5.5 C
New York
Monday, November 25, 2024

నేటి చారిత్రక అవసరం

గురజాడ ఆలోచనా విధానం

నేటి చారిత్రక అవసరం

-తొలి సంచిక

ప్రజల జీవితాలను సజీవంగా, సృజనాత్మకంగా
చిత్రించడమే కాదు, ఆ జీవితాలను మార్చడం కోసం వారిని చైతన్య పరచడమే లక్ష్యంగా రచనలు చేసే వారిని ఆ కాలంతో పయనించేరచయితలుగా మాత్రమే కాక రాబోయే కాలానికి ప్రతినిధులుగా కూడా పరిగణిస్తారు. వారు చేసే రచనలు ఎప్పుడు చదివినా వాటికి సార్వజనీనత ఉంటుంది.ఏ తరం వారు చదివినా ఆ తరం ఆలోచనలకు పదునుపెట్టేవిగా ఉంటుంది. గురజాడ అప్పారావు రచనలు చదివితే ఆయన ఆలోచనా విధానం ఎప్పటికప్పుడు ఒక
చారిత్రక అవసరంగా ప్రతిఫలిస్తుంటుందనడంలో సందేహం లేదు. తన కాలంతో పాటు పయనించి, తన కాలానికి కొన్ని ఏళ్లకు ముందుగానే యోచించిన గురజాడను నిత్య ఆధునికుడు అనడానికి ఏ మాత్రం సందేహించనక్కర్లేదు.


సమాజంలో కుళ్లిపోతున్న వ్యవస్థలు, వ్యవస్థల అండతో పెరుగుతున్న దుర్మార్గాలు,
నియంతృత్వ పోకడలు, మూఢనమ్మకాలు, దురాచారాలు, బూటకపు దేశభక్తి, మతతత్వం
ప్రబలిపోవడం, మారుతున్న కాలానికి అనుగుణంగా భాష, విద్యా విధానం మారకపోవడం
అనుభవంలోకి వచ్చినప్పుడల్లా గురజాడ అప్పారావు గుర్తుకురావడంతోనే ఆయన
ఆలోచనల సమకాలీనత అర్థమవుతుంది. ఆయన చేసిన రచనల్లో దాదాపు అన్నిటిలో నేటి
సమాజానికి అన్వయించగల అనేక అద్భుత పరిశీలనలు, వ్యాఖ్యానాలు చదివినప్పుడు
గురజాడ విలువేమిటో మనకు తెలియక తప్పదు.


ఒకరకంగా గురజాడ తన కాలానికి ఎదురీదారు. భాషా సాహిత్యాల విషయంలో
మార్పుకోసం ఒక ఘర్షణే చేయవలసి వచ్చింది. ఉదాహరణకు ఇవాళ మనం
పాఠ్యగ్రంథాలను వ్యావహారిక భాషలో చదువుతున్నాం. కాని ఆనాడు ఆయన అందుకోసం
పోరాడవలిసి వచ్చింది. ‘నేటి విద్యావిధానంలో వచన వాఙ్మయానికి గల అవసరం
తీర్చడానికి వాడుకభాషే ప్రయోగార్హం’ అని ఆయన స్పష్టం చేశారు. గ్రాంథిక వాదులు
పోటీగా ఏర్పర్చిన ఆంధ్ర సాహిత్య పరిషత్ సభల్లో ఒంటరిగా పాల్గొని తన వాదన ద్వారా
వారిని ఒప్పించే ప్రయత్నం చేశారు. కాని లాభం లేకుండా పోయింది. ‘మార్పుకు వారు
బద్ధవిరోధులు, పురోగతికి అవరోధులు’ అని ప్రకటించారు. ‘సంకెళ్లు ప్రేమించే వాళ్లు
గ్రాంథిక భాషను ఆరాధిస్తారు కాని నా మటుకు నా మాతృభాష సజీవమైన తెలుగు.
ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అనిపించుకున్న ఈ తెలుగులో మన సుఖాల్ని, మన దుఃఖాల్ని
వెల్లడించుకోవడానికి మనం ఎవరమూ సిగ్గుపడనవసరంలేదు..’ అన్నాడు.

