నిర్జలం
– చాగంటి ప్రసాద్
9000206163
ఆఫీసులో బిజీగా ఉన్న ప్రభాకర్ కి పొలం కౌలుదారు వీర్రాజు ఫోన్ చేశాడు -అర్జంటుగా మాట్లాడాలి, ఒకసారి కోటిపల్లి రమ్మనమని.
అతను ఆఫీసులో పని త్వరగా ముగించి ఇంటికి వచ్చిపడ్డాడు. “ఏమోయ్! కాకినాడ వెళ్ళి , అక్కడ నుండి కోటిపల్లి వెళ్ళాలి. ఒక చిన్న బ్యాగ్ లో జత బట్టలు సర్దు” అని భార్య రజనికి చెప్పాడు, ఇంట్లోకి అడుగుపెడుతూనే.
” అంత అర్జంటుగా కోటిపల్లికి ఎందుకు ? ఏమైనా పొలం గొడవలా” అని కంగారుపడింది.
” రమ్మనమని వీర్రాజు ఫోన్ చేశాడు. నాకు మాత్రం ఏం తెలుసు… ఫోన్ లో కూడా ఏం చెప్పలేదు”
“వాడి నాన్న మన పొలం కౌలుకి చేసినప్పుడు మనం హాయిగా ఉన్నాం. వాడు వచ్చాక, అన్నీ సమస్యలే. ఒక్క
సంవత్సరం కూడా కౌలు శిస్తు సరిగ్గా ఇచ్చిన పాపానపోలేదు. ఏదో ఒక వంక చెప్పి సగం చేతిలో పెడతాడు లేదా చేతులెత్తేస్తాడు. పెద్ద మోసగాడు! అమ్మి పడేయండి, ఏం తిరుగుతారు అస్తమాను. అసలే వాడు మంచాడు కాదు” అంది భయంగా.
” ఏం చేస్తాం? ముళ్ళమీద వేసిన బట్ట. జాగ్రత్తగా తీసుకోవాలి. అమ్మడం ఎంతసేపు! తరతరాలనుంచి ఉన్న భూమి. అమ్మాలంటే బాధ అనిపిస్తుంది. నాకు రైలు కి టైము అవుతోంది, టిఫిన్ పెట్టేయి” అని తొందరపెట్టాడు.
ఈ లోపు “నాన్నా! ఎప్పుడొచ్చావ్” అంటూ ఐదో క్లాసు చదువుతున్న కొడుకు సంపత్ స్కూల్ బ్యాగ్ పక్కన పడేసి వచ్చాడు. తండ్రి వీపు మీద ఎక్కి , వెనక నుంచి గట్టిగా పట్టుకున్నాడు. ప్రభాకర్ వాడ్ని ముందుకి లాక్కొన్నాడు.
“నేను వూరు వెడుతున్నాను, తిరిగి వచ్చేవరకు బుద్ధిగా ఉండాలి. అమ్మని ఏడిపించకూడదు. నీకు బోల్డు చాక్లెట్సు, బొమ్మలు తెస్తాను” అంటూ ముద్దుపెట్టుకున్నాడు.
“నాకు రేపు, ఎల్లుండి స్కూల్ కి సెలవలు నాన్నా ! నన్ను కూడా ఊరికి తీసుకువెళ్లవూ ప్లీజ్ “ అని బతిమాలాడు తండ్రిని.
“వద్దు. నాన్నకి అక్కడ ఏదో అర్జెంట్ పని ఉందిట. నువ్వు , నేను తర్వాత వెడదాం “ అని సంపత్ ని స్నానం చేయించడానికి తీసుకెళ్లిపోయింది రజని. స్నానం చేసి , తువ్వాలు కట్టుకుని, మళ్ళీ తన పేచీ కొనసాగించాడు. “మీరిద్దరూ అబద్ధం ఆడుతున్నారు. నాకు క్లాసు లో ఫస్ట్ మార్కు వస్తే , ఊరు తీసుకువెడతామన్నారు. ఇప్పుడు చీట్ చేస్తున్నారు” అని గట్టిగా వెక్కిళ్లు పెడుతూ , కళ్ళు నలుపుకుంటూ ఏడిచాడు సంపత్.
వాడి ఏడుపు చూడలేక ” పోనీ వీడ్ని తీసుకు వెడతారా” అంది రజని.
