11.7 C
New York
Monday, November 25, 2024

వ్యవహారిక భాషోద్యమ దీప్తి – గిడుగు రామమూర్తి

వ్యవహారిక భాషోద్యమ దీప్తి – గిడుగు రామమూర్తి

                     (జనవరి 22 వర్థంతి సంధర్భంగా) 

– డా. అమ్మిన శ్రీనివాసరాజు

సెల్ : 7729883223

19వ శతాబ్దిలో తెలుగుదేశంలో పుట్టిన మహనీయుల్లో గిడుగురామమూర్తి ఒకరు. పందొమ్మిదో శతాబ్ది ఉత్తరార్థం ప్రవేశిస్తున్న సమయంలో తెలుగునేల చేసుకున్న పుణ్యఫలంగా ముగ్గురు ప్రముఖ సాహితీమూర్తులు జన్మించారు. వారి మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే!! వారే కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, గిడుగుమూర్తి. 

ఆధునికాంధ్ర సాహిత్యం, సామాజిక దృక్పథం ఈ ముగ్గురివల్ల ఎంతగానో ప్రభావితంఅయ్యింది,  ముగ్గురూ మూడురకాలైనా మౌలిక, అభ్యుదయోధ్యమాలకు నాయకత్వం వహించారు. అందుకే వారు ఆధునికాంధ్ర సాహిత్యంలో సుస్థిరస్థానం పొందారు.

వీరేశలింగం నాటి సామాజిక దృక్పథంలోనే మౌలికమైన మార్పులు తేవడానికి కృషిచేసి సఫలంకాగా. గురజాడ లక్ష్యం కూడా సాహిత్యం ద్వారా సామాజిక మార్పు,  నాటి దురాచారాల్లో చెడును రూపుమాపడం,  అందుకు ఆయన ఎంచుకున్న మార్గం సాహిత్యాన్ని, శిల్పాన్ని నవ్యనూతనం చేస్తూ ప్రజలభాషలోనే తన భావాలను పంచుకొని నిజమైన సాహిత్యశిల్పం ఆవిష్కరించి గొప్పనాటకాన్ని,  తొలికథానికను,  తెలుగు సాహిత్యానికి అందించి ఒక సంచలనం సృష్టించాడు.

 సాహిత్యాన్ని పండితుల గుత్తాధికారం నుంచి తప్పించినవాడు గురజాడ కాగ. సాంఘిక ప్రయోజనానికి భాషమీద గుత్తాధిపత్యాన్ని పండితవర్గం నుంచి తప్పించి ప్రజలకు ’భాషాస్వాతంత్రం’ కలిగించినవాడు గిడుగురామమూర్తి,  సంఘంలో అలజడి పుట్టించే భావ విప్లవ సాధనంగా సాహిత్యాన్ని స్వీకరించడం ఆధునిక యుగంలో ఆయన ద్వారానే మొదలైంది.

నేడు మనం అనుభవిస్తున్న ఈ సరళ భాషాసౌందర్యం కోసం సుమారు నూరు సంవత్సరాల క్రితమే ’గిడుగు’ తన కృషికి శ్రీకారం చుట్టారు.

ఆయన మొట్టమొదటి తెలుగు భాషా శాస్త్రవేత్త,  వ్యవహారిక భాషోద్యమ రథసారధిగ,  గ్రాంధిక భాషాభిమానుల పాలిటి పిడుగుగ చెప్పబడ్డ తనకు గ్రాంథికభాషపై చిన్నచూపు గాని కోపం గాని ఎంతమాత్రం ఉండేవికావు. గ్రాంధికభాష పరిమితి ప్రయోజనం, వేరని ఆయన అభిమతం. చదువు సంధ్యలూ రాతకోతలూ వాడుకభాషా ముఖంగా జరగాలన్న ఒకేఒక్క ’వాదం’తో ఆయన కడకంటూ పోరాడారు. గిడుగు గొప్ప మానవతావాది. అక్షరజ్ఞానం లేని అడవిబిడ్డలైన సవరజాతికి అక్షరబిక్ష పెట్టాడు. సవర భాషకు వాగనుశాసనుడు అనిపించుకున్న ఆయన వారి భాషావికాసం కోసం తన జీవితాన్నే అర్పించిన అసలైన భాషాసేవకుడాయన.

’ఆధునిక తెలుగుభాష’ అనే జీవనదిని నిరంతరాయంగా ప్రవహింపచేశాడాయన. ఆయన తెలుగునాట వ్యవహారిక భాషోద్యమం ప్రారంభిస్తున్న రోజుల్లో మనదేశంలోనే అంతటి గొప్ప భాషావేత్తలేడు. భాషాస్వరూప స్వభావాలను సామాజిక ఉపయోగితను ప్రయోజనాన్ని వికాసకారకాలను ఆయనలా వివరించి విశ్లేషించిన మహామనిషి అప్పుడు – ఇప్పుడు తనకు సాటిరాగల వారు లేరు.

