11.7 C
New York
Monday, November 25, 2024

స్వవిషయం

స్వవిషయమ

ఉ. కాటుకకంటి నీరు చనుకట్టుపయిం బడ నేల యేడ్చె ? దో
కైటభదైత్యమర్దనుని గాఁదిలికోడల! యో మదంబ! యో
హాటకగర్భురాణి! నిను నాఁకటికిం గొనిపోయి యల్ల క
ర్ణాటకిరీటకీచకుల కమ్మ ద్రిశుద్ధిగ నమ్ము భారతీ.

పోతన శ్రీమదాంధ్ర భాగవతమును రచియించు
సందర్భమునను మహానుభావుఁడైన పోతనామాత్యు
నకును భాగ్యభోగప్రియుఁడైన శ్రీనాథునకును సంబం
ధించిన కథ లనుశ్రుతముగ వచ్చుచున్నవి. ఆ గాథల యందు భాగవతకృతిసమర్పణమునకు సంబం ధించిన గాథయు నొకటి కలదు. ఆ గాథయును పోతరాజునకు సహజమైన స్వాతంత్ర్య భావ వైభవమును మనోహరముగ దెలుపుచున్నది.
పోతరాజు తన భాగవతకృతి నే రాజునకో ఇచ్చిదుర్భరమైన దారిద్ర్యమును బాపుకొనుట వివేకమని శ్రీనాథుడు పోతరాజును హెచ్చరించెను. శ్రీనాథుని పలుకులు పోతరాజునకుఁ గొంత సంభ్రమమును గలుగఁ జేసినవఁట! తనమనోవికారము వలనన్ను భారతికి గలిగిన సంతాపమును పోతన గనుఁగొని పై పద్యమును రాసి భారతికి దుఃఖోపశమనమును జేసినాఁడట!

పరాధీన స్థితియందున్న భారతి విశుద్ధమైన దేశభాషారాధకులకు గలుగఁజేసెడి హృదయసంతాపము నీ పద్యార్థము విశదముఁ జేయుచున్నది. పోతరాజు పరమస్వతంత్రుఁడు. ఆ మహాకవికి కావ్యసామ్రాజ్యానుభవమున కాటంకము లెవ్వియును లేవు. భాషయందును భావములందును విజ్ఞానమునందును
జీవనప్రవృత్తి యందును. పూర్ణస్వాతంత్ర్యమును గలిగి స్వాధీనభారతి నారాధింపఁ గలిగినను కృతివిక్రయభావము పోతరాజునకు సంతాపమును గలుగఁజేసినపుడు సకల విధములౌ స్వాతంత్ర్యమును గోల్పోయి యిపుడు పరాధీనస్థితియందున్న భారతిని గనుగొనునపుడు గలుగగల సంతాపమునకు మితిమేరలుం గలవా?

మన నిర్మాణమునకు మన పరాధీనస్థితికి మూలశక్తియైన భారతియొక్క పరాధీనస్థితియె మూలము. స్వీయ సంప్రదాయాచార సిద్ధమైన భారతీస్వరూపమును సంకల్పించి ధ్యానించి పూజించి వర్ణించి చిత్రించి కీర్తించి భారతిని ప్రత్యక్షము చేసికొనుటయె స్వాధీనస్థితికి సాధనము.
భారతి దీనదశ ననుభవించుచున్నది. అంగములు శుష్కించినవి. కాంతికళలు పోయినవి. విషమస్థితి గలిగినది.

ఈ మహోపద్రవమునందు మునిఁగితేలుచున్న భారతి నుద్ధరించి శుభస్థితిని గల్పింపవలయునను సంకల్పము భారత హృదయము నందు గలిగినది. సేవాపరాయణులు పలువిధముల నీ దేవి నారాధించుచు దివ్యరూప సందర్శనమును జేయగోరుచున్నారు. ఆరాధనాభిలాష యితర రాష్ట్రములందు వలె నాంధ్రరాష్ట్రమునందును గలదు. ఆ యభిలాషను సఫలము చేయుటకు పత్రికలను
ప్రచురించుచున్నారు. గ్రంథములను వ్రాయుచున్నారు. చిత్తరువులను చిత్రించు చున్నారు. పాటలను బాడుచున్నారు.

ఈ ప్రయత్నములన్నియును భారతిని బ్రత్యక్షము చేయుచు నాత్మవికాసమునకు సాధనంబు లగుచున్నవి. భారతి ఆదిశక్తి, మహాశక్తి, సావిత్రి, సరస్వతి, మహాలక్ష్మి, త్రిపురసుందరి.

