నెత్తిన వేసుకుందాం
– ప్రవీణ మోనంగి
9848863070
టైం పది కావస్తోంది. ఈ రంగి ఇంకా రాలేదేమిటి? ఎక్కడ పెత్తనాలు చేస్తుందో మేడం గారు, కొంపదీసి ఈ పూట పనికి డుమ్మా కొట్టదు కదా! వామ్మో! ఇప్పుడు కనుక రంగి రాకపోయిందో నా పని అయిపోతుంది. సింకు నిండా గిన్నెలు. పప్పుల డబ్బాలు బాలేవని అవో మూడు పడేశాను సింకులో, ఇప్పుడెలా! ఆ డబ్బాలు వేస్తున్నప్పుడే అనుకున్నాను… రంగి ఈ రోజు పనికి రాకపోతే అని! ఐరన్ మౌత్ కదా నాది. ఇలా ఏవేవో ఊహించుకుని తనలో తానే మాట్లాడేసుకుని, హాల్ నుండి వంటింటికి వెళ్తూ ఒకసారి సింక్ వైపు చూస్తూ అమ్మో! అనుకుంది జానకి. మళ్ళీ హాల్ లోకి వస్తూ, గుమ్మం వైపు ఒకసారి రంగి వచ్చిందేమో అని చూస్తూ..మళ్ళీ వంటింట్లోకి ఇలా తిరుగుతూ చివరకి అలసిపోయి సోఫాలో చతికిలపడింది.
ఏమిచెయ్యాలో తోచక చివరికి పేపర్ చదవడం మొదలుపెట్టింది. పేపర్ చదువుతోందే కానీ, మనసంతా రంగి పైనే ఉంది. అంతలోనే ఇంటి కిందన ఎవరితోనో గొడవ పడుతున్నట్లుగా రంగి గొంతు వినబడింది జానకికి. జానకి వాళ్ళ ఇల్లు రోడ్డు పక్కన ఉంది కనుక సందడి సందడిగా ఉంటూ అన్నీ వినిపిస్తూ ఉంటాయి. వెంటనే బాల్కనీ లోకి వెళ్లి చూస్తే జానకి అనుమానం నిజమైంది. ఆటోలో నుండి ఎవరో ఒక అమ్మాయి, అబ్బాయి దిగారు. వాళ్లతో రంగి గొడవ పడుతోంది. తను ఎవరితో గొడవ పడితే నాకేంటి? రంగి పని లోకి వచ్చింది, గిన్నెలు తోమే పని నాకు తప్పిందని అనుకుంది జానకి. ఇప్పుడు ప్రశాంతంగా పేపర్ తిరగేసింది.
కాసేపటికి పనిలోకి వచ్చిన రంగితో “వచ్చారా మేడం గారు! ఏమిటి ఇవాళ పనికి ఇంత లేటు?” చల్లారిన పాలు ఫ్రీడ్జ్ లో పెడుతూ అడిగింది జానకి.
“మా కోడలితో ఎప్పుడూ తలనొప్పేనమ్మా! నేను ఒకటి చెబితే అది ఒకటి చేస్తాది”
“ఈ రోజు ఏం చేసింది ఏమిటి?”
“గుత్తొంకాయ కూరకి ఉల్లిపాయలు సన్నంగా తరగాలని చెబితే నాలుగు ముక్కలుగా కోసేసింది.అలా కాదు అంటే వినదే. పని తొందరగా అయిపోవాలి తనకి. పద్ధతిగా అవ్వాలి అంటాను నేను, మీకు తెలుసుగా నా పనితనం గురించి!”
“ఆ తెలుసులే! అందుకేగా పది గంటలకి పనిలోకి వచ్చినా చేయించుకుంటున్నాను”అంటూ రంగి వైపు చూసింది జానకి.
“అమ్మో! భలే అంటారు మీరు. ఉండండి నేను పని చేసుకోవాలా వద్దా ” అంటూ చీపురుపట్టిన రంగి తో అంది జానకి “ఏమే రంగి! ఎవరితోనో మాట్లాడుతున్నావు ఇందాక?”
“చూసేశారా ఏంటి మీరు?”
“ఆ! మరి నీ గొంతు మూడు ఊర్లకు వినబడుతుంటే చూడరా, వినరా ఎవరైనా? ఇంతకీ ఎవరితో గొడవ పడుతున్నావో చెప్పు ?”
“ఇందాక మీరు చూసిన అమ్మాయి మా వీధిలో ఉండే అమ్మాయే. వాళ్ళ అమ్మ కష్టపడి నాలుగిళ్లలో పాచి పని చేస్తుంది. వాళ్ళ అయ్య ఆటో తోలుతూ, ఈ పిల్లని చదివిస్తూ ఉంటే, కాలేజీకి వెళ్లడం మానేసి ఎవరో పోరగాడితో తిరుగుతోందమ్మా! అందుకే ఆ పిల్ల మీద కేకలు వేస్తున్నా. ఆ పిల్లాడికి నాలుగు చీవాట్లు పెట్టాను”.
“ఎవరు ఎలా పోతే నీకెందుకే! నీకు ఇంట్లో ఉన్న సమస్యలు చాలవా ఏంటి? దారిని పోయినవి నెత్తిన వేసుకుంటావు ఎందుకు?”
