10.9 C
New York
Tuesday, November 26, 2024

ప్రణయానికి బంధం

ప్రణయానికి బంధం

రంజిత్ కుమార్ గన్నోజు 
8523062388 
                                                                          

“అబ్బబ్బా… ప్రణయ్, లేవరా… సమయం పదవుతోంది” చిరాకుగా అరిచింది సంధ్య. “కాసేపమ్మా…” మంచంపై ముసుగులోంచి బద్ధకంగా బదులిచ్చాడు ప్రణయ్. “పండగకి ఇన్ని సెలవులెందుకిస్తారో? పదిరోజులు వీడితో వేగేసరికి తలప్రాణం తోకలోకొచ్చినట్టవుతుంది, దేవుడా…” అనుకుంటూ వంటగదిలోకెళ్లింది సంధ్య.

 కాసేపటికి ‘ఇదిగో ఇక్కడ.., పైకి రండి, ఫ్రిడ్జ్ జాగ్రత్త, మెల్లగా తీసుకురండి’ అంటున్న అమ్మాయి మాటలు వినబడేసరికి దిగ్గున లేచి, స్వరానికి తగ్గ అందమైన రూపురేఖలను ఊహించుకుంటూ కిటికీ దగ్గరికెళ్ళాడు ప్రణయ్. ఎదురింటి మొదటి అంతస్తులో తళుక్కున మెరిసి మాయమయ్యిందో అమ్మాయి, కానీ ముఖమైతే అస్పష్టం! ప్రణయ్ ఆత్రుత అంతకంతకూ పెరిగిపోయింది. కొన్ని ఎదురుచూపుల అనంతరం ప్రణయ్ ఊహలకు వజ్రాలు పొదుగుతూ ప్రత్యక్షమయ్యింది అమ్మాయి. ‘అబ్బా! ఏముందీ! ఈ వీధిలో అమ్మాయిల కరువుతో ఈ సెలవులెలా గడుస్తాయా అనుకున్నా. ఇప్పుడా బాధ లేదు’ అని లోలోనే మురిసిపోతూ హుషారుగా గది బయటికెళ్ళాడు.

 ఎదురుగా వార్తాపత్రిక చదువుతూ కూర్చున్న ప్రణయ్ నాన్న “ఫైనల్ ఇయరుకొచ్చావు. కొంచెమైనా సిగ్గుందా? పదిన్నరదాకా ముసుగుతన్ని పడుకున్నావు” అంటూ నిర్విరామంగా తిట్ల సుప్రభాతం ఆలపిస్తుంటే…  వింటూనే వడివడిగా వంటింట్లోకెళ్ళాడు ప్రణయ్. చపాతీ చేస్తూ అతడి  రాకను గమనించిన సంధ్య “నువ్వు మారవు, ఆయన తిట్టడం మానరు. మీ ఇద్దరితో నేను సతమతమవుతున్నా” అని చిరాకుగా అన్నది. “అమ్మా… నాన్న నన్ను కదా తిడుతోంది. నువ్వు నీ పని కానివ్వు. కంచంలో చపాతీ పెట్టెయ్, పదే నిమిషాల్లో వచ్చేస్తా” అంటూ స్నానానికెళ్ళాడు. స్నానానంతరం హడావుడిగా చపాతీ తిని, తర్వాత తల్లి ఏదో మాట్లాడబోతుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు ప్రణయ్.

***

“నీకో దండంరా! దయచేసి రేపట్నుండి ఫోన్ చెయ్యకు, నన్ను కలవకు” అన్నాడు అరుణ్.

“ఏమైందిరా  పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నావ్?” సందేహించాడు ప్రణయ్.

అర్రే బుర్ర తక్కువ్వెధవా!! పిచ్చి నాక్కాదురా, నీకు! ఆ ఫస్టియర్ వినీలని ఎందుగ్గెలికావు? అందరమ్మాయిల్లా కాదు తను. ఎందుకంటే వాళ్ళయ్య పోలీస్. నీ గురించి ఆయనగ్గానీ తెలిసిందో.., నీతోపాటు నాక్కూడా జైలే గతి. అందుకే నన్నొదిలేయ్”

“ఇన్ని రోజుల్లేని భయం ఇప్పుడెందుకురా?”

