5.5 C
New York
Monday, November 25, 2024

పునరుజ్జీవం

పునరుజ్జీవం

                                                                                                              – దేశరాజు

‘‘ఆడవాళ్ళ ముచ్చట్లనీ, సోది కబుర్లనీ ఊరికే హేళన చేస్తాం. కానీ, జాగ్రత్తగా ఆలకించు, వాళ్లెప్పుడూ చాలా అత్యవసరమైన విషయాల గురించే మాట్లాడుకుంటారు. దైనందిన జీవితానికి కీలకమైన అంశాలనే చర్చించుకుంటారు. వాటిని మనం అసలు ఏమాత్రం గుర్తించలేం’’

‘‘నువ్వు మరీ ఎక్కువచేసి చెబుతున్నావేమో…’’

‘‘లేదు. వాళ్లు అలాంటి విషయాలన్నింటినీ పట్టించుకుని- సంసారాల్నీ, ఆరోగ్యాల్నీ చక్కదిద్దుకుంటూపోతుండటం వలనే మనం హాయిగా కాలక్షేపం చేయగలుగుతున్నాం’’

వాళ్లిద్దరూ చాలా సన్నిహిత మిత్రులు. పదవీ విరమణ చేసి పదిహేనేళ్లు పైనే అయి ఉంటుంది. ఇద్దరూ పని చేసింది ఒకే దగ్గర, ఉండేదీ ఒక దగ్గరే. దశాబ్దానికి పైబడి రోజూ పొద్దున్నే వాకింగ్‌ చేస్తారు. గతంలో అయితే అది అయ్యాక వార్మింగ్ అప్ ఎక్సర్‌సైజులు చేసేవాళ్లు. ఇప్పుడు వాకింగ్ చేయడమే గొప్ప అనుకుని సర్దుకుపోతున్నారు. అక్కడే ఉన్న బెంచీపై కూర్చుని ప్రపంచాన్ని జల్లెడపడతారు. ‘కరోనా వైరస్ మానవ సృష్టా లేక సహజమైనదా? ఆంధ్రప్రదేశ్‌లోని జగన్ ప్రభుత్వం చేపట్టిన పథకాల మంచిచెడ్డలు, తెలంగాణలో కేసీఆర్ పనితీరు వెలుగునీడలు’ ఒకటేమిటి- అన్నిటినీ వాళ్లు విశ్లేషించి నిగ్గుతేల్చాల్సిందే. 

అమావాస్యకీ, పున్నానికీ వారిలో కొంటెతనం పురివిప్పుతుంది. టైట్‌గా ఉండే లెగ్గిన్లూ, టీషర్టులూ వేసుకుని వాకింగ్ చేసే ఆడవాళ్లలో ఒకర్ని చూసి ‘‘ఇలాంటి అమ్మాయి ఓ ఇరవయ్యేళ్ల క్రితం దొరికితేనా…’’ అని ఒకరంటే-

‘‘ఆమె అమ్మాయి కాదండీ. అమ్మాయిలకి, వింటున్నావా… ఇద్దరు అమ్మాయిలకి తల్లి. ఉండేది మా బ్లాక్‌లోనే’’ అని మరొకరు నీళ్లుచల్లుతారు.

‘‘అయినా, నడుస్తూనూ మాట్లాడుకుంటారు; కూర్చునీ మాట్లాడుకుంటారు. అసలు వీళ్ళకి ఏం టాపిక్ ఉంటుంది, మాట్లాడుకోడానికి’’ అని అడిగాడు స్నేహితుడు. 

‘‘ఏం, మనం మాత్రం మాట్లాడుకోవడంలే’’ అన్నాడు ఈయన. 

వీళ్లు కేవలం కబుర్లకే పరిమితం కాదు. సమాజంలో అత్యాచారాలు, ఇతర దౌర్జన్యాలు జరిగినప్పుడు తీవ్రంగా స్పందిస్తారు. ఐదారు వందల వరకు ఫ్లాట్స్ ఉండే ఆ గేటెడ్ కమ్యూనిటీలో చాలామంది వృద్ధులు ఉన్నారు. వారందరికీ ఓ సంక్షేమ సంఘం ఉంది. కొన్ని సంఘటనలు కలచివేసినప్పుడు ఆ సంఘం సభ్యులందరినీ సమావేశపరిచి ఖండిస్తారు. నిరసనగా కవితలు చదువుతారు. క్యాండిల్ లైట్ ర్యాలీలు నిర్వహిస్తారు.