కైలాస శిఖరమునందును కన్యాకుమారియందును, శ్రీ గిరియందును వేంకటాద్రియందును,
వటమునందును చూతమునందును, మత్తేభమునందును మరాళమునందును,
అజంతాయందును ఎల్లోరా యందును, కమలములందును కేదారములందును,
మందిరములందును మహలులందును, వేదములందును కావ్యములందును, పాట
లందును పద్యములందును సర్వత్ర భారతి ప్రత్యక్షముగ నున్నది. సర్వత్ర కన్నులుగల
వారికి ప్రత్యక్షముగనున్న భారతిని యథాశక్తి నారాధించి భారతీప్రసాదమును
బడయుటయె ఆత్మోపలబ్ధికి సాధనము.
భారతి దేశభాషారీతుల ననుసరించి బహురూపములను నెల్లెడలను
వెలయుచున్నది. ఆ మహాదేవి వంగ మహారాష్ట్రాది దేశములందు నవవికాసముతో
విహరించుచున్న విధమును నారాష్ట్రముల కళావాఙ్మయముల వికాసము విశదము
చేయుచున్నది. వంగ భాషయందుఁ బ్రచురింపఁబడుచున్న గ్రంథములు చిత్రపటములు
పత్రికలు పరిశోధనలు వారి యుత్సాహమునకు నిదర్శనములు. ఆంధ్రభారతియును
వంగభారతియును కర్ణాటక భారతియును భారతీస్వరూపములు. భారతీదేవి నెవ
రేరీతిని గొలిచిన వారి కారీతిని బ్రత్యక్షమగుచు కామితార్థముల నొసంగుచున్నది.
శ్రీకాకుళమునుండి నాశిక వరకును మహావైభవ విలాసములతోఁ బూర్వమానందముగ
నాంధ్రావనియందు విహరించిన భారతి యిపుడు పరాధీనయై దైన్యము ననుభవించు
చున్నది. స్వాతంత్ర్య వాతావరణము చెలరేఁగుచున్న వర్తమాన సమయమునందు
దైన్యదశ కంటికిఁ బాగుగఁ బొడగట్టుచున్నది. మానవులకు భావదాస్య విమోచనము

