గుప్త దానం
-షేక్ అబ్దుల్ హకీమ్
అదొక మధ్యతరగతి కుటుంబం.
మొత్తం ఆ కుటుంబంలో నలుగురు. ఇద్దరు పిల్లలు, భర్త, భార్య.
ప్రతీ నెలా జీతంపై వారి జీవనాధారంగా నెలకు 20000 రూపాయలు వస్తాయి. సాదాసీదా
జీవితం గడుపుతూ, కోరికలను నలిపేస్తూ, భవిష్యత్తుపై ఆశలను వదిలేసి ‘ప్రస్తుతం
జరిగితే చాలు’ అనుకునే అల్పసంతోషుల మధ్యతరగతి కుటుంబం వీరిది.
పండుగలు, పబ్బాలు వస్తే అప్పులతో ఆహ్వానం వాటికి! మరలా పండుగ వరకు వడ్డీలతో
చెలగాటం. ఇలా మరోపక్క.
ఇంక పిల్లల చదువులు అంటారా? వారు చదివేది స్కూల్. చదువు…చాలా బాగుండాలి కానీ
ఫీజుకి డబ్బులు ఎప్పుడూ చివరి తేదీలే! చివరికి పిల్లల్ని స్కూల్ యాజమాన్యం
నిలబెట్టి అడిగేవరకు వస్తుంది సమస్య. అప్పుడు వారినీ వీరినీ బతిమాలి కొంత
టైమ్ కావాలంటారు. తిరిగి ఆ టైమ్ దగ్గర పడితే పిల్లల జాలి చూపులు తండ్రి
హృదయాన్ని కొరుకుతూ ఉంటాయి.
ఇలాంటి సమయంలో మళ్ళీ అప్పు. ఎలాగైనా తల తాకట్టు పెట్టి ఆ ఫీజులు
సమకూర్చి ఆ రోజు మాత్రం హమ్మయ్య అనుకుంటారు.
ఇలా ఆ కుటుంబం పరిస్థితి అటు పైకీ పోలేదు…ఇటు కిందకీ రాలేదు.
కానీ ఇప్పుడు మరొక విపత్తు వచ్చిపడింది. ప్రపంచం మొత్తం కరోనాతో లాక్
డౌన్. అలాగే మనదేశంలో కూడా లాక్ డౌన్. మరి వీరి పరిస్థితి ఎలా…?
ఏదో ఒక పదిరోజులు ఉన్న సరుకులు చాలా జాగ్రత్తగా వాడారు.
బయట పరిస్థితి చాలా దారుణంగా ఉంది. తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది.
ప్రస్తుతం ఈ నెల జీతం వస్తుంది అనుకుంటే అదీ రాలేదు. ఏం చేయాలి?
అయోమయంలో పడింది ఆ కుటుంబం.
భర్త చాలా గౌరవం కల వ్యక్తి. ఆ ఏరియాలో ఎవరినీ ఎప్పుడూ… చేయి చాచి అడిగిన
స్థితి లేదు…అలాగని ఆత్మాభిమానం చంపుకొని అడుగుదామా అనుకుంటే- ఆ ఏరియాలో
అందరి పరిస్థితీ అలాగే ఉందన్న
ఆలోచనలో ఉండిపోయాడు.
ఇంట్లో చిల్లిగవ్వ లేదు. ఉన్న సరుకులు మొత్తం అయిపోయాయి. పిల్లలకు పాలు కూడా కష్టమైపోయింది. చిన్న వారు అవటం వల్ల వారికి ఏం తెలుసు? చాలా మారాం చేస్తున్నారు. భార్య పక్కింటివారి దగ్గర ఒక రెండు రోజులు ఎలాగోలా ఉప్పో పప్పో తీసుకుని వండింది. పిల్లలకు ఎలాగోలా తి నిపించి భార్యాభర్తలు… ఆకలితోనే పస్తులు ఉండేవారు. కానీ ఎన్ని రోజులు అలా? ఇద్దరూ నీరసించారు. బయటకు వెళ్ళలేని దీనత్వం. వెళ్ళినా ఏం చేయాలి? ఇప్పటికిప్పుడు డబ్బులు పుట్టవు కదా…ఎవరినైనా అడగాలి! అదే ప్రయత్నం చేశాడు భర్త…తన సన్నిహితులతో తన పరిస్థితి చెప్పుకొన్నాడు. “అప్పుగా అన్నా ఇవ్వండి” అని అడిగాడు మనసు చంపుకుని. కానీ అందరి స్థితి-గతి అలాగే
ఉంది. ఎవరూ సహకరించలేకపోయారు… ఎందుకంటే ఉన్నా కొంతమందికి మనసు ఒప్పదు ఇవ్వటానికి!
ఇలా అవుతుందని ఎప్పుడూ ఆలోచించలేదు. మామూలు రోజుల్లో ఏదోరకంగా గడిచిపోతోంది…కానీ తను పనిచేస్తున్న కంపెనీ కూడా ఇటువంటి ఆపద సమయంలో ఆదుకోలేకపోయింది. చాలా విచారంగా ఆలోచనలో ఉన్నాడు భర్త. ఒకపక్క భార్య ” ఏదో రకంగా కాస్త సరుకులు సమకూర్చండి. పిల్లలకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. పక్క ఇంట్లో పిల్లలు ఏవేవో తెచ్చుకుని వీరి ముందే తింటున్నారు. మన చిన్నోడు అయితే ఎన్నోసార్లు ‘అమ్మా! నాకు కావాలి అదీ… ఇదీ…’ అని విసిగిస్తున్నాడు. రాత్రి ఇద్దరినీ ఎలా పడితే అలా కొట్టాను పాపం.
