శుభ కామన నవ జీవన క్రాంత
మన కలలూ కోరికలూ నిరంతరాలు, నిరంతరాయాలు.
అంధకారాన్ని పటాపంచలు చేసే భోగిమంటలు, దూరాల్ని
దరిచేర్చే దారాల గాలిపటాలు, పోరు పటిమను పెంచి పోషించేనానావిధాల పందేలు… ఇవన్నీ మానవాళి ఆశల ఆశయాల ప్రతిరూపాలు.
వీటన్నిటి సమాహారమే ఏడాదిలో తొలిదీ పెద్దదీ
అయిన సంక్రాంతి. ముచ్చటగా మూడు మాటల్లో నవ జీవన
కాంతి. ‘సం’ అంటే ముందుకు. ‘క్రాంతి’కి అర్థం అడుగు.
ఒక్కముక్కలో ముందడుగు. అందుకే ఇది అఖిలలోక వైజయంతి, స్వర్ణప్రభా స్రవంతి.
సరదాలు, మురిపాలు, ఆటపాటలు పైకి కనిపించేవైతే అంతర్లీనంగా వెల్లివిరిసేవి సంస్కృతీ సంప్రదాయాలు. వీటిని తోటివారితో పంచుకుంటే కష్టం తగ్గి సుఖం రెట్టింపవుతుంది. అందునా వరుసగా నాలుగురోజులు సంకురాత్రి పండుగ శోభ (భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ) తెలుగింటనే కాక అంతటా వెలుగులీనుతూనే ఉంటుంది. నేనూ, నా ఊరూ, నా వాళ్ళనే ఆరని తడిని గుండెగుండెనా నింపుతుంటుంది.
ఏ ప్రాంతంలో ఏ పేరుతో పిలిచినా ఇదంతా పర్వదినోత్సాహం, ప్రతి ఒక్కరి మహాహృదయోల్లాసం. కవిస్వరం పలికినట్లు ‘హేమంత వీధి కదలివచ్చెను భాగ్యాల కడలి వోలె మకర సంక్రాంతి లక్ష్మి’
మానవ గమనాల, గమ్యాల సూచిక లక్ష్మీకళ. భానుడి నవీన రాశీ ప్రవేశం -సంక్రమణం. దీనికితోడు ఉత్తరాయణ కాల ఆగమనం, ధనుర్మాస ప్రాభవాదులు సైతం
భారతజాతి వైభవయాత్రా భాగాలు. బహువిధ అరిష్టాలను భస్మీపటలం చేసే,
సుఖశాంతి ప్రకాశికలను ఊరూరా వాడవాడలా ప్రసాదించే సంక్రాంతి లక్ష్మి మనందరి
పాలవెల్లి, కల్పవల్లి. ఇదంతా సకల జనుల శ్రేయస్సునూ కోరి ఆవరించే ప్రకృతి
ఆరాధనోత్సవం. పౌష్య లక్ష్మీపూజతో ఇల్లంతా భోగభాగ్యాలమయం కావాలన్న
శుభకామనోత్సాహ నిలయం. అత్యాధునిక జీవనవేగం కొనితెచ్చిన కామ క్రోధ లోభ
మద మోహ మాత్సర్యాలను సత్య శివశాంతి సుందరాదులు నిండిన ప్రేమతో క్షాళన
చేయాలన్నదే ఈ పండుగ అర్థం – పరమార్థం. జాషువా కవి అభిలషించినట్లు ‘చలితో
రేగిన రోగబీజముల దోషం బెల్ల నీ భోగిమం / టలతో దగ్ధము చేసి జీవితపు తోటల్
శుద్ధి గావించి, రా/ గల సంవత్సరమెల్లదేశమున సౌఖ్యశ్రీలు వర్షించి, ని / ర్మల
ధీశక్తులొసంగుమమ్మ! శుభసంక్రాంతీ! దిగంతంబులన్’. మాలిన్యం మలగిపోవ,
మాత్సర్యం కరగిపోవ, దౌర్భాగ్యం తొలగిపోవ, చీకట్లవి చెదిరిపోవ ప్రతి వ్యక్తీ తన
శక్తికొద్దీ సాగించే యత్నాలే కదా ఈ వాడుక వేడుకలన్నీ!
