స్వాగతము
–సాహిత్య ప్రకాశిక
(భారతి పత్రిక తొలి సంచికలో “భారతి” కి శర్మానంద
గారు పలికిన అపూర్వ పద స్వాగతాంజలి)
భావప్రకటీకరణ మసంభావ్యమైనచో, అగ్రాహ్యంబు
లంతర్భూత మగుననియో, అకృతైచ్ఛికము లగుననియో,
తలంచుట ప్రమాదము. ఆత్మప్రకటనమునకు, అలౌకిక భాషా ప్రయోగమును,
ప్రాపంచికానుగతికంబులకు, సాధారణ భాషానియమమును, యాదృచ్ఛికములకు,
ఉభయేతరేతర సంప్రదాయమును, అనుగమితము లగుట, విబుధాచారము. ఏది
ఎట్లైనను, విషయావగాహనమగు భాషాప్రయోగప్రచారమే, సమంజసము. కావున
ప్రమాదజనితంబులగు దోషలేశంబులం గైకొనక, ధారాళహృదయులరై, మా
చదువరులు విషయగ్రహణం బొనర్తురుగాత.
అపూర్వప్రసంగంబుల, అఖిలభారత పూర్వాపూర్వ ప్రస్తావనంబుల, నైహికా
ముష్మికవిషయావబోధ విధానంబుల, సుప్రసిద్ధకథాకథితవ్యాసంగంబుల, సదమల
విశద యశోవిరాజమానంబగు సుగంధ గంధిలప్రఫుల్ల హృదయ కుముదినియై,
నవనవోద్బుద్ధ విబుధామోదిత భారతరహస్య విలసనామోఘ వ్యవసాయానుభూతతత్త్వ
విమర్శనా కౌశల్యంబున, కుసుమవర్షంబులం గురియుచు, కోమల ప్రణయగీతామృత
రసప్రవాహంబుల, నభ్రగంగయో యన, ఆత్మసంతానహృదయకలుషక్షాళన కుతూ
హలియై, విస్తృతవృత్తంబుల, పండితపామరారాధ్యయై, మృదుపదవచనరచనా
శృంగారవిలాస లాలసియై, కమ్మదెమ్మెరల గమగమలతో, ఉత్తరాభిముఖియై, ఆంధ్ర
సర్వస్వంబును పవిత్రంబొనర్ప, నిదే! మా నవ్య “భారతి” యీదెసనుండి ముద్దు
గుల్కులేనడలతో, బయలువెడలినది.
విజయోస్తు, ‘భారతీ!’ విజయోస్తు. వర్ణత్రయీ! స్వాగతము. ‘భారతీ’మతల్లీ!
సుస్వాగతము. అమ్మా! నీ పుత్రపుత్రికాసహస్రంబుల సానురాగదృక్కుల నను
గ్రహింపుము. నీ చతురంతయానమును, వీథివీథికిం జననిమ్ము. నీ వింటింట విందవు
కమ్ము. మా పరిచర్యల నామోదింపుము. మా స్తోత్రపాఠములకు తా విమ్ము. మా గీతా
గానంబుల కామోదింపుము. హితబోధలొనర్పుము. తరణోపాయముం జూపుము.
ధర్మతత్పరులం జేయుము. అభీష్టాభిసిద్ధి కాశీర్వదింపుము. వేయేల! మమ్మెల్లర నీ
బిడ్డల మనిపింపుము. ఇదియ నా ప్రథమాంజలి.