ఇంకా ఎందుకీ నిశ్శబ్దం?
-స్ఫూర్తి కందివనం
మొబైల్ ఫోనుని చేతిలోకి తీసుకుని, కాంటాక్ట్స్ లో నంబర్లను స్క్రోల్ చేసి,
తన ప్రాజెక్ట్ మేనేజర్ ప్రశాంత్ పేరు కనిపించగానే, అతని నంబరుకి ఫోను చేసింది
మైథిలి.
“హలో గుడ్ మార్నింగ్ సర్! నాకు… ఓ రెండ్రోజులు లీవ్ కావాలి” అంటూ
తటపటాయిస్తూనే అడిగింది.
“వాట్! రెండ్రోజులా? నో- కుదరదు” ఖచ్చితంగా అన్నాడు ప్రశాంత్.
“సర్ అదీ…హెల్త్ బాగోలేదు”
“నువ్వు పోయినవారమే మీ బాబుకి ఒంట్లో బాగోలేదని రెండ్రోజులు లీవ్
తీసుకున్నావు. మళ్ళీ రెండ్రోజులు అంటున్నావు. నేను ప్రాజెక్ట్ స్టార్టింగ్
లోనే అందరినీ హెచ్చరించాను- ప్రాజెక్ట్ పూర్తయ్యేవరకు ఎవ్వరికీ లీవ్స్
ఇవ్వడం కుదరదని. అయినా సరే పోయినవారం లీవ్ ఇచ్చాను నీకు. మళ్ళీ అంటే ఐ
కాంట్”
“అది కాదు సర్, లేడీస్ ప్రాబ్లెమ్! రాలేని పరిస్థితి… “
“ఆఫీసులో చాలామంది ఆడవాళ్లు ఉన్నారు. వాళ్ళు రావట్లేదా? నువ్వు మాత్రం
ప్రతి నెలా ఈ కారణం చెప్పి లీవ్ తీసుకుంటావు. ఇకపై నో మోర్ డిస్కషన్స్. ఈ
ప్రాజెక్ట్ మన కంపెనీకి చాలా ముఖ్యం, అసలే ఇవాళ మన టీంకి ప్రెజెంటేషన్
ఉంది, సీఈఓ గారు కూడా వస్తారు. ఈ టైంలో లీవ్ అంటే అస్సలు కుదరదు. వస్తే రా,
లేకపోతే పర్మనెంట్ గా ఇంట్లోనే ఉండు” కఠినంగా అని విసుగ్గా కాల్ కట్ చేశాడు
ప్రశాంత్.
నిరుత్సాహంగా ఫోనుని చెవి దగ్గర నుండి మెల్లిగా తీసి, ఎదురుగా ఉన్న టేబులుపై
పెట్టి… స్కూలు బ్యాగు సర్దుకుంటున్న తన పదేళ్ల కొడుకు సిద్దూ వైపు
ఆలోచనగా చూసింది మైథిలి. ఒక క్షణం కళ్ళు మూసుకుని, దీర్ఘంగా శ్వాస తీసుకుని, ఒక
నిట్టూర్పు వదిలి ఆఫీసుకి తయారయ్యింది.
“సిద్దూ! రెండు నిమిషాలు. నేను కూడా వస్తున్నా” అంది మైథిలి నీరసంగా.
“నీకు ఒంట్లో బాగోలేదు అన్నావు కదమ్మా!”
“అవును రా. కానీ ఆఫీసులో లీవ్ ఇవ్వనన్నారు. సరే పద- టైమవుతోంది” అంటూ తన
హ్యాండ్ బ్యాగును భుజానికి వేసుకుని, ఇంటికి తాళం వేసి, వీధిలోకి నడిచారు
మైథిలి, సిద్దూ.
సిద్దూ చెప్పే స్కూలు విషయాలను ఓపిక లేకున్నా తెచ్చుకుని వింటూ నడుస్తోంది
మైథిలి. ఇంతలో సిద్దూ స్కూలు సమీపించడంతో, తనని పంపించి ఆఫీస్ క్యాబ్ కోసం
ఎదురుచూస్తూ నిలబడింది.
మైథిలి ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్వేర్ పనిచేస్తోంది. తన మీద లేనిపోని
అనుమానాలతో నిత్యం వేధింపులకు గురిచేస్తున్న భర్తతో, తన ఆత్మాభిమానాన్ని
చంపుకొని కలిసి ఉండలేకపోయింది. రెండేళ్ల క్రితం అతనితో విడిపోయి, వేరుగా
ఉంటుంది. ప్రస్తుతం ఆమెకున్న ఒకే ఒక ఆధారం ఈ ఉద్యోగం.