దివినంతా రవిదీప్తి నిండేలా భువినిండా మానవత పండేలా ఐక్యత సమగ్రతలిచ్చే
సంబరం ఇది. విజ్ఞాన వివేక వికాసత్రయాన్ని రంగరించి జాతి మత కుల ప్రాంత వర్ణ
వర్గాదులకు అతీతమైన స్ఫూర్తి దీప్తులనందించే జనజాతరా ఇదే. దీని విలక్షణత ఎంత
సర్వసంపన్నమంటే ‘వినుము ధనములు రెండు తెరగులు / ఒకటి మట్టిన పుట్టినది.
వేరొకటి హృత్ కమలంపు సౌరభంబు (గురజాడ కవీంద్రుడు)’. అవి సంస్కృతీ
సంప్రదాయాలే. పంటధాన్యాలూ పల్లెటూళ్ళే సంకురాతిరికి అసలు సిసలైన శాశ్వత
చిరునామాలు. వారూవీరన్న అంతరమేదీ లేకుండా అందరినీ ఒక్కుమ్మడిగా కలగలిపి
నిలిపేవే ఈ అన్నివిధానాలూ. ఎంతటి మట్టివాసననైనా బిగబట్టి పట్టి చూపించే
అనుభూతి మాధుర్యానికి పతాక, ప్రతీక సంక్రాంతే! నిర్వహణలో ఇంకెంత
వైవిధ్యముందో ఉదాహరణ సహితంగా తెలుసుకుందాం. నెలపట్టడం, ముంగిళ్ళలో
సందళ్ళు రేపడంగా దీన్ని తెలుగువారు భావిస్తారు. సంవత్సరమంతా ఇళ్ళలో
పేరుకుపోయిన వ్యర్థాలతో వేకువవేళ భోగిమంట. ఆ రోజునే పసివాళ్ళకు భోగిపళ్ళు,
పిన్నలతో పాటు పెద్దలనీ మురిపించి, మైమరపించేలా బొమ్మలకొలువులు, పసందైన
విందుభోజనాలు, అటు తర్వాత పోటీలూ, పందేల కోలాహలం. నగరవీధులు
బోసిపోయినా పల్లెసీమల్లో కిలకిలలూ కళకళలూ. బతుకు పచ్చదనాన్ని ఆశగా
శ్వాసించడానికే పట్టణాల నుంచి గ్రామాలకు వరస ప్రయాణాలు. కాలప్రవాహంలో
పరుగుల ఉరవడిలో మనుషుల నడిమధ్యన నిట్టనిలువునా లేస్తున్న అడ్డుగోడలను
ఒక్కపెట్టున కుప్పకూల్చే మంత్రశక్తి ఈ తిరణాలకే ఉంది.
విజయనగరం జిల్లా చీపురుపల్లి
ప్రాంతంలోని ఇటకర్ల పల్లిలో సంక్రాంతిన
కొన్ని కుటుంబాలు తొమ్మిదిరోజులు
చేసుకుంటాయి. భోగికి ముందుగా వచ్చే
రోజుల్లోనే సంబరాలు ఆరంభిస్తారు. ఎవరు
ఎక్కడ ఉన్నా ఆ రోజుల్లో స్వస్థలానికి చేరి
పెద్దలను గౌరవించుకుంటారు. అక్కడివారికి
అది నవరాత్రి ఉత్సవ సంరంభం.
చిత్తూరుజిల్లా బంగారుపాళ్యం సమీపంలోని
ఓ ఊరిపేరు సంక్రాంతి పల్లె. అక్కడున్న
వారిలో పలువురి ఇంటిపేరు ‘కోడి’!