ఆధునిక తెలుగు సాహిత్య ప్రక్రియలన్నింట తను వున్నాడు. విద్య కేవలం కొన్ని వర్గాలకే పరిమితమై పండితులకే సొంతం కాకూడదని నూరుశాతం అక్షరాస్యత రావాలని తద్వారా ప్రజాస్వామ్యం స్వాతంత్రం పరిరక్షింపబడాలని గిడుగువారు ఉద్భోదించారు, ఉద్యమించారు.

పసిప్రాయం నుంచి మంచి ప్రతిభావంతుడైన రామమూర్తి నాటికాలపు సామాజిక పరిస్థితులను బట్టి కుటుంబపోషణార్థం ఉపాధ్యాయవృత్తిని ఎంచుకుని ఆ వృత్తి నుంచే తన భాషోధ్యమాన్ని ప్రారంభించి వేదిక చేసుకున్నారు.

’గిడుగు’ వారి పూర్వికులు కృష్ణాజిల్లా ప్రాంతంవారు, 1850 ప్రాంతంలో  తీవ్రకరువు కాటకాలు ఏర్పడటంతో కుటుంబ పోషణే కష్టమైన కరణీకపు వృత్తిగల కుటుంబాలు చాలావరకు విజయనగరం మహారాజావారిని ఆశ్రయించి ఉద్యోగాలు పొంది జీవించారు. అందులో భాగంగానే గిడుగు వీర్రాజు కాలినడకన అక్కడకు చేరుకుని కొలువు పొందారు. అక్కడ కరణీకం చేస్తున్న వీర్రాజు ప్రతిభ లౌకికవ్యవహార దక్షత గమనించిన పోడూరి సీతాపతి గారు తన కుమార్తె ’వెంకమ్మ’ ను ఇచ్చి వీర్రాజు గారికి వైభవంగా వివాహం జరిపించారు. ఉద్యోగ విధుల్లో భాగంగా శ్రీకాకుళంకు ఇరవైమైళ్ళ దూరంలోని ’పర్వతాలపేట’లో వీర్రాజు వుండగ అక్కడే 1863 ఆగష్టు 29న దుందుభినామ సంవత్సరంలో రామ్మూర్తి జన్మించారు. 1875సంవత్సరం వరకు  పర్వతాల పేటలోనే ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేసుకుని తర్వాత విజయనగరం అమ్మమ్మగారింటికి చేరి మహారాజావారి పాఠశాలలోనే తన ఉన్నతవిద్య పూర్తి చేసుకున్నారు. రామ్మూర్తి గార్కి ఇద్దరు చెల్లెళ్ళు. పెద్ద చెల్లెలు అన్నపూర్ణమ్మ ’చాగంటి’ వారి కోడలు కాగా చిన్నచెల్లెలు సుందరమ్మ ’కాళీపట్నం’ వారి కోడలు.

చిన్నతనం నుండి చదువుల్లో చురుకుగా వున్న రామమూర్తి విజయనగరం మహారాజ కళాశాలలో చదువుకునే సమయంలో తన ప్రతిభకు మరింత రాణింపు లభించింది. ఆప్పుడే గురజాడ అప్పారావు, ఆదిభట్ట నారాయణదాసు, బుర్రా పార్వతీశం,  తదితరులంత సహవిద్యార్దులుగ  ఉండేవారు. 1879 నాటికి మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణుడయ్యారు. ఆ రోజుల్లో ఆ పరీక్ష పాస్ కావడం చాలా కష్టంగా ఉండేది. అది పాస్ అయినవారికి ఉద్యోగవకాశాలు అధికంగా ఉండేవి. కలెక్టరు వారి కార్యాలయంలో కూడా ఉద్యోగాలు లభించేవి. ఆదాయం, హోదా అధికంగా వుండే అలాంటి ఉద్యోగ అర్హత వున్నా రామ్మూర్తిగారు మాత్రం ఉపాధ్యాయ వృత్తినే ఎంచుకుని విజయనగరానికి 80 మైళ్ళ దూరంలోగల ’పర్లాకిమిడి’ గిరిజన గ్రామం ఎంచుకుని మిడిల్ స్కూల్ ఉపాధ్యాయునిగా 1880 నుంచి ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించి ఒక పక్క అక్కడి సవరగిరిజనుల విధ్యాభివృద్ది కోసం విశేషంగా కృషి చేయడమే కాదు తన యావత్ జీవితాన్ని ఖర్చు చేశారు. 