పొద్దున్నే నిద్రలేవగానే మైథిలికి పీరియడ్స్ మొదలయ్యాయి. దాని వల్ల
కడుపునొప్పితో పాటు వాంతులు కూడా అయ్యి శక్తిహీనంగా ఉంది తనకి. అందుకే
ఆఫీసుకి సెలవు పెడదామని తన ప్రాజెక్ట్ మేనేజర్ కి ఫోను చేసింది. కానీ సెలవు
దొరక్కపోగా, ఇప్పుడు వెళ్లకపోతే ఉద్యోగం పోతుందేమో అన్న గుబులు తన
మనసుని ఆవహించింది. అందుకే నొప్పిని అణచుకుని ఆఫీసుకి వెళ్ళడానికి
తయారయ్యింది.
కాసేపటికి క్యాబ్ వచ్చింది. లోపల అప్పటికే ఉన్న ఇద్దరు సహోద్యోగులను
పలకరిస్తూ అందులో ఎక్కి కూర్చున్నాక, క్యాబ్ ముందుకు కదిలింది. అసలే నెలసరి
నొప్పితో లోలోపలే విలవిల్లాడుతున్న మైథిలి… క్యాబ్ డ్రైవర్
దారిపొడుగునా మధ్యమధ్యలో అద్దంలోంచి తనపై విసురుతున్న చూపులకు అసహనంగా
కిటికీ పక్కకు తిరిగి కూర్చుంది.
ఆఫీసుకి చేరుకున్నాక బలవంతపు చిరునవ్వుతో అందరినీ పలకరించి, తన క్యాబిన్‌కి
వెళ్లి కూర్చుంది. అనంతరం తన టీంతో పాటు ప్రెజెంటేషన్‌కి డేటా సిద్ధం
చేయాలని ఉన్నా, పనిమీద సరిగా దృష్టి పెట్టలేకపోతోంది. పైగా చీటికీ మాటికీ
వాష్ రూమ్ కి వెళ్లి రావడం చాలా అసౌకర్యంగా ఉంది మైథిలికి.
కాసేపయ్యాక మీటింగు మొదలయ్యింది. కంపెనీ సీఈఓ కూడా రావడంతో
ప్రాజెక్ట్ గురించి చర్చలు జరుగుతున్నాయి. టీంలో మైథిలి మిగతావాళ్ళకంటే
కాస్త సీనియర్ కావడంతో ప్రశాంత్ ప్రెజెంటేషన్ మైథిలినే ఇవ్వమన్నాడు.
అన్యమనస్కంగానే ముందుకు వెళ్ళింది మైథిలి. ఎప్పుడూ ఆత్మవిశ్వాసంతో
మాట్లాడే ఆమెకు ఈ రోజు మాత్రం మాట తడబడుతోంది. మధ్యమధ్యలో తీవ్రత
పెరుగుతున్న నడుము నొప్పి, సూదులు గుచ్చినట్లుగా రెట్టింపు అవుతున్న
కడుపునొప్పికి తట్టుకోలేక ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. చేతులకు వణుకు
చేరింది. కాళ్ళు నిస్సత్తువగా మారి ఉన్నచోటే కూలబడిపోవాలనిపించింది
మైథిలికి. దానికి తోడు, ఈ సమయంలో ఆఫీసు పనిలో అధికంగా ఒత్తిడికి లోనవడం చేత
రక్తస్రావం కూడా అధికమవడం మొదలయ్యింది.
ఇంతకంటే భరించడం తన వల్ల కాదు అన్నట్లుగా “ఇక ఈ నిశ్శబ్దాన్ని ఛేదించాల్సిన
అవసరం ఖచ్చితంగా ఉంది” అని మనసులో అనుకుని, ప్రెజెంటేషన్ ను హఠాత్తుగా
ఉన్నట్టుండి మధ్యలోనే ఆపేసింది.
ప్రశాంత్ కంగారుగా మైథిలి వంక చూశాడు. అక్కడే ఉన్న సీఈఓ తో పాటు
మిగతావాళ్ళు కూడా ప్రశ్నార్థకంగా చూశారు.
ఎదురుగా కూర్చున్న వాళ్ళందరినీ కలియజూసి “క్షమించాలి! నేను ఈ ప్రెజెంటేషన్
కొనసాగించలేకపోతున్నాను. అందుకు కారణం- నేను పీరియడ్ లో ఉన్నాను” అని మైథిలి
చెప్పగానే అక్కడ ఉన్నవాళ్ళంతా అవాక్కయ్యారు. వాళ్ళల్లో ఉన్న
ఉద్యోగినులు అదేదో వినకూడని పదంలా ఉన్నచోటే బిగుసుకుపోయారు.
