డా. గోపాలకృష్ణన్ బులుసు
జీవ వైవిధ్యానికి అనువైన వాతావరణం గల భూగ్రహం
ఉదయభాస్కరుని నులి వెచ్చని లేత కిరణాల గిలిగింతలు
పక్షుల సుమధుర గానాలు,
విరిసిన సుమ బాలలను వెదుక్కుంటూ
ఝుంకారం చేస్తూ ఎగురుతున్న మధుపాలు
ఇలా పరిఢవిల్లిన ప్రకృతికి
ఆకర్షణ చెందని వారున్నారా?
శ్రుతిమించిన లాభాపేక్షతో, అభివృద్ధి పేరిట
రేపన్న రోజు లేదన్నట్టు ప్రకృతిని నాశనం చేస్తుంటే
నిన్నటి వరకు భాగ్యనగర అద్భుత శిలాసౌందర్య కొండలూ, గుట్టలూ
భూవిక్రయదారుల సమ్మెటలకు పిండి పిండయి
వెల వెల పోయి మటు మాయమవుతుంటే
అదుపు లేకుండా వాడుతున్న శిలేంధనాల వలన
హరితగృహ వాయ్వుల పెరుగుదలతో
భూమాతకు భూతాప జ్వరం వచ్చింది!
బెంబేలు పద్ద కొందరు భూవైద్యులు
జ్వరం తగ్గడానికి శిలేంధన లంఖణాలు, పథ్యాలు చెప్పేరు.
సలహాలు వింటే తమకే నష్టమని
అగ్ర దేశాలు ఆచరణలో నిర్లక్ష్యం చేస్తున్నారు
అట్టడుగు దేశాలు చేతులు కాలేక
పట్టుకుందుకు ఆకులుండవని భీతితో ఏడుస్తున్నారు
భూమాత జ్వరం తగ్గాలంటే
మనవంతు మనం చేయాలి నీరు, విద్యుత్ పొదుపు
ఆలస్యం, అలక్ష్యం చేస్తే జ్వరం విషమిస్తుందని మరవొద్దు …