అందుకేనేమో కోళ్ళను పెంచి పందేలకు
దిగుతుంటారు. పండుగ మూడురోజులూ
ఇళ్లదగ్గరే ఆటపాటా. కృష్ణాజిల్లా గుడివాడ
పరిసరాల్లో ఎడ్లతో బండలాగుడు పోటీల
జరుపుతుంటారు. బలప్రదర్శనకే పెద్దపీట. కోనసీమలో కోడిపందేలకు తోడు ప్రభల
వేడుకలకు తండోపతండాలుగా చేరుకుంటారు. రాజమహేంద్రవరం, తదితర
ప్రాంతాల్లో భోగిదండల విక్రయాలెక్కువ. పిడకల్ని అట్టల్లో ఉంచి అమ్మకానికి పెట్టడం
కాలపరిణామం. చేత చిరుతలు వాయిస్తూ దైవ సంకీర్తన చేస్తూ ఇంటింటికీ తిరిగే
హరిదాసులు ఇప్పటికీ మరికొన్ని చోట్ల కనిపిస్తూనే ఉంటారు. గుంటూరుజిల్లాలోని
కొన్ని పల్లెటూళ్ళలో పొట్టేళ్ళ పందేలతో ఒకటే సందడి. ఈడుపుగల్లు, గొడవర్రు
గ్రామాల్లో పోటీలకు హైదరాబాద్తో పాటు ఇతరత్రా తొమ్మిది రాష్ట్రాలనుంచి పొట్టేళ్ళు
రావడం మునుపటి ముచ్చట. రెండేళ్ళనాటి పందేల్లో కర్ణాటక పోటీదారు
ప్రథమస్థానంలో నిలిచింది (మరో ముఖ్యాంశం : మకర సంక్రాంతి తరుణంలో ఎడ్లను
మంటల్లోకి దూకించి పరుగులు తీయించే క్రీడోత్సాహం నేటికీ కర్ణాటకలో
కనిపిస్తుంది). నెల్లూరుజిల్లాలో రంగవల్లుల కళానైపుణ్యం తొణికిసలాడుతుంటుంది.
తూర్పు గోదావరిజిల్లా విలసవిల్లి పరిసరప్రాంతంలో రెండేళ్ళకిందట 750 అడుగులు
పైగా భారీ భోగి దండ (గోమయం, ముద్ద కర్పూరం, సాంబ్రాణి సమ్మిళితం) ఊరేగింపు
జరిపారు. సంప్రదాయ రీతిలో పడవల పోటీల నిర్వహణకు విజయవాడ పరిసరాల్లోని
నాగాయలంక వేదికగా ఉంటోంది. ఇదీ పర్వదిన ప్రాభవ వైభవమే.
గంగిరెద్దుల విన్యాసాలే కాక – హరిదాస, జంగమదేవర, బుడబుక్కల
కళాప్రావీణ్యానికి కాణాచి హైదరాబాద్ లోని శిల్పారామం. సత్సంప్రదాయ జానపద
కళా రూపాలతో పాటు విభిన్న నృత్యరూపకాలతో ప్రాంగణమంతా
తళుకులీనుతూంటుంది.
చేనేత హస్త కళాప్రదర్శనలు అదనపు ఆకర్షణలు.
అంబరాన్నంటే సంబరంగా పతంగులతో
పెరేడ్ మైదానం అలరిస్తుంటుంది. అందులో
ఇదివరకు చైనా, ఫ్రాన్స్, వియత్నాం,
దక్షిణాఫ్రికా, శ్రీలంక సహా అనేక దేశాల
ఔత్సాహికులు పాల్గొన్నారు. నోరూరించి
మదిని దోచి మురిపించే తీపి మిఠాయి
ఉత్సవంలో పాతిక రాష్ట్రాల నుంచి
ప్రతినిధులు భాగస్వామ్యమయ్యారు. కేరళ
చపాతీ, అసోం రొట్టె, గుజరాతీ లడ్డూ, ఒడిశా
ద్రావణం, తమిళనాడు హల్వా, పంజాబీ
పిండిముద్ద మిశ్రమం… ఓహ్ అంతటా
తీపిదనమే! రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ
కొన్నిచోట్ల ప్లాస్టిక్ గాలిపటాలు, రసాయనిక
ముగ్గులు కానవస్తున్నా – పర్యావరణ ప్రేమికులకు, సర్వప్రాణి హితాభిలాషులకు
కొదవే లేదు. మన దేశంలోని అనేకానేక ప్రాంతాల్లో పలురకాల పేర్లతో విభిన్న
తీరుతెన్నులతో సంక్రాంతి ఉన్నా – ఆ క్రాంతిలో అంతర్లీనంగా నిండిందొక్కటే…
ఆశావహ ఆరోగ్యకర మార్పు కోసం సాధన. ప్రకృతి కాంతకు, సమాజ మాతకు
సన్నిహిత సర్వం సంక్రాంతి పర్వం.