పొద్దునపూట వాకింగ్ అనంతరం మాత్రమే కాదు. కొన్నిసార్లు సాయంత్రాలు కూడా కలుస్తూ ఉంటారు. కొడుకు, కోడలుతో గొడవలు; భార్యల అనారోగ్యాలు; మనవళ్లు, మనవరాళ్ల గొప్పదనాలు కలబోసుకుంటారు. ఖచ్చితంగా ప్రతివారం కుటుంబాలతో కలుసుకుంటారు. అంటే, కొడుకులు, కోడళ్లు, మనుమలు, మనవరాళ్లు… అంతా కలుస్తారని అనుకుంటే పొరబాటే. వృద్ధ దంపతులు మాత్రమే కలుస్తారు. ఒక వారం వాళ్లిద్దరూ వీళ్లింటికి వస్తే, తరువాత వారం వీళ్లిద్దరూ వాళ్లింటికి వెళతారు. అలా కలుసుకున్నప్పుడు చిన్న పిల్లల్లా… భార్యల గురించి భర్తలూ, భర్తల గురించి భార్యలూ ఒకరికొకరు ఫిర్యాదు చేసుకుంటారు. చివరికి అంతా ఉల్లాసంగా నవ్వేసుకుంటారు. 

ఈ స్నేహితుల భార్యలు కూడా మంచి మిత్రులే. అప్పుడప్పుడు పూజలు, పునస్కారాల్లోనే గాక, ప్రతి శుక్రవారం మిగిలినవారందరినీ కలుపుకొని లలితా పారాయణం చేస్తారు. వీళ్ల ఫ్లాట్లు ఉండే టవర్స్‌ లో ఒకదానికి వీధి పోటు ఉందనే అనుమానంతో గణేశ్ ప్రతిమను తెచ్చి ఉంచారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆయన స్నేహితుడి భార్యే రోజూ కాసిని నీళ్లు పోసి, ఆ విగ్రహాన్ని కడిగి; పసుపు, కుంకుమ పెట్టి; నాలుగు పువ్వులు కూడా ఉంచి చక్కగా అలంకరించి నమస్కారం చేసుకుంటుంది. అయితే, ఆ ప్రతిమను అందుకోవాలంటే ఫుట్ పాత్ ఎత్తులో ఉన్న చిన్న గట్టు ఎక్కాలి. ఆవిడకు అసలే మోకాళ్ల నొప్పులు. నడవడమే కష్టం. దాంతో ఆ కాస్త ఎత్తు గట్టునీ ఎక్కడానికి  చేయి ఆసరా అవసరం ఆమెకి. తనుండగా వాళ్ళాయన చేయి పట్టుకోవాలంటే…ఈ వయసులో కూడా ఆమె సిగ్గుపడటం ఆశ్చర్యం కలిగిస్తుందతనికి.

‘‘ఫర్వాలేదులే. పనికిమాలిన సిగ్గూ, నువ్వూనూ. జాగ్రత్తగా పట్టుకో. పడ్డావంటే మంచంపడతావ్’’ అని  స్నేహితుడు నవ్వూ, విసుగూ మేళవించి భార్యపై చిరుకోపం ప్రదర్శిస్తాడు. నెమ్మదిగా ఆ గట్టు ఎక్కించి ఆమె విగ్రహం కడుగుతుంటే, చెంబుతో నీళ్లు పోస్తాడు. ఆమె పసుపు, కుంకుమ పెడుతుంటే… అతను పూలు కోసి ఇస్తాడు. అంతా అయ్యాక ఆమె, ఆయనా నమస్కారం పెట్టుకుంటారు. 

ఆమె చొరవగా ‘‘అన్నయ్యగారూ, మీరూ ఓ దణ్ణం పెట్టుకోండి, పడుంటుంది’’ అంటుంది.

