6.1 C
New York
Monday, November 25, 2024

తాతగారి జ్ఞాపకాలు

తాతగారి జ్ఞాపకాలు

-తొలి సంచిక

తెలుగు భాషాసాహిత్యరంగాల్లో అత్యాధునిక అభ్యుదయ మార్గాన్ని చూపించిన మహామనీషి గురజాడ వేంకట
అప్పారావుగారు. ఆలోచనాధోరణిలో అత్యంత ఆధునికుడు.విజయనగరం మహారాజావారి ఆస్థానంలో ఉంటూ వారి అండదండలతో భాషకు అక్షరార్చన చేశారు. ఆనాటి సామాజిక పరిస్థితులను, ముఖ్యంగా ఆడపిల్ల విక్రయం, వయసు మీరినవారితో వివాహాలను ఎండకడుతూ రాసిన ‘కన్యాశుల్కం’ నాటకం తెలుగు నాటకరంగంలో నేతలమానికం లాంటిది. కన్యాశుల్కం ఆచారం అంతరించి దశాబ్దాలు దాటినా ఆ నాటకంకాని, దాని ప్రదర్శన కానీ పాతబడలేదు. అందుకే ఆయన రచనలను కాలతీతంగా చెప్పవచ్చు.

వ్యవహార భాషా పితామహుడుగా వినుతికెక్కిన గిడుగు రామమూర్తి పంతులు గారితో కలసి వాడుకభాష ఉద్యమాన్ని సాగించి విశ్వవిద్యాలయాల పాఠ్యాంశాల్లో మార్పునకు పోరాడారు. ఎంతోమంది ఆయనని ఆదర్శంగా తీసుకుని ఏకలవ్య శిష్యులుగా మారారు. అప్పారావుగారి పుత్రుడు శ్రీ వెంకటరామదాసు కాగా మనవడు వేంకట శ్యామలరావుగారు. వారి పుత్రుడిని నేను. మహాకవిలాంటి ఉన్నత వ్యక్తి పుట్టిన మహా వంశవృక్షంలో నేనూ ఒక శాఖను కావడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను.

