సహాయ౦ చేసే గుణం
– పి. ఎల్. ఎన్. మంగారత్నం
అది స్మార్ట్ సిటీలో ఓ వీధి. ఆ వీధి నుంచి మనుషులతో పాటు వాహనాలే కాదు- ఆవులూ, కుక్కలూ పందులు కూడా యధేచ్చగా సంచరిస్తుంటాయి.
అలా ఓ తల్లిపంది తన అరడజను పిల్లలతో ఆహార సముపార్జన కోసం బయలుదేరింది.
తల్లితో పాటే, పిల్లలూ దొరికిన ఆహారం తింటూ ముందుకు కదులుతున్నాయి.
ఆ వీధిలో కాస్త ముందుకు వెళ్ళాయో లేదో… ఓ ఖాళీ స్థలంలో ఇంటి నిర్మాణం జరుగుతూ, ఇనుప చువ్వలతో పిల్లర్లు లేపి ఉన్నాయి. బహుళ అంతస్తుల ఇల్లే కడుతున్నారు. మెట్ల మార్గానికి ఎదురుగా లిఫ్ట్ కూడా పెడుతున్నారు కాబోలు, ఆ గది కోసం అని పునాదుల్లోకి లోతుగా తవ్వి ఉంచారు.
ఇంటి నిర్మాణంలో పిల్లర్స్ ని నీళ్ళతో తడిపే అవసరం ఉండడంతో, లిఫ్ట్ గుంటలోకి నీళ్ళు చేరాయి. మిగిలిన ఆ ప్రదేశం అంతా చదును చేసి, శుభ్రంగా ఉంది.
కాపలా లేని ఆ స్థలానికి తల్లితో పాటు పంది పిల్లలూ వెనుకే వెళ్ళాయి.
అక్కడే ఉన్న ఇసుక గుట్ట మీద కాళ్ళు బార్లా చాపుకొని విశ్రాంతి తీసుకుంటున్నాయి నాలుగు కుక్కలు. తమ శత్రువర్గ౦వారి రాకను చూసి అప్రమత్తమై, గుర్రుగా చూసినా … కాస్సేపటికి వాటి వల్ల తమకు కలిగే నష్టం ఏదీ లేదని గ్రహించి, కుదుటపడ్డాయి.
అంత చదునుగా రాళ్ళూ రప్పలూ లేని ప్రదేశం చూసేసరికి- తల్లితో పాటు ఉన్న పిల్లల్లో ఉత్సాహం వచ్చి ఆనందంతో గంతులు వేయసాగాయి. ఓ రెండు పిల్లలు పరుగు పందాలు వేసుకుంటే, మరో రెండు పిల్లలు ఒకదాని మీద మరొకటి పడి ముష్టియుద్ధం చేసుకోసాగాయి.
తల్లి పంది ఆహారం కోసం అన్నట్లు అదే పోకన ముందుకుపోవడంతో … ఆ యుద్ధం చేసుకునే పిల్లల్లో ఓ పిల్ల అక్కడ ఉన్న లిఫ్ట్ గుంటలో కాలుజారి పడిపోయింది!
ఇది అంతా ఆ స్థలానికి ఎదురుగా ఉన్న ఐదంతస్తుల మేడమీద నిలబడి పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్న ఇద్దరు ఆడవాళ్ళు గమనించారు “ అయ్యో! ఓ పిల్ల… ఆ నీటిగుంతలో పడిపోయింది” కంగారుపడింది పెద్దావిడ.
“ అవును. నేనూ చూశాను” చెప్పింది రెండో ఆమె.
మిగిలిన పిల్లలతో కలిసి తల్లి అక్కడక్కడే తిరుగుతుంటే “ అయ్యో! ఆ తల్లి ఇప్పటికీ గమనించినట్లు లేదు చూశా రా” అంది- ‘తల్లన్న తర్వాత పిల్లల్ని ఆమాత్రం గమనించుకోకపోతే ఎలాగా’ అన్నట్లు.
అంతలోనే తేరుకుని “ ఆ పిల్లముండలు రెండూ కొట్టుకోవడమే వచ్చింది” అంటూ నిర్ధారించింది మొదటి ఆమె.
ఇంతలో గుంటలో పడిపోయిన పిల్ల ‘గుర్రు’ మన్నట్లుంది.
అప్పుడు గమనించిన తల్లి గుంత చుట్టూ తిరిగి చూసింది.
లోపల పడ్డ పిల్ల, పైకి ఎగిరి గెంతే ప్రయత్నం చేస్తోంది గానీ శక్తి చాలడం లేదు.
తల్లితో పాటు మిగిలిన పిల్లలూ ఆ గుంతలోకి తొంగి చూశాయి. ఆ గుంతలోంచి దీనంగా చూస్తూ కలియదిరుగుతోం ది పిల్ల.
“ హమ్మయ్యా! తల్లి చూసిందిలే” ఊరట చెందింది పెద్దామె.
తల్లి చూస్తే మాత్రం ఏమిటి? చెయ్యందించి లేవదియ్యగలదా? మనుషుల్లా ఎవరి సహాయం అయినా తీసుకోగలదా! కాస్సేపు …గుంత చుట్టూ గాభరాగా తిరిగి, అరిచింది. అయినా లోపల పడిన పిల్ల అలాగే భయంతో కొట్టుమిట్టాడుతోంది. తల్లిది ఏమీ చెయ్యలేని పరిస్థితి.
కాస్సేపటికి – చేసేది లేక ఉన్న పిల్లల్ని తీసుకుని తిరుగుముఖం పట్టింది.