అతడు నవ్వుతూ ‘‘అలాగేనమ్మా’’ అంటూ నమస్కరిస్తాడు. ఈ దణ్ణాల సంగతి ఎలా ఉన్నా- ఆ దంపతుల ఆప్యాయత, అనురాగాలు చూడటం అతడికి ముచ్చటగా అనిపిస్తుంది. 

కానీ, ఆ ముచ్చట ఎంతోకాలం నిలవదని అప్పుడతనికి తెలియదు!

ఓ రోజు పొద్దున్నే లేచి వాకింగ్ కోసం షూ వేసుకుంటున్నాడాయన. ఇంతలో వాట్సప్ మెసేజ్ వచ్చింది. ‘అతడు మరి లేడ’ని దాని సారాంశం. వెంటనే షాక్ అయిన ఆయన షూ వేసుకునే ప్రయత్నం విరమించుకుని, చెప్పులు తగిలించుకుని స్నేహితుడింటికి హడావుడిగా వెళ్లాడు.

స్నేహితుడింటి దగ్గర జనాలు మూగి ఉన్నారు. వాళ్లని తప్పించుకుని లోపలికి వెళ్లాడు. ఈయన్ని చూడగానే స్నేహితుడి భార్య దుఃఖం మళ్లీ పెరిగింది. ‘‘మధ్య రాత్రి లేచి మంచినీళ్లు కూడా తాగారు. తెల్లారేప్పటికి…’’అంటూ ఏడుస్తూనే వివరించిందామె. 

‘‘వదినా, ఊరుకో. ఎవరితోనూ చేయించుకోకుండా మహారాజులా వెళ్లిపోయాడు’’ అని ఊరడిస్తున్నారెవరో. 

అతను నెమ్మదిగా బయటకు వచ్చి, బెంచీమీద కూర్చున్నాడు. గాలి మెల్లగా వీస్తోంది. సూర్యుడి లేత ఎండ నిశ్శబ్దంగా పరుచుకుంటోంది. కబుర్లు చెప్పుకుంటూ నడిచేవాళ్లు, చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వెళ్ళేవాళ్లు, వీడియోలు చూస్తూ ఒక్కో అడుగూ నెమ్మదిగా సాగేవాళ్లు… అందరూ యథావిధిగా తమ పనులు కొనసాగిస్తూనే ఉన్నారు. 

ప్రతి ఉదయం స్నేహితుడితో కలిసి కూర్చునే అతను, ఇప్పుడు ఒంటరిగా! ఇంకో నాలుగు రోజులుపోతే తానూ ఉండడు. అప్పుడు ఈ బెంచీపై ఎవరు కూర్చుంటారో? అనుకున్నాడు అప్రయత్నంగా. లేచి నెమ్మదిగా ఇంటివైపు అడుగులు వేశాడు. 

ఈయన రాక కోసమే ఎదురుచూస్తున్న ఆమె, ఆ వాలకాన్ని పసిగట్టింది. ‘‘ఏం చేస్తాం, అందరం ఏదో రోజు వెళ్లాల్సిన వాళ్లమే. సునాయాసంగా పోయారు మరి. మీరు అక్కడే ఆగండి. పిల్లాడు నీళ్లిస్తాడు. కాళ్లు కడుక్కుని, ఏమీ ముట్టుకోకుండా బాత్ రూంలోకి వెళ్లి స్నానం చేసి రండి’’ అంది.

భార్యకు తెలిసిందంటే- అపార్ట్‌ మెంట్ వాట్సప్ గ్రూప్‌లో పెట్టి ఉంటారని అతడికి అర్థమయ్యింది.