సాహిత్య ప్రయోజనం గురించి నేటి ఆధునికుల్లో
ఎందరికంటేనో ముందుగా స్పష్టీకరించిన రచయిత
గురజాడ. ‘దురాగతాలను బహిర్గతం చేస్తూ ఉన్నత
నైతిక భావాలను వ్యాప్తి చేయడం కంటే మిన్న అయిన
లక్ష్యమూ, ప్రయోజనమూ సాహిత్యానికి లేదు..’ అని
కన్యాశుల్కం తొలి కూర్పు పీఠికలో వివరించారు.

కన్యాశుల్కం అనే దురాచారం నేడు లేకపోయినప్పటికీ ఆ నాటకం విలువ ఇంకా ఉన్నదని చెప్పడానికి ప్రధాన కారణం వివాహ వ్యవస్థలో స్త్రీలకు తమ నిర్ణయాధికారం ఇంకా రాలేదు. స్త్రీలపట్ల అన్యాయాలు ఇంకా కొనసాగుతున్నాయి. కన్యాశుల్కం నాటకంలో అభివర్ణించిన అవకాశవాదులు, అమాయకులు, అమాయకుల్ని మోసం చేసే వాళ్లు ఇంకా
ఉన్నారు. మూఢనమ్మకాలింకా ఉన్నాయి. ప్రజల్ని మోసం చేసే సాధువులు ఇప్పటికీ ఉన్నారు. దుర్మార్గమైన పోలీసు, న్యాయవ్యవస్థలు ఇంకా ఉన్నాయి. గురజాడ తీసుకున్న అనేక సమస్యలు ఇప్పుడు విత్తనం నుంచి చెట్టులాగా మారి శాఖోపశాఖలుగా విస్తరించాయి. ఆకలి మూఢవిశ్వాసాలను సృష్టించగలదు, రూపుమాపగలదు. ఆకలి ఏ కూడైనా తినిపించగలదు. అన్న భయంకర సత్యం గురజాడ కన్యాశుల్కంలో ఒక పాత్ర ద్వారా వ్యక్తీకరిస్తారు. ఒక కుళ్లిపోయిన, అవినీతితో నిండిన సమాజాన్ని మన కళ్లముందుంచేందుకు కన్యాశుల్కం అనే అంశాన్ని ఆయన అత్యంత సమర్థవంతంగా ఉపయోగించుకున్నారు. పెద్దమనుషులుగా, విద్యావంతులుగా నటిస్తూ, ఆచరణకూ, ఆదర్శాలకూ పొంతనలేని వ్యక్తుల్ని చీల్చి చెండాడారు.


బ్రిటిష్ పాలకులు మన రాజకీయ ఆర్థిక వ్యవస్థలో ప్రవేశపెట్టిన మార్పులు
సమూలమైనవి కావు. పాత వ్యవస్థను అలాగే కొనసాగిస్తూనే కొత్తగా తీసుకువచ్చిన
మార్పులు అవి. తమకు అవసరమైన చోట్ల రోడ్లను కొత్తగా వేసుకోవడం, అవసరమైన
ఆర్థిక, సామాజిక సంస్కరణలే చేయడం, తమకు అవసరమైన చోట్లపాతవిలువలను,
సంప్రదాయాలను కొనసాగనివ్వడం, అవసరమైన చోట్ల రాచరికాన్ని సమర్థించడం,
అవసరమైన చోట్ల మాత్రమే ప్రజాస్వామ్యాన్ని, తిరుగుబాట్లను సమర్థించడం జరిగాయి.
ఈ ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతోంది. అధునాతన సమాజానికి మద్దతునిచ్చే అధిపతులే
యజ్ఞాలను, యాగాలను, మూఢనమ్మకాలను, బాబాలను, వారి శిష్యురాళ్లను
పెంచిపోషిస్తారు. ఒకవైపు ఐటి విప్లవం గురించి మాట్లాడుతూనే మరో వైపు కుల వ్యవస్థను,
మత రాజకీయాలను, విద్వేషాలను సమర్థిస్తారు. పాలక వ్యవస్థలో పోలీసులు,
న్యాయవ్యవస, ్థ రాజకీయ, అధికార యంత్రాంగం, మతం, మూఢనమ్మకాలు,
భూస్వామ్యం, వ్యభిచారం, అవినీతి, అణిచివేత, విద్యావ్యవస్థలో లోపాలు మిలాఖతయి
కనపడతాయి. ప్రశ్నించడాన్ని సమర్థిస్తూనే ప్రశ్నించినవాడిని అణిచివేసే సంస్కృతి ఇది.
కన్యాశుల్కంలో వీటన్నిటిపైనా ప్రశ్నలు మనకు కనపడతాయి కనుకే ఇది నిత్య ఆధునిక