మైథిలి కొనసాగిస్తూ “మీకు తెలుసా… ఒక మహిళకి ఈ సమయంలో వచ్చే నొప్పి, బాధ
అధికంగా ఉంటుంది. చెమటలు పట్టడం, కాళ్ళు లాగడం, వికారం, అధిక రక్తస్రావం
లాంటి ఇంకా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు. ఉద్యోగాలు చేసే స్త్రీలు వారి
కుటుంబ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇవన్నీ భరిస్తూ పనిచేయాల్సి వస్తుంది.
దాని వల్ల మేం శారీరకంగానే కాకుండా, మానసికంగా కూడా ఆరోగ్య సమస్యలను
ఎదుర్కొంటున్నాం. మహిళా ఉద్యోగినులకు ప్రతి నెలా రెండ్రోజుల నెలసరి సెలవు
ఇవ్వాలని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సర్!
అంతేకాకుండా మిగతా మూడు రోజులకు ఆఫీసులో ఉద్యోగినులకు సరైన సదుపాయాలను
సమకూరిస్తే, మేం ఈ సమయంలో ఎలాంటి మనోవేదనకూ గురికాకుండా పనిమీద దృష్టి
పెట్టగలం ” అంటూ తన ఆవేదనను, బాధను ఉద్వేగంగా యాజమాన్యానికి
వెళ్లబుచ్చింది.
అక్కడ ఉన్నవాళ్లందరికీ ముందు తను చెప్పిన విషయం ఇబ్బందిగా అనిపించినా, ఆ
తర్వాత అందరినీ ఆలోచిం పచేసింది. మిగతా ఉద్యోగినులు కూడా ధైర్యం చేసి
మైథిలితో ఏకీభవించారు. అప్పటివరకు తనపై చిందులు వేసిన ప్రశాంత్… మైథిలితో
తను ప్రవర్తించిన తీరుకు కాస్త గిల్టీగా చూశాడు.
సీఈఓ “ఇంతవరకు మేం అసలు ఈ విషయం గురించి పెద్దగా శ్రద్ధ వహించలేదు. కానీ ఇది
ఎంత ముఖ్యమో ఇప్పుడు మీ మాటల్లోనే తెలుస్తోంది” అని మైథిలి వైపు చూసి
అన్నారు.
మళ్ళీ మిగతావాళ్ళ వైపు చూసి “ఇప్పటినుంచి మన కంపెనీలో పనిచేస్తున్న
మహిళలందరికీ ప్రతి నెలా రెండ్రోజులు నెలసరి సెలవులు ప్రకటిస్తున్నాను. ఇక్కడ
పనిచేసే ప్రతీ ఒక్క మహిళా సిబ్బందీ ఈ సెలవు తీసుకోవచ్చు అలాగే మిస్సెస్
మైథిలి అన్నట్లు ఆఫీసులో కూడా అమ్మాయిలకి ఈ విషయంలో ఎలాంటి ఇబ్బంది
ఉండకుండా ఏర్పాట్లు చేస్తాం. మన కంపెనీలో ఇంచుమించు యాభై శాతం మహిళలు
పనిచేస్తున్నారు. మీరంతా ఆరోగ్యంగా ఉంటూ, ఉత్సాహంగా పనిచేస్తేనే కంపెనీ
ఎదుగుతుంది. ఇప్పుడే ఈ విషయాన్ని అఫిషియల్ గా కూడా ప్రకటిస్తాం ” అన్నారు.
సీఈఓ తీసుకున్న నిర్ణయానికి కాన్ఫరెన్స్ హాల్లో ఉన్నవాళ్ళంతా, ముఖ్యంగా
మహిళలు వాళ్ళ ఆనందాన్ని కరతాళ ధ్వనుల ద్వారా వ్యక్తంచేశారు. నెలసరి
విషయంలో ప్రతి నెలా ఉద్యోగినులు ఎదుర్కొంటున్న సమస్యలను
నిర్మొహమాటంగా తెలియజేసిన మైథిలిని అంతా అభినందించారు.
తాను అనుకున్నట్లు- ఈ నెలసరి నిశ్శబ్దాన్ని ఛేదించగలిగినందుకు…
ఆత్మవిశ్వాసంతో చిరునవ్వు నవ్వింది మైథిలి.