9.8 C
New York
Monday, November 25, 2024

సాహిత్యవాదాలు సామాజిక
వైషమ్యాలకు ఆజ్యం పోస్తున్నాయా?

సాహిత్యవాదాలు సామాజిక
వైషమ్యాలకు ఆజ్యం పోస్తున్నాయా?

అభ్యుదయవాదాలు మానవాళి మనుగడకు ఉషోద యాలై, మానవీయతకు మహోన్నత మార్గాలై, దోపిడీని ఎదిరించే ఉద్యమాలకు ఊపిరై విలసిల్లాలి. ఎల్లవేళలా మనిషితనాన్ని పరిమళభరితం చేయాలి. అభ్యుదయాన్ని
కాంక్షించే సమస్త కళలు సమాజానికి చైతన్య దీపికలు కావాలి. కళలన్నింటిలోనూ మకుటాయమానమై నిలిచే సాహిత్యం, సామాజిక విధ్వంసక మూలాలను, నవ నాగరికత వ్యామోహంతో రూపిస్తున్న సామాజిక రుగ్మత లను, ధ్వంసించేందుకు తోడ్పడే ఆయుధం కావాలి.

మాన వాభ్యుదయానికి ఆయవు పోయాలి. మానవత్వానికి మారాకు తొడగాలి.
సాహిత్యదృక్పథం ఎప్పుడూ వర్గ, వర్ణ, కుల, మతరహితంగా మనిషి మనుగడే
ధ్యేయంగా సాగిపోవాలి. ఇలాంటి లక్ష్యాలతో, మార్గాల్ని అన్వేషిస్తూ సరికొత్త చూపుతో
మున్ముందుకు పోవాల్సిన సాహిత్యంలో వివిధ వాదాలు పుట్టుకొచ్చాయి. మత,
రాజకీయ, కవితోద్యమాల తరువాత ‘జెండర్’ ప్రాతిపదికగా స్త్రీవాదం; కులాల
ప్రాతిపదిగ్గా దళితవాదం, బి.సి వాదం; మైనారిటీ వాదం; అస్తి ్వవాదంతో పాటు
ప్రాంతాల వివక్షతను ఎత్తిచూపుతూ ‘ప్రాంతీయవాదం’ వెలుగులోకి వచ్చాయి. ఈ
వాదాలన్నీ వారివారి మూలాలను తవ్వుకుంటూ, వారి ఆవేదనలను, అసమ్మతిని,
అనుభవాలను, దోపిడీవైనాన్ని వ్యక్తీకరిస్తూ ముందుకొచ్చాయి. దోపిడీని నిలువరించే
పోరాటపటిమను, దౌర్జన్యాలను అడ్డుకునే ఆరాటశక్తిని, ఆయా వర్గాల్లో నింపి
ఎదుర్కొనే చైతన్యాన్నిచ్చే బంధనాశక్తిగా సాహిత్యం రూపుదాల్చింది. దీని ఫలితమే
ఆయా వర్గాలకు సొంత గొంతుకతో, ఓ కొత్తచూపు, తిరుగుబాటు చైతన్యం, ఆర్థిక,
రాజకీయ, పురోగామి దిశగా పయనించే మార్గాన్వేషణ అలవడి కొన్ని విజయాలను
సాధించాయనే చెప్పొచ్చు. సామాజిక నూతన మలుపుకు ఈ వాదాలు
దోహదపడినాయనడంలో ఎట్టి సందేహమూ లేదు.
తొలిదొల్తగా ఈ వివాదాల్లోంచి పుట్టుకొచ్చిన సాహితీవేత్తలు నిబద్ధత, నిజాయితీ,
సంఘటిత శక్తి, ప్రతిఘటనాపటిమ, సృజనాత్మకత, విస్తృతి, గొప్ప కళాభివ్యక్తితో

కూడుకొని ఎంతో నిజాయితీగా పరిఢవిల్లారనే చెప్పుకోవచ్చు. క్రమేపి ఈ స్ఫూర్తి
అన్నివాదాల్లోను, మసకబారి, వ్యక్తి స్వార్థంలోకి జారిపోతూ, కుహనామేధావి వర్గాల
స్వార్థపరత్వానికి తాళంవేస్తూ, నానాటికి నైతికంగా దిగజారిపోతున్న తీరు స్పృహతో
ఉన్నవారెల్లరకు విదితమే! ఈ విధానాన్ని నిస్వార్థపరిశీలనతో, ఆయా వర్గాల కవులు,
రచయితలు తమ సాహిత్యాన్ని పునర్ మూల్యాంకనం చేసుకోవాల్సిన అవసరం
ఎంతైనా ఉంది. నేడు కనిపిస్తున్న వర్ణాగ్రహాలు, వర్గాగ్రహాలు, జెండర్ ఆగ్రహాలు,
ధర్మాగ్రహాలుగా తలపించడం లేదు. ఇందులో ఏ కొత్తకోణం కనిపించడం లేదు.
అధిక్షేపధోరణులన్నీ ఆగడాలుగానే, అన్యాయంగా వేపుకుతినే పోకడలుగానే,
రూపుదాలుస్తున్నాయని బాధితులు వాపోవడం చూస్తూనే ఉన్నాం.
నేడు కొందరు కవులు, రచయితలు నడుస్తున్న కాలాన్ని, నేటి సామాజిక
స్థితిగతుల్ని, కొత్తచూపుతో, సరికొత్త కోణాల్లో చూడకుండా, అవగాహనించుకోకుండా,
గత మూడుదశాబ్దాల నాటి ముచ్చట్లనే, తిప్పితిప్పి రాస్తూ కుల, మతాల మధ్య
చిచ్చురేపుతున్నారు. నిజాలను గుప్పిట పడుతున్నారు. సర్దుకుపోగల సమస్యలను
పెద్దది చేసుకుంటున్నారు.
నిజం మాట్లాడాలంటే, నేటి సమాజంలో కాలానుక్రమముగా ఉద్భవిస్తున్న
సరికొత్త సమస్యలను పట్టుకొని, అవి ఏవిధంగా వర్గాల్లో, వర్ణాల్లో విషాన్ని విరజిమ్ము
తున్నాయో, వీటిమూలంగా మనుషులు ఏవిధంగా పరాయీకరణ చెందుతున్నారో
లోతుల్లోకెళ్ళి కవులు, రచయితలు పసిగట్ట ం లేదు. వస్తుదర్శనం ఈ కోణాల్లోంచి
చేయడం లేదు. సమాజంలో తలెత్తిన విపత్కర సమస్యను ఒక చట్టమో, లేక
ప్రజాగ్రహమో, రూపుమాపిందనుకుంటామేకాని, ఆ సమస్య, అడ్డుకొన్న అవరోధాల
వల్ల తను రూపం, కోణం మార్చుకుంటుంది. సరికొత్త లక్షణాలతో సమాజాన్ని
పట్టిపీడిస్తూనే వుంటుంది అనే విషయాన్ని సాహితీవేత్తలు ముఖ్యంగా పసిగట్టాల్సిన
అవసరం వుంది. తదానుగుణ్యంగా సాహిత్యసారం కూడా మారాల్సిన ధర్మం ఉంది.

