ముద్రించుకోవటానికి దాతల్ని ప్రశంసిస్తారు. ఎవరినీ పొగడటం తప్పుకాదు. ఆపని
అవతలివాడి యోగ్యతను బట్టి చేయాలి. కొందరికి స్తోత్రపాఠాలు ఉగ్గుతో పెట్టినవిద్య.
“ఇచ్చట సన్మాన పత్రములు రాయబడును” అని ఇంటి ముందర బోర్డువేలాడగట్టేవాళ్లు
ఈ కోవకు చెందినవారు. కొందరు విపరీతంగా పొగిడేస్తుంటారు. “పొగడ్తలు అగడ్తలు
దాటా’యంటారు ఇటువంటి సందర్భాల్లోనే. కొందరు ఇష్టం లేకపోయినా ముఖస్తుతిగా
ప్రశంసిస్తారు. హృదయపూర్వక అభినందనే మంచి ప్రశంస. కొందరు నోటితో నవ్వుతూ
నొసటితో వెక్కిరిస్తారు. ఇవాళ విపరీతంగా పొగడిననోళ్లేరేపు తెగడ్డానికి సంకోచించవు.
“నిప్పులు చిమ్ముకుంటూ
నింగికి నేనెగిరిపోతే
నిబిడాశ్చర్యంతో వీరు
నెత్తురు క్రక్కుకుంటూ
నేలకు నే రాలిపోతే
నిర్దాక్షిణ్యంగా వీరె”
అన్నాడు శ్రీశ్రీ. ఇవాళ బ్రహ్మరథం పట్టినవాడు రేపు కిందకు తోసేస్తాడు. కాకాపట్టి
బాకా ఊదినవాడే తన పని అయిపోయాక ఢోకా ఇవ్వడానికి వెనుదియ్యడు.
కొన్ని సభల్లో, సన్మానాల్లో “నువ్వు నన్ను పొగుడు, నేను నిన్ను పొగుడతా”నన్న
చందానా ఉంటాయి ప్రసంగాలు. కొందరైతే ఇతరులు తమను పొగిడే అవకాశం ఇవ్వరు.
వారి స్వంతడబ్బా వాళ్లే వాయించుకుంటారు. ఎవరికైనా ప్రశంసలు ప్రేరణ కలిగించాలి.
మరింత ఉత్సాహంగా పనిచేస్తూ విజయం సాధించేందుకు ఉత్ప్రేరకంగా పనిచేయాలి.
పొగడ్తలు ఆత్మవిశ్వాసాన్ని కలిగించేలా ఉండాలి గాని అహంకారాన్ని పెంచేలా
ఉండకూడదు. లోకంలో ఒకసామెత ఉంది.
“హనుమంతుడికి తన బలం తనకు తెలియదని. సర్వశక్తిమంతుడు హనుమ.అయినా
సముద్రం దాటేస్తానని ముందుకు రాలేకపోయాడు. ఆతడికి బాహ్యప్రేరణ అవసరమైంది.
ఒక మూల కూర్చుని విషాదంలో మునిగి పోయినవాడికి జాంబవంతుడు ప్రేరణనిచ్చాడు.
అతడిశక్తిని, బలాన్ని గుర్తు చేశాడు.
ప్రశంసల్ని చిరునవ్వుతో స్వీకరించాలి. విమర్శించినపుడు మౌనంగాఉండి
సరిదిద్దుకోవాలి.
ప్రశంసల్ని, విమర్శల్ని సమబుద్ధితో స్వీకరించడం స్థితప్రజ్ఞ. అది సాధించగలిగినప్పుడు
మనం బలమైన వ్యక్తిత్వం గలవాళ్లమవుతాం.