మరోవైపు తన ఉన్నత పాఠశాల విధ్యాభ్యాసం నుంచి మొదలైన ’వ్యవహారిక భాష’ వాదం ఆయనలో దినదిన ప్రవర్థమానంగా పెరిగి పెద్దదైంది. తన వాదాన్ని లోకానికి తెలియజేస్తూ ’జీవద్భాషకు నియామకుడు రచయితే కాని లాక్షణికుడూ వ్యాకరణకర్తా కాడు’ అని వివరించారు. ’లోకం పలుకుబడిని వ్యాకరణ రచయిత గ్రహించకపోతే అది అతడి తప్పు అవుతుంది కాని లోకం తప్పు కాదని’ ఆయన భావన.

గిడుగు అంకితభావం గల ఉపాధ్యాయుడు, ప్రామాణికుడైన లిపి శాస్త్రవేత్త, తెలుగును ప్రజలకు వాడుకభాషగా అందించడం కోసం దార్శనికతతో ఉద్యమరూపంలో కృషిచేసిన భాషోద్యమ సైనికుడు.

1913లో గిడుగు భాషోద్యమ లక్ష్యంతో నడిపిన ’తెలుగు’ పత్రిక వెలువడింది ఏడాదికాలమే అయినా దానిలోని విషయాలు’ భాషాశాస్త్ర అధ్యయనం’ కోసం ఎంతగానో ఉపకరిస్తాయి. అలాంటి ప్రామాణిక విషయాలు మరే పత్రికలో రాలేదు అనడంలో అతిశయోక్తి లేదు. 

1857లో మన దేశంలో స్థాపించబడ్డ మూడు  విశ్వవిద్యాలయాల్లో పట్టబద్రులైన విద్యాధికులు తమ ఆంగ్లభాషా పరిజ్ఞానం ద్వారా ప్రజల భావనల్లో మార్పు తేగలరని బ్రిటిష్ వారుఅనుకున్న  అర్థ శతాబ్దం దాటిన అనుకున్న లక్ష్యాలు సాధించలేకపోయారు. ప్రజల్లో అక్షరాస్యత పెరగలేదు. విద్యసామాన్య ప్రజలకు చేరువుకాలేకపోయింది.

దీనికిగల కారణాలు తెలుసుకోవడానికి ఏర్పడ్డ ’విషయవిచారణ పరిశీలన సంఘం’ విచారణల్లో తేలిన విషయం. విశ్వవిద్యాలయాల్లో దేశభాషలైన ప్రజల భాషలుగ చెప్పబడే ” వ్యవహారిక భాషలు”  నిర్లక్ష్యానికి గురికావడమే! అని నిర్థారణ అయ్యింది.

1910సంవత్సరం పూర్వం వ్యవహారానికి స్థూలంగ ’గ్రామ్యము’ అనే పేరుండేది ఈ కాలంలోనే వ్యవహారిక భాషోద్యమానికి ఒక స్పష్టమైన ఆకృతి కలిగింది దానికి ఆంధ్రదేశంలో కర్త, కర్మ, క్రియగా ” గిడుగు రామ్మూర్తి ” నిలిచారు. ప్రజల భాష ద్వారానే ప్రజలకు విద్య చేరువ అవుతుందని భావించిన గిడుగు. ఆంధ్రదేశంలో జరిగిన ఇతర సంస్కరణోద్యమాల మాదిరిగానే సామజిక ప్రయోజనం ఆశించి ఈ వ్యవహారిక భాషోద్యమంకు నడుంకట్టి నడిపించారు. 

ఈ ఉద్యమానికి ప్రభుత్వాలు, ప్రజలు సముఖత కలిగిన సాంప్రదాయవాదులైన గ్రాంధిక భాషావాదులు ఇదో భాషావిచ్చిన్న చర్యగా భావించి వ్యతిరేకతలు, దూషణలు మొదలుపెట్టి వారి వారి అధికార, అంగబలాలను ప్రయోగించి గిడుగు ఉద్యమానికి ఆటంకాలు కలిగించిన తనదైన ఉపన్యాసాలు, రచనలు,  ద్వారా తన ’వ్యవహారిక భాషావాదాన్ని’ బలంగా సవివరంగా వ్యాప్తి చేశారు. ఆయన సంకలనం చేసిన ’గద్యచింతామణి’ 19వ శతాబ్దంలో తెలుగు వచన రచన ఎలా ఉండేదో తెలియపర్చే ప్రామాణిక గ్రంథం. కడదాకా తను ఎంచుకున్న లక్ష్యంకోసం కృషిచేసి  తనలక్ష్యం సంపూర్తి కాకుండానే 22 జనవరి 1940న మద్రాసు మహానగరంలో అనారోగ్య కారణంగా గిడుగు కన్నుమూసిన తదనంతర కాలంలో ఆయన ఆశయం నెరవేరి ప్రజల భాష ద్వారా ఆయన కలకాలం జీవించే ఉంటారు. ప్రజలను  మాతృభాషల లో విద్యాభ్యాసం చేయించడమే మనం ఆయనకు అందించే అసలైన నివాళి.

Vote this article
Vishnu Vardhan
Author: Vishnu Vardhan

Related Articles

Latest Articles