల్కమంటే గుర్తుకొచ్చేది
గిరీశమే. అందుకే శ్రీశ్రీ శూద్రకుని “మృచ్ఛకటికం” తర్వాత అంత గొప్ప నాటకం
తెలుగుసాహిత్యంలో వచ్చిన “కన్యాశుల్కం” అంటారు.


5/5 - (1 vote)
Vishnu Vardhan
Author: Vishnu Vardhan

Related Articles

Latest Articles