గలుగకను బాహ్యదాస్యవిమోచనము గలుగఁజాలదు. ఆత్మవికాసమునకు సాధనం
బులైన భాష భావములు కళలు శాస్త్రములు సంప్రదాయాచారములు కాంతికళలు
లేకను జీవనప్రవాహము సంకుచితమైనది. హృదయవికాసమునకు సాధనంబులైన
కావ్యకళానాటకాదుల యుద్ధరణమున కాత్మసంస్మరణము సాధనముగ నున్నది. ఆత్మ
సంస్మరణమున కవసరమైన దేశావృతమైన సాధనల నారాధించి
భావదాస్యవిమోచనమును బడయవలసిన శుభ ముహూర్తము సంప్రాప్తమైనది.
ఆంధ్రయువజన హృదయముత్సాహపూరితమై వర్తమాన సమయమునందు
భావకర్మరంగములందు నిర్మాణమార్గము నవలంబించుటకు పరితపించుచున్నది.
కళాభిజ్ఞులు కళాభ్యుదయమునకుఁ బాటుపడుచున్నారు. పండితులు శాస్త్ర పరిశోధన
లకుఁ బూనుకొనుచున్నారు. కవులు మనోభావములను వర్ణించుచున్నారు. గాయకులు
పాడుచున్నారు. చిత్రకారులు చిత్రించుచున్నారు. శాస్త్రజ్ఞులు పరిశోధించుచున్నారు.
అన్ని దిశలయందును జిజ్ఞాసకాంతులు ప్రసరించుచున్నవి. అన్ని కులములవారును
మతములవారును ఆత్మోపలబ్ధిని బడయఁ గోరుచున్నారు. ఆంధ్ర హృదయమునందు
స్వకీయమైన స్వరూప స్వభావములను నిర్ణయించి స్వధర్మము నారాధింపవలయునను
సంకల్పము గలిగినది. ఆ సంకల్పమును సఫలము చేయుటకు చరిత్రకారులు
పండితులు పరిశోధకులు కళాప్రవీణులు ప్రచారకులు చేయుచున్న పరిశ్రమ
దేశవ్యాప్తమై ప్రజాపోషణమును బడయుచున్నది. దేశ వ్యాప్తములైన ప్రయత్నముల
నేకముఖమునను నాంధ్ర ప్రపంచమునకు వ్యక్తముచేసి ప్రజాదృష్టిని నవసరము
గలిగినది. ఆ యవసరమును సఫలము చేయుట కాంధ్ర ప్రపంచము పూర్వాపర
సంస్కారములను సమన్వయమును జేయుటకు బూను కొనుచున్నది. ఆంధ్రప్రవృత్తిని
పరిశీలించునపుడు ఈ విషయమును వ్యక్తమగుచున్నది.
ఆంధ్రవ్యక్తిత్వము చిరకాలాగతంబైన సంస్కార ఫలము. ఆ వ్యక్తిత్వమునందును
నితరవ్యక్తిత్వములందువలె విశేషణములు గలవు. ఆంధ్రహృదయశీల మభివ్యాపకము
గాని వ్యావర్తకము గాదు; ఉదారముగాని సంకుచితముగాదు; సరళముగాని వక్రము
గాదు. ఆంధ్ర హృదయక్షేత్రమునందీ విశేషణము లాదికాలమునుండియు నప్రతి
హతముగఁ బ్రకాశించుచున్నవి. ఆంధ్రభాష, వాఙ్మయము, మత సంప్రదాయా
చారములు, ఆచారవ్యవహారములు, కళలు, శిల్పములును నీశీలమును విశదము
చేయుచున్నవి. దేశవ్యాప్తములైన ప్రతిష్ఠాపనలందీ సహజశీలము గోచరంబగుచున్నది.
శ్రీశైలము వేద యుగమునకు ఋష్యాశ్రమము; బౌద్ధయుగమునకు బౌద్ధవిహారము;
శంకరయుగమునను శివక్షేత్రము; బసవయుగమునను జంగమమఠము; ఇపుడు
శిథిల క్షేత్రము. శ్రీశైలము దశాభేదముల పాలైనను నేటికిని సుప్రసిద్ధమైన యాంధ్ర
క్షేత్రముగ నున్నది.
ఆంధ్ర భాష సంస్కృత సంప్రదాయబద్ధమైనను ద్రవిడసంప్రదాయబద్దమైనన ప్రత్యేక సంప్రదాయముల ననుసరించి వికసించినది. ప్రాకృత సంస్కృత ద్రవిడ భాషల
సంపర్కము భాషాభ్యుదయమునకుఁ దోడ్పడినను భాషాశీలమును శిథిలము చేయ
లేదు. ఆంధ్ర భాష స్వరాంతమై సరళవర్ణరంజితమైన మృదు మధుర స్వభావమును
గాపాడుకొనఁ గలిగినది. ఆంధ్రవాఙ్మయము ప్రాకృత సంస్కృత కర్నాటక
వాఙ్మయముల సంపర్కమును గలిగినను ప్రత్యేక రీతిని వికసించినది. మతాచారములు
వైదిక జైన బౌద్ధశంకర వీరశైవ రామానుజాది మత సంపర్కమును గలిగియున్నను
జ్ఞానమార్గమునవలంభించుచు వ్యక్తిత్వమును విశదము చేయుచున్నవి. కళలు
దేశకాలపాత్రల స్థితిగతుల కనుగుణముగను వృద్ధిక్షయములను బొందినను ప్రత్యేక
లక్షణములను గలిగియున్నవి. జీవనప్రవాహము నిమ్నోన్నత తలముల
నధిగమించినను నిర్మలాకృతిని గలిగి ప్రవహించుచున్నది.
ఆంధ్రవ్యక్తి పరిణామమును నిరూపించుటకపారమైన విషయావగాహనమును
జేయుట కాంధ్రలోకము పూనుకోవలసియున్నది. విషయావగాహనమునకు సాధ
నములైన ప్రాచీనమందిరములు బౌద్ధస్తూపములు తామ్రశిలా శాసనములు తాళపత్ర
గ్రంథములు కళావిచిత్రములు వాఙ్మయస్వరూపములు నిగూఢములై ప్రకాశము
నపేక్షించుచున్నవి. ఆంధ్రవ్యక్తిద్యోతకములైన అమరావతి సాంచి మొదలగు
స్తూపముల వైభవ మజ్ఞాతముగ నున్నది. శాసనపరిశోధనాలయమునందు
వందలకొలఁది తామ్రశాసనములు త్రుప్పుపట్టి పోవుచున్నవి. ప్రాచ్యలిఖితపుస్తక
భాండారమునందును తంజావూరు గ్రంథభాండారమునందును ప్రాఁతప్రతులు
శిథిలము లగుచున్నవి. అజంతాయందలి మనోహరమైన చిత్తరువులు ప్రకాశమును
గోరుచున్నవి. రసవంతమైన వాఙ్మయము ప్రకాశమును పరిశీలనమును గోరుచున్నది.
దేశమునందు మూలమూలను దాఁగియున్న శాసనములు గ్రంథములు కళలు
వెలుతురును గోరుచున్నవి. ఈ విషయావగాహనముకు దోడుగను ఆంధ్ర
ప్రపంచమునందు భావరంగమునందు గలిగిన మహాసంచలనము సాదర
పరిశోధనమును ప్రకాశమును గోరుచున్నది. గ్రంథకర్తలు చిత్రకారులు కళాప్రవీణులు
సరసములైన నవరచనలను జేయుచు నవజీవనోదయమును జేయుచున్నారు. ఈ
మహోదయ సమయమునందు యథాశక్తిని భారతిని గొలుచుట కవకాశము
లారాధకులకు గలవు.
ఈ విషయావలోకమునకును సంస్మరణమునకును గారణ మాత్మసందర్శ
నాభిలాష గాని స్వకీయప్రతిష్ట గాదు. విషయసాగరమథనమును ప్రాజ్ఞులు చేయుచు
నాత్మసందర్శనమును జేయుచున్న విధమును విజ్ఞానకాంతులు విశదము
చేయుచున్నవి. పరిశోధకమండలులు పత్రికలు సాహిత్య సంఘములు చిత్రకళా
సంఘములు విద్యానిలయములు విషయసాగరమథనమును జేయుచు ఫలప్రాప్తికి
సాధనములను విశదము చేయుచున్నవి. ఈ స్వల్పారంభమును లబ్ధావకాశములను