నాటకంగా అనిపిస్తుంది.

పాత విద్యావిధానం నేటికాలానికి ఎందుకు పనికిరాదో వివరిస్తూనే, మిడిమిడి జ్ఞానపు
చదువుల ద్వారా ప్రయోజనం ఉండదనే విషయాన్ని గిరీశం, వెంకటేశం ద్వారా వివరించి
విద్యావిధానం గురించి కొత్తగా ఆలోచించాల్సిన ఆవశ్యకతను గురజాడ వెల్లడిస్తారు.
బ్రిటిష్ వాడు తీసుకువచ్చిన న్యాయవ్యవస్థ ప్రజలకు ఉపయోగపడే వ్యవస్థకాదని చెప్పడం
ద్వారా న్యాయవ్యవస్థను ఆయన ప్రశ్నిస్తారు. డిప్టీ కలెక్టర్ కచేరీ నుంచి సారాయి దుకాణం
వెనుక ఉన్న తోట వరకు జరిగిన సంభాషణల్లో ఎవరికీ కోర్టుల మీద విశ్వాసం ఉండదని
అర్థం అవుతుంది. లంచం తీసుకుని హత్యకేసును కొట్టి వేసిన మునసబు, స్వప్రయోజనాలు
ఆశించి చెప్పే దొంగ సాక్ష్యాల ద్వారా అబద్ధపు వ్యవస్థమీదనే న్యాయవ్యవస్థ నడుస్తుందన్న
అభిప్రాయం ఆయన కలిగిస్తారు. దొంగసాక్ష్యం ఇస్తే కాని కేసులు గెలవవు అనే సత్యాన్ని ఆ
నాడే నిరూపిస్తారు. గురజాడ. ఎవరు శక్తివంతులైతే వారిదే గెలుపు అంటాడు. ‘వకీలు