“ఎలా… నువ్వు లేకుండా వాడు నా మాట వింటాడా ? నిన్నూ తీసుకు వెడదాం అంటే, ఇప్పటికిప్పుడు టిక్కెట్లు దొరకవు కదా”
ఇద్దరి మాటలూ వింటున్న సంపత్ … “ నేను గుడ్ బోయ్ లా ఉంటాను. అల్లరి చెయ్యను నాన్నా! ప్లీజ్ నన్ను తీసుకువెళ్ళవూ” అని ప్రభాకర్ చేతులు పట్టుకుని మరీ బతిమాలసాగాడు.
“రజనీ! ట్రైన్ లో ఏదో రకంగా ఎడ్జెస్టు అవుతాంలే ఇద్దరం” అని సంపత్ కేసి చూసి నవ్వాడు ప్రభాకర్.
వాడు ఆనందంగా గంతులు వేశాడు. వాడి ఆనందం చూసి ఇద్దరూ నవ్వుకున్నారు.
“జాగ్రత్త! వెళ్ళగానే ఫోన్ చేయండి” అని ఇద్దరినీ సాగనంపి తలుపేసుకుంది.
***
రైల్లో కూర్చున్న ప్రభాకర్ కి విసుగ్గా ఉంది. తండ్రి ఇచ్చిన రెండు ఎకరాల ఊడ్పుచేను నిలబెట్టుకోవడానికి నానా తంటాలు పడతున్నాడు. అమ్మేద్దామనుకున్నా మనసు ఒప్పుకోవడం లేదు. ఎన్నో ఏళ్ళబట్టి ఉన్న ఆ పొలంతో ఉన్న బంధాన్ని తెంచుకోలేకపోతున్నాడు.
దాహం వేసి- కొనుక్కున్న బాటిల్ లోని నీళ్ళు తాగి సీటులో వెనక్కి వాలి నిద్రలోకి జారుకున్నాడు. సంపత్ రైల్లోంచి బయట ఆకాశంలో తమతో పాటు పరుగుపెడుతున్న చందమామని చూస్తూ నిద్రపోయాడు.
***
కాకినాడ చేరగానే, తండ్రి అన్న మాటలు ప్రభాకరానికి జ్ఞాపకానికి వచ్చాయి. ” నీకు ఎంత అవసరం వచ్చినా పొలం మటుకు అమ్మకు. తరతరాల నుంచి మనతో వస్తున్న లక్ష్మీదేవి. పొలం పక్కనే గోదారి నీళ్ళు, సారవంతమైన నేల. నువ్వు ఏమంత కష్టపడనవసరం లేదు. మన కౌలు రైతు మంచివాడు. ధర్మం తెలిసినవాడు. ఎప్పుడైనా మరీ అవసరం వస్తే తప్ప పొలం శిస్తు బాకీపెట్టడు.నీకు ఏదైనా ప్రాణావసరం వస్తే , ఆఫీసులో లోన్ తీసుకో. అంతే కానీ, పొలం మటుకు అమ్మకు” … అని పదే పదే చెప్పాడు.
లాడ్జిలో రిఫ్రెష్ కాగానే, టిఫిన్ చేసి కోటిపల్లి బస్ ఎక్కాడు. ప్రభాకర్ ని రిసీవ్ చేసుకోడానికి వీర్రాజు బుల్లెట్ మీద బ స్టాండుకి వచ్చాడు. చేతులకి బంగారపు ఉంగరాలు, మెళ్ళో పులిగోరు, కళ్ళకు రేబన్ కళ్ళద్దాలు, పొందూరు ఖద్దరు లాల్చీతో ప్రత్యక్షమయ్యాడు.
ప్రభాకర్ కాసేపు అతన్ని గుర్తుపట్టలేకపోయాడు. బాగా ఒళ్ళుచేశాడు.
” ప్రయాణం బాగా జరిగిందాండీ” అని అడిగాడు వీర్రాజు.
” బాగానే జరిగింది” ముక్తసరిగా సమాధానం చెప్పాడు ప్రభాకర్.
“మా ఇంటికెళ్ళి కాస్త టీ తాగి పొలంకాడికి ఎడదామండి” అని సమాధానం కోసం ఎదురు చూడకుండా బండి లాగించేశాడు. కూడా ఆటో బయలుదేరింది.