*****

చాలా రోజులుగా సన్నిహితంగా మెసిలిన స్నేహితుడు వెళ్లిపోవడం అతడిని కుంగదీసింది. వారం, పది రోజులపాటు వాకింగ్‌కే వెళ్లలేదు. తర్వాత కూడా అలా వెళ్లి, ఇలా వచ్చేసేవాడు. ముఖ్యంగా ఆ బెంచీపై కూర్చోవడం పూర్తిగా మానేశాడు. ఎవరూ పట్టించుకోక పోవడంతో గణేశ్ ప్రతిమ దుమ్ముకొట్టుకుపోయి ఉంది. ఎండిపోయిన ఆకులు, చెత్తా దాని చుట్టూ పడి ఉన్నాయి. అతనికి ఏ పని మీదా ఆసక్తి కలగడం లేదు. మనవలతో ఆడుకోవడం లేదు. ఇంట్లోని వారితో కూడా మాటలు తగ్గించేశాడు. అలాగే ఓ ఏడాది గడిచిపోయింది. రానురానూ అతడి పరిస్థితి దిగజారిపోతున్నట్టు అనిపించడంతో డాక్టర్‌కు చూపించి, టెస్టులు చేయిద్దామనుకున్నాడు కొడుకు. ఆ కారణంగా బయటకు వెళుతుంటే వినాయక విగ్రహం ఆయన కంటపడింది. ఆ రోజే కడిగి, శుభ్రం చేసి… పూజ చేసినట్టు తెలుస్తోంది. అతడికి అర్థం కాలేదు. స్నేహితుడి భార్య… చేయి ఆసరా లేకుండా గట్టు ఎక్కలేదు. సహాయం లేకుండా పూజా కార్యక్రమాలు పూర్తిచేయలేదు. మరి ఇప్పుడు ఎవరు చేస్తున్నట్టు ఇవన్నీ?

మరుసటి రోజు వాకింగ్‌కు వచ్చి కాసేపు అటూ ఇటూ తిరిగి, ఆ విగ్రహం కనిపించేలా దూరంగా ఉన్న బెంచీపై కూర్చున్నాడు. కాసేపటికి స్నేహితుడి భార్య వంగిన నడుంతో, అడుగులో అడుగు వేసుకుంటూ నెమ్మదిగా వస్తూ కనిపించింది. ఓ చేతిలో రాగి చెంబులో నీళ్లున్నాయి. ఆ చెంబుడు నీళ్లను గట్టు మీద ఓ వారగా పెట్టుకుని, ఆ గట్టు మీద రెండు చేతులూ ఆన్చి కూర్చుని ‘పరమాత్మా’ అనుకుంటూ ఓ క్షణం ఆయాసం తీర్చుకుని, అలాగే కూర్చుని వెనక్కి తిరిగి గట్టు ఎక్కింది. ఎడం చేతిని ఎడమ మోకాలిపై ఆన్చుకుని కుడిచేత్తో అతి నెమ్మదిగా చెంబందుకుని ప్రతిమ పెట్టిన అరుగును పట్టుకుని విగ్రహాన్ని శుద్ధి చేసింది. 

అతడి ఆశ్చర్యానికి, ఆనందానికి అవధులు లేవు. అంత చేతకాకపోయినా, ఆమె ఏమాత్రం నిరుత్సాహపడకుండా శ్రద్ధగా చేస్తున్న ఆ పని అతనిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. గబగబా దగ్గరకు వెళ్లాడు. 

‘‘ఎందుకండీ, ఇవన్నీ మీకు… ఓపిక లేనప్పుడు..?’’ అంటున్నారెవరో.

 ‘‘ఓ పూజా, పునస్కారమా? కేవలం శుభ్రం చేయడమేగా, తప్పేం లేదులే అమ్మా! మన చుట్టూ ఉండే పరిసరాలు శుభ్రంగా ఉంటేనేగా మనలోనూ ఉత్సాహం నిండేది’’ అందావిడ.

ఈసారి ఆమె అడక్కుండానే అతడు నమస్కారం చేసుకున్నాడు. ముందు వెళుతున్న పెద్దాయన్ని పిలిచాడు. ఆ అడుగులో అడుగులు కలిపి వాకింగ్ మొదలుపెట్టాడు. వాకింగ్ చేస్తూనే,  కొత్త స్నేహితుడితో మాటలు కలిపాడు. అతడి నడకలోనూ నడతలోనూ పునరుజ్జీవం తొణికిసలాడుతోంది.

                                      ——————————

Vote this article
Vishnu Vardhan
Author: Vishnu Vardhan

Related Articles

Latest Articles