విషయావగాహనమును జేయుట కేర్పడినదిగాని మహత్ఫలమును సమకూర్పఁ
బడునను నభిమానముతో నేర్పడలేదు.
భారతియందు భాష వాఙ్మయము శాస్త్రములు కళలు మొదలగు విషయములు
సాదరభావముతోఁ జర్చించుట కవకాశములు గల్పింపబడును. వాఙ్మయనిర్మాణమున
కిపుడు జరుగుచున్న ప్రయత్నములు ప్రస్ఫుటము చేయబడును. శిల్పమునకు చిత్ర
లేఖనమునకు శాసనములకు సంబంధించిన విషయములు చిత్రములతో బ్రచురింపఁ
బడును. సామాన్యముగఁ బత్రికాప్రచురణమునందుఁ గల సాధకబాధకము లనను
భవవేద్యములైనను ఓ క్రొత్తప్రయత్నము సాహసకార్యముగఁ గనఁబడును. మాసపత్రిక
నొకదానిని బ్రచురింపవలయునని తలఁచి కార్యసిద్ధికిఁ బ్రయత్నములు జరిగినవి.
విజ్ఞానసంపన్నులు కొమఱ్ఱాజు లక్ష్మణరావుగా రీ భారమును బూనుట కంగీకరించిరి.
ఆ మహానుభావునకు నూఱేండ్లునిండినవి. వారి సహాయము దుర్లభమైనది. రెండేండ్లు
లక్ష్మణరావుగారి నిమిత్తమును గతించినవి. సంకల్పము రిక్తమనోరథముగ నిలిచినది.
కొంతకాలము పెరిఁగిన సంకల్పమును చేసిన ప్రయత్నములను సఫలము చేయుటకుఁ
గల యవకాశములను వినియోగించుట కీప్రయత్నము కారణము. ఫలము
దైవాధీనమునందు గలదు.
విపులమైన యాంధ్రావనియం దిట్టి ప్రయత్నముల కెన్నిటికైనను నవకాశములు
గలవు. భారతిని పెంచి పోషింపవలసిన భారమాంధ్రలోకాధీనమైయున్నది.
ముఖ్యముగ నీభారము విద్యావంతులమీఁదను గలదు. పత్రికకు జీవకళను
విద్యావంతుల వ్యాసములు సమకూర్చునటులు బొమ్మలును పటములును నచ్చును
సమకూర్పఁజాలవు. విద్యాసంపన్నులు యథాశక్తిని సకలవిధములను భారతిని
బోషించుటకుఁ బ్రార్థితులు. వ్యాసములను పద్యములను పాటలను చిత్రపటములను
బంపి ప్రచురణమునకుఁ దోడ్పడిన మహాజనులకు వందనశతంబులు. ఆంధ్ర
మహాజనులు సదయహృదయులై భారతికి స్వాగంతంబు నొసంగి దీవించి నా
ప్రయత్నమును సఫలము చేయుటకు సాయపడుదురు గాక!

Vote this article
Vishnu Vardhan
Author: Vishnu Vardhan

Related Articles

Latest Articles