ఇంటిలోకి అడుగుపెట్టిన ప్రభాకర్ కి, అతని ఇంటి హాల్లో పెద్ద టీవీ, డబుల్ డోర్ ఫ్రిజ్. ఒక పడక గదిలో ఎ.సి. కనబడ్డాయి. ఇల్లంతా ఇంటీరెయర్ డెకరేషన్ చేయించినట్టున్నాడని మనసులో అనుకున్నాడు. భార్య వంటిమీద నగలు భారీగా కనిపించాయి.
ఇద్దరూ టీ తాగాక “ఎడదామాండి” అన్న వీర్రాజు పిలుపుకి ప్రభాకర్ లేచాడు. వీర్రాజు మోటార్ సైకిల్ తీస్తుంటే – ” బండి తీయకు, నడుచుకుంటూ వెడదాం” అని వారించాడు.
“అలాగే! తమరి ఇట్టమండీ” అని తీసిన బండి కి స్టాండ్ వేశాడతను.
ఇద్దరూ పొలం వైపుకి నడిచారు. పక్కన లేగ దూడలా చెంగు చెంగుమంటూ సంపత్ పరుగుపెడుతున్నాడు.
ప్రభాకర్ కళ్ళకి… చుట్టూ ఎక్కడా పచ్చదనం కనబడలేదు… అన్నీ ఉప్పునీటి కయ్యల వంటి రొయ్యల చెరువులు తప్ప. మధ్యలో ఇంజన్ మోత వినబడుతోంది.”ఏం వీర్రాజూ! ఎందుకు ఫోన్ చేశావు” అడిగాడు ఎటో చూస్తూ.
“ఇప్పుడు మీరు సూసిన సెరువులన్నీ మన ఊళ్ళో ఉన్న మోతుబరి రైతులవండి”
“అసలు విషయానికి రావయ్యా”
“అదేనండీ! ఎగసాయం గిట్టుబాటు కాటం లేదండి. అందరి దగ్గర కౌలు తీసుకున్న భూములన్నీ ఆళ్ళ ఇట్టం మీదే రొయ్యల సెరువులు చేసేశామండి. గొప్ప లాబాలండి! ఆళ్ళు కూడా సంతోసంగా ఉన్నారండి” అని కళ్ళజోడు గ్లాసుల్ని రుమాలుతో తుడుచుకుంటూ చెప్పాడు.
” ముందు మన పొలం వైపుకి నడు” అని అతనికి సమాధానం చెప్పకుండా పొలం వైపు దారితీశాడు ప్రభాకర్.
పెద్ద దున్నపోతుల మధ్య భయపడుతున్న గోవులా అతని పొలం కనబడింది. ఎక్కడా నాట్లు పెట్టిన దాఖలాలు లేవు. ” అదేంటి! పొలం బీడుపెట్టేశావు? పొలం పెట్టుబడికి అని నా దగ్గర డబ్బులు కూడా తీసుకున్నావు కదా” అని నిలదీశాడు .
” మీరు ఓ పాలి నా మాట ఇనండి. ఎగసాయం మానేశాను. మీరు కూడా ఒప్పుకుంటే రెండెకరాల్లో బంగారం తీయచ్చు. సానా లాభాలు. నాలుగు నెల్లు తిరక్కుండానే మన సేతిలో వచ్చిపడతాయి. అది మాటాడదామనే తమర్ని రమ్మన్నాను” అని అసలు విషయం కక్కాడు.
ఇంతలో వీర్రాజుకి ఫోన్ వచ్చింది . ” లోడు దింపడానికి మా ఓడు వత్తన్నాడు. కాసేపు ఆగండెహ!” అంటూ ఎవరిమీదో గట్టిగా అరుస్తున్నాడు.
ఆలోచిస్తూ పొలానికి ఆనుకున్న ఏటిగట్టు ఎక్కిన ప్రభాకర్ కి బక్కచిక్కిన గోదారి పాయ కనబడింది. శరీరం మీద లేచిన కంతుల్లా ఇసక మేటలు కనబడ్డాయి. విశాలమైన గోదారి ఇంతలా ఎలా అయిపోయింది అనిపించి బాధతో గుండె బరువెక్కింది అతనికి.