“అదేంటమ్మా! అలా అనేశారు”? అంటూ తుడుస్తున్న చీపురు చేతిలో పట్టుకొని అడిగింది రంగి.
“అలా అనక మరి ఇంకేమనాలి! వాళ్ళు నీ మాట వింటారా? పైగా నీకు విషయం తెలిసి వాళ్ళింట్లో చెబుతావేమోనని, ఆ పిల్లాడు నిన్నేమైనా చేస్తే నీ పరిస్థితి ఏంటో ఆలోచించావా!”
“ఏమోనమ్మా, నేను అంత దూరం ఆలోచించలేదు. నాలాగా మరో ఆడపిల్ల బలి అవ్వకూడదు. నేను చేసిన తప్పు ఇంకెవరూ చేయకూడదు. అక్కడ ఉన్నది నాకు తెలిసిన అమ్మాయా? తెలవని అమ్మాయా… నాకు అనవసరం. నేను చెప్పాలనుకున్నది చెబుతా. చేయాలనుకుంది చేస్తా. వాళ్ళు వినేవరకు చెబుతూనే ఉంటాను. విషయం ఎంతవరకైనా పోనీయండి, నాకు అనవసరం. ఇక మీరు అన్నట్లుగా నన్ను ఏమైనా చేస్తే చేయనీయండి, నేను భయపడను. జీవితంలో నరకాలన్నింటిని అనుభవించాను. మీరు నా గురించి ఇంతలా ఆలోచిస్తున్నారు, అందుకు చాలా సంతోషం అమ్మా!” అంటూ కన్నీళ్ళు తుడుచుకుంటూ మళ్లీ ఇల్లు తుడవడం మొదలు పెట్టింది.
నిజంగా రంగి తన జీవితంలో అన్ని బాధలూ అనుభవించేసింది. తను పుట్టగానే తల్లి చనిపోవడంతో, నాన్న రెండో పెళ్లి చేసుకుని రంగికి సవతి తల్లిని తీసుకొచ్చాడు. ఆమె పెట్టే కష్టాలు తట్టుకోలేక రంగి ఆత్మహత్య చేసుకోవాలని రెండుసార్లు ప్రయత్నించింది. నీ కష్టాలు ఇంకా పూర్తవ్వనిదే ఎక్కడికి పోతావు… అని ఆ దేవుడు కూడా రంగి ఆత్మహత్యను నిరాకరించాడు. సవతి తల్లి సాధింపులతో, తండ్రి నిర్లక్ష్యంతో విసిగిపోయిన రంగి 14 వ ఏటనే ఒక కుర్రాడి ప్రేమలో పడింది. చెప్పాలంటే వాడి మాయమాటల వలలో పడింది. ఇంటి నుండి వెళ్ళి పోయింది. తల్లిని చేసి వాడు పారిపోయినా, కడుపులో పెట్టుకు కాపాడేరు గుడిసె అద్దెకిచ్చిన భార్యా, భర్తా. వాళ్ళవీ కూలి బతుకులే. నెలలు నిండేవరకూ, వాళ్ళ వెంటే కూలీకి వెళ్ళేది. ధర్మాసుపత్రిలో పండంటి బిడ్డ పుట్టిన నెలనాళ్ళకే మళ్ళీ కూలిబాట! తేలికభావంతో చేరవచ్చినవారికి- రంగి నిప్పని, ముట్టుకుంటే ముప్పని తెలిసొచ్చింది.
అందం చూసి, చేసుకుంటామనో చేరదీస్తామనో వచ్చినా… ఆ ఊసే ఎత్తవద్దు అంది.పిల్లాడే తన ప్రపంచంగా జీవించింది. వాడికి పెళ్లి చేసింది. ఇంత చేసినా ఏం లాభం? కోడలికి, రంగికి అస్సలు పడదు. కొడుకు… తల్లీపెళ్ళాల మధ్యలో నలిగిపోతూ, చివరకు పెళ్ళానికి ఒరిగిపోయాడు.
తన ఇద్దరి మనవళ్ళని చూసుకుంటూ మురిసిపోతూ అన్నీ మరచిపోతుంది రంగి. ఇప్పటికీ రంగి కష్టపడనిదే ఇల్లు గడవదు. పెళ్లాన్ని పనిలోకి పంపిoచాలంటే, కొడుకు ఒప్పుకోడు. అతడి సంపాదనతో ఎలా ఇల్లు గడుస్తుందని ఈ వయస్సులో కూడా రంగి కష్టపడుతుంది. భార్య పనిలోకి వెళ్లకూడదు గానీ, తల్లి వెళ్లవచ్చు…ఇదీ కొడుకు నిర్వాకం!
రంగి తనతో చెప్పిన తన కథని గుర్తుచేసుకుంది జానకి.
“నిజం. మనిషి సంఘజీవి. “ఎవరు ఎలాపోతే నాకేం” అనుకోవడం సరికాదు. దారిన పోయే గొడవలు అనుకోకూడదు. అవసరమైతే నెత్తిన వేసుకోవడమే నాగరికత. అప్పుడే దారులు సుగమమౌతాయి. రండి. నెత్తిన వేసుకుందాం…!