పుష్యమాసంలో అరుదెంచే సంక్రాంతి శోభ భాగ్యమయం, సౌభాగ్యప్రదం.
పుష్యమంటే పోషణ శక్తి కలిగి ఉండటం. పరమాత్మ
సంబంధిత అనుభవమే ఆత్మకు భోగం కాబట్టి ఆ
రోజు భోగి. వత్సర ఆరంభంలో ఋషులు నిర్వహించే
యజ్ఞం భోగభాగ్యదాయకం. అదే యాగంలోని
‘హోమాగ్ని ప్రతిరూపమే భోగిమంట’ అంటుంది
శాస్త్రం. ఆ మంటను ఉత్తరాదిన ‘లోడి’గా పిలుస్తారు.తెలుగునాట కొన్ని ప్రదేశాల్లో భోగినాడు
గొబ్బి గౌరివ్రతం ఆచరించినట్లే, కర్ణాటకలో ‘హళ్ళిరె’ పేరిట
పిల్లవాళ్ళకు భోగిపళ్ళు పోస్తారు. భోగిమంటలనేవి
మహారాష్ట్రలో అంతగా లేకున్నా, సౌభాగ్యవతు
లయ్యేలా వనితలు నిర్వర్తించే పూజాదికాలు అత్యంత
ప్రత్యేకాలు. సజ్జలు విరివిగా పండేచోట్ల ఆ రొట్టెలకు
నువ్వులద్ది స్వీకరించడమూ పండుగ ఆచారమే. చలిని
తొలగించి వేడిమిని కలిగించేలా కొన్ని ఉత్తరాది
రాష్ట్రాల్లోదుప్పట్ల, గొంగళ్ళ దానాలూ చేస్తుంటారు.
ఇది కూడా సంక్రాంతి సంప్రదాయమే. హరియాణా,
పంజాబ్ ప్రాంతీయులు చేసుకునే సంబరం తీరు దాని
పేరు (లోహ్రీ) లోనే ప్రస్ఫుటమవుతుంటుంది. లోహ్కి
అర్థాలు కాంతి, వెచ్చదనం. ఇనుము అనే భావమూ ఉంది. పండుగపూట ఇనుప
మూకుళ్ళలోనే కదా పిండివంటలు చేస్తుంటారు! మన సంక్రాంతి వారికి మాగీ.
ముందురోజు వచ్చేదే లోహ్రీ. ఇక భోగిమంటల మాటకొస్తే – మనవాళ్ళు
తెల్లవారుజామున, వాళ్ళు సాయంత్రాల్లోవేస్తుంటారు. మనలాగే వారి పాటల వెనకా
సూర్యుడు, అగ్నిదేవుడు ఉంటారు కనుక వాటినే ఆలాపిస్తూ గీతనృత్యాలు
కొనసాగిస్తారు. వచ్చిన కొత్తపంటతో ప్రత్యేక వంటకాలు చేసుకుంటారు. పవన యజ్ఞం
పేరిట మైదానంలో కట్టెలతో మంటలు వేసి చెరకు గడలు, మొక్కజొన్న కండెల్ని అగ్నికి
అర్పిస్తారు. ప్రసాదంగా నువ్వులను పంచిపెడుతూ, రంగులు చల్లుకుంటూ
ఆనందోత్సాహాలతో పరవశిస్తారు. తమిళనాట సంక్రాంతిపూట అరటిపిలకల
చెఱకుముక్కల్ని పూజించి పొంగలి వండుతారు. రాత్రి అన్నం వండాక పాలుపోసి
తోడుపెట్టి, మరునాడు కనుమ పండుగకు పొద్దున్నే ఇళ్ళముందు ఆకులు పరిచి
మూడేసి ముద్దలు ఉంచుతారు. వాటిని కాకులు ముట్టుకున్న తదుపరి ప్రక్రియగా
చిత్రాన్నం, పెరుగన్నం తయారుచేసుకుంటారు.