మా కుటుంబాలలో మహాకవిని ఎల్లప్పుడూ అప్యాయంగా ‘గురజాడ తాతగారు’ అనే స్మరించుకుంటాం. నేను విజయనగరం లోని గురజాడ తాతగారి ఇంట్లోనే పుట్టి పెరిగాను. ముత్తాత గారి గురించి, వారు సాధించిన విజయాల గురించి మా తాతయ్య వెంకట రామదాసు గారి ద్వారా వినేవాడిని. మా తాతగారు చెప్పిన దానిని బట్టి, మా ముత్తాత అప్పారావు గారు. క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. ఆయన ప్రతిరోజు తెల్లవారు జాము నాలుగు గంటలకు నిద్రలేచి ప్రాత:కాల విధులు, స్నానాదులు ముగించుకొని నుదిటి పై కుంకుమ ధరించి సంధ్యావందనం, చక్రధ్యానం చేసేవారు. కాఫీ సేవించిన తరువాత ఉదయం 7.00 గంటల వరకు తన రచనా వ్యాసంగాలను కొనసాగించేవారు.కవితలు, ప్రకాశిక పత్రికకు సంబంధించిన పనులు, ఉత్తరప్రత్యుత్తరాలు సాగించేవారు. భోజనానంతరం మహారాజా వారి కోటకి వెళ్ళి ఆస్థానంలోని కార్యకలాపాల్లో నిమగ్నమైపోయేవారు. మహారాజా వారు రాత్రి భోజనం ముగించి తమ విశ్రాంతి మందిరానికి వెళ్ళిన తరువాతగాని తిరిగి ఇంటికి చేరేవారు కాదు. ఇది ఆయన దినచర్య. ఆరోగ్యకరమైన జీవితం కోసం పాటించవలసిన నియమాలను, తీసుకోవలసిన ఆహారం గురించి ఒక పుస్తకం రాయాలనుకున్నారట. గురజాడ తాత గారు. ఆయన విజయనగరం మహారాజావారి కుటుంబ సేవకు జీవితాన్ని అంకితం చేశారు. సంస్థానానికి సంబంధించిన చట్టపరమైన కార్యకలాపాలపై దృష్టిసారించి, న్యాయపోరాటంలో గెలిచి మహారాజా వారికి తలతో నాలుకలా అంకితభావంతో జీవితాంతం సేవలందించారు. గురజాడ తాతగారు తమ ఇంటి మేడపై గల ప్రధాన గదిలో పడుకునేవారు. మంచాన్ని గది ప్రవేశద్వారం ఎదురుగా ఉన్న గోడ దగ్గర తూర్పు, పడమర వైపు ఉంచేవారు. తద్వార రాత్రిపూట తన ఆలోచనలను పెన్సిల్తో గోడపై వ్రాయగలిగేవారు. కొన్నిసార్లు, చేతులు, కాళ్ళ నొప్పుల కారణంగా రాత్రిళ్లు నిద్ర కరవయ్యేది. ఒక సహాయకుడు వారి పాదాలకు మసాజ్ చేసేవాడు. గురజాడ వారికి మనవరాలు బుచ్చి కొండాయమ్మ అంటే చాలా ఇష్టం. ఆమె చాలా చురుకైనది,తెలివైనది. తెల్లని మేనిఛాయ కలిగి ఉండేది. ఆయన ఆమెను మనవరాలిగా కంటే స్నేహితురాలిగానే ఎక్కువగా పరిగణించేవారు. సాయంత్రం వేళల్లో సభలు, సమావేశాలకు ఆమెను వెంట తీసుకుని వెళ్ళేవారు. కొన్నిసార్లు ఆ సభలు మా ఇంట్లోనే ఏర్పాటయ్యేవి. ఆయన వివిధ ప్రాంతాలకు చెందిన పలువురితో సంభాషించే వారు. ప్రపంచ శాంతి, తెలుగు సాహిత్యం, సామాజిక సంస్కరణల గురించి ఎక్కువగా ఆలోచించేవారు. గురజాడ తాతగారు ప్రకృతి, పరిసరాలపట్ల గొప్ప పరిశీలనతో ఉండేవారు. తెలుగు సాహిత్యం, సామాజిక సంస్కరణల గురించి మాట్లాడడానికి, బోధించడానికి సదా సంసిద్ధులై ఉండేవారు. సమాజ హితం కోసం, సాహిత్యం కోసం ఏదో చేయాలన్న తపనతో అప్పారావు గారుతనను తాను మరచి ఎంతటి ఆలోచన చేసేవారు అనడానికి ఓ ఉదాహరణను చెప్పుకోవాలి. మెట్రిక్యులేషన్ విద్యలో తాతగారు కనబరచిన విశిష్ట ప్రతిభ ప్రిన్సిపాలు గారిని ఎంతగానో ఆకట్టుకొంది. ఉన్నతవిద్యను అభ్యసించడానికి తన ఇంట్లో ఉండమని తాతగారిని ప్రిన్సిపాలుగారు ఆహ్వానించారు. ఒకరోజు గురజాడ తాతగారు ఏదో ఆలోచనలోపడి కాలేజీకి ఆలస్యంగా వెళ్ళారు. అది ఆయన కాలేజికి బయలుదేరేముందు, భోజనంచేస్తున్నప్పుడే గ్రహించారు. ఆరోజు మొదటి ఉపన్యాసం ప్రిన్సిపాలు గారిది అని ఆయన గుర్తుచేసుకున్నారు. తాతగారు వెంటనే సగం పూర్తయిన భోజనం నుండి లేచి కండువాని ధరించడం మర్చిపోయి కళాశాల వైపు పరుగెత్తారు. శాస్త్రిగారు గురజాడ తాతగారిని చూసి, కండువా లేకుండా తరగతి ముందు నిలబడి ఉన్నట్లు గమనించారు. ఆ పరిస్థితిలో తాతగారిని చూసి అవాక్కయిన ప్రిన్సిపాల్ గారు తన ఉపన్యాసాన్ని ఆపి, తన కండువాని తాతగారికి ఇచ్చి, తాతగారిని తరగతిలోనికి అనుమతించిన తరువాత వారి ఉపన్యాసాన్ని కొనసాగించారు. గురజాడకి చెందిన చారిత్రాత్మక విలువ గల వస్తువులెన్నిటినో మనం కోల్పోయాం. దురదృష్టవశాత్తు గురజాడ తాతగారి మరణం తరువాత వారి ఇల్లు చాలాసార్లు దొంగలబారిన పడింది. ఆయన ఉంగరం, వాయిస్ రికార్డర్, ఫోటోలు, డైరీలు, ప్రకాశిక పత్రిక ప్రతులు, విడిగా ఉన్న కాగితాలు గల చెక్కపెట్టె సహా చోరీ అయ్యాయి. ముత్తాత గారి ఇంటిని ప్రభుత్వానికి అప్పగించిన వేళ తాత రామదాసుగారు ఎంతో గర్వించారు.`దేశమును ప్రేమించుమన్నా, మంచియన్నది పెంచుమన్నా… వట్టి మాటలు కట్టిపెట్టోయ్, గట్టిమేల్ తలపెట్టవోయ్’ అని గొప్ప దార్శనికతతో చెప్పిన మాటలను భావితరాలవార

