12.3 C
New York
Monday, November 25, 2024

లోకం తీరు

లోకం తీరు

                                                               – శ్రీమతి,రమాదేవి బాలబోయిన
                                                  7893261262

“భానూ! ఒకసారి ఇలా రా…” అమ్మ పిలిచింది.

“ఆ..వస్తున్నా..అమ్మా! ” అంటూ చేస్తున్న పని పక్కన పెట్టేసి వెళ్లాను.

” భానూ! రేపూ నువ్వూ…” అంటూ తటపటాయిస్తూ  ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తోంది అమ్మ.  ఏదో మొహమాటం ఆమె గొంతును నొక్కేస్తోంది.

“పర్లేదు, త్వరగా చెప్పవే అమ్మా! నాకింకా ఆఫీస్ పనీ బోలెడుందీ…”

“ఏం లేదే భానూ! రేపు మీనూ అక్కని చూసుకోవడానికి పెళ్లివాళ్ళు వస్తున్నారు. అందుకని  రేపు నువ్వు  మీ ఫ్రెండ్ సంధ్య వాళ్ళింటికి వెళ్లి ఓపూట ఉండగలవా? లేదా… మణిపిన్ని వాళ్ళింటికైనా వెళ్ళు”  మధ్య మధ్యలో ఆగుతూ మధ్య మధ్యలో చెబుతూ నేను ఏమనుకుంటానో అని మనసులో మధనపడుతూ అంది అమ్మ.

అమ్మ అలా ఎందుకు అందో అర్థం కానంత చిన్నదాన్ని కాదు కదా! నిజానికి ఇప్పుడు నా పెళ్లి చేయాల్సిన సమయం. కానీ నాకన్నా ముందే పుట్టిన అక్కకు పెళ్లి కుదరక అమ్మానాన్న వేదన చెందుతున్నారు. మమ్మల్ని గుదిబండలుగా  భావిస్తున్నారు. కారణం నాన్న ఆరోగ్యం చాలా దెబ్బతిన్నది.  అమ్మ బయట పనికి వెళ్లి ఎరగనిది. దాంతో ఎలాంటి సంపాదనా లేని మా కుటుంబానికి ఇన్నాళ్ళూ అక్క ఉద్యోగమే ఆధారమైంది.మమ్మల్ని వదిలి తాను పెళ్లి చేసుకుని వెళ్ళనని  మొండికేసి కూర్చుంది అక్క.

మొన్నీమధ్యనే నాన్నగారు పనిచేసిన ఆఫీసులోనే నాకు కారుణ్య నియామకంకింద ఉద్యోగం ఇచ్చారు.  నాన్నగారి ఆఫీసర్ చాలా మంచివారు. నాకు ఉద్యోగం ఇవ్వడంతోపాటు,  అక్కకు మంచి సంబంధం కూడా చూశారు. వాళ్ళకి ముందే మా కుటుంబ పరిస్థితి తెలియజేయడంతో అర్థం చేసుకోగలరు. కానీ అమ్మ ప్రవర్తన విపరీతంగా అనిపించింది నాకు.

అక్కని చూసుకోవడానికి వచ్చిన నాలుగైదు సంబంధాల వాళ్ళు మొదట కట్నం నచ్చక వెళ్ళిపోతే, ఆ తర్వాత వచ్చిన వాళ్ళు పెద్దది వద్దు, చిన్నదాన్ని చేసుకుంటాం అన్నారట. పది సంబంధాల దాకా  వచ్చి తప్పిపోవడంతో,  అటు అమ్మకు ఇటు నాన్నకు గుండెలు జారిపోయాయి. ఏదో వాళ్ళ ఆశ మేరకు అక్కకు పెళ్లి చేసి పంపిం చేస్తే ఆ తర్వాత నా పెళ్లి చేయొచ్చని అమ్మ ఆరాటం.

మగపిల్లలు లేకపోవడంతో  ఆడపిల్లలతో వేగటం అమ్మకు అలవాటు అయింది. తాను  పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు ఇంట్లో బాబాయిలు, అత్తలు చిన్నపిల్లలట. మా తాతగారుస్వర్గం చేరి వదిలేసిన బోలెడన్ని బాధ్యతలను  అమ్మ నాన్న తమ భుజాలపై మోశారట. ఉద్యోగంలో కుదురుకుంటూ నెమ్మదిగా చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు, తమ్ముళ్ల ఉద్యోగాలు, తల్లి అనారోగ్యం, ఆస్పత్రులు, కార్యాలు, పుణ్యాలు, తిధులు ఇలా అన్ని బాధ్యతలనూ నెరవేర్చి  నాన్న అలసిపోయాడు. ఆయన గుండె, మెదడు అలిసిపోయి పని చేయడానికి మొరాయించాయి.