“మా ఇంటెదురుగానే కదా వాళ్ళిల్లు. నువ్వు ఫోనెందుకు లిఫ్ట్ చేయట్లేదని నన్నడుగుతోంది”

“ఏదో చూడ్డానికి బాగుందని కొంచెం చనువుగా మాట్లాడా, అంతే. రోజూ ఫోన్లు చేస్తుంటే మాట్లాడడం నా వల్ల కాదు. అయినా మా ఎదురింటికొక అమ్మాయి అద్దెకొచ్చిందిరా, అందమంటే ఆమెది! ఆమెని చూడడానికే సమయం చాలట్లేదు”

“అంత బాగుంటుందారా?”

“అంత ఇంత కాదురా! ఎంతో అందంగా ఉంటుంది. తను బ్యాంక్ మేనేజరంట. ఒక్కతే ఉంటుంది ఇంట్లో”

“బ్యాంక్ మేనేజరంటున్నావు, బాగుందంటున్నావు? అంత పెద్దామెతో ఈ వేషాలవసరమా?”

“మరీ పెద్దదేం కాదులేరా. మనకంటే ఓ రెండుమూడేళ్లు పెద్దదేమో, అంతే. చిన్నవయసులో ఉద్యోగమొచ్చినట్టుంది”

“రెండుమూడేళ్లు పెద్దదా! మరి మీ ఇంట్లో తెలిస్తే?”

“నేనన్నీ చూసుకుంటా గానీ, ఇప్పుడైతే వెళ్తున్నా. రేపుదయం పదికల్లా నువ్వు బ్యాంక్ దగ్గరికొచ్చెయ్. నీకు కొత్తగా అకౌంట్ తీయిస్తా”

“నేన్రాను. ఆ అకౌంటేదో నువ్వే తీసుకో”

“ఆ బ్యాంకులో నాకు ముందే అకౌంట్ ఉందిరా. రేపు పదిగంటలకి రాకుంటే చెప్తా నీ సంగతి” అనుకుంటూ వెళ్ళిపోయాడు ప్రణయ్.

****

“ఏంట్రా!! ఉదయాన్నే ఎక్కడికెళ్తున్నావు?” అనడిగింది సంధ్య.

“బ్యాంకుకి అమ్మా, అరుణ్ కొత్తగా అకౌంట్ తీస్తున్నాడంట. వాడికి తెలియదంటే నేనెళ్తున్నా” బదులిచ్చాడు ప్రణయ్.

“బ్యాంక్ మేనేజరే ఇంకా వెళ్ళలేదు, మీరెళ్లి ఏం చేస్తార్రా?”

“బ్యాంక్ మేనేజర్ నీకు తెలుసా అమ్మా!”

“నాన్న స్నేహితుడి కూతుర్రా ఆ అమ్మాయి., వాళ్ళందరూ ఢిల్లీలో ఉంటారు. దగ్గరి ఊరిలోనే చుట్టాలున్నారంట కానీ ఆ అమ్మాయికి వేరే వాళ్ళ ఇళ్లల్లో ఉండడం ఇష్టం లేదంట. పైగా ఇక్కడికి దగ్గర్లోనే కదా బ్యాంకు, అందుకే ఇక్కడ అద్దెకు ఉంచారు. అదీ మనమున్నామన్న ధైర్యంతోనే”

“మరి నాతో చెప్పలేదేంటమ్మా?”

“నిన్న ఉదయం చెప్పబోతుంటే, వినిపించుకోకుండా వెళ్లిపోయావు. ఇంక నేనే వెళ్లి ఆ అమ్మాయికి భోజనం ఇచ్చొచ్చా”

‘అబ్బా… ఎంత మంచి అవకాశం చేజారిపోయింది! అనవసరమైనవన్నీ చెప్తుంటావు కానీ ఇలాంటి విషయాలు మాత్రం ముందు చెప్పవు కదా ‘ అని మనసులో అనుకుంటూ “సరే… ఈరోజు నేనిచ్చొస్తాలే అమ్మా” అన్నాడు.

“ఈరోజు ఏమొద్దంటరా. స్టౌ, సిలిండర్ తెచ్చేసుకుందంట”

“ఎలాగో పులిహోర కలుపుతున్నావు కదా. బాక్సులో పెట్టివ్వమ్మా! పాపం బ్యాంకుకి వెళ్లే హడావుడిలో ఉదయాన్నే వంట చేసుకుందో లేదో!”