అబద్ధాలాడిస్తే న్యాయం
పుచ్చుకునే జడ్డి ఏం చేస్తాడండీ.
అని గిరీశం అడిగితే, ‘ఉభయ
పార్టీల వకీళ్లు ఆడించే అబద్ధాల్ని
చెయ్యి పీకేట్లు రాసుకుంటాడు’
అని సౌజన్యారావు ద్వారా
న్యాయవ్యవస్థపైనే పరిహాసమాడిస్తారు గురజాడ. నేటి న్యాయవ్యవస్థ ఇంతకంటే భిన్నంగా
ఉన్నదా?
ఎవరు అధికారంలోకి వచ్చినా వ్యవస్థల స్వభావం మారదు అనేది కన్యాశుల్కం
నిరూపిస్తుంది. స్వాతంత్ర్యం వస్తే మన ఊరి హెడ్ కానిస్టేబుల్ మారతాడా అని ఒక పాత్ర
ప్రశ్నిస్తుంది. ఆ ఊరి వరకు హెడ్ కానిస్టేబులే అధికార యంత్రాంగానికి ప్రతినిధి. ఎన్ని
స్వాతంత్ర్యాలు వచ్చినా ఆ అధికారి మారకపోతే ఆ స్వాతంత్ర్యానికి అర్థం ఏమిటి? ఇప్పటి
వ్యవస్థలు, అధికార యంత్రాంగం అప్పటికంటే వేరుగా ఉన్నాయా? అన్న అనుమానం
గురజాడ రచనలు చదివితే మనకు కలగక తప్పదు.
అధికారవర్గాల ప్రయోజనాలకు అనుకూలంగా రూపుదిద్దుకుంటున్న మత
భావజాలానికి నిర్ధిష్టమైన ప్రయోజనం ఉన్నది. ‘గవర్నమెంట్లూ, దేవుళ్, లూబ్రాహ్మలూ వారి
నేరాలు వారివి. వాటితో మనకు పనిలేదు. మన భక్తి మనకుండాలి’ అని హవల్దార్ అచ్చన్న
అంటాడు. మనిషి సృష్టించిన దేవుడు మనిషి పైనే ఆధిపత్యం చలాయించే స్థితికి ఎదిగి
వ్యవస్థ దోపిడీ చట్రంలో ఒదిగిపోతాడు. ‘నిజమేమిటి, అబద్ధమేమిటి, లోకమే పెద్ద అబద్ధం’
అంటాడు బైరాగి.
ఒక ప్రక్రియను ఏ రకంగా ఆధునీకరించవచ్చో కన్యాశుల్కం ద్వారా మనకు
అర్థమవుతుంది. గురజాడ పద్యశకానికి సంబంధించిన ప్రధాన లక్షణాలను విధ్వంసం
చేయడం లక్ష్యంగా పెట్టుకుని నవ్యశకానికి నాందీ వాచకం పలికారు. అంతకుముందున్న
నాటక సంప్రదాయాన్ని, నాందీ ప్రస్తావనలు, భరత వాక్యాలను త్రోసిపుచ్చారు. వర్ణనలను

వదిలిపెట్టారు. నాయకుడు, నాయిక వంటి సాంప్రదాయిక పాత్రలు ఉండి తీరాలని
గురజాడ తాపత్రయపడలేదు. వాడుకభాషలో, కళ్లముందు నడుస్తున్న కథతో, తీవ్రమైన
పరిణామానికి లోనవుతున్న సామాజిక చరిత్రతో సమన్వయం చేశారు. సాహిత్యానికీ,
సమాజానికీ మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని గుర్తించి వస్తు శిల్పాల మధ్య ఐక్యత
పరిపూర్ణంగా సాధించారు. ‘సాహిత్యం వ్యక్తిగతానందం కోసం కాదు, అది సామాజిక
రుగ్మతలను రూపుమాపే బలమైన ఆయుధం కావాలి’ అని గురజాడ ప్రగాఢంగా విశ్వసించి
దానికి తగ్గట్లుగా కన్యాశుల్కాన్ని మలిచారు.
గురజాడ కథల వెనుక కూడా ఒక జీవిత కాలపు చింతన ఉన్నది. వీటిలో పూర్తిగా
ఆధునికత మనకు కనబడుతుంది. రాజీతత్వానికీ, ఉబుసుబోని కబుర్లకు ఇందులో
తావుండదు. గతానికి చోటుండదు. వర్తమానం వస్తువు, భవిష్యత్తు లక్ష్యంగా ఆయన
రనచలు కొనసాగుతాయి. ‘దిద్దుబాటు’ కథ ద్వారా ఏ వర్గానికి చెందిన స్త్రీ అయినా
విద్యావంతురాలు కావల్సిందే అన్నది స్పష్టీకరిస్తారు. ‘మీ పేరేమిటి’ కథలో గ్రామీణ
మతమౌఢ్యాన్ని విమర్శిస్తారు. మతాన్ని అడ్డుపెట్టుకుని కుట్రలు చేసే వారు సృష్టించే