 అంతే- ఇంత కాలం సహాయం పొందిన అత్తలు, బాబాయిలు మొహం చాటేశారు. మమ్మల్ని కష్టాల సముద్రంలో వదిలేసి తాము వెళ్లిపోయారు. అప్పటికీ అక్క డిగ్రీ పూర్తి చేసింది.  నేను డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నాను అమ్మ బయటకి వెళ్లి ఉద్యోగం చేసే పరిస్థితి లేకపోవడం వల్ల,  అక్క చిన్న ఉద్యోగం సంపాదించగా..నాన్నగారి ఉద్యోగంలో  నేను చేరి పోవాల్సి వచ్చింది.

 నాన్న నన్ను ఎప్పుడూ  ఆడపిల్లగా చూడలేదు.  చిన్నోడా చిన్నోడా అంటూ నన్ను మగరాయుళ్లా పెంచాడు. అక్కకు పెళ్లై వెళ్ళిపోయినా అమ్మానాన్నలిద్దరి  బాధ్యతా నాదేనని! ఎందుకంటే వాళ్ళు ఎంతగానో ప్రేమగా చూసుకున్న నాన్న చెల్లెలు, తమ్ముళ్లు నాన్నను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయారు . అలా కాకుండా నాన్నకు తృప్తికరమైన జీవితం ఇవ్వాలనిపించింది.

“ఏంటే! చప్పుడు చేయవూ ? అలా బెల్లంకొట్టిన రాయిలా నిల్చుండిపోయావేంటీ,” అమ్మ పిలుపుతో ఈ లోకం లోకి వచ్చాను.

“సరేమ్మా! అలాగే ..వెళ్తాను లే..” అన్నాను నేను.

ఇంటి ముందు కారు ఆగిన చప్పుడు ..ఆఫీసర్ గారు,   ఆయన  తెచ్చిన పెళ్లి సంబంధంవారు వచ్చారు.

మేము వాళ్ళకి నమస్కారాలు తెలియజేసి ఇంట్లోకి ఆహ్వానించాం.. అమ్మ నా వైపు కాస్త చురుగ్గా చూసినట్లుగా అనిపించింది . పెళ్లివాళ్ళ ముందు నేను ఉండడం అమ్మకి అస్సలు నచ్చలేదు .  లోలోన భయపడుతోంది.

పెళ్లివాళ్లను కూర్చోబెట్టి కాఫీలు టిఫిన్లు నాతో పంపించింది అమ్మ. ఆఫీసర్ గారు సరదాగా మాట్లాడుతూనే,  వచ్చిన విషయాన్ని లేవనెత్తారు. అమ్మను నాన్నను కూర్చోబెట్టి అసలు విషయం అడిగారు.  అక్కని వాళ్ళ అన్న కొడుక్కి,  నన్ను ఆఫీసర్ గారికి కొడుక్కి సంబంధం అడగడానికి వచ్చారాయన.

“శేఖరంగారు లేకపోతే నేను ఇన్ని రోజులు బతికి ఉండేవాడిని కాదమ్మా! ఒక ప్రమాదం  నుంచి నన్ను కాపాడడానికి  తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టాడు .ఇలాంటి గొప్పవారికి జన్మించిన వారి పిల్లలు కూడా గొప్పగానే ఆలోచిస్తారు. భాను ఆఫీస్ లో అడుగుపెట్టిన మొదటి నెలలోనే వ్యాపారం  ఎంతో అభివృద్ధి చెందింది..అందుకే నా ఇంటికి కోడలు గా వచ్చి , యజమానురాలిగా కుటుంబాన్ని  వృత్తిని కూడా వృద్ధి లోకి తీసుకు వస్తుందని భావిస్తున్నాను” అన్నారు మేనేజర్ గారు అమ్మతో..

 అమ్మ రెండు చేతులూ  జోడించి నమస్కరిస్తూ” మీ మంచితనం మర్చిపోలేను బాబూ “అంది.

“నిజానికి గొప్పవారు శేఖరంగారేనండి. మీవారి వల్లనే నేను ఈ స్థాయిలో ఉండగలిగాను “అన్నారు మేనేజర్ గారు.

ఆయన అన్నట్లుగానే నెల రోజుల వ్యవధిలో అక్కకు నాకు పెళ్లి జరిపించారు. మా వైభోగం చూసి,  మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిన బాబాయిలు అత్తలు తిరిగి మమ్మల్ని చేరారు.  అమ్మా నాన్నలను వాళ్ళు గౌరవంగా చూడడం ప్రారంభించారు.

నాకు వాళ్లను చూడగానే  “చెరువు నిండిన… కప్పలు పదివేలు చేరు గదరా సుమతీ”..పద్యం గుర్తొచ్చి జీవిత సత్యం బోధపడింది. ఏది మంచిదో,   ఏది కాదో నిర్ణయించుకునే అవకాశం వచ్చింది.  కానీ స్వలాభాపేక్ష తో ఇలా  బంధువులు వచ్చి చేరడంతో “లోకం ఇంతే”  అనిపించింది నాకు…..                                                                                **************

Vote this article
Vishnu Vardhan
Author: Vishnu Vardhan

Related Articles

Latest Articles