కర్ణాటకలో పంచదార, బెల్లం, వేరుశెనగ కలిపి వనితలకు పంచడం పరిపాటి.
ఆడపిల్లకు నువ్వులతో పాటు బెల్లం కలిపి పంచిపెట్టడం మహారాష్ట్రీయుల అలవాటు.
మలయాళీయులకు సైతం సంక్రాంతి ఒక వ్యవసాయ పర్వదినం (పంటలకు
సంబంధించి సజ్జలూ, నువ్వుల రొట్టెలు, పప్పూ, బియ్యం కలగలుపు పులగాల తయారీ
తెలుగునాట కొన్ని చోట్ల కనిపిస్తుంటుంది) ముగ్గులతో ఇంటా బయటా అలంకరణ
కేరళలోనే కాక రాజస్థాన్, బెంగాల్ ప్రాంతాల్లోనూ పండుగ ప్రసిద్ధి. రంగుల
రంగవల్లికలు శుభప్రద సూచికలు – కళా నైపుణ్య ప్రదర్శకాలు. గృహాల లోపల సుద్ద,
సున్నాలతో చిత్రీకరణలు. వెలుపల పిండితో రూపచిత్రణలు సంక్రాంతి ప్రత్యేకతలు.
వృత్తాలతో పాటే పలు కోణాల ముగ్గులకు పసుపు కుంకుమలనూ వాడటం ఆయా
ప్రాంతాల విలక్షణత. చుక్కలు (బిందువులు) పెట్టినా గీతలు (రేఖలు) వేసినా ఆ
ముగ్గుల సొగసు సోయగాల చూడతరమా? ఇక సంబర వీరోచిత సంప్రదాయాల
గురించి వివరించాలంటే – తమిళనాడు సహా మరికొన్ని ప్రదేశాల్లో జల్లికట్టు(ఎడ్లతో
పోరు) ఉండనే ఉంది. మదురై జిల్లా అలంగానల్లూరు పోటీలైతే జగద్విఖ్యాతి.
దానాలకే కాదు, సూర్యారాధనకీ – ప్రఖ్యాతం సంక్రాంతి మహోత్సవం. ఈ విశిష్టత
ఒడిశాలో కనువిందు చేస్తుంటుంది. ఇరుగు పొరుగు వివాహితలను సాదరంగా పిలిచి
వస్త్రాల ప్రదానం చేయడమన్నది గోవా ప్రాంతంలోనూ అగుపిస్తుంటుంది. దేశంలోని
ఎన్నో ప్రదేశాల్లో పర్వదిన దేవతార్చనలు, జపతప నిర్వహణలు నాటికీ నేటికీ తరతరాల
విధి విధానాలే మరి. నలుగుతో చేసే పుణ్యస్నానాలు వెన్నులోని కుండలినీ శక్తిని
ప్రదీప్తం చేస్తాయి. ఎరుపు పూలు, నీళ్ళు కలిపి ప్రభాకరుడి ఎదురుగా నిలబడి
సమర్పించే అర్ఘ్యం ఆరోగ్యభాగ్య ప్రదాయకం. చలిమిడి, పానక నివేదనలూ ఆయుర్
వృద్ధి సాధకాలు. తాను తిని తోటివారికి ఇంతో అంతో పెట్టే ఏ వ్యక్తికీ భుక్తికి లోటు
ఉండదంటుందీ పండుగ. సంక్రమణ వేళ గోపూజ దృశ్యాలూ వివిధ ప్రాంతాల్లో
రివాజు. ఎడ్లను కూడా ఆదరించడం కనుమ సంబర సారాంశం. అదేరోజున
గొబ్బెమ్మలు (గోమయ పిండాలు) చుట్టూ తిరుగుతూ దైవగానం చేసేవారిని సంక్రాంతి