ఇంతలో ఒక బక్కపలచని నడివయస్సు మనిషి నడుచుకుంటూ ఎదురుపడ్డాడు.
అతన్ని చూడగానే ప్రభాకర్ గుర్తుపట్టాడు. కోటిపల్లి గోదారొడ్డున కొబ్బరి అచ్చులు అమ్మే అతను! చిన్నప్పుడు పడవ అంచుమీద నడుచుకుంటూ చాకచక్యంగా జీళ్ళు, కొబ్బరిబెల్లం కలిపిన అచ్చులు అమ్మేవాడు. బొద్దుగా ఉండేవాడు. ఇప్పుడు ఎంత చిక్కిపోయాడు? ఎప్పుడైతే గోదారి సన్నబడిపోయిందో, రేవుమీద ట్రాఫిక్ తగ్గిపోయింది. గలగలలాడే రావిచెట్టు మీద కిలకిలలాడే పక్షులు కూడా తగ్గిపోయాయి. కాలుష్యపు కోరల్లో గోదారి చిక్కి శల్యమైంది.
నది ఒడ్డున ఎవరికో శ్రాధ్ధకర్మ పెడుతున్నట్టున్నారు.” అఖంఢ గోదావరీ తీర సామీప్యే…” అనే వర్ణన కూడా విన్న ప్రభాకర్ బాధగా నిట్టూరుస్తూ పొలం వైపు నడిచాడు.
వీర్రాజు ఇంకా ఫోన్లో ఎవడ్నో తిడుతూ మాట్లాడుతున్నాడు.
తిండిగింజలు పండించే బంగారు భూముల్ని లాభాల కోసం ఉప్పుకయ్యలు చేసి సర్వనాశనం చేయడం ఎంతవరకు న్యాయం? జలం కలుషితమైతే, రేపటి తరాలకి దాహం తీరే మార్గం ఏది? భూతాపం ఇప్పటికే బాగా పెరిగిపోయింది. భవిష్యత్తులో నిర్జల పరిస్థితులొస్తే మనిషి బతుకు ఏమిటి… అని మధనపడ్డాడు ప్రభాకర్. పొలంలో దిగి గుప్పెడు మట్టిని తీసుకుని ఆప్యాయంగా పాంటు జేబులో పోసుకున్నాడు.
తండ్రి చేస్తున్న పని చూసి సంపత్ … “నాన్నా! ఎందుకు జేబులో మట్టిపోసుకున్నావు ? మట్టిలో చేతులు పెట్టద్దు అని అమ్మ, నువ్వు తిడతారు మరి “ అని సందేహంగా అడిగాడు.
ప్రభాకర్ నవ్వి “ఇది మట్టి కాదు నాన్నా! బంగారం. మన తాతగారు మనకి ఇచ్చిన భూమి” అని చెప్పాడు ఆనందంగా.
“ఓహో “ అని సంపత్ కూడా పొలంలోకి దిగి, చిట్టి చిట్టి గుప్పెళ్లతో మట్టి తీసుకుని వాడి జేబులో పోసుకున్నాడు. తండ్రిని, కొడుకుని ఇద్దర్నీ విచిత్రంగా చూస్తున్న వీర్రాజు అడిగాడు ” ప్రభాకరంగారూ! ఏం సేద్దామంటారు? “
” ఏం చెయ్యద్దు! దాని మానాన దాన్ని బతకనీ” అని పొలం కేసి చూసి చెప్పాడు ప్రభాకర్. “నా పొలం నేనే చూసుకుంటాను. నువ్వు కౌలు చేయఖ్ఖర్లేదు. నీ బాకీ సొమ్ము కూడా నాకు జమ చేయక్కర్లేదు” … అని పొలం కేసి చూస్తూ చెప్పాడు గట్టిగా.
గోదారిమీద నుంచి వచ్చిన గాలి తనతో మోసుకొచ్చిన ఇసకను వీర్రాజు కళ్ళల్లో కొట్టింది. కళ్ళు తుడుచుకుంటున్న అతనికి దూరంగా వడివడిగా వెళ్లిపోతున్న ప్రభాకరం, ఆ చెయ్యి పట్టుకున్న సంపత్ కనిపించారు… అస్పష్టంగా!
****************