“అవునురా! నాకా ఆలోచనే రాలేదు” అంటూ డబ్బాలో పులిహోర పెట్టేసింది సంధ్య.

******

“ఏమండీ!! ఉన్నారా?” అంటూ తలుపు కొట్టాడు ప్రణయ్. “ఆ.., వస్తున్నా! ఒక్క నిమిషం” అని, తలుపు తెరిచింది అమ్మాయి, తడితలతో. ” ఏం అందంరా బాబూ!! పైగా ఇప్పుడే స్నానం చేసినట్టుంది’ అని మదిలో అనుకుంటూ “నా పేరు ప్రణయ్ అండీ. సంధ్యవాళ్ళబ్బాయిని” అని హొయలుపోతూ అన్నాడు ప్రణయ్. “హే ప్రణయ్, లోపలికిరా..  నా పేరు వర్షిత” అంటూ షేక్హాండ్ ఇచ్చింది అమ్మాయి. లోపలికెళ్లి కుర్చీలో కూర్చున్నాక-

“మీ గురించి అమ్మ చెప్పిందండీ. కొత్తగా ఉద్యోగంలో చేరారంట కదా. గొప్పవారండీ మీరు, చిన్నవయసులోనే ఉద్యోగం పట్టారు”

“ఉద్యోగానిదేముంది ప్రణయ్. సరిగ్గా చదివితే సులువుగా వచ్చేస్తుందంతే!”

“మాటల్లోపడి మర్చేపోయా, ఇదిగోండి అమ్మ పులిహోర పంపింది”

“అయ్యో… వద్దని చెప్పా కదా! మళ్లీ పంపారేంటి?”

“పర్లేదు ఈసారికి తీసుకోండి. మీరింకా కుదురుకున్నారో లేదోనని పంపింది” అని పులిహోర డబ్బాను వర్షితకిచ్చాడు.

“నువ్వు చాలా మంచోడిలా ఉన్నావు ప్రణయ్. ఏమనుకోకుండా తలుపు గడియ వేసిరావా…నీతో కొంచెం మాట్లాడాలి” సున్నితంగా అడిగింది వర్షిత. అంత మృదుపలుకులెందుకో అర్థమవ్వక అయోమయంలోనే తలుపేసొచ్చాడు. కాసేపు ఒకరి కళ్ళలోకొకరు చూసుకున్నాక, “ఏదో మాట్లాడాలన్నావు!!” ప్రణయ్ మాటలు ఏకవచనంలోకొచ్చేశాయి. అంతలోనే ఫడేల్ మనే శబ్దం! క్షణం తర్వాతగానీ అర్థమవ్వలేదు, తన చెంప పగిలిందని ప్రణయ్ కి.

 కాసేపు మౌనం ఆవహించిన తర్వాత, “అర్విక” అన్నది వర్షిత. “ఏంటీ?” ఆశ్చర్యం ప్రణయ్ వంతయ్యింది.

“అరువు ఇక, అన్నాను. నొప్పి పుట్టుంటుంది కదా…”

“కాదు మీరు ‘అర్విక’ అన్నారు”

“అర్విక ఏంటి?”

“నేను ప్రేమించిన అమ్మాయి పేరు అర్విక!” తల దించుకుని అన్నాడు ప్రణయ్.

“మరి మూడేళ్లు ప్రేమించాక బ్రేకప్ ఏంటి? అమ్మాయిలంటే ఆటలా? అర్వికతో బ్రేకప్ అని వినీలకి దగ్గరయ్యావు. ఇప్పుడేమో నన్ను చూసి చొంగ కారుస్తున్నావు” అంటూ ఘాటుగా మాట్లాడింది వర్షిత.

వర్షిత మాటలకు ప్రణయ్ ఆశ్చర్యపోయి, ఉక్కిరిబిక్కిరవుతూ “మీకెలా తెలుసు?” అని దించిన తలను హఠాత్తుగా ఎత్తుతూ అడిగాడు.