భావోద్వేగాలకు లోనై
మనుషులు విడిపోరాదని
హెచ్చరిస్తారు. దేవుడిని
వ్యాపారం చేసే వాళ్ల నిజస్వ
రూపాన్ని బహిర్గతం చేస్తారు.
మత సమైక్యతే నేటి సామాజిక
అవసరం అని రచయిత ఈ కథ ద్వారా చెప్పిన సత్యానికి నేటికీ ఎంతో ప్రాధాన్యత ఉన్నది.
‘సంస్కర్త హృదయం’ అనే కథ ద్వారా ఒక సంస్కర్తలో నిజాయితీ లేకపోతే సమాజానికి
ఎలా కీడు చేయగలరో వివరిస్తారు. ‘పెద్దమసీదు’ కథ ద్వారా మత మార్పిడులపై లోతైన
వ్యాఖ్యానం చేస్తారు.


ఇక కవితల ద్వారా గురజాడ ఆధునికతకు శంఖమే పూరించారు. ఈ ఆధునికత
ఎటువంటిది? ప్రపంచమే ఒక కుటుంబంగా ఉండాలన్న ఉదాత్తమైన ఆలోచనకు
సంబంధించింది. ‘ఎల్లలోకము ఒక్క ఇల్లై, వర్ణ భేదములెల్ల కల్లై’ వాక్యంద్వారా నేటి‘గ్లోబల్
సిటిజన్’ అన్న పదానికి ఆయన పరిపూర్ణ నిర్వచనం ఇచ్చారు. మతాలు వస్తూ పోతూ
ఉంటాయి. కాని జ్ఞానం మాత్రమే నిలిచి వెలుగుతుంది. జ్ఞానమంటే ఏమిటి? శాస్త్రం, సైన్స్.
సైన్స్ ను ఎవరూ కాదనలేరు కదా అన్నది గురజాడ అభిప్రాయం. ‘మతాలన్నీ మాసిపోయి
సైన్స్ మాత్రమే మిగులుతుంది..’ అని ఆయన గట్టిగా చెప్పారు. కాని వాస్తవాల్ని
సమకాలికులు గ్రహిస్తారా? గ్రహించరు. ‘లోకమందలి మంచి చెడ్డలు లోకులెరుగుదురా’
అని గురజాడ ప్రశ్నించారు. అదే అప్పటికీ ఇప్పటికీ జీవన సత్యం. ‘మనిషి కల్పించిన
దేవుడిని పూజించే ఓ మనిషీ, మనిషి నెందుకు హీనంగా చూస్తావు.. దేవుడెక్కడో దాగి
ఉన్నాడని కొండల్లో, కోనల్లో ఎందుకు వెతుకుతావు?’ అని ప్రశ్నిస్తారు.
కన్యాశుల్కంతో పాటు దాదాపు అన్ని రచనల్లో గురజాడ గతంపై పోరాటం చేశారు.