లక్ష్మి అనుగ్రహిస్తుందని పెద్దల మాట. విద్య ఉద్యోగ వ్యాపారాల కోసం ఇతర దేశాలకు
వెళ్ళి ఉంటున్న ప్రవాస భారతీయులకు మరీ ముఖ్యంగా సంక్రాంతి అంటే మక్కువ
ఎక్కువ. అందుకే ఈ పండుగ సందడి ఏనాడో ఖండాంతరాలు దాటి అణువణువునా
కళాకాంతులు నింపుతోంది. నిజానికిది సర్వకళల సకల శాస్త్రాల మేళవింపు. ఆ
కారణంగానే అమెరికా, ఆస్ట్రేలియా సహా ఐరోపా దేశాల్లోని తెలుగు సంఘాలు –
సంస్థలు ఏటా వీటిని అనురక్తితో నిర్వర్తిస్తున్నాయి. పలు రాష్ట్రాల నుంచి విదేశాలకు
చేరినవారెందరో అక్కడ సంక్రాంతి నిర్వహణకు ముందువరుసలో ఉంటున్నారు.
భారతీయ సంస్కృతీ సుమ సౌరభాలు నలుదిశలా గుబాళించేలా చేస్తున్నారు.
వీధులన్నింటినీ విద్యుద్దీపాలతో ధగధగలాడించడం, సాంస్కృతిక వేడుకల ఏర్పాటుతో
భారతీయతను గౌరవించుకోవడం…. వారిని చూసే ఎవరైనా నేర్చుకోవాలి. వాడుకగా
ఉమ్మడి పండుగగా చేసుకోవడంలో సింగపూర్లోని ‘లిటిల్ ఇండియా’ ప్రాంతం
పేరుపొందింది. అక్కడ ఇళ్ళముందూ కార్యాలయ భవనాల ఎదుటా రంగుల
ముగ్గులను తీర్చిదిద్దుతారు. పర్వదిన వస్తు సామగ్రితో పాటు చీరలు, గాజులను
కాంప్బెల్ రోడ్డుప్రాంతంలో ప్రదర్శనగా ఉంచి విక్రయిస్తుంటారు. మట్టికలశాల్లో
పొంగలి వండటం వంటి ఆచారాలను తు.చ. తప్పక పాటిస్తారు.
ఇంతకుముందే మనం అనుకున్నట్లు – దేశమైనా విదేశమే అయినా సంక్రాంతి
అంటే భారతీయ ఆత్మ. ఉత్తరప్రదేశ్లో ‘కిచెరి’ అనే పేరున్నా, గుజరాత్లో
‘ఉత్తరాయణ్’గా పిలుచుకున్నా, అసోంలో “భొగాలి బిహు’ అని నామకరణం
చేసుకున్నా, కర్ణాటకలో తినుబండారాలను కంచాల్లో ఉంచి ఒకరికొకరు
ఇచ్చిపుచ్చుకుంటూ ‘ఎల్లు బిరోదు’ అనుకున్నా ఈ అన్నీ సంబరాల్లోని భాగాలే. పువ్వుల
తావిలో, పసిబుగ్గల నిగ్గుల్లో, చంటిపాపల చిరునవ్వు మోముల్లో, రసరాగిణి
పిల్లనగ్రోవిలో కనిపించి వినిపించే అందాలూ ఆనందాలన్నీ సంక్రాంతిని తలుచుకున్నా
అనుభవమవుతాయి. పైడిపంటల భూమాతను, పాడిపంటల గోమాతను సంభావించి
ఆరాధించుకునే ఈ పర్వదినం బొండుమల్లెలు గుప్పెడు… చప్పున మన గుండెమీదుగా
జారినంత సదానుభూతిమయం, అంతకుమించి మహా అనుభవైక వేద్యం. ఎప్పటికీ
ఇది బహు పెద్ద పండుగే!