“అర్విక మా అత్తయ్య కూతురు. తను అన్ని విషయాలు నాతో పంచుకుంటుంది”

“అవునా! ఏదో  పండగ సెలవుల్లో తనని ఆటపట్టించాలని బ్రేకప్ అన్నానంతే గానీ, నిజంగా కాదు”

“నువ్వు బ్రేకప్ అనైతే అన్నావుగానీ, ఆ తర్వాత రోజు రాత్రి తను హాస్టల్లో సూసైడ్ అటెంప్ట్ చేసింది తెలుసా? వాళ్ళ ఫ్రెండ్స్ వెంటనే నాకు ఫోన్ చేయడంతో, తను బతికింది. వాళ్ళింట్లో గానీ తెలిసుంటేనా, నీ పనుండేది”

ప్రణయ్ కి ఒక్కసారిగా తల తిరిగిపోయింది. తను ఆకతాయితనంగా అర్వికతో చెప్పిన మాటలు గుర్తొచ్చాయి.

“నిజమా! ఇప్పుడు తనకెలా ఉంది?”

“అయినా తన గురించి నీకెందుకులే. నీ ఆనందం నీది”

“తనెక్కడుందో చెప్పరా, వెంటనే చూడాలి”

“నీకు తనని కలిసే అర్హతే లేదు. ముందిదంతా మీ అమ్మతో చెప్పాక అప్పుడాలోచిద్దాం”

“మీరు మా ఇంట్లో చెప్పినా సరే. నన్ను మళ్లీ కొట్టినా సరే. ముందైతే తనెక్కడుందో చెప్పండి ప్లీ…జ్ “

“అయితే నిజంగానే ప్రేమిస్తున్నావా?”

“మీకా సందేహమక్కర్లేదు. తనలా చేసుకుంటుందనుకోలేదంతే”

“మాట తప్పవు కదా”

“మా అమ్మమీదొట్టు”

“ఆ బెడ్రూంలో పడుకొనుంది, వెళ్ళు. నువ్వు నన్ను రోజూ కిటికీలోంచి చూస్తుంటావనే విషయం తనకి తెలియదు. నువ్వుగానీ నోరు జారి చెప్పేవు. తను బాధపడుతుంది” అంటున్న వర్షిత మాటలు వింటూనే వేగంగా బెడ్రూంలోకి వెళ్ళాడు ప్రణయ్. అక్కడ చేతికట్టుతో పడుకొనున్న అర్వికని చూడగానే చాలా బాధపడ్డాడు. దగ్గరకెళ్లి, ఆప్యాయంగా చేతిలో చేయేసి పక్కనే కూర్చున్నాడు. అర్విక మేలుకొని, మెల్లగా లేచి కూర్చుంది. ఏమీ మాట్లాడలేక దోషిలా ఉండిపోయాడు ప్రణయ్. అంతలోనే ఫిరంగి పేలిన శబ్దం! ప్రణయ్ రెండో చెంప చెళ్ళుమంది!! అర్విక చేతికట్టు ఊడి కింద పడింది. అంతసేపూ వర్షిత, అర్వికలు అమలు చేసిన నాటకం తేటతెల్లమయ్యింది. ప్రణయ్ మతితప్పి అర్విక వైపు చూస్తుండగానే-

“ఇంకోసారి మళ్లీ బ్రేకప్ అంటావా?” అంటూ ఏడ్చేసింది అర్విక. “నువ్వు మాత్రం… బావ నాకన్నా చాలా బాగుంటాడు, నాకన్నా తెలివైనవాడు, బాగా చదువుతాడు” అంటూ ఎప్పుడూ వేరెవరి గురించో నాతో చెప్తే నాకెలా ఉంటుంది” అంటూ ప్రణయ్ కూడా ఏడ్చేశాడు. ఆ  సమయంలో అక్కడికొచ్చిన వర్షిత “ఇంక చాలు ఆపండి మీ ఏడ్పులు. ఇప్పటి నుండి పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ప్రేమగా ఉండండి” అన్నది. అంతలోనే ప్రణయ్ ఫోన్ మోగింది. ఫోన్ ఎత్తి, “చెప్పరా అరుణ్” అన్నాడు.

“ఎక్కడున్నావురా? నేను బ్యాంక్ దగ్గరికి వచ్చేశా”

“అకౌంట్ క్యాన్సిల్. నువ్వు ముందు ఇంటికెళ్ళురా. నీతో తర్వాత మాట్లాడతా” అని ఫోన్ పక్కన పెడుతూ… అర్వికని సౌమ్యంగా క్షమాపణడిగాడు ప్రణయ్.

                                                   ********************

                                

Vote this article
Vishnu Vardhan
Author: Vishnu Vardhan

Related Articles

Latest Articles