వర్తమానం ఆధారంగా మంచి భవిష్యత్తు కావాలని కోరారు… అంత మాత్రాన గతాన్నంతా
ఆయన తృణీకరించలేదు. వర్తమానాన్ని పూర్తిగా, గుడ్డిగా కౌగలించుకోలేదు. పాత కొత్తల
మేలు కలయిక గురించి మాట్లాడారు. ‘మంచిచెడ్డలు మనుజులందున ఎంచి చూడగ
రెండు కులములు, మంచి అన్నది మాల అయితే మాల నేనగుదున్’ అని కులవ్యవస్థపై
సమరం ప్రకటించారు. ‘జ్ఞానం, నీతి ప్రధానం కాని జాతిలో ఏముంది’ అని కన్యాశుల్కంలో
హెడ్ కానిస్టేబుల్ పాత్రతో అనిపిస్తాడు.
గురజాడ ‘దేశభక్తి’ గీతాన్ని సమస్త ప్రపంచ మహాజనుల జాతీయ గీతంగా శ్రీశ్రీ
అభివర్ణించారు. ఈ కవితా పరిమళం ఎన్ని శతాబ్దాలు గడిచినా వాడిపోదు. భౌగోళిక
సరిహద్దులు ముఖ్యం కాదని, మనిషి ముఖ్యమనీ, మానవత్వం ముఖ్యమని చెబుతుందీ
కవిత. ‘దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్’ అనే వాక్యం ఇవాళ
రాజకీయ నాయకులు అలవరచుకోవాల్సిన విశాల దృక్పథాన్ని చెబుతుంది. మతం ఏదైనా
మనుషులంతా ఐక్యమయితే జాతి సమున్నతి జరుగుతుందని తెలుపుతుంది.
‘దురభిమానమైన, మతపరమైన దేశభక్తి కాదు, ఏ దేశంలోనైనా అనుసరించదగిన దేశభక్తి
ఏ విధంగా ఉండాలో గురజాడ శతాబ్దం క్రితమే స్పష్టీకరించారు. దేశ ఆర్థిక వ్యవస్థ గురించి
గురజాడకి అప్పటికే సమగ్ర అవగాహన ఉన్నది. విదేశీ వస్త్రదహనం జరగడానికి, ‘మేక్
ఇన్ ఇండియా’ ప్రచారానికి దశాబ్దాలకు ముందే గురజాడ అప్పారావు ‘దేశి సరుకులను
అమ్మవలెనోయ్’ అని దేశభక్తి గీతంలో చెబుతారు. పాడి పంటలు పొంగిపొరలే దేశం
కావాలని ఆశిస్తారు. దేశ మార్కెట్ ప్రపంచాలకు కూడా విస్తరించాలని చెప్పారు.
ప్రపంచీకరణ ప్రాధాన్యత పెరుగుతున్న కొద్దీ గురజాడ అభిప్రాయాలకు మరింత విలువ
పెరుగుతుంది. దేశభక్తి గీత రచనకు ముందు గురజాడ 1908లో మద్రాస్లో జరిగిన
కాంగ్రెస్ సమావేశాలకు హాజరయ్యారు. గురజాడ ఈ సమావేశంపై ఇంగ్లీషులో రాసిన
వ్యంగ్య కవితను ‘పాడకోయ్ కవీ కాంగ్రెస్ భజన సమాజం మాత్రమేనని, ప్రతినిధులంతా
నిద్దురపోయినా భవనం కిక్కిరిసిన సత్రమే సుమీ..’ అని శ్రీశ్రీ అనువాదం చేశారు. అది
ఇప్పటి కాంగ్రెస్ పార్టీకీ వర్తిస్తుంది.
గురజాడ అప్పారావు మరణించి వంద సంవత్సరాలైనప్పటికీ ఆయన రచించిన
రచనలు వంద సంవత్సరాల క్రిందవైనప్పటికీ వాటి విలువ ఇప్పటికీ సజీవంగా ఉన్నది.
ఇందుకు ప్రధాన కారణం ప్రస్తావించిన అనేక సామాజిక సమస్యల్లో అనేకం ఇప్పటికీ
ఉనికిలో ఉండడమే కాక కొత్త రూపాల్లో తలెత్తడం. రెండవది- వారు ఆశించిన సంఘ
సంస్కరణలు ఇప్పటికీ అవసరం కావడం. మూడవది- వారిలాగా అధునాతన రీతిలో
ఆలోచించిన వారు ఇప్పటికీ లేకపోవడం. 150 ఏళ్ల తర్వాత కూడా గురజాడ ఆశయాలు,
ఆదర్శాలు, ఆయన సాహిత్య నిబద్ధతా, మనకు ఆశ్చర్యం కలిగిస్తాయి. వారి చారిత్రక
అవసరం నాటికన్నా నేటికే ఎక్కువ ఉన్నదని మనకు ఆ రచనల్ని చదివితే అర్థమవుతుంది.
గురజాడ తన కాలానికి కంటే ఒక దశాబ్దం ముందు కాదు, ఒక శతాబ్దం ముందు పుట్టిన
మేధావి. ‘మంచి గతమున కొంచెమేనోయ్’ అన్నది గురజాడ విషయంలో వర్తించదు.
ఆయన సూచించిన మంచి అపారం.

4/5 - (2 votes)
Vishnu Vardhan
Author: Vishnu Vardhan

Related Articles

Latest Articles