జంతువుల స్థితి అంతే. ప్రకృతిని జయించగలిగితేనే వాటికి జీవితం.
“ గుంతలో ఎన్నో నీళ్ళు లేవు. రేపు పొద్దుటకైనా లేస్తుంది లెండి. ఈలోపు ఎవరైనా చూస్తే సరి ” మనం ఇంతకుమించి చేసేది లేదు- అన్నట్లు చెప్పింది రెండో ఆమె.
వాళ్ళు ఇలా మాటల్లో ఉండగానే …
పది నిముషాల తర్వాత గోతిలో పిల్ల శక్తినంతా కూడగట్టుకుని పైకి గెంతి, గుంతలోంచి బయటపడింది.
మాటల్లో ఉన్నా దృష్టి అటే ఉంది వాళ్ళకు.
“ హమ్మయ్యా! బయటపడింద౦డోయ్” సంబరపడింది పెద్దామె.
“ అవును” రెండో ఆమె ముఖమూ వెలిగింది.
అలా బయటపడిన దానికి అక్కడ తల్లీ తోబుట్టువులూ కనిపించలేదు.
వాటిని వెతుక్కుంటూ, వచ్చిన దారినే బయటపడే ప్రయత్నం చేస్తుంటే, అప్పటివరకూ స్తబ్దుగా ఉన్న నాలుగు కుక్కలూ లేచి చుట్టుముట్టినాయ్- శత్రువు ఒంటరిగా దొరికింది, ఇక పండుగే అన్నట్లు.
అసలే ఒంటరిది. వాటి ఉగ్రరూపం చూసి అడుగులు వెనక్కువేసి౦ది. అది వెనక్కి వెళుతుంటే కుక్కలు విజయగర్వంతో ముందుకు వెళుతున్నాయి. వాటికి ‘చిన్నపిల్ల’ అని జాలీ, కనికరం ఏదీ లేని జాతి వైరం.
భయపడితే బతుకు లేదనుకుందో ఏమో… పందిపిల్ల ధైర్యం చేసి ముందుకు వచ్చి, వాటి పక్కనుంచే దాటుకుని మెల్లగా రోడ్డుమీదకు అడుగు పెట్టేసింది.
తల్లి అప్పటికే చాలా ముందుకు వెళ్ళిపోయింది.
“ అయ్యో! తల్లిని కలుస్తుందో లేదో” అంతలోనే దిగులుపడింది పెద్దామె. అప్పటివరకూ గోతిలోంచి లేస్తుందా? లేదా? అనుకుంటే, లేచిన తర్వాత- ఇప్పుడు తల్లిని కలుస్తుందా… అన్న సంశయం.
వాళ్ళలో ఆత్రం. కన్నార్పకుండా ఊపిరి బిగబట్టి చూస్తున్నారు.
అంతలోనే ఆసక్తిగా చూస్తున్న… వాళ్ళ కళ్ళలో మెరుపులు.
అయితే ‘గుర్ గుర్’ మంటున్న పిల్లపంది సంకేతాలు దూరంగా ఉన్నా తల్లికి అందినట్లున్నాయి. మనుషుల కన్నా జంతువులకు గ్రహణ శక్తి ఎక్కువ. అంతే, అది వెనక్కి తిరిగింది.
వెనకాలే మిగిలిన పిల్లలూ అనుసరించాయి.
పరుగు పరుగున వచ్చి … పిల్లని చేరి స్పృశిస్తూ ఆన౦దపడింది. దాంతో కుక్కలు తోకలు ముడిచి అక్కడే ఆ గిపోయినాయ్.
కథ సుఖాంతం అవడంతో, పై నుండి చూసే ఆ ఇద్దరూ ఊపిరిపీల్చుకున్నారు.
ఫర్వాలేదు. తాము చూస్తుండగా… ఏ ఘోరమూ జరిగిపోలేదు.
అప్పటికి నెమ్మదించిన రెండో ఆమె “ ఇంకా కాస్సేపు చూసి, కిందకు దిగి వెళ్లి, వాచ్ మెన్కి చెబుదాం అనుకున్నాను. తీరా చెప్పినదాకా ఉంటే, ‘అక్కడికి వెళ్లి పందిపిల్లని నేనేం తీస్తానండీ, వాటిని ముట్టుకో గలుగుతామా మనం’ అంటాడేమో అనిపించింది” అంది.
“ అంతే, అలానే ఉంటాడు. తన పనులు కాకుండా మరో పని చెబితే చెయ్యడు. మొన్న లిఫ్ట్ పాడైన రోజునే, నేను … ఊరి నుంచి దిగాను. వంద మెట్లెక్కి పైకి రావడమే కష్టం అనుకుంటే, చేతిలో సూట్ కేస్ ఒకటి. ‘కాస్త పైకి తెచ్చిపెట్టవయ్యా శ్రీనూ’ అంటే … ‘అది పట్టుకుని అయిదంతస్తులు నేనెక్కడ ఎక్కగలనండీ ’ అన్నాడు. అప్పుడే మా ఫ్లోర్ లోని సతీష్ పైకి వస్తూ ‘ నేను తెస్తానులెండి ఆంటీ” అని అందుకున్నాడు. మన శ్రీనులో సహాయం చేసే గుణం అస్సలు లేదు. వాళ్ళ పనులేమిటో, వాళ్ళ లోకం ఏమిటో అంతే” చెప్పింది పెద్దామె.
అలా వాళ్ళ సంభాషణలు పక్కదారి పట్టాయి.
********************