ఈ గృహాన్ని సందర్శించినపుడు తలచుకుని గర్వపడుదురు గాక అని మా తాతయ్య రామదాసుగారు అన్న మాటలు ఇంకా గుర్తున్నాయి.గురజాడ సంస్థ(అమెరికా), ఇతర శాఖలు అనుసరిస్తున్న సూత్రం ఇదే.

గురజాడ వారి తత్వాన్ని విశ్వవ్యాపితం చేసేందుకు, ప్రపంచ శాంతి గురించి ఆయన కలలను సాకారం చేసేందుకు ఈ సంస్థ ప్రయత్నిస్తోంది.

గురజాడ ఫౌండేషన్`(అమెరికా) కమిటీ సభ్యులు, వాలంటీర్లు ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలు
ఆరంభం మాత్రమే.


మా కుమార్తె చి.సౌ. శిరీష పిండిప్రోలు, శ్రీమతి అరుణ గురజాడ, కొవ్వలి గోపాల కృష్ణ
గార్ల కుమార్తె కుమారి చంద్రలేఖ,ఫౌండేషన్ యువ నాయకులుగా వ్యవహరిస్తూ ‘గురజాడ
స్ఫూర్తి విద్యార్థి’ పురస్కారానికి ప్రాయోజితులుగా ఉన్నారు. వీరు గురజాడ వారి ఆశయాల్ని
సాకారం చేసేందుకు మరింత కృషి చేస్తారని ఆశిస్తున్నాను.


అప్పారావుగారి మునిమనుమరాలు అరుణ గురజాడ, ఆమె భర్త డాక్టర్ కొవ్వలి
గోపాలకృష్ణ టెక్సాస్ లోని షుగర్ ల్యాండ్లో యుఎస్ఏ గురజాడ ఫౌండేషన్ స్థాపించడం
(2014) చాలా సంతోషం కలగించింది. ఈ ఫౌండేషన్ వారిచే పునః ప్రారంభింపబడుతున్న
‘ప్రకాశిక’ ద్వారా గురజాడ స్ఫూర్తితో సాహిత్య, సమాజ సేవలను చేయాలనే సంకల్పం
నెరవేరాలని ఆశిస్తున్నాను. ఈ పత్రిక గురజాడ తాత గారి ఆశీస్సులతో నిరంతరాయంగా,
విజయవంతంగా నడుస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది.

Vote this article
Vishnu Vardhan
Author: Vishnu Vardhan

Related Articles

Latest Articles