పసిపిల్లలు… నా మనసు తరుక్కుపోతోంది, వాళ్ళని అలా చూస్తుంటే ” అంది. “వాళ్ళు ఏం పాపం చేశారు.. మనకు పుట్టటమేనా?” అని భర్తతో అంది. ఇది విన్న భర్త ఇంకా కుంగిపోయాడు…మనసులో కకావికలంగా ఉంది.ఏదో ఆవేదన! ఇంతలో- ఎవరో స్వచ్ఛంద సంస్థలవాళ్ళు రేషన్ కిట్స్ పంపిణీ చేస్తున్నారు అని ఆ ఏరియాలో అనుకుంటున్నారు. ఈ విషయం భార్య … భర్తతో చెప్పింది.
ఇంటింటికీ రేషన్ ఇస్తున్నారు.
ఇంతలో ఎవరో తలుపు తట్టినట్టు అనిపించి తలుపు తెరవగానే…
ఒక నలుగురు వ్యక్తులు ఉన్నారు. వారిలో ఒకతను చేతిలో సెల్ ఫోన్ తో ఫోటో తీయటానికి రెడీగా ఉన్నట్లు గమనించి…”ఎవరు మీరు” అడిగాడు భర్త . వాళ్ళు “మేం రేషన్ ఇవ్వటానికి వచ్చాం” అని చెప్పారు.
వెంటనే “మాకు అవసరం లేదు” అని చెప్పి లోపలికి వచ్చేశాడు.
భార్య, భర్త… ఇద్దరూ చాలా బాధపడ్డారు. “అయ్యో తీసుకుంటే బాగుండేదే” అని భార్య…అంటుంటే ‘’నాకూ అలాగే అనిపించింది. కానీ నాకు చేతులు రాలేదు. ఎందుకో మనసు ఒప్పుకోలేదు. ఏం చేయాలి దేవుడా…’’ అని మనసులోనే కుంగిపోయాడు భర్త .
భార్య భర్తను ఓదార్చే ప్రయత్నం చేసింది. “అయ్యో మీరే ఇలా ఉంటే ఎలా? దేవుడు మనకు ఏదో రకంగా దారి చూపిస్తాడు… మీరు ధైర్యంగా ఉండండి” అని కన్నీటితోనే లోపలికి వెళ్ళింది. ఇలాంటి వారి పరిస్థితిని ఒకసారి ఆలోచించండి! స్వచ్ఛంద సంస్థలు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ముందుకు వచ్చి తమ సహాయాన్ని అందిస్తున్నాయి. కానీ వారు చేసే సేవాకార్యక్రమాలు అందరికీ తెలియడానికి ఫోటోలు, వీడియోలు తీస్తారు.
వాటి వల్ల- తీసుకునే వ్యక్తి మనసు ఎంతలా ఇబ్బంది పడుతుందో… ఆ బాధ పడ్డవారికే తెలుస్తుంది. ఆ వ్యధ వర్ణనాతీతం.
దయచేసి మనం చేసే సేవ స్వచ్చందంగా చేద్దాం. మనం సేవ చేస్తోంది ఆ సృష్టికర్త సంతోషం కోసం. పుణ్యం కోసం. మన పిల్లల జీవితాలు సుఖసంతోషాలతో ఉండాలని, మన భవిష్యత్తు కూడా బాగుండాలనీ… దానం చేస్తున్నాం. అలాంటప్పుడు… ఫోటోలు, వీడియోలు ఎందుకు?
ఆలోచించండి…
మనం దానం ఒక చేత్తో చేస్తే, అది రెండవ చేతికి తెలియకుండా చేయాలి. అదీ మరో కంటికి తెలియకుండా! ఇంకో వ్యక్తికి తెలియకుండా చేసే దానమే … ఎంతో విలువైనది, అసలైనది. అదే గుప్త దానం!
ఆ కుటుంబం ఆ రోజు అంతా పస్తులతోనే గడిపింది. ఇంతలో తెల్లారింది. ఎవరో డోర్ కొట్టారు.
“ఏవండీ … కొంచెం డోర్ తీయండి” అని భార్య చెప్పింది.
భర్త తలుపు తెరిచి చూసేసరికి…ఇంటి ముందు నెలకు సరిపడే రేషన్ సరుకులు! ఒక కవరు కూడా ఉంది. ఆశ్చర్యపోయారు ఆ ఇద్దరూ. లోపలికి తీసుకువచ్చి …ఆ కవరులో ఏముందీ అనుకుంటూ
తెరిచారు. మళ్ళీ ఆశ్చర్యపోయారు.
అందులో కొంత డబ్బు! అలాగే చిన్న లెటర్ ఉంది.
“దయచేసి నా ఈ సహాయాన్ని స్వీకరించండి. నా గురించి… మీరు ఆలోచించవద్దు. నేను ఎవరో చెప్పను. ఒక్క పని చేయండి. మీలాగా ఎంతోమంది ఇలా ఇబ్బందిపడుతున్నారు… వారి గురించి తెలియచేయండి చాలు. మీరందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను” అని ఉంది.
చదివి… భర్త… అశ్రునయనాలతో “ఓ దేవుడా! నీకు కృతజ్ఞతలు” అన్నాడు. ఇలా ఎన్నో కుటుంబాలు మనకు తెలియకుండానే ఉన్నాయి. దయచేసి దానం గుప్తంగానే చేద్దాం…
గుప్తదానమే ఎంతో మేలైనది, గొప్పది కూడా!
ఆలోచించండి!
……………………………………….