ప్రపంచీకరణ ఫలితంగా, కార్పోరేట్ వాణిజ్య విధానాల వలన, కుల, మత,
భేదరహితంగా అన్ని వర్గాల్లోకి బూర్జువా భావజాలం, పెత్తనందారీతనం, దోపిడీతత్వ్తం,
నీతినిజాయితీ లేమి, వారికి ఎరుక లేకుండానే ప్రవేశించడం ఈ కాలధర్మంగా
భావించాల్సి ఉంది. సమా జంలో నాటుకుపోతున్న ఈ అదృశ్య అగాధాలను సాహితీ
వేత్తలు పసిగట్టాలి; పూడ్చగలిగే భావాల్ని అందివ్వాలి.
ఆయా వాదాల్లో వర్గాల్లో కలంపట్టిన కవులు ‘కమిటెడ్’ కవులుగానే మిగిలిపోతూ,
ఆయా వర్గాల్లోకి దూరుతున్న దుష్టభావజాలాన్ని నిశితంగా ఖండించలేకపోతున్నారు.
‘ఏనాటినుండో అరిగిపోయిన, విరిగిపోయిన, శిథిలమైన, భావజాలానికి తాకట్టు
వడుతూ వాటికే తానతందాన’ అంటున్నారు. వీరు అనంతాన్వేషణకు తెరలేపరు,
పునర్ మూల్యాంకనం పట్టించుకోరు. సమస్యల రూప పరిణామ క్రియల మీద
వాదోపవాదాలు, చర్చలు జరుపరు. సెమినార్లకు తెరలేపరు.


ఒకపక్క కులవృత్తులు నశించిపోతున్నాయి, కులాల కడ్డుగా గీయబడిన లక్ష్మణరేఖలు చెరిగి పోతున్నాయి. అంటరానితనం అంతరించి పోయింది. కానీ కుల మతాల మధ్య మాత్రం కుమ్ములాటలు అలానే
కొనసాగుతున్నాయి. మనం మొత్తంమీద గమనిం చాల్సింది ప్రతిమనిషిలోను ఆర్థిక వేటగాడు మాటువేసి వున్నాడు. ఉద్దరిగా వీలుపడే ఆర్థికవేటకు విల్లంబులు ఎక్కుపెట్టే వున్నారు. ఎవడి పరిధిలో వాడు, ఎవడి స్థోమతను బట్టి వాడు, వీలైనంతవరకు దోపిడీకి
సిద్ధపడుతూనే వున్నాడు. ప్రపంచవ్యాప్తంగా నయా దోపిడీ విధాన పరిజ్ఞానం ఎక్కడనుండి ఇంపోర్టవు తుందో, ఎట్లా ఎక్స్ పోర్ట్ అవుతుందో, కారకులెవరో కనిపెట్టి బహిర్గత పరచాల్సిన బాధ్యత సాహితీవేత్త
లందరి మీద వుంది. మూఢాచారాల ముసుగుల్ని హేతుబద్ధత, శాస్త్రీయ దృక్పథం, ఎంతవరకు చీల్చి పారేస్తుంది? వ్యక్తి స్వార్థానికి, పదవీకాంక్షకు, ధన దాహానికి,
సాహిత్య సిద్ధాంతాలు నీరుగారిపోకుండా ఎంతవరకు నిలబడగలుగు తున్నాయో
ఆలోచించాల్సి ఉంది. సంప్రదాయవాదాన్ని ఒక కులానికి అంటగట్టి, వారందరిని
టార్గెట్ చేసి హింసించడం ఎంతవరకు సమంజసమో తేల్చాల్సి ఉంది.
ఏ సాహిత్యవాదమైనా మారేకాలంతో పాటు మార్పును ఆహ్వానించాల్సిందే.
వేదాల్లాగా వాదాలు పూజనీయం అనుకోవడం సరికాదు. సాహిత్యవాదాలెప్పుడూ
సామాజిక వైషమ్యాలకు ఆజ్యం పోయకూడదు. మనిషితనానికి మచ్చతే కూడదు.

Vote this article
Vishnu Vardhan
Author: Vishnu Vardhan

Related Articles

Latest Articles